1. మీరు పాపము చేయకుండుటకై, నా చిన్ని బిడ్డలారా! మీకు ఇట్లు వ్రాయుచున్నాను. కాని ఎవరైన పాపము చేసినచో మనకొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడగు యేసుక్రీస్తు మనకు కలడు.
2. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు,
3. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితిమనుట నిశ్చయము.
4. కాని ఎవరైనను “నేను ఆయనను ఎరుగుదును” అనుచు, ఆయన ఆజ్ఞలను మీరినచో, అట్టివాడు అసత్యవాది. వానిలో నిజము లేదు.
5. కాన, ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో, అట్టి వానియందు దేవునియెడల అతని ప్రేమ నిజముగ పరిపూర్ణమైనది. దీనివలన మనము ఆయనయందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము.
6. నేను ఆయనయందు ఉన్నానని చెప్పుకొనెడివాడు, ఆయన ఎటుల నడుచుకొనెనో అటులనే తానును నడుచుకొన బద్దుడైయున్నాడు.
7. ప్రియ స్నేహితులారా! నేను వ్రాయబోవు ఈ ఆజ్ఞక్రొత్తది కాదు. మీకు అనాది కాలమునుండియు వచ్చుచున్న పాత ఆజ్ఞయే. పాత ఆజ్ఞ మీరు ఇది వరకు వినియున్న సందేశమే.
8. కాని, నేను వ్రాయ బోవు ఆజ్ఞ క్రొత్తది. చీకటి గతించి నిజమగు వెలుగు ప్రకాశించుచుండుటచే దాని సత్యము క్రీస్తునందును, మీయందును కూడ గోచరించుచున్నది.
9. తాను వెలుగునందున్నానని చెప్పుకొనుచు, తన సోదరుని ద్వేషించువాడు, ఇంకను చీకటియందే ఉన్నాడు.
10. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందున్నాడు. వానియందు ఇతరులకు ఆటంక కారణమైనది ఏమియులేదు.
11. కాని తన సహోదరుని ద్వేషించువాడు అంధకారమునందు ఉన్నాడు. దానియందే సంచరించును. ఆ అంధకారము వానిని గ్రుడ్డి వానినిగా ఒనర్చుటచే తాను ఎచటికి పోవుచున్నదియు అతడు గుర్తింపజాలడు.
12. నా చిన్నిబిడ్డలారా! క్రీస్తు నామమువలన మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయుచున్నాను.
13. తండ్రులారా! ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు కాన మీకు వ్రాయుచున్నాను. యువకులారా! దుష్టుని మీరు ఓడించుటచే మీకు వ్రాయుచున్నాను. బిడ్డలారా! తండ్రిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను.
14. తండ్రులారా! ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. యువకులారా! మీరు బలవంతులగుట చేతను, దేవుని వాక్కు మీ యందు నిలిచియుండుట చేతను, దుష్టుని మీరు జయించియుండుట చేతను మీకు వ్రాయుచున్నాను.
15. ఈ లోకమును గాని, ఐహికమగు దేనినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన యెడల, తండ్రి ప్రేమ వానిలోలేదు.
16. ఈ లౌకికమైన సమస్తమును, శారీరక వ్యామోహమును, దృష్టి వ్యామోహమును, జీవితమునందలి డాంబికమును తండ్రి నుండి వచ్చునవి కావు. ఇవి అన్నియు ప్రాపంచికములే.
17. ఈ ప్రపంచమును, దాని వ్యామోహమును గతించును. కాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వతజీవి అగును.
18. నా బిడ్డలారా! ఇది తుదిఘడియ. క్రీస్తు విరోధి ఆగమనము మీకుముందే తెలుపబడినది. ఇప్పటికే చాలమంది క్రీస్తు విరోధులుగ గోచరించుచున్నారు. కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకు తెలియుచున్నది.
19. ఇట్టివారు ఎన్నడును యథార్థముగా మన గుంపులోనివారు కారు. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోనివారే అయినచో, మనతోనే నిలిచి ఉండెడి వారు. వారు ఎవ్వరును నిజముగ మనలోనివారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి.
20. అయితే మీరు పవిత్రునివలన అభిషేకింపబడితిరి. కనుక మీరందరును సమస్తమును తెలిసికొంటిరి.
21. కనుక నేను మీకు వ్రాయునది: సత్య మును మీరు ఎరుగరని కాదు. అంతేకాక, సత్యము మీకు తెలియును కనుకను, సత్యమునుండి అబద్దము పుట్టనేరదని మీకు తెలియజేయుట చేతను, నేను వ్రాయుచున్నాను.
22. అయినచో అసత్యవాది ఎవరు? యేసును, క్రీస్తు కాదనువాడే. తండ్రి కుమారులు ఇరువురను తిరస్కరించువాడే క్రీస్తు విరోధి.
23. ఎట్లన, కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడ తిరస్కరించును. కుమారుని అంగీక రించువాడు తండ్రినికూడ అంగీకరించినట్లే.
24. మొదటినుండియు మీరు వినిన సందేశమును మీ హృదయములయందు పదిలపరచు కొనుట మరువకుడు. మొదటి నుండియు మీరు వినిన సందేశము మీ హృదయములందు నిలిచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యమునొంది జీవింతురు
25. ఇదియే క్రీస్తు మనకు వాగ్దానము చేసిన నిత్యజీవము.
26. మిమ్ము మోసగింపనెంచుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను.
27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచియున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయ ములను గూర్చి మీకు బోధించుచున్నది. కనుక ఆ బోధసత్యమే కాని అబద్దము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయనయందు మీరు నిలిచి ఉండుడు.
28. ఆయన దర్శనము ఇచ్చునాడు మనము సిగ్గుతో తలదాచుకొను అవసరము లేకుండ, ధైర్యముతో ఉండుటకై నా చిన్నిబిడ్డలారా! ఆయనయందే నిలిచి ఉండుడు.
29. క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియును. అయినచో సత్ప్రవర్తన గల ప్రతిఒక్కడు దేవుని మూలముననే జన్మించియున్నాడని తెలుసు కొందురు.