ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st John chapter 1 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము

 1. సృష్టి ఆరంభమునుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని, కన్నులారా కాంచితిమి. కన్నులారా కాంచుటయేగాదు, మా చేతులు దానిని స్పృశించినవి.

2. ఈ జీవము ప్రదర్శింపబడినపుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. కనుకనే మేము దానిని గూర్చి మాట్లాడుచు, మనకు విదితము చేయబడినదియు, పితతో ఉండునదియు అగు నిత్యజీవమును గూర్చి మీకు విశదమొనర్చుచున్నాము.

3. పిత తోడను, కుమారుడు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసములో మీరును మాతో చేరుటకై, మేము వినినవియు, కనినవియు అగువానిని మీకును ప్రకటించుచున్నాము.

4. మన సంతోషము పరిపూర్ణమగుటకుగాను మేము దీనిని వ్రాయుచున్నాము.

5. ఆయన కుమారునినుండి మేము వినినదియు, మీకు ప్రకటించునదియు అగు సందేశము ఇదియే: దేవుడు వెలుగు. ఆయనయందు ఎంత మాత్రమును చీకటిలేదు.

6. కాని, ఆయనతో మనకు సాహచర్యము ఉన్నదని చెప్పుకొనుచు, మనము చీకటి యందు నడిచిన యెడల మనము అబద్దమాడుచు, సత్యమును అవలంబింపకున్నాము.

7. కాని ఆయన వెలుగునందున్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో, మనము అన్యోన్యమగు సహవాసము కలవారము అగుదుము. ఆయన పుత్రుడగు యేసు రక్తము మనలను పాపములన్నిటినుండి శుద్ధిచేయును.

8. మనయందు ఎట్టిపాపమును లేదని మనము చెప్పుకొనినచో, మనయందు ఏ మాత్రము సత్యము లేకుండుటయేకాక, ఆత్మవంచన చేసికొనినవారము అగుదుము.

9. కాని, దేవునియెదుట మన పాపములను ఒప్పుకొనినచో, ఆయన మన పాపములను క్షమించి, మన అవినీతినుండి మనలను శుద్ధిచేసి, నీతిని చేకూర్చును; ఏలయన ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు.

10. మనము ఎట్టి పాపములను ఒనర్పలేదని చెప్పుకొనినచో, మనము దేవుని అసత్య వాదిని చేసినట్లగును, ఆయన వాక్కు మనయందులేదు.