ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోహాను సువార్త | Telugu Catholic Bible

 1. ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవునియొద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను.

2. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను.

3. సమస్తమును ఆయన మూలమున కలిగెను కలిగియున్నదేదియును ఆయన లేకుండ కలగలేదు

4. ఆయనయందు జీవము ఉండెను. ఆ జీవము మానవులకు వెలుగాయెను.

5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని గ్రహించలేదు.

6. దేవుడు ఒక మనుష్యుని పంపెను. అతని పేరు యోహాను.

7. అతని మూలమున అందరు విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెను.

8. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెనే కాని, అతడు మాత్రము ఆ వెలుగు కాదు.

9. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుని వెలిగించుచున్నది.

10. ఆయన ఈ లోకమున ఉండెను. ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలిసికొనలేదు.

11. ఆయన తనవారియొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరింపలేదు.

12. ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికిని ఆయన దేవుని బిడ్డలగు అధికారమును ప్రసాదించెను.

13. ఈ దైవపుత్రత్వము వారికి దేవునివలన కలిగినదే కాని, రక్తము వలన గాని, శరీరేచ్ఛవలన గాని, మానవసంకల్పమువలనగాని కలిగినది కాదు.

14. ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్దనుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ.

15. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, “నా తరువాత వచ్చువాడు నాకంటె శ్రేష్ఠుడు. ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వమునుండియే ఉన్నవాడు. ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది” అని ఎలుగెత్తి పలికెను.

16. ఆయన పరిపూర్ణతనుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొందియున్నాము.

17. మోషేద్వారా ఒసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపాసత్యములు.

18. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి వక్షఃస్థలమున ఉన్న జనితైక కుమారుడే ఆయనను ఎరుకపరచెను.

19. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును 'నీవు ఎవడవు?' అని అడుగుటకు యాజకులను, లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను.

20. యోహాను ప్రత్యుత్తరము ఇచ్చుటకు వెనుదీయ లేదు. “నేను క్రీస్తును కాను” అని అతడు ఒప్పుకొనెను.

21. "అట్లయిన నీవు ఎవడవు? ఏలీయావా?” అని వారు ప్రశ్నించిరి. “కాదు” అని యోహాను సమాధా నము ఇచ్చెను. వారు మరల “నీవు ప్రవక్తవా?” అని అడిగిరి. “కాదు” అని అతడు పలికెను.

22. “మమ్ము పంపినవారికి మేము సమాధానము తీసికొనిపోవలయును. నీవు ఎవడవు? నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పు కొనెదవు?” అని అడిగిరి.

23. అందుకు అతడు, “నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును” అనెను.

24. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి.

25. “నీవు క్రీస్తువు, ఏలీయావు, ప్రవక్తవు కానిచో ఏల ఈ బప్తిస్మమును ఇచ్చుచున్నావు?”అని వారు అడిగిరి.

26. అందుకు యోహాను, “నేను నీటితో బప్తిస్మమును ఇచ్చు చున్నాను. కాని మీ మధ్య ఒకవ్యక్తి ఉన్నాడు. ఆయనను మీరు ఎరుగరు.

27. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే! నేను ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యు డనుకాను” అని సమాధానము ఇచ్చెను.

28.యోహాను బప్తిస్మమును ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలితీరమునగల బెతానియాలో ఇది జరిగెను.

29. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, “ఇదిగో! లోకపాపములను పరిహ రించు దేవుని గొఱ్ఱెపిల్ల .

30. 'నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు. ఆయన నాకంటె శ్రేష్ఠుడు. ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వమునుండియే ఉన్నవాడు' అని నేను పలికినది ఈయనను గూర్చియే.

31. ఈయనను యిస్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బప్తిస్మమును ఇచ్చుచున్నాను. కాని నేను ఆయనను ఎరుగనైతిని” అని పలికెను.

32. మరియు యోహాను, “ఆత్మ పావురమువలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండుటను చూచితిని.

33. నేను ఆయనను ఎరుగనైతిని. కాని నీటితో బప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు 'నీవు ఎవరిపై ఆత్మదిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు' అని నాతో చెప్పెను.

34. ఇప్పుడు నేను ఆయనను చూచితిని. ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చు చున్నాను” అని చెప్పెను.

35. మరునాడు మరల యోహాను తన శిష్యులలో ఇద్దరితో నిలుచుని ఉండగా,

36. ఆ సమీపమున నడచిపోవుచున్న యేసును చూచి “ఇదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల ” అనెను.

37. అది విని, ఆ యిద్దరు శిష్యులు యేసును వెంబడించిరి.

38. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, “మీరేమి వెదకు చున్నారు?” అని అడిగెను. “రబ్బీ! (రబ్బీ అనగా బోధకుడని అర్ధము) నీవు ఎక్కడ నివసించుచున్నావు?” అని అడిగిరి.

39. “వచ్చి చూడుడు"అని యేసు సమాధాన మిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ.

40.యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు అంద్రెయ.

41. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని “మేము మెస్సయాను కనుగొంటిమి” అని చెప్పెను. (మెస్సయా అనగా 'క్రీస్తు' 'అభిషిక్తుడు' అని అర్థము).

42. అతడు సీమోనును యేసు వద్దకు తీసికొనిరాగా, యేసు అతనిని చూచి “నీవు యోహాను కుమారుడవగు సీమోనువు. నీవు 'కేఫా' అని పిలువబడుదువు” అనెను (కేఫా అనగా 'రాయి" అని అర్థము).

43. మరునాడు యేసు గలిలీయ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో “నన్ను అనుసరింపుము" అని పలికెను.

44. ఫిలిప్పు కూడ అంద్రియ పేతురుల నివాసమగు బెత్సయిదా పుర నివాసియే.

45. ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడినవానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు” అని చెప్పెను.

46. “నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?” అని నతనయేలు అడుగగా, “వచ్చి చూడుము" అని ఫిలిప్పు పలికెను.

47. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు “ఇదిగో! కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు” అని చెప్పెను.

48. “మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు?” అని నతనయేలు అడుగగా యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని” అని సమాధానమిచ్చెను.

49. “బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు” అని నతనయేలు పలికెను.

50.“ 'నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటె గొప్ప కార్యములను నీవు చూడగలవు” అని యేసు చెప్పెను.

51. ఇంకను, “మీరు పరమండలము తెరువబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను. 

 1. మూడవ దినమున గలిలీయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను.

2. యేసు, ఆయన శిష్యులును ఆ వివాహమునకు ఆహ్వా నింపబడిరి.

3. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి “వారికి ద్రాక్షరసము లేదు” అని ఆయనతో  చెప్పెను.

4. "స్త్రీ! అది నాకేమి? నీకేమి? నా గడియ ఇంకను రాలేదు” అని యేసు పలికెను.

5. ఆయన తల్లి సేవకులతో “ఆయన చెప్పినట్లు చేయుడు” అనెను.

6. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ ఆరురాతి బానలుండెను. ఒక్కొక్క బానలో రెండు మూడు కడవల నీరుపట్టును.

7. “ఆ బానలను నీటితో నింపుడు” అని యేసు వారికి చెప్పెను. అట్లేవారు వానిని అంచులవరకు నింపిరి.

8. అంతట ఆయన “మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు” అని చెప్పగా వారు అట్లే తీసికొనిపోయిరి.

9. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగ మారిన ఆ నీటిని రుచిచూచెను. అది ఎక్కడనుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియును. కనుక అతడు పెండ్లికుమారుని పిలిచి,

10. “ఎవడైనను మొదట శ్రేష్ఠమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరు మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కాని, నీవు శ్రేష్ఠమైన ద్రాక్షరసమును ఇప్పటివరకు ఉంచితివి” అని పలికెను.

11. ఈ విధముగా యేసు గలిలీయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచకక్రియను ప్రదర్శించి, తన మహిమను వెల్లడిచేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి.

12. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్నిదినములు ఉండిరి.

13. యూదుల పాస్కపండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను.

14. దేవాలయములో ఎడ్లను, గొఱ్ఱెలను పావురములను అమ్ము వారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను.

15. ఆయన త్రాళ్ళతో కొరడా పేని, గొఱ్ఱెలను, ఎడ్లను అన్నింటిని ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను.

16. పావురములను అమ్మువారితో “వీనిని ఇక్కడనుండి తీసికొనిపొండు. నా తండ్రి ఇంటిని వ్యాపారగృహముగా చేయవలదు” అని చెప్పెను.

17. “నీ గృహమునందు నాకుగల ఆసక్తి నన్ను దహించును” అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అపుడు తలపునకు వచ్చెను.

18. యూదులు అపుడు ఆయనతో “నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూ పెదవు?” అని ప్రశ్నించిరి.

19. అందుకు యేసు “ఈ ఆలయమును మీరు పడగొట్టుడు. నేను దీనిని మూడు రోజులలో లేపుదును” అని వారికి సమాధాన మిచ్చెను.

20. “ఈ ఆలయ నిర్మాణమునకు నలువది ఆరు సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని మూడు రోజులలో లేపగలవా?” అని యూదులు తిరుగు ప్రశ్నవేసిరి.

21. కాని, వాస్తవముగ ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే.

22. ఆయన మృతులలోనుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి.

23. యెరూషలేములో పాస్కపండుగ సందర్భ మున ఆయన చేసిన అద్భుతకార్యములను చూచిన అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.

24. కాని, యేసు వారిని అంతగా నమ్మలేదు.

25. ఏలయన, వారందరిని గూర్చి ఆయనకు తెలియును. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక, మానవస్వభావమును గూర్చి ఆయనకు ఎవ్వరును సాక్ష్యమీయనక్కరలేదు. 


 1. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను.

2. అతడు ఒకరాత్రి యేసు వద్దకు వచ్చి “బోధకుడా! నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయన, దేవునితోడు లేనియెడల నీవు చేయుచున్న అద్భుత సూచకక్రియలను ఎవడును చేయలేడు” అని పలికెను.

3. యేసు అందుకు అతనితో, “మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవునిరాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.

4. అందుకు నికోదేము, “వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లిగర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింప గలడా?” అని అడిగెను.

5. అపుడు యేసు, “ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీరమూలముగ జన్మించినది శరీరమును, ఆత్మమూలముగ జన్మించినది ఆత్మయునైయున్నది.

7. నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు.

8. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును” అనెను.

9. “ఇది ఎటుల సాధ్యమగును?” అని నికోదేము అడిగెను.

10. అందులకు యేసు: “నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా?

11.మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికి సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

12. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పినయెడల ఎట్లు నమ్మెదరు.

13. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్యకుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు.

14. “మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో

15. ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడ వలెను.

16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనముచెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను.

17. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు.

18. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు. విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు.

19. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి.

20. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు.

21. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును” అని సమాధాన మిచ్చెను.

22. ఆ పిదప యేసు తనశిష్యులతో యూదయా సీమకు వెళ్ళి, వారితో కొంతకాలము గడపుచు జ్ఞానస్నానమిచ్చుచుండెను.

23. నీరు పుష్కలముగా ఉండుటచే 'సలీము' సమీపమున ఉన్న 'ఐనోను' వద్ద యోహాను కూడ బప్తిస్మమిచ్చుచుండెను. జనులు అతని యొద్దకు వచ్చి బప్తిస్మము పొందుచుండిరి.

24. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు.

25. యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కించుచుండిరి.

26. వారు యోహాను వద్దకు వెళ్ళి, “బోధకుడా! యోర్దాను నది ఆవలితీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవనిని గురించి మీరు సాక్ష్యమిచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చుచున్నాడు. అందరు ఆయనయొద్దకు వెళ్ళుచున్నారు” అని చెప్పిరి.

27. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను: “పరలోకమునుండి అను గ్రహింపబడిననే తప్ప ఎవడును ఏమియు పొందనేరడు.

28. నేను క్రీస్తును కాననియు, ఆయనకంటే ముందుగా పంపబడినవాడననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు.

29. పెండ్లికుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లికుమారుని మిత్రుడు అతని చెంతనుండి అతడు చెప్పినట్లు చేయును. అతని స్వరమును వినినపుడు మిక్కిలి ఆనందమును పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది.

30. ఆయన హెచ్చింపబడవలెను. నేను తగ్గింపబడవలెను.

31. పైనుండి వచ్చువాడు అందరికంటె అధికుడు. భూలోకమునుండి వచ్చువాడు, భూలోకమునకు చెంది నవాడు. అతడు భూలోక విషయములనుగూర్చి మాట్లా డును. పరలోకమునుండి వచ్చువాడు అందరికంటే అధికుడు.

32. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చును. కాని, ఎవరును ఆయన సాక్ష్యమును అంగీకరింపరు.

33. ఆయన సాక్ష్యమును అంగీకరించినవాడు దేవుడు సత్య సంధుడని నిరూపించును.

34. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములు గూర్చి చెప్పును. ఏలయన, దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా ఒసగును.

35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించియున్నాడు.

36. కుమారుని విశ్వసించువాడు నిత్యజీవమును పొందును. ఆయనకు విధేయించనివాడు జీవమును చూడలేడు. దేవుని ఆగ్రహము అతనిపై నిలిచి ఉండును. 

 1. యోహానుకంటె తాను ఎక్కువమంది శిష్యులను చేర్చుకొనుచు, వారికి బప్తిస్మము ఇచ్చుచున్నట్లు పరిసయ్యుల చెవినపడెనని యేసుకు తెలిసెను.

2. బప్తిస్మమిచ్చినది వాస్తవముగ యేసు శిష్యులేకాని ఆయన కాదు.

3. అది విని యేసు యూదయా సీమ వదలి మరల గలిలీయకు ప్రయాణమయ్యెను.

4. ఆయన సమరియా మీదుగా వెళ్ళవలసియుండెను.

5.యేసు సమరియాలోని సిఖారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు యోసేపు నకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది.

6. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావివద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ.

7. ఒక సమరీయ స్త్రీ నీటికొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను “నాకు త్రాగుటకు నీరు ఇమ్ము” అని అడిగెను.

8. ఆయన శిష్యులు ఆహార పదార్ధములు కొనితెచ్చుటకు పట్టణమునకు వెళ్ళియుండిరి.

9. ఆ సమరయ స్త్రీ యేసుతో, “యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగు చున్నావు?” అని అనెను. (ఏలయన, యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తునులేదు.)

10. అప్పుడు యేసు “నీవు దేవుని వరమును గ్రహించియున్న యెడల, 'త్రాగుటకు నీరు ఇమ్ము' అని అడుగుచున్నది ఎవరు అని తెలిసికొని ఉన్నయెడల, నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు. అపుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు” అని సమాధానమిచ్చెను.

11. అపుడు ఆ స్త్రీ "అయ్యా! ఈ బావి లోతైనది. నీరు చేదుటకు నీయొద్ద ఏమియు లేదు. జీవ జలమును నీవు ఎక్కడినుండి తెచ్చెదవు?

12. మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతనికంటె గొప్పవాడవా?” అని అడుగగా,

13. యేసు సమాధానముగా ఆమెతో, “ఈ నీటిని త్రాగువాడు మరల దప్పికగొనును.

14. కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవమునకై ఊరేడి నీటి బుగ్గగా ఉండును” అని చెప్పెను.

15. అపుడు ఆమె “అయ్యా! నేను మరల దప్పికగొనకుండునట్లును, నీటికై ఇక్కడకు రాకుండు నట్లును నాకు ఆ నీటిని ఇమ్ము” అని అడిగెను.

16. అప్పుడు యేసు “నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము" అనెను.

17. అందుకు ఆమె “నాకు భర్తలేడు” అని చెప్పెను. “నాకు భర్తలేడు” అని నీవు యథార్థముగా చెప్పితివి.

18. నీకు ఐదుగురు భర్తలుండిరి. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు యథార్థమే చెప్పితివి” అని యేసు పలికెను.

19. ఆ స్త్రీ ఆయనతో "అయ్యా! నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది.

20. మా పితరులు ఈ పర్వతముమీద ఆరాధించిరి. కాని, దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు” అని పలికెను.

21. “స్త్రీ నా మాట నమ్ముము. సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతముమీదకాని, యెరూషలేములోకాని తండ్రిని ఆరాధింపరు.

22. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలయన రక్షణ యూదులనుండియే వచ్చును.

23. కాని, నిజమైన ఆరాధకులు ఆత్మ యందును, సత్యమందును తండ్రిని ఆరాధించు సమ యమిపుడే వచ్చియున్నది. అది ఇపుడే వచ్చియున్నది. నిజముగ తండ్రి ఆశించునది ఇటువంటి ఆరాధకులనే.

24. దేవుడు ఆత్మస్వరూపి కనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును, సత్యమునందును ఆరాధింపవలయును” అని యేసు చెప్పెను.

25. అప్పుడు ఆ స్త్రీ "క్రీస్తు అనబడు మెస్సయా రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినపుడు మాకు అన్ని విషయములు తెలియజేయును” అని పలికెను.

26. “నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను!” అని యేసు చెప్పెను.

27. అంతలో శిష్యులు వచ్చి, ఆయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడిరి. కాని, ఎవడును “నీకేమి కావలయును” అని గాని “నీవు ఎందుకు ఈమెతో మాటాడుచున్నావు” అనిగాని అడుగలేదు.

28. ఆమె తన కడవను అక్కడే వదలిపెట్టి పట్టణములోనికి వెళ్ళి ప్రజలతో,

29. “ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన 'క్రీస్తు' ఏమో!” అని చెప్పెను.

30. ప్రజలు పట్టణమునుండి బయలుదేరి ఆయనవద్దకు వెళ్ళిరి.

31. ఈలోగా ఆయన శిష్యులు “బోధకుడా! భోజనము చేయుడు” అని బ్రతిమాలిరి.

32. యేసు వారితో "భుజించుటకు మీరు ఎరుగని ఆహారము నాకు కలదు” అని చెప్పెను.

33. “ఎవరైన ఈయనకు భోజనము తెచ్చి పెట్టిరా?” అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి.

34. యేసు వారితో, “నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తిచేయుటయే నా ఆహారము.

35. నాలుగు మాసముల పిమ్మట కోతలు వచ్చునని మీరు చెప్పుదురుకదా! పొలములవైపు కన్నులెత్తి చూడుడు. అవి పండి, కోతకు సిద్ధముగా ఉన్నవి.

36. కోత కోయువాడు కూలి తీసికొని నిత్య జీవమునకై ఫలము సేకరించుకొనుచున్నాడు. ఇందు వలన విత్తువాడు, కోయువాడు ఇద్దరును సంతసింతురు.

37. 'విత్తువాడు ఒకడు, కోయువాడు మరొకడు' అని లోకోక్తి ఇక్కడ సార్థకమైనది.

38. మీరు శ్రమింపనిదానిని కోయుటకు మిమ్ము పంపి తిని. ఇతరులు శ్రమించితిరి. వారి ఫలితము మీకు లభించినది” అని చెప్పెను.

39.“నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను” అని ఆ స్త్రీ చెప్పినదానిని బట్టి ఆ పట్టణములోని సమరీయులు అనేకులు ఆయనను విశ్వసించిరి.

40. ఆ సమరియ వాసులు వచ్చి ఆయనను తమయొద్ద ఉండుమని వేడుకొనగా, ఆయన అచట రెండు రోజులు ఉండెను.

41. ఆయన ఉపదేశమును ఆలకించి. ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి.

42. “మేము ఇపుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు. మేము స్వయ ముగా ఆయన ఉపదేశమును వింటిమి, వాస్తవముగ ఆయన లోకరక్షకుడని మాకు తెలియును” అని వారు ఆమెతో చెప్పిరి.

43. రెండు దినములైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలీయకు వెళ్ళెను.

44. ఏలయన, ప్రవక్త తన స్వదేశంలో గౌరవింపబడడని యేసే స్వయముగ సాక్ష్యమిచ్చెను.

45. యేసు గలిలీయకు వెళ్ళినప్పుడు అచటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలయన, పాస్కపండుగ సందర్భమున గలిలీయ నివాసులు యెరూషలేమునకు వచ్చినపుడు ఆయన చేసిన అద్భుతకార్యములన్నియు స్వయముగ చూచిరి.

46. అంతట ఆయన నీటిని ద్రాక్షరసముగ మార్చిన గలిలీయలోని కానాను అను పల్లెకు మరల వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను.

47. యేసు యూదయానుండి గలిలీయకు తిరిగివచ్చెనని విని, ఆ ఉద్యోగి ఆయనయొద్దకు వెళ్ళి, ప్రాణసంకట ములో పడియున్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరుపవలసినదిగా ప్రార్ధించెను.

48. “మీరు సూచకక్రియలను, మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు” అని యేసు పలికెను.

49. "ప్రభూ! నా కుమారుడు చనిపోకముందే రండు” అని ఆ ఉద్యోగి వేడుకొనెను.

50. “నీవు వెళ్ళుము. నీ కుమారుడు జీవించును”అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను.

51. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై “నీ కుమారుడు స్వస్థుడైనాడు” అని చెప్పిరి.

52.“ ఏ గంటనుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది?" అని అతడు సేవకులను అడుగగా, “నిన్న మధ్యాహ్నము ఒంటిగంటకు జ్వరము విడిచినప్పటినుండి” అని వారు చెప్పిరి.

53. “నీ కుమారుడు జీవించును” అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి, అతని కుటుంబము యేసును విశ్వసించిరి.

54. ఇది యేసు యూదయానుండి గలిలీయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ. 

 1. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్లెను.

2. యెరూషలేములో గొఱ్ఱెల వాకిలివద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో 'బెత్సతా' అందురు. దానికి అయిదు మండపములు ఉన్నవి.

3. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండెడివారు.

4. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదలించును. నీరు కదలగనే మొదట అందులో దిగిన వాడు ఎటువంటి వ్యాధినుండియైనను స్వస్థత పొందును.

5. ముప్పది ఎనిమిదిఏండ్లనుండి వ్యాధిపీడితుడు ఒకడు అక్కడ ఉండెను.

6.యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలమునుండి అచట ఉన్నాడని గ్రహించి "నీవు స్వస్థత పొందగోరుచున్నావా?” అని అతనిని అడిగెను.

7. అందుకు అతడు "అయ్యా! నీరు కదలినపుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడును లేడు. నేను వెళ్ళబోవుసరికి మరియొకడు నాకంటే ముందు దిగుచున్నాడు” అని చెప్పెను.

8. “లెమ్ము. నీ పడకను ఎత్తుకొని నడువుము” అని యేసు అతనితో చెప్పెను.

9. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసికొని నడువ సాగెను. అది విశ్రాంతిదినము.

10. కావున యూదులు స్వస్థతపొందిన వానితో “ఇది విశ్రాంతిదినము, నీవు పడకను మోయుట తగదు” అనిరి.

11. అందుకు వాడు “ 'నన్ను స్వస్థపరచిన వ్యక్తి నాతో నీ పడకను తీసికొని నడువుము' అని చెప్పెను” అనెను.

12.“పడకను తీసికొని నడువుము' అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు?" అని వారు ప్రశ్నించిరి.

13. ఆయన ఎవరో స్వస్థత పొందినవానికి తెలియదు. ఏలయన, అక్కడ జనసమూహము ఉండుటచేయేసు అచటనుండి వెళ్ళిపోయెను.

14. అటు తరువాత యేసు దేవాలయములో వానిని కనుగొని “ఇదిగో! నీవు స్వస్తుడవైతివి. నీకు మరింత కీడుకలుగకుండుటకు ఇక పాపము చేయకుము” అని చెప్పెను.

15. అతడు వెళ్ళి యూదులతో తనను స్వస్థపరచినది యేసు అని చెప్పెను.

16. విశ్రాంతిదినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింపమొదలిడిరి. .

17. యేసు వారితో, “నా తండ్రి ఇప్పటికిని పనిచేయుచున్నాడు. నేనును చేయుచున్నాను” అని చెప్పెను.

18. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగ ప్రయత్నించిరి. ఏలయన, ఆయన విశ్రాంతిదిన నియమమును మీరుటయేకాక, దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగ చేసికొనుచుండెనని వారు భావించిరి.

19. యేసు వారితో ఇట్లనెను: “నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో, దానినే కాని తనంతట తాను ఏమియు చేయజాలడు. తండ్రి ఏమిచేయునో కుమారుడు దానిని అట్లే చేయును.

20. తండ్రి కుమారుని ప్రేమించును. తాను చేయు ప్రతిదానిని కుమారునకు చూపును. ఇంతకంటె గొప్పకార్యములను చేయుటను ఆయనకు చూపి, మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును.

21. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగ చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును.

22. తండ్రి ఎవనికిని తీర్పువిధింపడు. తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను.

23. అందరు తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడ గౌరవించుటకు ఆయన అటుల చేసెను. కుమారుని గౌరవింపనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడ గౌరవింపడు.

24. "నా మాటలను ఆలకించి నన్ను పంపినవానిని విశ్వసించువాడు నిత్యజీవము పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు. అతడు మరణమునుదాటి జీవమందు ప్రవేశించును.

25. మృతులు దేవునికుమారుని స్వర మును విను సమయము వచ్చుచున్నది. అది వచ్చియే యున్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను.

26. ఏలయన, తండ్రి తనంతట తాను జీవము కలిగియున్నట్లే కుమారుడు కూడ తనంతట తాను జీవము కలిగియుండునట్లు చేసెను.

27. ఆయన మనుష్యకుమారుడు కనుక ఆయనకు తీర్పువిధించు అధికారమునుకూడ ఇచ్చెను.

28. మీరు ఆశ్చర్యపడవలదు. ఆ గడియ సమీపించు చున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వర మును విని,

29. ఉత్తానులగుదురు. మంచి కార్యములు చేసినవారు జీవపునరుత్థానమును, దుష్టకార్యములు చేసినవారు తీర్పుపునరుత్థానమును పొందెదరు.

30. “నా అంతట నేనే ఏమియు చేయజాలను. నేను వినినట్లు తీర్పుచేయుదును! నా తీర్పు న్యాయ మైనది. ఏలయన, నేను నా యిష్టానుసారము కాక నన్ను పంపినవాని చిత్తప్రకారమే చేయగోరుదును.

31.“నాకు నేను సాక్ష్యము పలికినచో నాసాక్ష్యము సత్యముకాదు.

32. నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరియొకడు ఉన్నాడు. ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును.

33. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి. అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చెను.

34. నాకు మనుష్యుని సాక్ష్యముతో పనిలేదు. కాని, మీరు రక్షింపబడుటకే నేను ఇట్లు చెప్పుచున్నాను.

35. యోహాను కాంతితో వెలుగుచున్న దీపమువలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి.

36. కాని, నాకుగల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యముకంటె గొప్పది. అది ఏమన: నేను చేయుక్రియలు, నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచు, తండ్రియే నన్ను పంపెనని విరూపించుచున్నవి.

37. నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మీరు ఎన్నడును ఆయన స్వరమును వినలేదు. ఆయన రూపమును చూడలేదు.

38. ఆయన పంపిన వానిని మీరు విశ్వసింపరు. కనుక, ఆయన వాక్కు మీయందు నిలిచి యుండలేదు.

39. నిత్యజీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు. అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

40. అయినను, మీరు, ఆ జీవమును పొందుటకు నాయొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు.

41. “నేను మనుష్యుల పొగడ్తలను ఆశించువాడనుకాను.

42. నేను మిమ్ము ఎరుగుదును. దైవప్రేమ మీలోలేదని నాకు తెలియును.

43. నేను నా తండ్రి పేరిట వచ్చియున్నాను. కాని మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు.

44. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తినిగాక, ఒండొరుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు?

45. తండ్రియొద్ద నేను మీపై దోషారోపణ చేసెదనని మీరు భావింప వలదు. మీరు నమ్ముకొనిన మోషే మీపై దోషారోపణ చేయును.

46. మీరు నిజముగ మోషేను నమ్మియుండిన యెడల నన్నును నమ్మి ఉండెడివారు. ఏలయన, అతడు నన్నుగురించి వ్రాసిఉన్నాడు.

47. అతడు వ్రాసిన వాటిని మీరు నమ్మనిచో నా మాటలను ఎట్లు నమ్మెదరు?” 

 1. ఆ పిదప యేసు 'తిబేరియా' అనెడి గలిలీయ సరస్సునుదాటి ఆవలి తీరమునకు వెళ్ళెను.

2. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత సూచకక్రియలు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను.

3. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను.

4. అపుడు యూదుల పాస్కపండుగ సమీపించినది.

5. యేసు కనులెత్తి గొప్పజనసమూహము తనయొద్దకు వచ్చుటచూచి, ఆయన ఫిలిప్పుతో “వీరు భుజింపవలసిన ఆహారపదార్థములను మనము ఎక్కడనుండి కొనితెచ్చెదము?” అనెను.

6. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అటుల పలికెను. ఏలయన, తానేమి చేయబోవు చున్నది ఆయనకు తెలియును.

7. “ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను రెండువందల దినారముల రొట్టెలు కూడ చాలవు” అని ఫిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను.

8. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు అంద్రెయ

9. “ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవ (ధాన్యపు) రొట్టెలు, రెండు చేపలు కలవు. కాని, ఇంతమందికి ఇవి ఏమాత్రము?” అని పలికెను.

10. యేసు “అందరిని భోజనమునకు కూర్చుండబెట్టుడు” అనెను. అచట ఇంచుమించు ఐదువేలమంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి.

11. అపుడు యేసు రొట్టెను తీసికొని, ధన్యవాదములు అర్పించి, కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలనుకూడ వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను.

12.వారు తృప్తిగ భుజించిన పిదప, యేసు శిష్యులతో “ఏమియు వ్యర్థముకాకుండ మిగిలిన ముక్కలను ప్రోవుచేయుడు” అని చెప్పెను.

13. వారు భుజించిన పిదప ఐదు యవ ధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను పండ్రెండు గంపలకు నింపిరి.

14. ప్రజలు యేసు చేసిన ఈ సూచకక్రియను చూచి, “వాస్తవముగ ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే” అని చెప్పిరి.

15. ప్రజలు తనను బలవంతముగ రాజును చేయనున్నారని తెలిసికొని, యేసు మరల ఒంటరిగ పర్వతము పైకి వెళ్ళెను.

16. సందె వేళకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి,

17. పడవను ఎక్కిసరస్సు ఆవలివైపున ఉన్న కఫర్నామునకు పయనమైరి. అంతలో చీకటి క్రమ్మెను. కాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

18. పెనుగాలివలన సరస్సునందు అలలు చెలరేగెను.

19. వారు మూడు నాలుగు మైళ్ళు పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడచుచు పడవను సమీపించుటను చూచి భయభ్రాంతులైరి.

20. కాని, యేసు వారితో “నేనే, భయపడకుడు" అని చెప్పెను.

21. వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకొనకోరిరి. ఇంతలో పడవ, వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చిచేరెను.

22. మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటవున్న ఒకే ఒక చిన్నపడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతోపాటు యేసు వెళ్ళలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటను చూచిరి.

23. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలముచెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను.

24. అక్కడ యేసుగాని, శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి.

25. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని “బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి.

26. “మీరు రొట్టెలు తిని సంతృపులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను.

27. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు” అని యేసు సమాధానమిచ్చెను.

28. అప్పుడు “దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా,

29. యేసు “దేవుడు పంపినవానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది” అని చెప్పెను.

30. అంతట “నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టిగురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు?” అని వారు మరల ప్రశ్నించిరి.

31. " 'వారు భుజించుటకు ఆయన పరలోకమునుండి ఆహారమును ప్రసాదించెను' అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో 'మన్నా' భోజనము లభించెను” అని వారు ఆయనతో చెప్పిరి.

32. “పరలోకమునుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు. కాని, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును.

33. దేవుని ఆహారము పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు వారితో అనెను.

34. "అయ్యా! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము" అని వారు అడిగిరి.

35. అందుకు యేసు "నేనే జీవాహారమును. నాయొద్దకు వచ్చువాడు ఎన్నటి కిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు."

36. “నేను మీతో చెప్పినట్లు మీరు నన్నుచూచియు విశ్వసించుటలేదు.

37. నా తండ్రి నాకు ఒసగు ప్రతివాడును నాయొద్దకు వచ్చును. నాయొద్దకు వచ్చు వానిని నేను ఎన్నడును త్రోసివేయను.

38. ఏలయన, నేను పరలోకమునుండి దిగివచ్చినది, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని, నా ఇష్టానుసారము చేయుటకు కాదు.

39. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, అంతిమదినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము.

40.కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొందు టయే నాతండ్రి చిత్తము. అంతిమదినమున నేను వానిని లేపుదును” అని సమాధానమిచ్చెను.

41. “నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును” అని యేసు చెప్పినందులకు యూదులు గొణగసాగిరి.

42. “ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయిన తాను పరలోకమునుండి దిగి వచ్చితినని ఎటుల చెప్పగలడు?” అని చెప్పుకొనసాగిరి.

43. యేసు వారితో “మీలో మీరు గొణుగు కొనవలదు.

44. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నాయొద్దకు రాలేడు. నేను వానిని అంతిమదినమున లేపుదును.

45. వారందరు దేవునిచే బోధింపబడుదురు' అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నాయొద్దకు వచ్చును.

46. అయితే ఎవడైనను తండ్రిని చూచెనని భావము కాదు. దేవునియొద్దనుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు.

47. నన్ను విశ్వసించువాడు నిత్యజీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

48. జీవాహారమును నేనే.

49. మీ పితరులు ఎడారిలో 'మన్నా'ను భుజించియు మరణించిరి.

50. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. దీనిని భుజించువాడు మరణింపడు.

51. పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.

52.అంతట యూదులు ఒకరితో ఒకరు "మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఈయ గలడు?” అని వాదించుకొనసాగిరి.

53.యేసు వారికి “మీరు మనుష్యకుమారుని శరీరమును భుజించి, ఆయన రక్తమును త్రాగిననే తప్ప, మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

54. నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమదినమున లేపుదును.

55. ఏలయన, నా శరీరము నిజమైన ఆహారము. నా రక్తము నిజమైన పానము.

56. నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాని యందును ఉందును.

57. జీవముగల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును.

58. ఇదియే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు 'మన్నా'ను భుజించియు మరణించిరి. అటులకాక, ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడును జీవించును” అని సమాధానము ఇచ్చెను.

59. ఆయన కవర్నాము ప్రార్థనామందిరమున బోధించుచు ఈ విషయములు చెప్పెను.

60. ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినిన పుడు “ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు?" అని చెప్పుకొనిరి.

61. తన శిష్యులు దీనిని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి యేసు “ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా?

62. అట్లయిన మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు?

63. జీవమును ఇచ్చునది ఆత్మయే. శరీరము నిష్ప యోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి.

64. కాని, మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు” అని పలికెను. ఆ విశ్వ సింపనివారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదటినుండియు యేసుకు తెలియును.

65. కనుకనే “తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నాయొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని” అని ఆయన పలికెను.

66. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి.

67. అపుడు యేసు తన పన్నిద్దరు శిష్యులతో “మీరును వెళ్ళిపోయెదరా?”అని అడుగగా,

68. సీమోను పేతురు, “ప్రభూ! మేము ఎవరియొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు.

69. మేము విశ్వసించితిమి. నీవు దేవునినుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి” అనెను.

70. అంతట యేసు “నేనుమీ పన్నిద్దరిని ఎన్నుకొనలేదా? అయినను మీలో ఒకడు పిశాచము” అని పలికెను.

71. ఆయన ఈ మాట సీమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాను ఉద్దేశించి పలికెను. ఏలయన, పన్నిద్దరిలో ఒకడైన అతడు ఆయనను అప్పగింపబోవుచున్నాడు. 

 1. ఆ పిమ్మట, యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచ రింపక, గలిలీయలో పర్యటింపసాగెను.

2. యూదుల పర్ణశాలలపండుగ దగ్గరపడుటచే ఆయన సోదరులు యేసుతో,

3. “నీవు చేయుపనులను నీ శిష్యులు చూడగలందులకు ఇక్కడినుండి యూదయా సీమకు వెళ్ళుము.

4. ఏలయన, తన మహిమలను బహిరంగ పరచుకొనకోరువాడు, వానిని రహస్యముగా చేయడు. నీవు ఇట్టిపనులను చేయుచున్నావు కనుక, నిన్ను నీవు లోకమునకు బయలుపరచుకొనుము” అని చెప్పిరి.

5. వాస్తవముగ ఆయన సోదరులు సైతము ఆయనను విశ్వసింపలేదు.

6. యేసు వారితో, “నా సమయము ఇంకను రాలేదు. మీ సమయము ఎప్పుడును సిద్ధముగానున్నది.

7. లోకము మిమ్ము ద్వేషింపదు. కాని దాని పనులు చెడ్డవి అని నేను ప్రకటించు చున్నందున అది నన్ను ద్వేషించుచున్నది.

8. మీరు పండుగకు వెళ్ళుడు. నా సమయము ఇంకను పూర్తిగా రాలేదు. కనుక నేను ఈ పండుగకు ఇపుడు వెళ్ళను” అనెను.

9. ఆయన వారితో ఇట్లు చెప్పి గలిలీయలో ఉండిపోయెను.

10. ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడ బహిరంగముగగాక, రహస్యముగ అచటికి వెళ్ళెను.

11. ఆ పండుగలో యూదులు యేసు ఎక్కడ ఉన్నాడు అని వెదకుచుండిరి.

12. జన సమూహములో ఆయనను గురించి గుసగుసలు బయలుదేరెను. కొందరు ఆయనను సజ్జనుడు అనియు, మరికొందరు కాదు, ఆయన ప్రజలను మోసగించుచున్నాడు అనియు చెప్పుకొనుచుండిరి.

13. కాని, యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరును బహిరంగముగా మాటాడరైరి. .

14. పండుగ మధ్య రోజులలో యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధింపసాగెను.

15. విద్యా శిక్షణ లేని ఈయనకు ఇంత జ్ఞానము ఎట్లు వచ్చినది? అని యూదులు ఆశ్చర్యపడిరి.

16. అందుకు యేసు, “నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపినవానిది.

17. దేవుని చిత్తమును నెరవేర్పగోరువాడు. ఈ బోధ దేవుని నుండి వచ్చినదో లేక స్వాధికారముతో నేనిట్లు పలుకుచున్నానో తెలిసికొనగలడు.

18. స్వాధికారముతో మాటలాడువాడు తన కీర్తికొరకై వెదకును. కాని, తనను పంపినవాని కీర్తి కొరకై వెదుకువాడు సత్యవంతుడు. ఆయనయందు ఎట్టి అసత్యమును లేదు.

19. మోషే మీకు ధర్మశాస్త్రమునీయలేదా? కాని, మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రానుసారము వర్తించుట లేదు. మీరు ఎందుకు నన్ను చంపయత్నించుచున్నారు?” అని ప్రశ్నించెను.

20. అందుకు వారు “నీకు దయ్యము పట్టినది. నిన్ను ఎవరు చంపయత్నించు చున్నారు?" అని పలికిరి.

21. అప్పుడు యేసు వారితో, “నేను చేసిన ఒక్కపనికిగాను మీరందరును ఆశ్చర్యచకితులైతిరి.

22. మోషే సున్నతి ఆచారము నియమించెను. ఈ ఆచారము మోషేవలన కలిగినది కాదు. పితరుల వలననే కలిగినది. అయినను మీరు విశ్రాంతిదినమున సున్నతి చేసెదరు.

23. మోషే చట్టము భంగము కాకుండుటకు విశ్రాంతిదినమున కూడ సున్నతి చేయుచున్నారు కదా! మరి విశ్రాంతి దినమున నేను ఒక మనుష్యుని సంపూర్ణ ఆరోగ్య వంతుని చేసినందుకు మీకు నాపై కోపమెందుకు?

24. మీరు పైకి కనిపించు వాటిని బట్టిగాక, న్యాయ సమ్మతమైన తీర్పుచేయుడు” అనెను.

25. యెరూషలేములో కొందరు ప్రజలు, “వారు చంపయత్నించుచున్నది. ఈయనను కాదా?

26. ఇదిగో! ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడు చున్నాడు. అయినను ఎవరును ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడ నిజముగ ఎరిగియుందురా?

27. ఈయన ఎక్కడి వాడో మనమెరుగుదుము. కాని 'క్రీస్తు' వచ్చినపుడు ఆయన ఎక్కడనుండి వచ్చునో ఎవరికిని తెలియదు” అని పలికిరి.

28. అపుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి “మీరు నన్ను ఎరుగుదురా! నేను ఎక్కడనుండి వచ్చితినో మీకు తెలియునా! నేను స్వయముగా రాలేదు. నన్ను పంపినవాడు సత్యస్వ రూపుడు. ఆయనను మీరు ఎరుగరు.

29. నేను ఆయనను ఎరుగుదును. ఏలయన, నేను ఆయన యొద్దనుండి వచ్చియున్నాను. ఆయన నన్ను పంపెను” అని చెప్పెను.

30. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి. కాని, ఆయన గడియ ఇంకనురానందున ఎవడును ఆయనపై చేయివేయలేదు.

31. కాని, ప్రజలలో ఎక్కువమంది ఆయనను విశ్వసించి, “క్రీస్తు వచ్చినపుడు ఆయన ఇంతకంటె ఎక్కువ సూచకక్రియలు చేయునా?” అని అనుకొనిరి.

32.యేసునుగురించి ప్రజలు ఈ విధంగా గొణుగు కొనుటను పరిసయ్యులు విని, వారును, ప్రధానార్చకులును ఆయనను బంధించుటకై అధికారులను పంపిరి.

33. అంతట యేసు వారితో, “ఇంకను కొద్దికాలము మాత్రము నేను మీతో ఉందును. తరువాత నేను నన్ను పంపినవానియొద్దకు పోవుదును.

34. మీరు నన్ను వెదకుదురు. కాని, నన్ను కనుగొనలేరు. నేను ఉండు స్థలమునకు మీరు రాలేరు” అనెను.

35. అందుకు యూదులు ఒకరితో ఒకరు “ఈయనను మనము కనుగొనలేకపోవుటకు ఈయన ఎక్కడకు పోవుచు న్నాడు? గ్రీసుదేశస్థులలో చెల్లాచెదరైపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీకులకు బోధించునా?

36. 'మీరు నన్ను వెదకుదురు. కాని నన్ను కనుగొనలేరు. నేను ఉండు స్థలమునకు మీరు రాలేరు' అని చెప్పుటలో భావమేమి?” అని చెప్పుకొనుచుండిరి. .

37. పండుగ చివరిదినము ప్రధానమైనది. ఆనాడు యేసు నిలచి బిగ్గరగా “ఎవడైన దప్పికకొన్నచో నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చునుకొనునుగాక!

38. లేఖనములో చెప్పబడినట్లు 'నన్ను విశ్వసించువాని అంతరంగమునుండి జీవజలనదులు ప్రవహించును' ” అని చెప్పెను.

39. ఆయన తన్ను విశ్వసించువారు పొందబోవు ఆత్మనుగురించి ఇట్లు పలికెను. యేసు ఇంకను మహిమపరుపబడనందున ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు.

40. ఈ పలుకులు విని జనసమూహములోని కొందరు “ఈయన వాస్తవముగ ప్రవక్త” అనియు,

41. మరికొందరు “ఈయన క్రీస్తు” అనియు చెప్పు కొనిరి. కాని కొందరు “క్రీస్తు గలిలీయనుండి రాడు గదా!

42. దావీదువంశమునుండియు, దావీదు గ్రామమగు బేత్లెహేమునుండియు క్రీస్తు అవతరించు నని లేఖనము చెప్పుటలేదా!” అని చెప్పుకొనిరి.

43. ఇట్లు ఆయననుగూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను.

44. కొందరు ఆయనను పట్టు కొనదలచిరి. కాని, ఎవడును ఆయనపై చేయివేయలేదు.

45. బంట్రౌతులు ప్రధానార్చకుల యొద్దకు, పరిసయ్యులయొద్దకు తిరిగిరాగా, “మీరు ఆయనను ఎందుకు పట్టుకొనిరాలేదు?” అని వారు ప్రశ్నించిరి.

46. అందుకు ఆ బంట్రౌతులు “ఆయనవలె ఎవడును ఎన్నడును మాట్లాడలేదు” అని సమాధానమిచ్చిరి.

47. అది విని పరిసయ్యులు వారితో, “మీరు గూడ మోసపోయితిరా?

48. అధికారులలోగాని, పరిసయ్యులలోగాని ఎవడును ఆయనను విశ్వసించలేదే!

49. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు. కనుక వీరు శాపగ్రస్తులు"అని పలికిరి.

50. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు.

51. అతడు “మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమిచేయునది తెలిసికొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా?” అని వారిని ప్రశ్నించేను.

52. అందుకు వారు “నీవును గలిలీయుడవా? గలిలీయనుండి ఏ ప్రవక్తయురాడు. పరిశీలించి చూడుము” అని సమాధానమిచ్చిరి.

53. అంతట అందరును తమతమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. 

 1. యేసు ఓలీవు పర్వతమునకు వెళ్ళెను.

2. తెల్లవారగనే ఆయన దేవాలయమునకు రాగా, ప్రజలు ఆయనయొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను.

3. అపుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసికొనివచ్చి అందరి ఎదుట నిలువబెట్టి,

4. "బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది.

5. ఇటువంటి స్త్రీలను రాళ్ళతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు?” అనిరి.

6. వారు యేసు మాటలలో తప్పుపట్టి, ఆయనపై నేరారోపణచేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేలమీద వ్రాయసాగెను.

7.వారు పదేపదే అడుగగా ఆయన లేచి “మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును” అని చెప్పి,

8. మరల వంగి నేలమీద వ్రేలితో వ్రాయసాగెను.

9. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలు కొని ఒకరివెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరు వెళ్ళిపోగా, ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను.

10. ఆయన తలయెత్తి “అమ్మా! వారందరు ఎక్కడ? ఎవరును నీకు శిక్ష విధింపలేదా!” అని ప్రశ్నించెను.

11. “లేదు ప్రభూ!” అని ఆమె సమాధాన మిచ్చెను. అందుకు యేసు “నేనును నీకు శిక్ష విధింపను. వెళ్ళుము. ఇక పాపము చేయకుము” అని చెప్పెను.

12. యేసు మరల వారితో "లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధ కారమున నడువక జీవపువెలుగును పొందును” అనెను.

13.పరిసయ్యులు ఆయనతో, “నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు. నీ సాక్ష్యము సత్యమైనది కాదు" అని పలికిరి.

14. అందుకు యేసు, "నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకొనినను అది సత్యము. ఏలయన నేను ఎక్కడనుండి వచ్చితినో, ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును. కాని, నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడకు వెళ్ళుచున్నానో, మీరు ఎరుగరు.

15. మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చేయను.

16. నేను తీర్పుచేసినను నా తీర్పు సత్యమైనది. ఏలయన, వాస్తవముగ తీర్పుచేయునది నేను ఒక్కడనే కాదు. నేనును, నన్ను పంపిన తండ్రియు తీర్పుచేయుదుము.

17. ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమగునని మీ ధర్మశాస్త్రమునకూడ వ్రాయబడి యున్నది గదా!

18. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను. నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు” అనెను.

19. అందుకు వారు “నీతండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగిరి. అప్పుడు యేసు “మీరు నన్ను కాని, నా తండ్రిని కాని ఎరుగరు. నన్ను ఎరిగియున్నచో నా తండ్రినికూడ ఎరిగియుందురు” అని సమాధాన మిచ్చెను.

20. యేసు దేవాలయమున కోశాగారమువద్ద బోధించుచు ఇట్లు చెప్పెను. కాని, ఎవరును ఆయనను పట్టుకొనలేదు. ఏలయన ఆయన గడియ ఇంకను రాలేదు.

21. యేసు మరల వారితో, “నేను ఇక వెళ్ళి పోయెదను. మీరు నన్ను వెదకుదురు. కాని మీరు మీ పాపములోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు” అనెను.

22. అపుడు యూదులు, “ఇతడు 'నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు' అని చెప్పుచున్నాడు. ఆత్మహత్య చేసికొనునా?" అని చెప్పుకొనిరి.

23. యేసు వారితో, “మీరు క్రిందినుండి వచ్చువారు. నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు. నేను ఈ లోకమునకు చెందినవాడను కాను.

24. కనుక మీరు మీ పాపము లలోనే మరణింతురు అని చెప్పితిని. నేనే ఆయనను అని విశ్వసింపనియెడల మీరు మీ పాపములలోనే మరణింతురు” అని చెప్పెను.

25. “అట్లయిన నీవు ఎవడవు?” అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు “మొదటినుండియు నేను ఎవడనని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను.

26. మిమ్ములను గురించి చెప్పవలసిన, తీర్పు తీర్పవలసిన విషయములు అనేక ములు కలవు. కాని నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను” అనెను.

27. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహింపలేదు.

28. కావున యేసు, “మీరు మనుష్యకుమారుని పైకెత్తినపుడు నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమియుచేయక, తండ్రి నాకు నేర్పినవానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు.

29. నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడును ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. కనుక, ఆయన నన్ను ఒంటరిగ విడిచి పెట్టలేదు” అని చెప్పెను.

30. ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా, అనేకులు ఆయనను విశ్వసించిరి.

31. అపుడు యేసు తనను విశ్వసించిన యూదులతో, “మీరు నామాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు.

32. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును” అనెను.

33. “మేము అబ్రహాము వంశీయులము. మేము ఎన్నడును, ఎవరికిని దాసులమై ఉండలేదు. 'మీరు స్వతంత్రులగుదురు' అని ఎటుల చెప్పగలవు?” అని వారు అడిగిరి.

34. అందుకు యేసు “నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు.

35. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివసించడు. కాని, కుమారుడు ఎల్లప్పుడును నివసించును.

36. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసినయెడల నిజముగ మీరు స్వతంత్రులై ఉందురు.

37. మీరు అబ్రహాము. వంశీయులని నేను ఎరుగుదును. అయినను, మీరు నా వాక్కును అంగీకరింపరు. కనుక, నన్ను చంపుటకు యత్నించుచున్నారు.

38. నేను నా తండ్రియొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను. మీరు మీ తండ్రియొద్ద వినినవానిని ఆచరించుచున్నారు” అని సమాధానమిచ్చెను.

39. అంతటవారు ఆయనతో “మా తండ్రి అబ్రహాము” అనిరి. అందుకు యేసు “మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు.

40. కాని, దేవునియొద్దనుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంపయత్నించుచున్నారు. అబ్రహాము అటుల చేయలేదు.

41. మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు” అనెను. అందుకు వారు “మేము వ్యభిచారమున పుట్టినవారము కాము. దేవుడొక్కడే మా తండ్రి” అని పలికిరి.

42. అందుకు యేసు “నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండెడివారు. ఏలయన, నేను ఆయన యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను. ఆయన పంపుటవలననే వచ్చితిని కాని, నాయంతట నేను రాలేదు.

43. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? నా వాక్కును వినజాలకుండుటవలననే గదా!

44. మీరు మీ తండ్రియగు సైతాను సంతానము. మీ తండ్రి కోరికలను నెరవేర్పకోరుచున్నారు. అతడు మొదటి నుండియు నరహంత. సత్యమునకు నిలబడడు.ఏలయన, సత్యమనునది వానిలో లేదు. అబద్ధమాడుట వానికి స్వభావసిద్ధము. ఏలయన, వాడు అసత్యవాది. అసత్యమునకు తండ్రి.

45. నేను సత్యమును పలుకుచున్నాను. మీరు నన్ను విశ్వసింపరు.

46. మీలో ఎవడు నాయందు పాపమున్నదని స్థాపింపగలడు? నేను సత్యము పలికినను మీరు ఏల నన్ను విశ్వసింపరు?

47. దేవునికి సంబంధించినవాడు దేవుని మాటలను ఆలకించును. మీరు దేవునికి సంబంధించినవారు కారు. కనుక, మీరు వాటిని ఆలకింపరు” అనెను.

48. “నీవు సమరీయుడవనియు, దయ్యము పట్టినవాడవనియు మేము చెప్పుట సముచితమే గదా!” అని యూదులు పలికిరి.

49. అందుకు యేసు “నేను దయ్యముపట్టిన వాడను కాను. నేను నా తండ్రిని గౌరవించుచున్నాను. కాని, మీరు నన్ను అగౌరవపరచు చున్నారు.

50. నేను నా కీర్తిని వెదకుట లేదు. దానిని వెదకి, తీర్పు చెప్పువాడు ఒకడున్నాడు.

51. నా మాటను పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు అని నిశ్చయముగ చెప్పుచున్నాను” అనెను.

52. అంతట యూదులు, “నీకు దయ్యము పట్టినదని మాకు ఇపుడు నిశ్చయముగ తెలియును. అబ్రహాము, ప్రవక్తలును మరణించిరి. 'నా మాటను పాటించు వాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు' అని నీవు చెప్పుచున్నావు.

53. మా తండ్రియైన అబ్రహాము మరణించెను. నీవు అతని కంటె గొప్పవాడవా? ప్రవక్తలును మరణించిరి. నీవు ఎవడవని అనుకొనుచున్నావు?” అని పలికిరి.

54. అందుకు యేసు, “నన్ను నేను మహిమ పరచుకొనినయెడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.

55. మీరు ఆయనను ఎరుగరు. కాని, నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పినయెడల మీవలె అసత్యవాదిని అగుదును. అయితే, నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాటను పాటించుచున్నాను.

56. మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను. అతడు దానిని చూచి సంతసించెను” అనెను.

57. “నీకు ఇంకను ఏబది సంవత్సరములైనను నిండలేదు. నీవు అబ్రహామును చూచితివా?” అని యూదులు ప్రశ్నించిరి.

58. అందుకు యేసు “అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.

59. అందువలన వారు ఆయనపై రాళ్లు రువ్వపూనుకొనిరి. కాని, ఆయన దాగుకొని దేవాలయమునుండి వెళ్ళి పోయెను. 

 1. యేసు మార్గమున పోవుచు ఒక పుట్టుగ్రుడ్డి వాడిని చూచెను.

2. ఆయన శిష్యులు “బోధకుడా! వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి? విడా? వీని తల్లిదండ్రులా?” అని యేసును అడిగిరి.

3. అందుకు యేసు “వీడుగాని, వీని తల్లిదండ్రులుగాని పాపము చేయలేదు. దేవుని మహిమ వీనియందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.

4. పగటి వేళనే నన్ను పంపినవాని పనులు మనము చేయుచుండవలయును. రాత్రి దగ్గర పడుచున్నది. అపుడు ఎవడును పనిచేయలేడు.

5. ఈ లోకమున నేను ఉన్నంతకాలము నేను లోకమునకు వెలుగును”

6. అని పలికి, నేలమీద ఉమ్మివేసి, ఆ ఉమ్మితో మట్టిని కలిపి, ఆ మట్టిని గ్రుడ్డివాని కనులమీద రాసి,

7. “వెళ్ళి సిలోయము' కోనేటిలో కడుగుకొనుము” అని చెప్పెను. ('సిలోయము' అనగా పంపబడినవాడు అని అర్థము.) ఆ గ్రుడ్డివాడు వెళ్ళి కడుగుకొని, చూపును పొంది తిరిగివచ్చెను.

8. అపుడు వాని ఇరుగుపొరుగువారును, అంతకు పూర్వము వాడు భిక్షమెత్తుటను చూచిన వారును “కూర్చుండి, భిక్షమడుగుకొనువాడు వీడు కాడా?" అనిరి.

9. కొందరు “అవును వీడే!" అనిరి. మరికొందరు “వీడు వానివలె ఉన్నాడు” అనిరి. కాని, వాడు మాత్రము “అతనిని నేనే” అని చెప్పెను.

10. “నీ కళ్ళు ఎట్లు తెరువబడినవి?” అని వారు అడిగిరి.

11. అందుకు వాడు “యేసు అను మనుష్యుడు మన్ను కలిపి, నా కన్నులమీద రాసి, 'వెళ్ళి సిలోయములో కడుగుకొనుము' అని చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొనగా నాకు చూపు కలిగెను” అని చెప్పెను.

12. “అతడు ఎక్కడ ఉన్నాడు?” అని వారు అడిగిరి. “నాకు తెలియదు” అని వాడు పలికెను.

13. అంతటవారు చూపును పొందిన ఆ గ్రుడ్డి వానిని పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.

14. యేసు మట్టిని కలిపి వాని కన్నులు తెరిపించిన రోజు విశ్రాంతిదినము.

15. అందుచే పరిసయ్యులుకూడ వానిని “నీకు ఎట్లు చూపు వచ్చినది” అని అడిగిరి. “ఆయన కలిపిన మట్టిని నా కనులమీద రాసెను. నేను కడుగుకొంటిని. నాకు చూపు కలిగినది” అని వాడు వారితో చెప్పెను.

16. “ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు. కనుక దేవునియొద్దనుండి వచ్చినవాడు కాడు” అని కొంతమంది పరిసయ్యులు అనిరి. కాని మరికొందరు “పాపియైన మనుష్యుడు ఇట్టి సూచక క్రియలు ఎట్లు చేయగలడు?" అనిరి. ఇట్లు వారిలో భేదాభిప్రాయములు కలిగెను.

17. వారు మరల ఆ గ్రుడ్డివానిని “అతడు నీ కనులు తెరిచినందుకు అతనిని గురించి నీ అభిప్రాయమేమిటి?” అని అడిగిరి. “ఆయన ఒక ప్రవక్త” అని వాడు చెప్పెను.

18. వాడు గ్రుడ్డివాడై ఉండెనని ఇపుడు చూపును పొందెనని యూదులు నమ్మక, వాని తల్లిదండ్రులను పిలిపించి

19. “వీడు మీ కుమారుడా? వీడు గ్రుడ్డివానిగా పుట్టెనా? అట్లయిన వీడు ఇపుడు ఎట్లు చూడగలుగుచున్నాడు?” అని అడిగిరి.

20. అందుకు వాడి తల్లిదండ్రులు “వీడు మా కుమారుడే. వీడు పుట్టు గ్రుడ్డివాడు. అంతవరకు మాకు తెలియును.

21. కాని, ఇపుడు ఎట్లు చూడగలుగుచున్నాడో, ఎవడు వీనికి దృష్టినిచ్చెనో మాకు తెలియదు. వాడు వయస్సు వచ్చినవాడు. వానినే అడుగుడు. తన సంగతి తానే చెప్పుకొనగలడు” అనిరి.

22. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అట్లనిరి, ఏలయన, ఆయనను క్రీస్తు అని అంగీకరించు వానిని ప్రార్థనామందిరము నుండి వెలివేయవలయునని యూదులు నిర్ణయించుకొనిరి.

23. అందుచేతనే వాని తల్లిదండ్రులు “వాడు వయస్సు వచ్చినవాడు. వానినే అడుగుడు” అని చెప్పిరి.

24. వారు ఆ గ్రుడ్డి వానిని మరల పిలిపించి వానితో, “దేవుని స్తుతింపుము. ఆ మనుష్యుడు పాపాత్ముడు అని మాకు తెలియును” అనిరి.

25. అందుకు వాడు “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. కాని, ఒకటి మాత్రము నాకు తెలియును. నేను గ్రుడ్డివాడనైయుంటిని. ఇపుడు చూడగలుగు చున్నాను” అనెను.

26. వారు వానిని, “అతడు నీకేమి చేసెను? నీ కన్నులు ఎట్లు తెరచెను?” అని ప్రశ్నించిరి.

27. అందుకు వాడు “ఇంతకు మునుపే చెప్పితిని. కాని మీరు వినిపించుకొనుటలేదు. మరల ఎందుకు వినగోరుచున్నారు? మీరు కూడ ఆయన శిష్యులు కాగోరుచున్నారా ఏమి?" అని సమాధానమిచ్చెను.

28. వారు వానిని దూషించుచు, “నీవే వాని శిష్యుడవు. మేము మాత్రము మోషే శిష్యులము.

29. దేవుడు మోషేతో సంభాషించెనని మేము ఎరుగుదుము. కాని ఇతడు ఎక్కడనుండి వచ్చెనో మేము ఎరుగము” అనిరి.

30. అందుకు వాడు “ఆయన, నాకు దృష్టిని ఇచ్చెను. ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఎంత ఆశ్చర్యకరము!

31. దేవుడు పాపులను ఆలకింపడని మనము ఎరుగుదుము. కాని ఆయనను ఆరాధించుచు ఆయన చిత్తమును నెరవేర్చువానిని ఆయన ఆలకించును.

32. ప్రపంచ ప్రారంభము నుండి నేటివరకు ఎవడును పుట్టుగ్రుడ్డివానికి దృష్టిని ఇచ్చినట్లు వినియుండలేదు.

33. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియును చేయ జాలడు” అని వారితో చెప్పెను.

34. అందుకు వారు “పాపకూపములో జన్మించిన నీవు, మాకు బోధింప బయలుదేరితివా?” అని వానిని వెలివేసిరి.

35. వానిని వెలివేసిన వార్త విని, యేసు వానిని కనుగొని, “నీవు మనుష్యకుమారుని విశ్వసించు చున్నావా?” అని అడిగెను.

36. అందుకు వాడు, "ప్రభూ! నేను విశ్వసించుటకు ఆయన ఎవరు?” అని ప్రశ్నించెను.

37.“నీవు ఆయనను చూచితివి. నీతో మాట్లాడుచున్నవాడు ఆయనయే” అని యేసు వానితో చెప్పెను.

38. “ప్రభూ! నేను విశ్వసించుచున్నాను” అని వాడు ఆయనను ఆరాధించెను.

39. “చూపులేనివారు చూచుటకును, చూపుగల వారు అంధులగుటకును, తీర్పుచేయుటకు ఈ లోకమునకు వచ్చియున్నాను” అని యేసు చెప్పెను.

40. ఆయనతో ఉన్న పరిసయ్యులు కొందరు ఇది విని “మేము కూడ గ్రుడ్డివారమా?' అనిరి.

41. అందుకు యేసు “మీరు నిజముగా గ్రుడ్డివారైయున్నయెడల మీ యందు పాపదోషము ఉండెడిది కాదు. కాని, మీరు దృష్టిగలవారమని చెప్పుచున్నారు. కనుక, మీయందు పాపదోషము నెలకొనియున్నది” అని పలికెను. 

 1. “నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా: గొఱ్ఱెలదొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు, దోపిడికాడునై ఉన్నాడు.

2. ద్వారమున ప్రవేశించు వాడు గొఱ్ఱెలకాపరి.

3. కావలివాడు వానికి తలుపు తీయును: గొఱ్ఱెలు వాని స్వరమును వినును. అతడు తన గొఱ్ఱెలను పేరు పేరున పిలిచి, బయటకు తోలు కొనిపోవును.

4. తన గొఱ్ఱెలను అన్నిటిని బయటకు తోలుకొనివచ్చిన పిదప, వాడు వానికి ముందుగ నడచును. గొఱ్ఱెలు వాని స్వరమును గుర్తించును. కనుక, అవి వాని వెంటపోవును.

5. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు. కనుక, అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును.”

6. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను. కాని, ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి.

7. అందుచే యేసు మరల ఇట్లు చెప్పెను: “ గొఱ్ఱెలుపోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

8. నాకు ముందుగా వచ్చిన వారందరు దొంగలు, దోపిడిగాండ్రు. గొఱ్ఱెలు వారి స్వరమును ఆలకింపలేదు.

9. నేనే ద్వారమును! ఎవడేని నాద్వారా ప్రవేశించినయెడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును. వానికి మేత లభించును.

10. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవము నిచ్చుటకును, దానిని సమృద్ధిగ ఇచ్చుటకును వచ్చియున్నాను.

11. “నేను మంచికాపరిని. మంచికాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణమును ధారపోయును.

12. జీతగాడు గొఱ్ఱెల సొంతవాడుకాడు కనుక, తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచి పారిపోవును. తోడేలు గొఱ్ఱెలను పట్టి బెదరగొట్టును.

13. వాడు జీతగాడే కనుక, వానికి గొఱ్ఱెలను గురించి చింతలేక పారిపోవును.

14-15. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగియున్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొఱ్ఱెలను, నన్ను నా గొఱ్ఱెలును ఎరుగును. నేను గొఱ్ఱెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను.

16. ఈ గొఱ్ఱెల దొడ్డికి చెందని వేరే గొఱ్ఱెలును నాకు కలవు. వానినిగూడ నేను తోడుకొనిరావలయును. అవి నా స్వరమును ఆలకించును. అపుడు ఒకే మందయు, ఒకే కాపరియు ఉండును.

17. “ఈ కారణము చేతనే, తండ్రి నన్ను ప్రేమించును. ఏలయన నా ప్రాణమును మరలపొందుటకై దానిని ధారపోయుదును.

18. ఎవడును నా ప్రాణమును తీసికొనడు. నా యంతట నేనే ధారపోయుటకును, దానిని మరల తీసికొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది” అని యేసు పలికెను.

19. ఈ మాటల వలన మరల యూదులలో భేదాభిప్రాయములు ఏర్పడెను.

20.“అతనికి దయ్యము పట్టినది, అతడు వెట్టివాడు. అతని మాటలు ఏల లక్ష్యపెట్టెదరు?" అని వారిలో అనేకులు పలికిరి.

21. మరికొందరు “ఈ మాటలు దయ్యము పట్టినవాని మాటలుగా లేవు. దయ్యము గ్రుడ్డివారికి చూపును ఈయగలదా?" అనిరి.

22.యెరూషలేములో దేవాలయ ప్రతిష్ణోత్సవము జరుగుచుండెను.

23. అది శీతకాలము. యేసు దేవాలయమున సొలోమోను మంటపమున నడుచు చుండెను.

24. యూదులు ఆయనచుట్టు గుమిగూడి, “నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము” అని అడిగిరి.

25. అందుకు యేసు వారితో, “నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయుపనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.

26. మీరు నా గొఱ్ఱెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముటలేదు.

27. నా గొఱ్ఱెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును.

28. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికిని నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతినుండి అపహరింపలేడు.

29. వానిని నా కిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు.

30. నేనును, నా తండ్రియు ఏకమైయున్నాము” అని చెప్పెను.

31. యూదులు మరల ఆయనను రాళ్ళతో కొట్టుటకు, రాళ్ళను తీసుకొనిరి.

32. యేసు వారిని “తండ్రియొద్దనుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని. వానిలో దేని కారణమున నన్ను రాళ్ళతో కొట్టుచున్నారు?” అని అడిగెను.

33. అందుకు యూదులు “నీవు మనుష్యుడవై ఉండియు, దేవుడనని అనుచున్నావు. కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్ళతో కొట్టుచున్నాము కాని, సత్కార్యము చేసినందుకు కాదు” అని అనిరి.

34. అందుకు యేసు వారితో ఇట్లనెను: “ 'మీరు దైవములని నేను చెప్పితిని' అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడియుండలేదా?

35. దేవునివాక్కు ఎవరివద్దకు వచ్చెనో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్థకము కానేరదు గదా!

36. అట్లయిన, తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పి నందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా?

37. నేను తండ్రి పనులను చేయని యెడల మీరు నన్ను నమ్మవద్దు.

38. కాని, నేను వానిని నెరవేర్చుచున్నయెడల, మీరు నన్ను నమ్మకపోయినను, నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నాయందును, నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహింతురు.”

39. వారు మరల యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కాని ఆయన వారి చేతులలో పడక తప్పుకొనిపోయెను.

40. యోహాను మొదట బప్తిస్మమును ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరల వెళ్ళి, అచటనే ఉండెను.

41. అనేకులు ఆయనయొద్దకు వచ్చిరి. “యోహాను సూచకక్రియలు ఏమియు చేయ లేదు. కాని, ఈయన గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము” అని వారు పలికిరి,

42. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. 

 1. బెతానియాలో 'లాజరు' అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ, ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండిరి.

2. యేసుకు పరిమళ తైలముపూసి, ఆయన పాదములను తలవెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు.

3. కనుక, అక్కచెల్లెండ్రు “ప్రభూ! మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు” అని యేసుకు వర్తమానము పంపిరి.

4. అది విని యేసు, “ఈ వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదు. ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమపరుపబడుటకును వచ్చినది” అనెను.

5. యేసు మార్తమ్మను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను.

6. లాజరు జబ్బుపడెనని వినియు, యేసు తాను ఉన్నచోటనే ఇంకను రెండు రోజులు ఉండెను.

7. ఆ పిమ్మట ఆయన తన శిష్యు లతో, “మనము యూదయాకు తిరిగిపోవుదము రండు” అనెను.

8. “బోధకుడా! ఇంతకు ముందే యూదులు మిమ్ము రాళ్ళతో కొట్టదలచిరి. అయినను మీరు అక్కడకు తిరిగివెళ్ళెదరా?” అని శిష్యులు అడిగిరి.

9. అందుకు యేసు ఇట్లనెను: “పగలు పండ్రెండు గంటలు ఉన్నవి కదా! ఎవడేని పగటివేళ నడచినయెడల తొట్రుపడడు. ఏలయన, వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును.

10. కాని, రాత్రి వేళ నడచినయెడల వాడు తొట్రుపడును. ఏలయన, వానియందు వెలుగులేదు.”

11. ఆయన వారితో మరల, “మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను” అని చెప్పగా,

12. శిష్యులు “ప్రభూ! అతడు నిద్రించుచున్నచో బాగుపడును” అనిరి.

13. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పెను. కాని, వారు అతని నిద్ర విశ్రాంతి గురించి చెప్పెనని తలంచిరి.

14. అపుడు యేసు వారితో స్పష్టముగ, “లాజరు మరణించెను.

15. మీరు విశ్వసించుటకు, మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతసించుచున్నాను. రండు ఇపుడు మనము అతనియొద్దకు వెళ్ళుదము” అని పలికెను.

16. అపుడు 'దిదీము' అనబడు తోమా “మనముకూడ వెళ్ళి ఆయనతోపాటు చని పోవుదము” అని తనతోటి శిష్యులతో అనెను.

17. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి నాలుగు దినములైనదని తెలిసికొనెను.

18. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది.

19. వారి సహోదరునిగూర్చి, మార్తమ్మ, మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి.

20. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురువెళ్ళెను. కాని మరియమ్మ ఇంటి యందే కూర్చుండి ఉండెను.

21. మార్తమ్మ యేసుతో, “ప్రభూ! మీరు ఇచట ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండెడివాడుకాడు.

22. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియును” అనెను.

23. యేసు ఆమెతో “నీ సహోదరుడు మరలలేచును” అని చెప్పెను.

24. అందుకు మార్తమ్మ “అంతిమదినమున పునరుత్థాన మందు అతడు మరలలేచునని నేను ఎరుగుదును” అని పలికెను.

25. అపుడు యేసు “నేనే పునరుత్థాన మును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును.

26.. జీవము ఉండగా ,నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణము చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా?” అని ప్రశ్నింపగా,

27. ఆమె “అవును ప్రభూ! లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను” అని చెప్పెను.

28. ఆమె ఇట్లు పలికి వెళ్ళి, తన సహోదరి మరియమ్మతో, “బోధకుడు ఇక్కడ ఉన్నాడు. నిన్ను రమ్మనుచున్నాడు” అని రహస్యముగా చెప్పెను.

29. అది విని, మరియమ్మ వెంటనే లేచి ఆయనవద్దకు వెళ్ళెను.

30. యేసు ఇంకను గ్రామము చేరలేదు, మార్తమ్మ తనను కలిసికొనిన స్థలముననే ఉండెను.

31. ఇంటియొద్ద మరియమ్మను ఓదార్చుచున్న యూదులు, ఆమె ఉన్నపాటున లేచి, వెలుపలకు బయలుదేరుట చూచి, ఆమె వెంట వెళ్ళిరి. ఏలయన, ఆమె సమాధియొద్ద విలపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి.

32. మరియమ్మ యేసు ఉన్నచోటుకు వచ్చి ఆయన పాదములపై బడి, “ప్రభూ! మీరు ఇక్కడ ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండెడి వాడు కాడు” అనెను.

33. ఆమెయు, ఆమె వెంట వచ్చిన యూదులును విలపించుటను చూచినపుడు యేసు హృదయము ద్రవించెను.

34. ఆయన దీర్ఘముగ నిట్టూర్చి, “మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి?" అని అడిగెను. “ప్రభూ! వచ్చి చూడుడు!” అని వారు పలికిరి.

35. యేసు కంటతడి పెట్టెను.

36. అంతట యూదులు “ఈయన అతనిని ఎంతగా ప్రేమించు చున్నాడో చూడుడు! ” అని చెప్పుకొనిరి.

37. కాని వారిలో కొందరు “గ్రుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యువునుండి తప్పింపలేకపోయెనా?” అనిరి.

38. యేసు మరల దీర్ఘముగ నిట్టూర్చి, సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ.

39. “రాతిని తొలగింపుడు” అని యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, “ప్రభూ! అతడు చనిపోయి నాలుగు దినములైనది. ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును” అనెను.

40. యేసు ఆమెతో “నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా?” అనెను.

41. అంతటవారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, “ఓ తండ్రీ! నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు కృతజ్ఞుడను.

42. నీవు నన్ను ఎప్పుడును ఆలకించెదవని నేను ఎరుగుదును. కాని ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై, నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితిని” అనెను.

43. పిమ్మట యేసు బిగ్గరగ “లాజరూ! వెలుపలకు రమ్ము" అని పలికెను.

44. చనిపోయినవాడు వెలువలకు వచ్చెను. అతని కాలుసేతులు ప్రేతవస్త్రముతో బంధింపబడియుండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడియుండెను. యేసు వారితో "కట్లు విప్పి, అతనిని పోనిండు” అనెను.

45. మరియమ్మతో కలసి వచ్చి ఈ కార్యమును  చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వ సించిరి.

46. కాని, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి, యేసు చేసిన ఈ కార్యమును గురించి వివరించిరి.

47. అంతట ప్రధానార్చకులు, పరిసయ్యులు సభను సమావేశపరచి “మనము ఏమిచేయుదుము? ఇతడేమో అనేక సూచకక్రియలు చేయుచున్నాడు.

48. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరు ఇతనిని విశ్వసింతురు. అపుడు రోమీయులు వచ్చి, మన పవిత్ర స్థలమును, మనజాతిని, రెంటిని నాశనము చేసెదరు” అని చెప్పిరి.

49. కాని, వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా,“మీకు ఏమియు తెలియదు.

50. జాతి అంతయు నాశనమగుటకంటె, ఒక మనిషి ప్రజలకొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా?” అనెను.

51. ఈ మాటను అతడు తానుగా గాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక, యేసు ఆ జాతి అంతటికొరకై మరణింపనున్నాడని ప్రవచించెను.

52. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అటుల మరణించునని పలికెను.

53. కావున వారు ఆనాటినుండియు యేసును తుద ముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి.

54. అందుచే యేసు అప్పటినుండియు యూదులమధ్య బహిరంగముగ సంచరించుట మానివేసెను. ఆయన అచట నుండి నిర్జనప్రాంతము సమీపమున యున్న ఎఫ్రాయీము పట్టణమునకు వెళ్లి తనశిష్యులతో అచటనే ఉండెను.

55. యూదుల పాస్కపండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లెప్రాంతములనుండి తమను తాము శుద్ధి చేసికొనుటకై పండుగకు ముందుగనే యెరూషలేమునకు వచ్చియుండిరి.

56. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు “నీకు ఏమితోచుచున్నది? అతడు పండుగకురాడా?” అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి.

57. ప్రధానార్చ కులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన పక్షమున వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అటుల ఆజ్ఞాపించిరి. 

 1. పాస్కపండుగకు ఆరుదినములు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలోనుండి లేపబడిన లాజరు యొక్క స్వగ్రామము.

2. అక్కడ యేసుకు విందుచేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను.

3. అపుడు మరియమ్మ విలువైన, స్వచ్చమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును శేరున్నర తెచ్చి యేసుపాదములను అభిషేకించి, తన తలవెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను.

4. అంతట ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు,

5. “ఈ పరిమళ తైలము మూడువందల దీనారములకు అమ్మి పేదలకు ఈయగూడదా?” అనెను.

6. అతడు పేదలపట్ల జాలితో ఇట్లు అనలేదు. ఏలయన, వాడు దొంగ. తనయెద్ద నున్న డబ్బులసంచినుండి దొంగిలించుచుండును.

7. అపుడు యేసు “ఆమెను అటుల చేయనిండు. నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు.

8. పేదలు ఎల్లపుడు మీతో ఉందురు. కాని, నేను ఎల్లప్పుడు మీతో ఉండను” అనెను.

9. యేసు అక్కడ ఉన్నాడని యూద జనసమూహము తెలిసికొని వారు యేసునే కాదు ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడ చూచుటకు వచ్చిరి.

10. అంతట ప్రధానార్చకులు లాజరును కూడ చంపుటకు కుట్రచేసిరి.

11. ఏలయన, అతని మూలమున యూదులలో పలువురు తమవారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి.

12. మరునాడు పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చియున్నాడని వినెను.

13. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసునకు ఎదురేగి, “ ' జయము! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక! యిస్రాయేలు రాజు స్తుతింపబడునుగాక!” అని ఎలుగెత్తి చాటిరి.

14. యేసు ఒక చిన్న గాడిదను చూచి, దానిపై కూర్చుండెను. లేఖనమందు ఇట్లు వ్రాయబడియున్నది:

15. “సియోను కుమారీ, భయపడకుము ఇదిగో! నీ రాజు నీయొద్దకు వచ్చుచున్నాడు. గాడిదపిల్లపై కూర్చుండి వచ్చుచున్నాడు."

16. ఆయన శిష్యులు మొదట దీనిని గ్రహింపలేకపోయిరి. కాని, యేసు మహిమపరుపబడినప్పుడు ఆయనను గురించి ఇటుల వ్రాయబడియున్నదనియు, అట్లే ప్రజలు ఆయన పట్ల వ్యవహరించిరనియు, వారికి స్ఫురణకు వచ్చెను.

17. సమాధినుండి లాజరును వెలుపలకు పిలిచి, వానిని మృతులలోనుండి పునర్జీవుని చేసినపుడు ఆయన వెంట ఉన్నవారు సాక్ష్యము పలికిరి.

18. ఆయన ఈ సూచకక్రియలు చేసెనని విని, జనసమూహము ఆయనను చూడబోయెను.

19. అంతట పరిసయ్యులు ఒకరితో ఒకరు “మన ప్రయత్నము ఎట్లు నిష్పలమయ్యెనో చూడుడు. లోకమంతయు ఆయన వెంటపోవుచున్నది” అని చెప్పుకొనిరి.

20. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి.

21. వారు గలిలీయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పున వెళ్ళి అతనితో "అయ్యా! మేము యేసును చూడగోరుచున్నాము" అనిరి.

22. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పెను. అంద్రెయ, ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి.

23. అందుకు యేసు ఇట్లనెను: “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియవచ్చినది.

24. నేను మీతో నిశ్చయ ముగ చెప్పునదేమన: గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించిన యెడల విస్తారముగ ఫలించును.

25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని, ఈలోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును.

26. నన్ను సేవింప గోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించినయెడల వానిని నాతండ్రి గౌరవించును.

27. ఇపుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను! ఓ తండ్రీ! ఈ గడియనుండి నన్ను కాపాడుము. లేదు. నేను వచ్చినది. ఈ గడియ నిమిత్తమే కదా!

28. ఓ తండ్రీ! నీ నామమును మహిమ పరుపుము” అనెను. అంతట ఆకాశమునుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను: “నేను దానిని మహిమ పరచితిని. మరల మహిమపరచెదను”.

29. అక్కడ ఉన్న జనసమూహము అది విని “మేఘము గర్జించినది” అనిరి. కొందరు “దేవదూత ఆయనతో మాట్లాడెను” అనిరి.

30. కాని యేసు, “ఈ శబ్దము నా కొరకు రాలేదు. అది మీ కొరకే వచ్చినది.

31. ఇపుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసి వేయబడును.

32. నేను భూమినుండి పైకి ఎత్తబడినప్పుడు అందరిని నాయొద్దకు ఆకర్షింతును” అని పలికెను.

33. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను.

34. జనసమూహము ఆయనను, “క్రీస్తు ఎల్లప్పుడును ఉండునని మేము ధర్మశాస్త్రమున వినియుంటిమి. మరి మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు ఎట్లు చెప్పుచున్నావు? ఈ మనుష్యుకుమారుడు ఎవడు?" అని ప్రశ్నించిరి.

35. అందుకు యేసు “ఇంకను కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్ము క్రమ్ముకొనకముందే, వెలుగు ఉండగనే నడువుడు. చీకటిలో నడుచువానికి, తాను ఎటు వెళ్ళుచున్నాడో తెలియదు.

36. మీరు వెలుగుపుత్రులుగా వుండుటకు వెలుగు ఉండగనే మీరు ఆ వెలుగునందు విశ్వాసముంచుడు” అనెను. ఈ మాటలు చెప్పి యేసు వారికి కనుమరుగైపోయెను.

37. యేసు వారి ఎదుట ఎన్నో సూచకక్రియలు చేసినను వారు ఆయనను విశ్వసింపలేదు.

38. యెషయా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను: “ప్రభూ! మా సందేశమును ఎవరు విశ్వసించిరి? ప్రభువు తన శక్తిని ఎవరికి బయలుపరచెను?”

39. ఇందువలన వారు విశ్వసింపలేకపోయిరి. ఏలయన, యెషయా ప్రవక్త మరల ఇట్లు పలికెను:

40. “వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని, నాచేత స్వస్థత పొందకుండునట్లు,  ఆయన వారి కనులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచెను."

41. యెషయా ఆయన మహిమను చూచెను. కనుక ఆయన విషయమై ఇట్లు పలికెను.

42. అయినను అధికారులలో కూడ పలువురు ఆయనను విశ్వసించిరి. కాని, ప్రార్థనామందిరమునుండి వెలివేయబడుదు మేమో అని పరిసయ్యులవలన భయముచే ఆయనను అంగీకరింపరైరి.

43. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పునే ఎక్కువగ కాంక్షించిరి.

44. యేసు ఎలుగెత్తి ఇట్లనెను: “నన్ను విశ్వసించు వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించు చున్నాడు.

45. నన్ను చూచువాడు నన్ను పంపినవానిని చూచుచున్నాడు.

46. నన్ను విశ్వసించు వారిలో ఎవడును చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

47. నా మాటలు ఆలకించి, ఆచరించని వానిని ఖండించునది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకేగాని, ఖండించుటకు కాదు.

48. నన్ను తృణీకరించి, నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను పలికిన నా వాక్కే అంతిమదినమున వానిని ఖండించును.

49. నా అంతట నేను ఏమియు మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమిచెప్పవలయునో, ఏమి మాట్లాడవలయునో ఆజ్ఞాపించి ఉన్నాడు.

50. ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును. కనుక, నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడు చున్నాను.”

 1. అది పాస్కపండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రియొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తనవారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను.

2. వారు భోజనము చేయుచుండ సీమోను కుమారుడగు యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలయునను ప్రేరణ కలిగించెను.

3. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు, తాను దేవునియొద్దనుండి వచ్చితిననియు, మరల దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను.

4. పిమ్మట తన పైవస్త్రమును తీసివేసి, నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని,

5. ఒక పళ్ళెములో నీరుపోసి, తన శిష్యుల పాదములు కడిగి, నడుమునకు కట్టు కొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను.

6. అట్లు ఆయన సీమోను పేతురుయొద్దకు రాగా, అతడు “ప్రభూ! నీవు నా పాదములు కడుగుదువా?” అని ఆయనతో అనెను.

7. “నేను చేయుచున్నది ఇపుడు నీవు గ్రహింపలేవు. ఇకమీదట తెలిసికొందువు” అని యేసు పలికెను.

8. “నీవు నా పాదములు ఎన్నటికిని కడుగరాదు” అని పేతురు పలికెను. అందుకు యేసు “నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు” అని చెప్పెను.

9. “అట్లయిన ప్రభూ! నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను, నా తలను కూడ కడుగు ము” అని సీమోను పేతురు పలికెను.

10. “స్నానము చేసినవాడు పూర్తిగా శుద్దుడైయున్నాడు. అతడు పాదములుతప్ప మరేమియు కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు. కాని, మీలో అందరు కాదు” అని యేసు అతనితో చెప్పెను.

11. ఆయన తనను అప్పగించువానిని ఎరిగియుండెను. కనుక, “మీలో అందరును శుద్ధులుకారు” అని పలికెను.

12. ఆయన వారందరి పాదములను కడిగిన పిమ్మట మరల తన పైవస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి, ఇట్లు పలికెను: “నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా?

13. మీరు నన్ను బోధకుడనియు, ప్రభుడననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయన, నేను మీ బోధకుడను, ప్రభుడనైయున్నాను.

14. మరియు, ప్రభుడను, బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడ ఒకరి పాదములు మరియొకరు కడుగవలయును.

15. నేను చేసినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని.

16. దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడు. పంపబడినవాడు పంపినవానికంటె గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

17. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు.

18. నేను మీ అందరి విషయమై మాట్లాడుట లేదు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచుంటినో నాకు తెలియును. కాని 'నాతో భుజించువాడు నాకు విరుద్దముగా లేచును' అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది.

19. అటుల జరిగినపుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను.

20. నేను పంపినవానిని స్వీక రించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపినవానిని స్వీకరించుచు న్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

21. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు “మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను.” అని స్పష్టముగ పలికెను.

22. అంతట ఆయన శిష్యులు “ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో” అని సందేహించుచు ఒకరి వంక మరియొకరు చూచుకొనసాగిరి.

23. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని కూర్చుండియుండెను.

24. యేసు ఎవనిని గురించి ఈ మాట చెప్పెనో అడుగు మని సీమోను పేతురు అతనికి సైగచేసెను.

25. అతడు అట్లే యేసు వక్షఃస్థలమున వంగి. "ప్రభూ! అతడెవడు?” అని ప్రశ్నించెను.

26. “నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదనో అతడే” అని యేసు సమాధానమిచ్చి, ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడగు 'యూదా'కు ఇచ్చెను.

27. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అపుడు యేసు వానితో, “నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము" అని పలికెను.

28. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించువారిలో ఎవరును గ్రహింపలేదు.

29. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున, యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనుమనియో, లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి.

30. యూదా ఆ రొట్టెముక్కను తీసికొని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రి వేళ.

31. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను: “ఇపుడు మనుష్యకుమారుడు మహిమపరుపబడి ఉన్నాడు. ఆయనయందు దేవుడు మహిమపరుపబడెను.

32. ఆయనయందు దేవుడు మహిమపరుప బడినయెడల, దేవుడును తనయందు ఆయనను మహిమ పరచును. వెంటనే ఆయనను మహిమపరుచును.

33. చిన్న బిడ్డలారా! నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. 'మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు' అని యూదులతో చెప్పినట్లే మీతో కూడ చెప్పుచున్నాను.

34. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు.

35. మీరు పరస్ప రము ప్రేమ కలిగియున్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు.”

36. అందుకు సీమోను పేతురు "ప్రభూ! నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు?” అని అడిగెను. “నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నావెంట రాలేవు. కాని, తరువాత రాగలవు” అని యేసు చెప్పెను.

37. “ప్రభూ! ఇపుడు మీవెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను” అని పేతురు పలికెను.

38. అందుకు యేసు “నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా?  కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని చెప్పెను

 1. యేసు వారితో “మీ హృదయములను కలవరపడనీయకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు.

2. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటులచెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్ధము చేయబోవు చున్నాను.

3. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును.

4. నేను వెళ్లు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు” అనెను.

5. తోమా ఆయనతో “ప్రభూ! మీరు వెళ్లు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమెట్లు ఎరుగుదుము?” అనెను.

6. అందుకు యేసు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు.

7. మీరు నన్ను ఎరిగియున్నచో, నా తండ్రిని కూడ ఎరిగి యుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచి ఉన్నారు” అని పలికెను.

8. అప్పుడు ఫిలిప్పు "ప్రభూ! మాకు తండ్రిని చూపుము. మాకు అది చాలును” అనెను.

9. అందుకు యేసు ఇట్లనెను: “ఫిలిప్పు! నేను ఇంతకాలము మీతో ఉంటిని. నన్ను తెలిసికొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు!

10. నేను తండ్రియందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు. కాని, తండ్రి నాయందు నివసించుచు, తన పనులను నెరవేర్చుచున్నాడు.

11. నేను తండ్రి యందు ఉన్నాననియు, తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టియైనను నన్ను విశ్వసింపుడు.

12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. కనుక, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటె గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

13. తండ్రి కుమారుని యందు మహిమ పరుపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసెదను.

14. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను.

15.“మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు.

16. నేను తండ్రిని ప్రార్ధింతును. మీతో ఎల్లప్పుడు ఉండుటకు మరొక ఆదరణ కర్తను ఆయన మీకు అనుగ్రహించును.

17. ఆయన సత్యస్వరూపి అగు ఆత్మ. లోకము ఆయనను పొందజాలదు. ఏలయన అది ఆయనను చూడదు, ఎరుగదు. కాని, మీరు ఆయనను ఎరుగుదురు. కనుక, ఆయన మీతో నివసించును. మీయందు ఉండును.

18. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. నేను మీయొద్దకు వత్తును.

19. కొలదికాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికిని చూడలేదు. కాని, మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను. కనుక, మీరును జీవింతురు.

20. నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు.

21." నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి, వానికి నన్ను తెలియపరచుకొందును” అని చెప్పెను.

22. అంతట ఇస్కారియోతు కాని 'యూదా' “ప్రభూ! లోకమునకుకాక మాకు మాత్రము తెలియపరచు కొనుట ఎట్లు సంభవించును?” అని అడిగెను.

23. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను: “నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అపుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము.

24. కాని, నన్ను ప్రేమింపనివాడు నామాట పాటింపడు. మీరు విను చున్న ఈ మాట నాది కాదు. నన్ను పంపిన నా తండ్రిది.

25. మీ యొద్ద ఉండగనే నేను ఈ మాటలు మీతో చెప్పితిని.

26. కాని, నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ మీకు సమస్తవిషయములను బోధించి, నేను చెప్పినవన్నియు మీకు తలపునకు తెచ్చును.

27. “శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకమువలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయ కుడు. భయపడనీయకుడు.

28. నేను వెళ్ళి మరల మీయొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారుగదా! తండ్రి నాకంటె గొప్పవాడు. కనుక, మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు.

29. ఇది సంభవించినపుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపకపూర్వమే ఇపుడు మీతో చెప్పుచు న్నాను.

30. మీతో ఇంక ఎక్కువగ మాట్లాడను. ఏలయన ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు.

31. కాని, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు. ఇటనుండి వెళ్ళుదము. 

 1. "నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు.

2. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతిరెమ్మను అధికముగ ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును.

3. నేను మీతో చెప్పిన మాటలవలన మీరు ఇప్పుడు శుద్దులైతిరి.

4. నేను మీయందు ఉందును. మీరు నాయందు ఉండుడు. ద్రాక్షావల్లియందు ఉండని రెమ్మ దానియంతట అది ఫలింప జాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింప జాలరు.

5. “నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో అతడు అధికముగ ఫలించును. ఏలయన, నేను లేక మీరు ఏమియు చేయజాలరు.

6. నాయందు నివసింపని వాడు రెమ్మవలె పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు.

7. నా యందు మీరును మీయందు నా మాటలును నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును.

8. మీరు అధికముగ ఫలించుటయందు నా తండ్రి మహిమపరుపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు.

9. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు.

10. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొనియుండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు.

11. “నా ఆనందము మీయందు ఉండవలయు ననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయు ననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను.

12. నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరి నొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ.

13. తన స్నేహితులకొరకు తన ప్రాణమును ధారపోయు వానికంటె ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు.

14. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులైయుందురు.

15. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇకమీదట నేను మిమ్ములను దాసులని పిలువక, స్నేహితులని పిలిచెదను. ఏలయన, నేను నా తండ్రివలన వినినదంతయు మీకు విశదపరచితిని.

16. మీరు నన్ను ఎన్ను కొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీఫలము నిలిచియుండుటకును, మిమ్ము నియమించితిని.

17. మీరు పరస్పరము ప్రేమకలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను.

18. “లోకము మిమ్ము ద్వేషించినచో మీ కంటె ముందు అది నన్ను ద్వేషించినదని తెలిసికొనుడు.

19. మీరు లోకమునకు చెందినవారైనయెడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించెడిది. మీరు లోకము నకు చెందినవారుకారు. నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని. కనుక, లోకము మిమ్ము ద్వేషించు చున్నది.

20. దాసుడు తన యజమానుని కంటె గొప్ప వాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించినయెడల అది మిమ్మును హింసించును. అది నా మాటను పాటించినయెడల మీ మాటనుకూడ పాటించును.

21. కాని, లోకము నన్ను పంపినవానిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తముగా మీపట్ల అది ఇవన్నియు చేయును.

22. నేను వచ్చి వారికి బోధింపనియెడల వారికి పాపదోషము ఉండెడిది కాదు. కాని ఇపుడు వారి పాపమునకు క్షమాపణ లేదు.

23. నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు.

24. నేను ఏ ఒక్కరును చేయని క్రియలు వారి మధ్యను చేయనియెడల, వారికి పాప దోషము ఉండెడిది కాదు. కాని, వారు ఇపుడు నేను చేసినదానిని చూచియు, నన్నును, నా తండ్రిని ఇద్దరిని ద్వేషించు చున్నారు.

25. 'వారు నన్ను నిష్కారణముగ ద్వేషించిరి' అను వారి ధర్మశాస్త్రమునందలి వాక్యము నెరవేరుటకు ఇట్లు జరిగెను.

26. “నేను తండ్రియొద్దనుండి మీయొద్దకు పంప నున్న ఓదార్చెడువాడును, తండ్రియొద్దనుండి వచ్చు సత్యస్వరూపియునగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును.

27. మీరు మొదటినుండియు నావెంట ఉన్నవారు. కనుక, మీరును నన్ను గురించిన సాక్షులు.

 1. “మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నియు మీతో చెప్పితిని.

2. వారు మిమ్ము ప్రార్థనామందిరములనుండి వెలివేయుదురు. మిమ్ము హత్యచేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచు న్నానని భావించు గడియ వచ్చుచున్నది.

3. వారు తండ్రినిగాని, నన్నుగాని ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు.

4. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకును ఈ విషయములు మీతో చెప్పలేదు.

5. కాని. ఇపుడునన్ను పంపినవానియొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడును 'నీవు ఎక్కడకు పోవు చున్నావు?” అని నన్ను అడుగుటలేదు.

6. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయ ములు దుఃఖముతో నిండియున్నవి.

7. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను.

8. ఆయన వచ్చి పాపమును గురించియు, నీతిని గురించియు, తీర్పును గురించియు లోకమునకు నిరూపించును.

9. పాపమును గురించి ఎందుకన, వారు నన్ను విశ్వసించుట లేదు.

10. నీతిని గురించి ఎందుకన, నేను తండ్రియొద్దకు పోవుచున్నాను. ఇక మీరు నన్ను చూడరు.

11. తీర్పును గురించి ఎందుకన, ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది.

12. “నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది. కాని, ఇపుడు మీరు వానిని భరింపలేరు.

13. ఆయన, అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చిన పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దానినే బోధించును. జరుగబోవు విషయములను మీకు తెలియచేయును.

14. ఆయన నన్ను మహిమపరచును. ఏలయన, ఆయన నాకున్న దానిని, నానుండి గైకొనిన దానిని, మీకు తెలియచేయునని చెప్పితిని.

15. తండ్రికి ఉన్నదంతయు నాది. అందుచేత నానుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని.

16. “కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు. మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు.” అని చెప్పెను.

17. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, “ 'కొంత కాలము తరువాత మీరు నన్ను చూడరు. మరి కొంత కాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. ఏలయన, నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను' అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి?

18. కొంతకాలము అని చెప్పుచున్నాడు. ఈయన చెప్పున దేమో మనకు తెలియుటలేదు” అని అనుకొనసాగిరి.

19. వారు తనను ఏదో అడుగదలచుచున్నారని యేసు గ్రహించి వారితో, “కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు. మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరి నొకరు ప్రశ్నించు కొనుచున్నారా?

20. మీరు శోకించి విలపింతురు. కాని, లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు. కాని, మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

21. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినపుడు ఆమె ప్రసవవేదనపడును. కాని, బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డపుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును.

22. అట్లే మీరు ఇపుడు దుఃఖముతో ఉన్నారు. కాని, నేను మిమ్ము మరల చూచెదను. అపుడు మీ హృదయములు సంతోషించును.మీసంతోషమును మీనుండి ఎవడును తీసివేయడు.

23. ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును.

24. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియును అడుగలేదు. అడుగుడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు.

25. “నేను మీకు దృష్టాంతములతో చెప్పితిని. కాని, తండ్రిని గురించి దృష్టాంతములతోగాక, తేట తెల్లముగచెప్పు గడియ సమీపించుచున్నది.

26. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుట లేదు.

27. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును.

28. నేను తండ్రియొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను” అని పలికెను.

29. అందుకు ఆయన శిష్యులు “ఇపుడు మీరు దృష్టాంతములతోకాక స్పష్టముగా మాట్లాడుచున్నారు.

30. మీరు సర్వజులనియు, ఒకరు మిమ్ము అడుగన వసరము లేదనియు ఇపుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవునినుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము” అనిరి.

31. అపుడు యేసు “ఇపుడు మీరు నన్ను విశ్వసించు చున్నారా?

32. ఇదిగో! మీరు నన్ను ఒంటరిగ వదలి, చెల్లాచెదరై, ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కాని, నేను ఒంటరిగా లేను. ఏలయన, తండ్రి నాతో ఉన్నాడు.

33. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు కాని, ధైర్యము వహింపుడు. నేను లోకమును జయించితిని” అని చెప్పెను. 

 1. యేసు ఈ మాటలు చెప్పి, ఆకాశము వైపు 'కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను: “తండ్రీ! గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరుచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము.

2. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్యజీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి.

3. ఏకైక సత్య దేవుడవగు నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలిసికొనుటయే నిత్యజీవము.

4. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తిచేసి, నిన్ను ఈ లోకమున మహిమపరచితిని.

5. ఓ తండ్రీ! లోక ఆరంభమునకు పూర్వము నీయొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమ పరుపుము.

6. “ఈ లోకమునుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీవారు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటను పాటించిరి.

7. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీనుండియేనని వారు ఇపుడు గ్రహించిరి.

8. నీవు నాకొసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి, నేను నిజముగ నీ యొద్ద నుండి వచ్చితినని తెలిసికొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి.

9. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకముకొరకుకాక నీవు నాకు అనుగ్రహించినవారి కొరకు ప్రార్ధించుచున్నాను. ఏలయన వారు నీ వారు.

10. నా సర్వస్వము నీది. నీది అంతయు నాది. నేను వారియందు మహిమపరుపబడితిని.

11. నేను ఇక ఈ లోకమున ఉండను. కాని, వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రీ! మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామమునందు సురక్షితముగ ఉంచుము.

12. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్ట పుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు.

13. కాని, నేను ఇపుడు నీయొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారియందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను.

14. నేను నీ వాక్కును వారికి అందజేసితిని. కాని లోకము వారిని ద్వేషించినది. ఏలయన, నావలె వారును లోకమునకు చెందినవారు కారు.

15. వారిని లోకమునుండి తీసికొనిపొమ్మని నిన్ను ప్రార్ధించుట లేదు. కాని, దుష్టునినుండి కాపాడుమని ప్రార్ధించు చున్నాను.

16. నావలె వారును లోకమునకు చెందిన వారుకారు.

17. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము.

18. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపి తిని.

19. వారును సత్యమునందు ప్రతిష్టింపబడునట్లు వారికొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను.

20. వీరి కొరకు మాత్రమేకాక, వీరి బోధ ద్వార నన్ను విశ్వసించు వారికొరకు ప్రార్ధించుచున్నాను.

21. “వారందరు ఒకరుగ ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రీ! నేను నీయందును, నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగ ఐక్యమై ఉండనిమ్ము.

22. మనవలె వారును ఒకరుగ ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికిని అనుగ్రహించితిని.

23. వారు సంపూర్ణముగ ఐక్యమై ఉండుటకును, నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లు వారినికూడ ప్రేమించితివనియు లోకము తెలిసికొనుటకును నేను వారియందును, నీవు నాయందును ఉన్నాము.

24. ఓ తండ్రీ! వారిని నీవు నాకు ఒసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలయునని కోరుచున్నాను. ఏలయన, లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి.

25. నీతి స్వరూపుడవగు తండ్రీ! లోకము నిన్ను ఎరుగదు. కాని, నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు.

26. నీవు నాయందు కనబరచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, నిన్ను వారికి తెలియచేసితిని. ఇక ముందును తెలియచేసెదను.”

 1. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోనులోయ దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలసి అందు ప్రవేశించెను.

2. యేసు తరచుగ తన శిష్యులతో అచటకు వెళ్ళుచుండును. కనుక, ఆయనను అప్పగింప నున్న యూదాకు ఆ స్థలము తెలియును.

3. సైనికులను, ప్రధానార్చకులు పరిసయ్యులు పంపిన బంట్రా తులను, అధికారులను వెంటబెట్టుకొని యూదా ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసికొనివచ్చిరి.

4. అపుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, “మీరు ఎవరిని వెదకుచున్నారు?" అని అడిగెను.

5. “నజరేయుడగు యేసును” అని వారు సమాధానము ఇచ్చిరి. “నేనే ఆయనను” అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యూదా వారితో నిలుచుండి ఉండెను.

6. యేసు "నేనే ఆయనను” అని చెప్పగనే వారు వెనకకు తగ్గి, నేలమీద పడిపోయిరి.

7. ఆయన మరల “మీరు ఎవరిని వెదకుచున్నారు?” అని ప్రశ్నించెను. అందుకు వారు “నజరేయుడగు యేసును” అని పలికిరి.

8. "నేనే ఆయనను అని మీతో చెప్పితిని. కనుక, మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనిండు” అని యేసు తిరిగిచెప్పెను.

9. “నీవు నాకు ఒసగిన వారిలో ఏ ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదు” అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను.

10. సీమోను పేతురు తనయొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడిచెవిని తెగనరికెను. ఆ సేవకుని పేరు మాల్కుసు.

11. యేసు పేతురుతో “నీ కత్తిని ఒరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా?" అనెను.

12. అపుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రౌతులు యేసును పట్టుకొని బంధించిరి.

13. మొదట అన్నాయొద్దకు తీసికొనిపోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైఫాకు అతడు మామ.

14. ఈ కైఫా 'ప్రజలందరికొరకు ఒకడు మరణించుట మేలు' అని యూదులకు సలహా ఇచ్చినవాడు.

15. సీమోను పేతురును, మరియొక శిష్యుడును యేసు వెంటవెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయము ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానా ర్చకుని ప్రాంగణములోనికి వెళ్ళెను.

16. కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను. అపుడు ప్రధానా ర్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి, ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసికొని వెళ్ళెను.

17. ఆ ద్వారపాలిక పేతురుతో “నీవును ఆ మనుష్యుని శిష్యులలో ఒకడవు కాదా?” అని అడిగెను. “నేను కాను” అని పేతురు పలికెను.

18. చలిగా ఉన్నందున సేవకులు, బంట్రోతులు, మంటవేసి చలికాచుకొనుచు అట నిలుచుండిరి. పేతురును వారితో కలసి చలికాచుకొనుచు నిలుచుండెను.

19. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింపగా,

20. “నేను అందరి యెదుట బహిరంగముగ మాటా డితిని. యూదులందరు సమావేశమగు ప్రార్థనా మందిరములలోను, దేవాలయములోను బోధించితిని గాని రహస్యముగా నేను ఏమియు చెప్పలేదు.

21. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించితినో వినినవారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు” అని యేసు పలికెను.

22. యేసు ఇట్లు పలుకగా, దగ్గర నిలిచియున్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి "ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము!” అనెను.

23. అప్పుడు యేసు “నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కాని నేను పలికినది సరియైనచో ఏల నన్ను కొట్టెదవు?” అనెను.

24. పిమ్మట అన్నా యేసును బంధములతో ప్రధానార్చకు డగు కైఫాయొద్దకు పంపెను.

25. సీమోను పేతురు ఇంకను అచటనే నిలు చుండి చలికాచుకొనుచుండెను. అచ్చటనున్నవారు అతనిని చూచి “నీవు ఆయన శిష్యులలోని వాడవు కావా?” అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, “నేను కాను” అనెను.

26. పేతురు చెవి తెగనరికిన వాని బంధువును, ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు, “నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా?” అని పేతురును అడిగెను.

27. పేతురు "నేను ఎరుగను” అని బొంకెను. వెంటనే కోడికూసెను.

28. అపుడు వారు యేసును కైఫాయొద్దనుండి అధిపతి మందిరములోనికి తీసికొనిపోయిరి. అది తెల్లవారుజాము. పాస్క భుజించుటకై మైలపడకుండు టకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు.

29. అందువలన పిలాతు వెలుపల ఉన్న వారియొద్దకు వచ్చి, “ఏనేరముపై మీరు ఇతనిని తీసికొనివచ్చితిరి?” అని అడిగెను.

30. “ఇతడు నేరము చేసినవాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించెడివారము కాము” అని వారు పలికిరి.

31. అందుకు పిలాతు “మీరే ఇతనిని తీసికొని వెళ్ళి మీ చట్టప్రకారము విచా రింపుడు” అనెను. “ఎవరికిని మరణదండన విధించు అధికారము మాకు లేదు” అని యూదులు చెప్పిరి.

32. యేసు తాను ఎట్టి మరణము పొందబోవుచు న్నాడో సూచించుచు చెప్పిన మాట ఇట్లు నెరవేరెను.

33. పిలాతు మరల మందిరములోనికి వెళ్ళి, యేసును పిలిపించి “నీవు యూదుల రాజువా?” అని అడిగెను.

34. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా? లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా?” అని యేసు తిరుగు ప్రశ్న వేసెను.

35. అందుకు పిలాతు “నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు, ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి?” అని అడిగెను.

36. “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండ నా అనుచరులు నా పక్షమున పోరాడెడివారు. కాని, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు” అని యేసు సమాధానమిచ్చెను.

37. అందుకు పిలాతు “అట్లయిన నీవు రాజువా?” అని అడిగెను. “నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీనికొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్యసంబంధులందరు నా మాటనాలకింతురు” అని ప్రత్యుత్తరమిచ్చెను.

38. "సత్యమనగా ఏమి?” అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి, మరల యూదులవద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను: “నాకు ఆయనలో ఏ దోషము కనిపించుట లేదు.

39. పాస్కపండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదలచేయు ఆచారమున్నదిగదా! యూదుల రాజును మీ కొరకు విడుదల చేయమందురా?” అనెను.

40. వారు మరల కేకలు వేయుచు, “ఇతనిని కాదు, బరబ్బను విడుదల చేయుడు” అనిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. 

 1. అపుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను.

2. సైనికులు ముళ్ళకిరీటమును అల్లి, దానిని ఆయన శిరస్సు పై పెట్టి, ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి.

3. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, “యూదులరాజా! నీకు శుభము!" అని నమస్కరించి, ఆయనను చెంపపై కొట్టిరి.

4. పిలాతు మరల బయటకు వెళ్ళి, ప్రజలతో “ఇదిగో! ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలిసికొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసికొని వచ్చుచున్నాను” అని చెప్పెను.

5. అపుడు యేసు ముళ్ళకిరీటమును ఊదావస్త్రమును ధరింప చేయబడినవాడై బయటకు వచ్చెను. “ఇదిగో ఈ మనుష్యుడు” అని పిలాతు వారితో చెప్పెను.

6. ప్రధానార్చకులును, బంట్రోతులును ఆయనను చూచినంతనే “వానిని నిలువవేయుడు, సిలువ వేయుడు" అని కేకలు వేసిరి. “ఈయన యందు నాకు ఏ దోషము కనిపించుట లేదు. మీరే ఈయనను తీసికొని వెళ్ళి సిలువవేయుడు" అని చెప్పెను.

7. అపుడు యూదులు “దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనుచున్నాడు. కనుక, మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే" అనిరి.

8. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి,

9. మరల అధికార మందిరములోనికి వెళ్ళి, యేసును “నీవు ఎక్కడినుండి వచ్చితివి?” అని ప్రశ్నించెను. కాని యేసు ఏమియు బదులు పలుకలేదు.

10. కనుక, పిలాతు “నీవు నాతో కూడ మాట్లాడవా? నిన్ను విడిచి పెట్టుటకును, సిలువవేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా?” అనెను.

11. అందుకు యేసు, “పైనుండి నీకు అధికారము ఈయబడని యెడల నీకు నా పై అధికారము ఏమాత్రము ఉండెడిది కాదు. అందుచే, నన్ను నీ చేతికి అప్పగించినవాడు, ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు” అని పలికెను.

12. అంతట పిలాతు ఆయనను విడిచి పెట్టుటకు మరి ఎక్కువగ ప్రయత్నింపసాగెను. కాని యూదులు, “ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు. తనను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి" అని కేకలువేసిరి.

13. పిలాతు ఈ మాటలు విని, యేసును వెలుపలకు తీసికొనివచ్చి, రాళ్ళుపరచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో 'గబ్బతా' అందురు.

14. అది పాస్కపండుగకు సిద్ధపడుదినము. ఇంచుమించు మధ్యాహ్నము పండ్రెండు గంటల సమయము. పిలాతు యూదులతో “ఇదిగో మీ రాజు!” అనెను.

15. అందుకు వారు, “ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువవేయుడు” అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో “నేను మీ రాజును సిలువ వేయుదునా?” అనెను. అందుకు ప్రధానార్చకులు “సీజరు తప్ప మాకు వేరొకరాజు లేడు” అని పలికిరి.

16. అపుడు పిలాతు యేసును సిలువవేయుటకు వారి చేతికి అప్పగించెను. కనుక వారు ఆయనను తీసుకొనిపోయిరి.

17. యేసు తన సిలువను మోసికొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో 'గొల్గొతా' అందురు.

18. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపుల మరి యిద్దరిని అట్లే సిలువ వేసిరి.

19. 'నజరేయుడగు యేసు, యూదుల రాజు' అను బిరుదమును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను.

20. యేసును సిలువవేసిన స్థలము నగరమునకు దగ్గరగ ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను.

21. అంతట యూదుల ప్రధానా ర్చకులు పిలాతుతో, “యూదుల రాజు అని వ్రాయకుము. 'నేను యూదులరాజును' అని అతడు చెప్పెనని వ్రాయుము” అనిరి.

22. అందుకు పిలాతు, “నేను వ్రాసినదేమో వ్రాసితిని. అంతే” అనెను.

23. యేసును సిలువవేసిన పిమ్మట, సైనికులు ఆయన వస్త్రములను నాలుగు భాగములు చేసి తలకొక భాగము తీసికొనిరి. వారు అంగీని సహితము తీసికొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టులేకుండ నేయబడియున్నందున,

24. “దీనిని చింపవద్దు. ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసికొందము” అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. “వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి. నా అంగీకొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి” అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందు వలననే సైనికులు ఇట్లు చేసిరి.

25. యేసు సిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి, క్లోఫా భార్యయగు మరియమ్మయు, మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి.

26. తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, “స్త్రీ! ఇదిగో నీ కుమా రుడు!” అనెను.

27. ఆ తరువాత శిష్యునితో “ఇదిగో నీ తల్లి” అనెను. శిష్యుడు ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసికొనిపోయెను.

28. పిదప, యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, “నాకు దాహమగుచున్నది” అనెను. (లేఖనము ఇట్లు నెరవేరెను.)

29. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని 'హిస్సోపు' కోలకు తగిలించి ఆయనకు అందించిరి.

30. యేసు ఆ రసమును అందుకొని “సమాప్తమైనది" అని తల వంచి, ప్రాణము విడిచెను.

31. అది పాస్కపండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, “రేపటి విశ్రాంతి దినము గొప్పదినము. ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరుగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతినిండు" అని అడిగిరి.

32. కావున సైనికులు వెళ్ళి, యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటివాని కాళ్ళను, మరియొకని కాళ్ళను విరుగగొట్టిరి.

33. కాని వారు యేసువద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి, ఆయన కాళ్లు విరుగగొట్టలేదు.

34. అయితే, సైనికు లలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను.

35. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పి నది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును.

36. "ఆయన ఎముకలలో ఒకటైనను విరుగ గొట్టబడదు” అను లేఖనము ఇట్లు నెరవేరెను.

37. “వారు తాము పొడిచినవానివంక వీక్షిం తురు” అను మరియొక లేఖనము ఇట్లు నెరవేరెను.

38. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్లి, యేసు భౌతిక దేహమును ఈయగోరెను. యూదుల భయమువలన ఈ యోసేపు బహిరంగముగ గాక, రహస్యముగ యేసు శిష్యుడైయుండెను. పిలాతు అనుమతినొసగ అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసికొనిపోయెను.

39. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడ ఇంచుమించు నూట ఏబది సేర్ల బరువుగల పరిమళ ద్రవ్యమును, అత్తరును తీసికొని వచ్చెను.

40. వారు యేసు దేహమును తీసికొని, యూదుల భూస్థాపన సంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నారవస్త్రముతో చుట్టిరి.

41. యేసు సిలువవేయబడిన చోట ఒక తోటగలదు. ఆ తోటలో ఎవ్వరును భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను.

42. అది విశ్రాంతిదినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను, ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి. 

 1. ఒకానొక రోజున యేసు దేవాలయములో ప్రజలకు బోధించుచుండగా ప్రధానార్చకులు, ధర్మ శాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు వచ్చి,

2. “ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయు చుంటివి? నీకు ఈ అధికారమును ఇచ్చినవాడు ఎవ్వడు?” అని ప్రశ్నించిరి.

3. అందుకు యేసు, “నేనుకూడ మిమ్ము ఒకమాట అడిగెదను.

4. యోహాను బప్తిస్మము ఎచ్చటనుండి వచ్చినది? దేవుని నుండియా? లేక మానవుని నుండియా?” అని ప్రశ్నించెను.

5. వారు తమలో తాము, “దేవుని నుండి అని సమాధానము ఇచ్చితిమా, అట్లయిన, మీరేల ఆయనను విశ్వసింపలేదు? అనును.

6. అట్లుగాక, మానవులనుండి అని చెప్పితిమా ప్రజలు మనపై రాళ్ళు రువ్వెదరు. ఏలయన, వారు యోహానును ప్రవక్త అని గట్టిగా నమ్ముచున్నారు” అని తర్కించుకొనిరి.

7. అందుచేత వారు “అది మాకు తెలియదు” అని సమా ధానము ఇచ్చిరి.

8. అంతట యేసు వారితో “అట్లయిన ఏ అధికారముతో ఈ కార్యములు చేయుచుంటినో నేనును చెప్పను” అనెను.

9. యేసు ప్రజలకు ఈ ఉపమానమును వినిపించెను. “ఒకానొకడు ద్రాక్షతోటను నాటించెను. కాపులకు దానిని కౌలుకిచ్చి చాలకాలము దేశాటన మునకు వెడలెను.

10. పంటకాలమున తన భాగమును తెచ్చుటకై కౌలుదారులయొద్దకు తన సేవకుని పంపెను. కాని వారు వానినికొట్టి వట్టిచేతులతో పంపివేసిరి.

11. అతడు మరొక సేవకుని పంపెను. వారు వానిని కూడ కొట్టి, అవమానించి వట్టిచేతులతో పంపివేసిరి.

12. అతడు మూడవవానిని పంపెను. వారు వానిని గూడ గాయపరచి, బయటకు నెట్టివేసిరి.

13. అంతట 'నేను ఏమి చేయవలెను?' అని యజమానుడు అనుకొని 'నా ప్రియకుమారుని పంపెదను. ఒకవేళ వారు అతనిని గౌరవింపవచ్చును' అని తలంచెను.

14. కాని ఆ కౌలుదారులు అతనిని చూడగనే 'వీడే వారసుడు, వీనిని చంపివేసెదము. వీని ఆస్తి అంతయు మనకు దక్కును' అని ఒకరికొకరు చెప్పుకొనిరి.

15. కనుక, వారు అతనిని తోట వెలుపలికి నెట్టి చంపివేసిరి. ఇపుడు ద్రాక్షతోట యజమానుడు వారిని ఏమి చేయును?

16. అతడు వచ్చి ఆ కౌలుదారులను హతమార్చి తన ద్రాక్షతోటను ఇతరులకు కౌలు కిచ్చును గదా!" ఇది విని ప్రజలు “అటులెన్నడు జరుగకుండుగాక!" అనిరి.

17. యేసు వారివైపు తిరిగి “మీరు ఈ లేఖనమును చదువలేదా? 'ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి, ముఖ్యమయిన మూలరాయి అయ్యెను'.

18. ఎవడు ఈ రాతిమీద పడునో, వాడు తునాతున కలగును. ఎవనిపై ఈ రాయిపడునో వాడు నలిగి నుగును” అని పలికెను.

19. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు ఈ ఉపమానమును విని అది తమను గురించియే అని గ్రహించి, ఆయనను అపుడే పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కాని ప్రజలకు భయపడిరి.

20. వారు పొంచియుండి, ఆయనను సంస్థాన పాలకునకు అప్ప గించుటకై మాటలలో చిక్కించుకొనవలయునని, నీతిమంతులుగా నటించుకొందరు గూఢచారులను ఆయన యొద్దకు పంపిరి.

21. వారు వచ్చి, “బోధకుడా! నీవు సత్యసంధుడవు. పక్షపాతము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవము బోధించువాడవు.

22. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయ సమ్మతమా? కాదా? అని అడిగిరి.

23. యేసు వారి కుతంత్రమును గుర్తించి, వారిని

24. “సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు. దానిపై ఉన్న రూపనామధేయములు ఎవరివి?” అని అడిగెను. “చక్రవర్తివి” అని వారు చెప్పిరి.

25. “మంచిది. చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునకు చెల్లింపుడు" అని ఆయన వారితో అనెను.

26. ఈ విధముగా ప్రజలయెదుట ఆయన చెప్పిన మాటలతో అతనిని చిక్కించుకొనలేకపోయిరి. కాని ఆయన సమాధానము నకు వారు ఆశ్చర్యపడి మిన్నకుండిరి.

27. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సదూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి,

28. “బోధకుడా! ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా!

29. అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను.

30. పిమ్మట రెండవవాడు

31. ఆ పిదప మూడవవాడు, అట్లే ఏడుగురును ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి.

32. ఆ పిదప ఆమెయు మరణించినది.

33. ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును?" అని అడిగిరి.

34. అందుకు యేసు “ఈ జీవితములో వివాహ ములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును.

35. కాని పునరుత్థానమునకు యోగ్యులగువారు రానున్న జీవిత మున వివాహముకొరకు ఇచ్చిపుచ్చుకొనరు.

36. పునరుత్థానులగుటచే వారికి ఇక చావులేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు. దేవుని కుమారులు.

37. మండు చున్న ! పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఈసాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు పలికెను.

38. దేవుడు జీవితులకేగాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే” అని వారికి సమాధానము ఇచ్చెను.

39. అపుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు “బోధకుడా! నీవు సరిగా సమాధానమిచ్చితివి" అనిరి.

40. ఆ పిదప, వారు ఆయనను మరేమియు అడుగుటకు సాహసింపలేదు.

41. కాని యేసు వారితో “క్రీస్తు దావీదు కుమా రుడని ప్రజలు ఎందుకు చెప్పుచున్నారు?

42. దావీదు స్వయముగా కీర్తనల గ్రంథములో ఇట్లు చెప్పియున్నాడు:

43. 'నేను నీ శత్రువులను , నీ పాదముల క్రింద ఉంచువరకును నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుమని, ప్రభువు నా ప్రభువుతో పలికెను.'

44. తనను ప్రభువని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లు అగును?” అని పలికెను.

45. ప్రజలందరు వినుచుండ యేసు తన శిష్యు లకు,

46. “మీరు ధర్మశాస్త్ర బోధకులను గురించి మెలకువగా ఉండుడు. వారు నిలువుటంగీలు ధరించి తిరిగెదరు. వీధులలో వందనములు, ప్రార్థనామందిర ములలో ఉన్నత స్థానములు, విందులలో ప్రధానాసనములు కోరుదురు.

47. వారు వితంతువుల ఇండ్లను దోచుకొందురు. ఆడంబరమునకై దీర్ఘ ప్రార్థనలు చేయునట్లు నటించుదురు. వారు కఠిన శిక్షకు గురియగుదురు” అని చెప్పెను. 

 1. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరల దర్శనము ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేదనగా:

2. సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలీయలోని కానా నివాసియగు నతనయేలు, జెబదాయి కుమారులు, మరి ఇద్దరు శిష్యులు ఒకచోట ఉండిరి.

3. సీమోను పేతురు వారితో, “నేను చేపలు పట్టబోవుచున్నాను” అని పలుకగా వారు “మేమును నీ వెంట వచ్చెదము” అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కాని, ఆ రాత్రి అంతయు వారికి ఏమియు దొరకలేదు.

4. ప్రాతఃకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కాని, శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి.

5. యేసు వారిని, “బిడ్డలారా! మీయొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా?” అని అడుగగా, “లేదు” అని వారు బదులు పలికిరి.

6. అపుడు ఆయన వారితో “పడవకు కుడివైపున వలవేయుడు. చేపలు దొరకును” అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగ పడుటచే వారు వలను లాగలేకపోయిరి.

7. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో “ఆయన ప్రభువు సుమీ!” అనెను. ఆయన ప్రభువు అని విని నంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పైవస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను.

8. తక్కిన శిష్యులు చేపలతో నిండియున్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు. వంద గజముల దూరమున మాత్రమే ఉండిరి.

9. వారు ఒడ్డునకు వచ్చినపుడు అచ్చట బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి.

10. యేసు వారితో “మీరు ఇపుడు పట్టిన చేపలు కొన్ని తీసికొనిరండు” అనెను. 11. సీమోను పేతురు పడవను ఎక్కి నూట ఏబది మూడు పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు.

12. “వచ్చి భుజింపుడు” అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవ్వడును “నీవెవడవు?” అని ఆయనను అడుగ సాహసింపలేదు.

13. యేసు వచ్చి రొట్టెను తీసికొని, వారికి పంచి పెట్టెను. అట్లే చేపను కూడ వారికి పంచి ఇచ్చెను.

14. మృతులలోనుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనము ఇచ్చుట ఇది మూడవ పర్యాయము.

15. వారు భుజించిన పిమ్మట యేసు, సీమోను పేతురుతో “యోహాను పుత్రుడవైన సీమోనూ! నీవు నన్ను వీరందరికంటె ఎక్కువగ ప్రేమించుచున్నావా?” అని అడిగెను. అందుకు పేతురు "అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు” అని సమాధానమిచ్చెను. అపుడు యేసు, “నీవు నా గొఱ్ఱెపిల్లలను మేపుము” అని చెప్పెను.

16. “యోహాను పుత్రుడవైన సీమోనూ! నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని యేసు రెండవ పర్యా యము అతనిని అడిగెను. “అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు” అని పేతురు బదులు చెప్పెను. “నా గొఱ్ఱెలను కాయుము” అని యేసు చెప్పెను.

17. “యోహాను పుత్రుడవైన సీమోనూ! నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగెను. “నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని యేసు మూడవ పర్యా యము అడిగినందున పేతురు మనస్సునొచ్చుకొని “ప్రభూ! నీకు అంతయును తెలియును. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు” అనెను. అపుడు యేసు “నా గొఱ్ఱెలను మేపుము” అనెను.

18. ఆయన అతనితో “నేను నీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. నీవు యువకుడవుగా ఉన్నపుడు నడుముకట్టి నీవు వెళ్ళదలచిన చోటుకు వెళ్ళెడివాడవు. కాని, నీవు వృద్దుడవైనపుడు నీ చేతులు చాచెదవు. అపుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసికొనిపోవును” అని చెప్పెను.

19. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి “నన్ను వెంబడించుము” అని అతనితో అనెను.

20. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, భోజనపంక్తిని ఆయన వక్షఃస్థలమున వంగి, 'ప్రభూ మిమ్ము అప్పగించువాడెవడు?” అని అడిగిన శిష్యుడు తమ వెంటవచ్చుట చూచి,

21. యేసుతో “ప్రభూ! ఇతని విషయమేమి?" అని అడిగెను.

22. అందుకు యేసు “నేను వచ్చువరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనదో, అది నీకేమి? నీవు నన్ను వెంబ డింపుము” అనెను.

23. కనుక, ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరెను. “నేను వచ్చువరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది

నీకేమి?” అని యేసు పలికెను. కాని, అతడు మరణింపడని చెప్పలేదు.

24. ఈ విషయములను గురించి సాక్ష్య మిచ్చుచు, వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము.

25. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నియో కలవు. వానిలో ప్రతిదానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచు చున్నది.