ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మార్కు సువార్త | Telugu Catholic Bible

 1. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము.

2. యెషయా ప్రవక్త వ్రాసిన విధమున: “ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను.

3. 'ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు. ఆయన త్రోవను తీర్చిదిద్దుడు' " అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను.”

4. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయపరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకటించు చుండెను.

5. యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యోర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చు చుండెను.

6. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుము నకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను.

7. “నాకంటె శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను.

8. నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని, కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో, స్నానము చేయించును” అని యోహాను ప్రకటించుచుండెను,

9. ఆ రోజులలో గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి, యోర్దాను నదిలో యోహానుచేత బప్తిస్మము పొందెను.

10. ఆయన నీటినుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరువబడుట, పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగి వచ్చుట చూచెను.

11. అప్పుడు పరలోకమునుండి ఒక వాణి “నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను” అని వినిపించెను.

12. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకొనిపోయెను.

13. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు నలువదిదినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి.

14. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలీయసీమకు వచ్చి,

15. "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయపరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు” అని దేవుని సువార్తను ప్రకటించెను.

16. యేసు గలిలీయ సరస్సు తీరమున వెళ్ళు చుండగా, వలవేసి చేపలనుపట్టు సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూచెను. వారు జాలరులు.

17. “మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదను” అని యేసు వారితో పలికెను.

18. వెంటనే వారు తమవలలను విడిచి పెట్టి, ఆయనను వెంబడించిరి.

19. అచటనుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగుచేసికొనుచున్న జెబదాయి కుమారుడగు యాకోబును, అతని సోదరుడు యోహానును చూచి,

20. వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి.

21. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతిదినమున ప్రార్థనామందిరమున ప్రవేశించి బోధింపసాగెను.

22. ఆయన బోధకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలయన, ధర్మశాస్త్ర బోధకులవలెగాక, అధికార పూర్వకముగ ఆయన బోధించెను.

23. అప్పుడు ఆ ప్రార్థనామందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు,

24. “నజరేతు నివాసియగు యేసూ! మాతో నీ కేమిపని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి” అని అరచెను.

25. “నోరు మూసికొని వీనినుండి వెడలిపొమ్ము ” అని యేసు దానిని గద్దింపగా,

26. అది వానిని విలవిలలాడించి, బిగ్గరగా అరచి వదలిపోయెను.

27. అంతట అచ్చటివారందరును ఆశ్చర్యపడి, “ఇది యేమి? ఈ నూతన బోధయేమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి!” అని తమలో తాము గుసగుసలాడు కొనసాగిరి.

28. ఆయన కీర్తి గలిలీయ ప్రాంతమంతట వ్యాపించెను.

29. పిదప యేసు ఆ ప్రార్థనామందిరమునుండి యాకోబు, యోహానులతో తిన్నగా సీమోను, అంద్రియల ఇంటికి పోయెను.

30. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి.

31. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతినిపట్టి లేపగా, జ్వరము వీడిపోయెను. అంతట ఆమె వారికి పరిచర్యచేయ సాగెను.

32. సాయంసమయమున ప్రజలు సకలవ్యాధి గ్రస్తులను, దయ్యము పట్టినవారిని యేసు వద్దకు తీసికొని వచ్చిరి.

33. ఆ పురవాసులందరు ఆ ఇంటి వాకిట గుమిగూడిరి.

34. అపుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరిని యేసు స్వస్థపరచి, పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగియుండుట వలన ఆయన ఆ దయ్యములను మాటాడనీయలేదు.

35. ఆయన వేకువ జాముననే లేచి, ఒక నిర్జన ప్రదేశమునకు పోయి, ప్రార్థనచేయనారంభించెను.

36. సీమోను, అతని సహచరులును, ప్రభువును వెదకుచు వెళ్ళి,

37. ఆయనను కనుగొని, “అందరు మిమ్ము వెదకుచున్నారు” అని చెప్పిరి.

38. “మనము పరిసర గ్రామములకు పోవుదమురండు. అచట కూడ నేను సువార్తను ప్రకటింపవలయును. ఇందు కొరకే నేను బయలుదేరి వచ్చితిని” అని ఆయన వారితో చెప్పెను.

39. ఆయన ప్రార్థనామందిరములలో సువార్తను ప్రకటించుచు, దయ్యములను వెడలగొట్టుచు, గలిలీయ సీమయందంతట పర్యటించెను.

40. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ఎదుట మోకరించి, “నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరప గలవు" అని ప్రాధేయపడెను.

41. యేసు జాలిపడి, చేయిచాచి, వానిని తాకి “నాకు ఇష్టమే శుద్ధిపొందుము” అనెను.

42. వెంటనే అతని కుష్ఠరోగము తొలగి పోయెను. అతడు శుద్దుడయ్యెను.

43. యేసు అపుడు “నీవు ఈ విషయమును ఎవరితోను చెప్పరాదు” అని గట్టిగా ఆజ్ఞాపించి,

44. “నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము” అని వానిని పంపివేసెను.

45. కాని వాడుపోయి, ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందు వలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక, నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కాని నలుదెసలనుండి జనులు ఆయనయొద్దకు వచ్చు చుండిరి.

 1. కొన్నిదినములు గడచిన పిమ్మట యేసు మరల కఫర్నాము చేరెను. ఆయన ఇంటియొద్ద ఉన్నాడని విని,

2. జనులు అచటకు గుంపులుగుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడ జనులు క్రిక్కిరిసి వుండిరి. యేసు వారికి వాక్కును బోధించుచుండగా,

3. కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయముతో మోసికొనివచ్చిరి.

4. కాని, జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్నచోటుకు పైన ఇంటి కప్పును తీసి, పడకతోపాటు ఆ పక్షవాత రోగిని దించిరి.

5. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో “కుమారా! నీ పాపములు క్షమింపబడినవి" అనెను.

6. అందుకు అచటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు,

7. “ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు. ఇతడు దేవదూషణము చేయుచున్నాడు. దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు?” అని లోలోన తర్కించుకొనసాగిరి.

8. యేసు ఆత్మ యందు వారి ఆలోచనలను గ్రహించి వారితో, “మీ హృదయములలో ఇట్లేల తలంచుచున్నారు?

9. ఏది సులభతరము? పక్షవాత రోగితో నీ పాపములు క్షమింపబడినవనుటయా? లేక, లేచి నీ పడక నెతుకొని పొమ్మనుటయా?

10. మనుష్యకుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును” అని, పక్షవాత రోగితో,

11. “నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను” అని పలికెను.

12. వెంటనే వాడు లేచి, అందరియెదుట తన పడకను ఎత్తుకొని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచటి ప్రజలందరును ఆశ్చర్యపడిరి. “ఇట్టివి మనము ఎన్నడును చూడలేదు” అని దేవుని స్తుతించిరి.

13. యేసు మరల గలిలీయసరస్సు తీరమునకు వెళ్ళెను. జన సమూహము అంతయు అచటికి చేరెను. యేసు వారికి బోధింపనారంభించెను.

14. పిదప ఆయన వెళ్ళుచు సుంకపుమెట్టుకడ కూర్చుండివున్న అల్పయి కుమారుడగు 'లేవి' అనువానిని చూచి, “నన్ను అనుసరింపుము" అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి, యేసును అనుసరించెను.

15. అనంతరము, యేసు అతని ఇంట భోజన మునకు కూర్చొనియుండగా, అనేకమంది సుంకరు లును, పాపులును ఆయనతోను, ఆయన శిష్యులతోను ఆ పంక్తియందు కూర్చొనియుండిరి. ఏలయన, ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువమంది ఇట్టివారున్నారు.

16. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులగు పరిసయ్యులు కొందరు “మీ గురువు సుంకరులతోను, పాపులతోను కలిసి భుజించుచున్నాడేమి?” అని శిష్యులను ప్రశ్నించిరి.

17. అది విని యేసు వారితో “వ్యాధిగ్రస్తులకేకాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువరాలేదు. కాని పాపులను పిలువవచ్చితిని” అనెను.

18. యోహాను శిష్యులును, పరిసయ్యులును ఉపవాసము చేయుచుండెడివారు. కొందరు ఆయన యొదకు వచ్చి, “యోహాను శిష్యులును, పరిసయ్యులును ఉపవాసము చేయుచుండ, నీ శిష్యులు ఏల ఉప వాసము ఉండరు?” అని ప్రశ్నించిరి.

19. అందుకు యేసు, “పెండ్లికుమారుడు ఉన్నంతవరకు విందుకు వచ్చినవారు ఉపవాసము ఉందురా? పెండ్లికుమారుడు తమతో ఉన్నంతవరకు వారు ఉపవాసము ఉండరు.

20. పెండ్లికుమారుడు ఎడబాయుకాలము వచ్చును,అపుడు వారు ఉపవాసము ఉందురు.

21. ప్రాతగుడ్డకు మాసికవేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయో గించినయెడల క్రొత్తగుడ్డ క్రుంగుటవలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును.

22. క్రొత్త ద్రాక్షారసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన యెడల ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును. ద్రాక్షా రసము, తిత్తులును చెడును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలెను” అని సమాధానమిచ్చెను.

23. ఒక విశ్రాంతిదినమున యేసు పంట పొలములో సాగిపొవుచుండ, ఆయన వెంట నడచు చున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి.

24. దానిని చూచిన పరిసయ్యులు “విశ్రాంతిదినమున చేయదగని పనిని వీరేల చేయుచున్నారు?” అని యేసును ప్రశ్నించిరి.

25. అందులకు ఆయన వారితో, “దావీదు అతని అనుచరులు ఆకలిగొనినపుడు ఏమి చేసినది మీరు చదువలేదా?

26. అబ్యాతారు ప్రధానయజకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయములో ప్రవేశించి, అర్చకులు తప్ప ఇతరులెవ్వరు తినగూడని, అచటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని, తన అనుచరులకు పెట్టెను గదా?

27. మానవుని కొరకే విశ్రాంతిదినము నియమింపబడినదిగాని, విశ్రాంతిదినముకొరకు మానవుడు నియమింపబడలేదు.

28. కనుక మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు కూడ ప్రభువే” అని పలికెను. 


1. యేసు మరల ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచట ఊచచేయిగలవాడు ఒకడుండెను.

2. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా? లేదా? అని అచటి జనులు కొందరు పొంచి, ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి.

3. అపుడు ఆయన ఆ ఊచచేయిగలవానిని చూచి “ఇచటకు రమ్ము” అని వానిని పిలిచెను.

4. అంతట ఆయన జనులను చూచి, “విశ్రాంతిదినమున మేలుచేయుటయా? లేక కీడు చేయుటయా? ప్రాణరక్షణ మొనర్చుటయా? లేక ప్రాణనష్టమొనర్చుటయా? ఏది చేయదగినపని?” అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి.

5. అంతట ఆయన కోవముతో నలుదెసలు చూచి, ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి, రోగితో “నీ చేయి చాపుము” అనెను. వాడట్లే చాపగా స్వస్టుడాయెను.

6. అంతట పరిసయ్యులు వెలుపలకు వచ్చి, యేసును చంపుటకు తరుణ్ పాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి.

7. యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా, గలిలీయ, యూదయానుండికూడ అపార జనసమూహము ఆయనయొద్దకు వచ్చెను.

8. ఆయన చేసిన గొప్ప కార్యములను అన్నిటిని గూర్చి విని యెరూషలేమునుండియు యూదయా, ఇదూమయ ప్రాంతములనుండియు, యోర్దాను నదీతీరమునకు ఆవలనుండియు, తూరు, సిదోను పట్టణ ప్రాంతము లనుండియు గొప్ప జనసమూహము అచటకు వచ్చెను.

9. జనసమూహము తనపై విరుగబడునేమోయని యేసు తనకు ఒక పడవను సిద్ధముచేయుడని శిష్యులను ఆజ్ఞాపించెను.

10. ఏలయన, ఆయన రోగులను అనేకులను స్వస్థపరచియుండెను. అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు తొక్కిసలాడుచు, పైపై పడుచుండిరి.

11. దయ్యములు పట్టినవారు ఆయనను చూడగనే ఆయనముందు సాగిలపడి, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలువేసిరి,

12. కాని, తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను.

13. పిదప, ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయనయొద్దకు వచ్చిరి.

14. తనతో నుండుటకును, సువార్త ప్రకటనకు పంపుటకొరకును ఆయన పన్నిద్దరు శిష్యులను నియమించెను. (వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను).

15. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను.

16. ఆ పన్నిద్దరు ఎవరనగా: పేతురు అనబడు సీమోను,

17. జెబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి “బోవనేర్గీసు” అను పేరు పెట్టెను. దీనికి "ఉరిమెడివారు” అని అర్ధము.

18. అంద్రియ, ఫిలిప్పు, బర్తోలోమయి, మత్తయి, తోమా, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడగు సీమోను,

19. ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు.

20. వారు ఇల్లు చేరగనే, తిరిగి జనసమూహము గుమిగూడినందున, భోజనము చేయుటకైనను వారికి వీలుపడలేదు.

21. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని, ఆయనకు మతి చలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచటినుండి తీసికొని వెళ్ళుటకు వచ్చిరి.

22. యెరూషలేమునుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు పట్టినదనిరి. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియు చెప్పిరి.

23. అపుడు ఆయన వారలను చేరబిలిచి ఉపమానములతో ఇట్లనెను: “సైతాను సైతానును ఎట్లు వెడలగొట్టును?

24. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల అది నిలువ జాలదు.

25. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల అది నిలువజాలదు.

26. అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును.

27. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప, ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి, సామగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మటనే గదా కొల్లగొట్టునది!

28. మానవులు చేసిన ఏ పాపమైనను, పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడును.

29. కాని, పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపియైయుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

30. ఆయన అపవిత్రాత్మ ఆవహించినవాడని వారు అనుటవలన యేసు ఇట్లు పలికెను.

31. అపుడాయన తల్లియు, సోదరులును వచ్చి, వెలుపల నిలిచి, ఆయనను పిలువనంపిరి.

32. జనసమూహము ఆయన చుట్టును కూర్చుండి యుండెను. “నీ తల్లియు, నీ సోదరులును (మరియు నీ సహోదరీలును) వచ్చి వెలుపల నీ కొరకు వేచి యున్నారు” అని కొందరు చెప్పిరి.

33. అందుకు యేసు “నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?” అని

34. తన చుట్టు నున్న జనులను చూచి, “ఇదిగో! వీరే నా తల్లియు, నా సోదరులును.

35. ఏలయన, దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అని పలికెను. 

 1. యేసు మరల గలిలీయ సరస్సు తీరమున బోధింపనారంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయనయొద్దకు వచ్చుటవలన ఆయన ఒక పడవ నెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున నుండెను.

2. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను:

3. “వినుడి, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలు దేరెను.

4. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను.

5. మరికొన్ని చాలినంత మట్టిలేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను కాని,

6. ఎండ వేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను.

7. మరికొన్ని ముండ్లపొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణచివేసెను. కనుక అవి ఫలింపలేదు.

8. ఇంక కొన్ని సారవంతమగు నేలలో పడి మొలిచి, పెరిగి పెద్దవై ముప్పదంతలుగను, అరువ దంతలుగను, నూరంతలుగను ఫలించెను.

9. వినుటకు వీనులున్నవాడు వినునుగాక!” అని చెప్పెను.

10. యేసు ఏకాంతముగా ఉన్నపుడు ఉపమాన మును విన్న కొందరు పన్నిద్దరు శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి, దానిని వివరింపుమని అడిగిరి.

11. “దైవరాజ్యము రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింప బడినది.

12. 'కాని, ఎంతగా చూచినను గమనింపకుండునట్లును, ఎంతగా వినినను గ్రహింపకుండునట్లును, హృదయపరివర్తనతో పాపపరిహారమును పొందకుండునట్లుండిరి. కనుక ఈ విషయములన్నియు ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి” అని పలికెను.

13. “ఈ ఉపమాన భావమును మీరు గ్రహింప లేదా? అట్లయిన ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు?

14. ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు.

15. కొందరు త్రోవప్రక్కనపడిన విత్తనములను పోలిన వారు. దేవుని వాక్కు అను విత్తనము వారియందు విత్తబడుచున్నది. కాని వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి, దానిని ఎత్తుకొని పోవును.

16. కొందరు రాతినేల పైబడిన విత్తనములను పోలిన వారు. వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు.

17. కాని, వారిలో వేరు లేనందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు. ఆ వాక్కు నిమిత్తమై శ్రమయైనను, హింసయైనను వచ్చినపుడు వెంటనే పతనమగుదురు.

18. కొందరు ముండ్లపొదలలో పడిన విత్తనములను పోలినవారు. వారు వాక్కును విందురు. కాని,

19. లౌకిక విచారము, ధనాశ, తదితర వ్యామోహములు వానియందు ప్రవేశించి వాక్కును అణచివేయును. కనుక, వారు ఫలమునీయరు.

20. ఇక, కొందరు మంచి నేలపై బడిన విత్తనములను పోలినవారు. వారు వాక్యమును విని, అంగీకరించి, ముప్పదంతలుగ, అరువదంతలుగ, నూరంతలుగ ఫలమును ఇత్తురు” అని చెప్పెను.

21. మరల ఆయన వారితో ఇట్లనెను: “ఎవడైనను దీపమును వెలిగించి, దీపస్తంభముపై ఉంచునుగాని, కుంచము క్రిందగాని, మంచము క్రిందగాని ఉంచడు గదా!

22. దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు. బయలు పరచుటకేగాని ఏదియు దాచబడ లేదు.

23. కనుక వినుటకు వీనులున్న వాడు వినును గాక!

24. “మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలువ బడును. అంతకంటే అధికముగా కొలువబడును.

25. ఉన్నవానికే మరింత ఒసగబడును. లేనివానియొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును.”

26. ఆయన ఇంకను వారితో ఇట్లనెను: “దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి,

27. రాత్రింబవళ్ళు నిద్ర పోవుచు, మేల్కొనుచుండగా, వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను.

28. భూమినుండి మొదట మొలకలు, వెన్ను అటుపిమ్మట కంకులు పుట్టును.

29. పంట పండినపుడు కోత కాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును.”

30. యేసు మరల ఇట్లనెను: “దేవుని రాజ్య మును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును?

31. అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినపుడు, అన్ని విత్తనములకంటె చిన్నదైనను

32. పెరిగి పెద్దదైనపుడు, మొక్కలన్నిటికంటే పెద్దదై, కొమ్మలతో, రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశపక్షులు దాని కొమ్మలలో గూళ్ళుకట్టుకొని నివసించును.

33. ప్రజలు గ్రహింపగలిగినంతవరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను.

34. ఉపమానములు లేక ఆయన ఏమియు బోధింప లేదు. కాని,ఏకాంతముగా ఉన్నపుడు ఈ ఉపమానముల అర్ధమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగ తెలిపెను.

35. ఆ దినము సాయం సమయమున, “మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు” అని యేసు శిష్యులతో చెప్పెను.

36. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసికొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను.

37. అపుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి, పడవను చిందరవందర చేయుచు, దానిని ముంచివేయునట్లుండెను.

38. అపుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించు చుండెను. శిష్యులు అపుడు ఆయనను నిద్రలేపి “గురువా! తమకు ఏ మాత్రము విచారములేనట్లున్నది. మేము చనిపోవుచున్నాము” అనిరి.

39. అపుడు యేసు లేచి, గాలిని గద్దించి, “శాంతింపుము” అని సముద్రముతో చెప్పగా, గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను.

40. “మీరింత భయపడితిరేల? మీకు విశ్వాసము లేదా?” అని వారిని మందలించెను.

41. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ “గాలియు, సముద్రము సయితము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎవరో!” అని తమలో తామనుకొనిరి. 

 1. పిదప వారు సరస్సునకు ఆవలనున్న గెరా సేనుల దేశమును చేరిరి.

2. యేసు పడవనుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధు లలోనుండి ఆయనయొద్దకు వచ్చెను.

3. సమాధు లలో నివసించుచున్నవానిని గొలుసులతో కూడ బంధింప ఎవరికిని సాధ్యము కాకుండెను.

4. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలుసేతులు కట్టివేసినను, వాడు ఆ గొలుసులను తెంపివేయు చుండెను. కనుక, వాడు ఎవ్వరికిని స్వాధీనము కాక పోయెను.

5. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందును, కొండకోనలయందును నివసించుచు, అరచుచుండెను. రాళ్ళతో తననుతాను గాయపరచు కొనుచుండెను.

6. వాడు దూరమునుండియే యేసును చూచి, పరుగెత్తుకొని వచ్చి పాదములపైబడి,

7. ఎలుగెత్తి “సర్వోన్నతుడవగు దేవుని కుమారా! యేసూ! నా జోలి నీకేల? నన్ను హింసింపవలదు. దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను” అని మొరపెట్టెను.

8. "ఓరీ అపవిత్రాత్మా! వీని నుండి వెడలిపొమ్ము” అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టెను.

9. పిమ్మట ఆయన “నీ పేరేమి?" అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు “నా పేరు దళము. ఎందుకనగా మేము అనేకులము” అని జవాబిచ్చెను.

10. “మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు” అని ఆయనను మిక్కిలి వేడుకొనెను.

11. అపుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను.

12. “మమ్ము అందరిని ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు” అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను.

13. ఆయన అట్లే అనుమతించెను. అంతట ఆ దయ్యములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి రెండువేల సంఖ్య గల ఆ మంద నిట్టనిలువుగా నున్న మిట్టనుండి సరస్సులోపడి మునిగి ఊపిరాడక చచ్చెను.

14. అపుడు పందులను మేపువారు పరుగెత్తి పట్టణములలో పరిసర పల్లెపట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి.

15. దయ్యము పట్టిన వాడు వస్త్రములు ధరించి, స్వస్థుడై కూర్చుండి ఉండుటను చూచి వారు భయపడిరి.

16. పందుల సంఘటనను, దయ్యములు పట్టినవానికి జరిగినది చూచిన వారు ఇతరులకు దానిని తెలియజేసిరి.

17. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి.

18. అంతట యేసు పడవ నెక్కునపుడు “నన్ను మీ వెంటరానిండు” అని దయ్యముపట్టినవాడు ప్రార్ధించెను.

19. అందుకు ఆయన సమ్మతింపక, “నీవు నీ ఇంటికి, నీ బంధువుల యొద్దకు పోయి, ప్రభువు నిన్ను కనిక రించి, నీకుచేసిన మేలునుగూర్చి వారికి తెలియ చెప్పుము” అని వానిని ఆజ్ఞాపించెను.

20. వాడు పోయి, యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెకపోలి (అనగా పది పట్టణములు) ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్య పడిరి.

21. విదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా, జనసమూహము ఆయన యొద్దకు చేరెను.

22. అటుల ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా, ప్రార్థనామందిరపు అధికారులలో ఒకడైన యాయీరు అనువాడువచ్చి, ప్రభువు పాదములపై పడి,

23. "ప్రభూ! నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి, ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థతపొంది, జీవింపగలదు” అని మిగుల బ్రతిమాలెను.

24. అంతట ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్పజనసమూహము ఆయనను వెంబడించుచు పై పైబడుచుండెను.

25. పండ్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ

26. ఎన్నో బాధలు పడి, ఎందరో వైద్యులయొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను, ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెచ్చు పెరిగెను.

27. ఆమె యేసును గూర్చి విని, జనసమూహములోనుండి ఆయన వెనుకగా వచ్చి,

28. “ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్తురాలనగుదును” అని తలంచి ఆయన వస్త్రములను తాకెను.

29. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బునుండి స్వస్థతపొందినట్లు గుర్తించెను.

30. అపుడు తననుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి “నా వస్త్రములను తాకిన వారెవ్వరు?” అని ఆ జనసమూహమును ప్రశ్నించెను.

31. “ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారుగదా! 'నన్ను తాకినదెవరు' అని ప్రశ్నించుచున్నారేల?” అని శిష్యులు పలికిరి.

32. తనను తాకినది ఎవరో తెలిసి కొనవలెనని ఆయన నలుదెసలు తేరిపారజూచెను.

33. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడవణకుచు, ఆయన పాదములపైబడి జరిగిన దంతయు విన్నవించెను.

34. అందుకాయన ఆమెతో “కుమారీ! నీ విశ్వాసము నిన్ను' స్వస్థపరచెను. ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము” అని పలికెను.

35. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడగు యాయీరు ఇంటినుండి కొందరు వచ్చి “నీ కుమార్తె మరణించినది. గురువును ఇంకను శ్రమపెట్టనేల?” అనిరి.

36. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక, ఆ మందిరాధ్యక్షునితో, “నీవు ఏ మాత్రము అధైర్య పడకుము. విశ్వాసమును కలిగియుండుము” అని చెప్పెను.

37. పిదప పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును మాత్రము తనవెంట తీసి కొని,

38. ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచట జన సమూహము గొల్లున ఏడ్చుటయు, ప్రలాపించుటయు చూచి,

39. ఆయన లోపలికి ప్రవేశించి, “మీరు ఏల ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు! ఈ బాలిక నిద్రించుచున్నదిగాని, చనిపోలేదు” అని వారితో పలికెను.

40. అందులకు వారు ఆయనను హేళనచేసిరి. అయినను, యేసు అందరిని వెలుపలకు పంపి, ఆ బాలిక తల్లిదండ్రులతోను, తన శిష్యులతోను బిడ్డ పరుండియున్న గదిలో ప్రవేశించెను.

41. ఆ బాలిక చెయ్యిపట్టుకొని “తలితాకూమీ” అనెను. “ఓ బాలికా! లెమ్మని నీతో చెప్పుచున్నాను” అని ఈ మాటలకు అర్థము.

42. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె పండ్రెండేండ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరు ఆశ్చర్యచ కితులైరి.

43. “దీనిని ఎవరికిని వెల్లడింపకుడు” అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, “ఆమెకు తినుటకు ఏమైన పెట్టుడు” అని చెప్పెను. 

1. ఆయన అక్కడనుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి.

2. విశ్రాంతిదినమున ప్రార్థనామందిర ములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధన లను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, “ఈయనకు ఇవి అన్నియు ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుతకార్యములను ఎట్లు చేయుచున్నాడు?

3. ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారల సోదరుడు కాదా? ఈయన అక్క చెల్లెండ్రు మనమధ్య ఉన్నవారు కారా?” అని చెప్పుకొనుచు తృణీకరించిరి.

4. "ప్రవక్త తన పట్టణమునను, బంధువుల మధ్యను, తన ఇంటను తప్ప ఎచటనైనను గౌరవింపబడును” అని యేసు వారితో పలికెను.

5. ఆయన అచట కొలదిమంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచెను కాని, మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయెను.

6. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామము లకు వెళ్ళి, ప్రజలకు బోధింపసాగెను.

7. యేసు పన్నిద్దరు శిష్యులను తనచెంతకు పిలిచి, బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను.

8. "ప్రయాణములో మీరు చేతికఱ్ఱను తప్ప మరిఏమియు తీసికొనిపోరాదు. రొట్టెగాని, జోలెగాని, సంచిలో ధనమునుగాని వెంటతీసుకొని పోరాదు.

9. పాదరక్షలు తొడుగుకొనుడు కాని, రెండు అంగీలను తీసికొనిపోవలదు.

10. మీరు ఎచ్చట ఒక ఇంట పాదముమోపుదురో, అచటినుండి వెడలి పోవునంతవరకు ఆ ఇంటనే ఉండుడు.

11. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో, వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచట దులిపి, వెళ్ళిపొండు” అని యేసు తన శిష్యులతో చెప్పెను.

12. అంతట ఆయన శిష్యులు పోయి, ప్రజలు పశ్చాత్తాపముతో హృదయపరివర్తనము పొందవలెనని బోధించిరి.

13. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి.

14. ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. “స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను. అందువలననే ఇతనియందు అద్భుత శక్తులు కార్యరూపములు తాల్చుచున్నవి” అని కొందరు

15. “ఇతడు ఏలియా” అని మరికొందరు, “ఇతడు ప్రవక్తలలో ఒకనివలె ఉన్నాడు” అని ఇంక కొందరును చెప్పుకొనుచుండిరి.

16. కాని, అది వినిన హేరోదు "నేను శిరచ్చేద నము గావించిన యోహానే మృతులనుండి లేపబడెను” అని పలికెను.

17. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి, బంధించి, చెరసాలలో పడవేసెను. ఏలయన, అతడు హేరోదియాను వివాహమాడియుండెను.

18. అంతే కాక యోహాను “నీవు నీ సహోదరుని భార్యను వివాహ మాడుట సరికాదు” అని హేరోదును హెచ్చరించు చుండెను.

19. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. కాని, ఆమెకు అది సాధ్యము కాకపోయెను.

20. ఏలయన, యోహాను నీతిమంతుడు. పవిత్రుడు అని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలతచెందినను వానిని ఆలకింప మనసు కలవాడై ఉండెను.

21. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మ దినోత్సవమున కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలీయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను.

22. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి, హేరోదు ప్రభువునకు, ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అపుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి "నీ ఇష్టమైన దానిని కోరుకొనుము. ఇచ్చెదను.

23. నీవు ఏమి కోరినను, నా అర్ధ రాజ్యమునైనను ఇచ్చెదను” అని ప్రమాణ పూర్వకముగా పలికెను.

24. అపుడు ఆమె వెలుపలకు పోయి, తన తల్లితో “నేనేమి కోరుకొనవలెను?” అని అడుగ, ఆమె “స్నాపకుడగు యోహాను తలను కోరుము” అని చెప్పెను.

25. అంతట ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, “స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పళ్ళెములో పెట్టి ఇప్పింపుము” అని కోరెను.

26. అందులకు రాజు మిగుల బాధపడెను. కాని, అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను.

27. కనుక, అతడు “యోహాను తలను తీసికొనిరమ్ము” అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి,

28. ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఈయగా, ఆమె తన తల్లికి ఇచ్చెను.

29. ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి, ఆ భౌతిక దేహమును తీసికొనిపోయి సమాధిచేసిరి.

30. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను, బోధలను తెలియచేసిరి.

31. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే, ఆయన వారితో “మీరు ఏకాంత స్థలమునకు వచ్చి, కొంత తడవు విశ్రాంతి తీసికొనుడు” అని చెప్పెను.

32. అంతట వారందరు ఒక పడవనెక్కి సరస్సును దాటి, ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి.

33. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కులనుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చిచేరిరి.

34. యేసు పడవను దిగి, జనసమూహమును చూచి కాపరిలేని గొఱ్ఱెలవలెనున్న వారిపై కనికరముకలిగి, వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను.

35. వేళ అతిక్రమింపగా, శిష్యులు ఆయనను సమీపించి, “ఇది నిర్జన ప్రదేశము. ఇప్పటికే చాల ప్రొద్దుపోయినది.

36. ఇక వీరిని పంపివేయుడు. పరిసరమునగల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజనపదార్థములను చూచుకొందురు” అని విన్నవించిరి.

37. అపుడు యేసు “మీరే వీరికి కావలసిన భోజనసదుపాయములను చేయుడు” అని చెప్పెను. అందుకు వారు "మేము వెళ్ళి రెండువందల దీనారములను వెచ్చించి, రొట్టెలను కొని వీరందరికి పంచి పెట్టుమందురా?” అని అడిగిరి.

38. “మీయొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయిచూడుడు” అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నవి” అని చెప్పిరి.

39. అంతట యేసు, ఆ జనసమూహమును “పచ్చికబయళ్ళపై పంక్తులు దీరి కూర్చుండుడు” అని ఆజ్ఞాపించెను.

40. అపుడు ఆ జనులు నూరునూరుగా, ఏబది, ఏబదిగా పంక్తులు దీరి కూర్చుండిరి.

41. ఆయన ఐదు రొట్టెలను, రెండుచేపలను అందుకొని, ఆకాశము వైపు కన్నులెత్తి, కృతజ్ఞతావందనములు సలిపి, ఆశీర్వదించి, రొట్టెలను త్రుంచి “జనులకు వడ్డింపుడు” అని శిష్యులకు అందించెను. అటులనే ఆ రెండుచేపలను అందరకు వడ్డన చేయించెను.

42. అందరు సంతృప్తిగా భుజించిరి.

43. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేపముక్కలను ప్రోవుచేసి పండ్రెండు గంపలకు నింపిరి.

44. భుజించినవారు ఐదువేల మంది పురుషులు.

45. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీరమందలి 'బెత్సయిదా' పురమును చేరవలెనని చెప్పెను.

46. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను.

47. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగ ఉండెను.

48. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువజామున ఆయన వారిని దాటిపోవలయునని, నీటిపై నడచుచు వారిచెంతకు వచ్చెను.

49. అటుల సముద్రముపై నడచివచ్చు యేసును చూచి, 'భూతము' అని తలంచి, వారు కేకలు వేసిరి.

50. ఏలయన, వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు, “ధైర్యము వహింపుడు. నేనే కదా! భయపడకుడు” అనెను.

51. అంతట ఆయన వారి పడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి.

52. వారు ఐదురొట్టెల అద్భుతములోని ఆంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలయన వారి హృదయములు కఠినమాయెను.

53. వారు సరస్సును దాటి, గెన్నెసరేతు ప్రాంతము చేరి, పడవను అచట కట్టివేసిరి.

54. వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే, అచటి జనసమూ హము ఆయనను గుర్తించెను.

55. పిమ్మట వారు పరిసరప్రాంతములకెల్ల పరుగెత్తి ఆయన ఉన్న స్థలము నకు పడకలపై రోగులను మోసికొనివచ్చిరి.

56. గ్రామములలోగాని, పట్టణములలోగాని, మారుమూల పల్లెలలోగాని, యేసు ఎచట ప్రవేశించినను జనులు సంతలలో, బహిరంగ స్థలములలో రోగులనుంచి, ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. ఆ విధముగా ఆయనను తాకిన వారందరును స్వస్థతపొందుచుండిరి. 

 1. అంతట యెరూషలేమునుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి.

2. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి.

3. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగు కొనక భుజించు ఆచారములేదు.

4. అంగటినుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధిచేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచుపాత్రలను శుభ్రపరుపవలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు.

5. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు “తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలినహస్తములతో భుజించుచున్నారేమి?” అని యేసును ప్రశ్నించిరి.

6. అందుకు ఆయన వారితో "కపట భక్తులారా! మిమ్ముగూర్చి యెషయా ప్రవక్త ఎంతసూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగానున్నవి.

7. మానవులు ఏర్పరచిన నియమములను దైవప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారుచేయు ఆరాధన వ్యర్ధము.

8. దేవుని ఆజ్ఞను నిరాకరించి, మానవనియమ ములను అనుసరించుచున్నారు”అని పలికెను.

9. మరియు ఆయన వారితో “ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు.

10. 'తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును' అని మోషే ఆజ్ఞాపించెనుగదా!

11. ఎవ్వడేని తన తండ్రితోగాని, తనతల్లితోగాని 'నానుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది' అని చెప్పినచో

12. అట్టి వాడు తనతండ్రినిగాని, తల్లినిగాని ఆదుకొను అవసరములేదని మీరు బోధించుచున్నారు.

13. ఈ రీతిని మీరు పూర్వసంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు” అని చెప్పెను.

14. పిదప, ఆయన జనసమూహమును తిరిగి పిలిచి “మీరు విని, గ్రహించుకొనగలరు.

15. వెలుపల నుండి లోపలికిపోయి మనుష్యుని అపవిత్రునిగా చేయ గలిగినది ఏదియును లేదు. కాని, లోపలినుండి బయలువెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును.

16. వినుటకు వీనులున్నవారు విందురుగాక!” అని అనెను.

17. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింపమని అడిగిరి.

18. అంతట యేసు శిష్యులను చూచి, “మీరును ఇంతటి మందమతులా? మానవుడు భుజించునది ఏదియు అతనిని మాలిన్య పరచదు.

19.ఏలయన, అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి, ఆ పిమ్మట విసర్జింపబడు చున్నది. అన్ని పదార్ధములు భుజింపదగినవే” అని ఆయన పలికెను.

20. “మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగమునుండి వెలువడునదియే.

21. ఏలయన, హృదయమునుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము,

22. దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్స ర్వము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును.

23. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగమునుండియే వెలువడి అతనిని మలిన పరచును” అని పలికెను.

24. అపుడు ఆయన ఆ స్థలమునువీడి, తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి, అచట ఎవ్వరికి తెలియకుండ ఉండగోరెను. కాని అది సాధ్యపడలేదు.

25. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి, ఆయన పాదములపై బడెను.

26. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్ధించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరో పెనిష్యాలో పుట్టినది.

27. అందుకు యేసు “పిల్లలు మొదట తృప్తిచెందవలెను. పిల్లల రొట్టెను తీసి కుక్కపిల్లలకు వేయుట తగదు” అని పలికెను.

28. అప్పుడు ఆమె “అది నిజమే స్వామీ! కాని, పిల్లలు పడవేయు రొట్టెముక్కలను భోజనపు బల్లక్రింద ఉన్న కుక్కపిల్లలును తినునుగదా!” అని బదులు పలికెను.

29.అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది. నీ కుమార్తె స్వస్థత పొందినది. ఇక నివు పోయిరమ్ము” అని చెప్పెను.

30. అంతట ఆమె  ఇంటికి వెళ్ళి దయ్యము వదలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండియుండుటను చూచెను.

31. పిమ్మట యేసు తూరు ప్రాంతమునువీడి, సీదోను, దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలీయ సరస్సు తీరమును చేరెను.

32. అపుడు అచటిజనులు మూగ,చెవిటివానిని ఆయనయొద్దకు తీసికొనివచ్చి, వాని మీద ఆయన హస్తమునుంచుమని ప్రార్థించిరి.

33. యేసు వానిని జనసమూహమునుండి ప్రక్కకు తీసికొనిపోయి, వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి, ఉమ్మి నీటితో వానినాలుకను తాకి,

34. ఆకాశమువైపు కన్నులెత్తి, నిట్టూర్చి “ఎప్పతా” అనెను. అనగా “తెరువ బడుము” అని అర్థము.

35. వెంటనే వాని చెవులు తెరువబడెను. నాలుక పట్టుసడలి వాడు తేలికగా మాటాడసాగెను.

36. “ఇది ఎవరితో చెప్పరాదు” అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్నకొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారముచేసిరి.

37. “చెవిటివారు వినునట్లుగా, మూగవారు మాటాడు నట్లుగా సమస్తమును ఈయన చక్కపరచియున్నాడు” అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. 

 1. మరియొకమారు మహా జనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. కాని, వారు భుజించుటకు ఏమియు లేనందున, ఆయన తనశిష్యులను పిలిచి, వారితో,

2. “నేటికి మూడుదినములనుండి వీరు నాయెద్ద ఉన్నారు. వీరికి భుజించుటకు ఏమియులేదు. అందు వలన నాకు జాలి కలుగుచున్నది.

3. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లి పోవుదురు. ఏలయన, వీరిలో కొందరు చాలదూరము నుండి వచ్చిరి” అని పలికెను.

4. అందులకు ఆయన శిష్యులు, “ఈ ఎడారిలో మనము ఎక్కడనుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తి పరచగలము?" అని ప్రత్యుత్తర మిచ్చిరి.

5. "మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి?" అని ఆయన ప్రశ్నింపగా, “ఏడు రొట్టెలున్నవి” అని వారు సమాధానమిచ్చిరి.

6. అంతట యేసు ఆ జనసమూహ మును అచటకూర్చుండ ఆజ్ఞాపించి, ఆ ఏడురొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, వానిని త్రుంచి, వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి.

7. వారియొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి, వానినికూడ వడ్డింప ఆజ్ఞాపించెను.

8. వారెల్లరు సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి, ఏడుగంపలు నింపిరి.

9. ఆ భుజించినవారు రమారమి నాలుగు వేలమంది.

10. పిమ్మట ఆయన వారిని పంపివేసి, వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో 'దల్మనూతా' ప్రాంతమునకు వెళ్ళెను.

11. కొందరు పరిసయ్యులు యేసువద్దకు వచ్చి ఆయనను శోధించుచు “పరలోకమునుండి ఒక గురుతును చూపుము” అని ఆయనతో వాదింప సాగిరి.

12. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, “ఈ తరమువారు ఏల ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయముగ చెప్పుచున్నాను" అనెను.

13. ఆయన అచటనుండి పడవనెక్కి సరస్సు ఆవలితీరమునకు సాగిపోయెను.

14. శిష్యులు తమవెంట రొట్టెలను తెచ్చు కొనుటను మరచిపోయిరి. పడవలో వారియొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను.

15. "పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసినపిండిని గూర్చియు, జాగరూకులై ఉండుడు” అని యేసు శిష్యులను హెచ్చ రించెను.

16. “మనయొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో” అని వారు తమలోతాము అను కొనిరి.

17. యేసు దానిని గ్రహించి, “రొట్టెలులేవని మీరు ఏల విచారించుచున్నారు? మీరింకను గ్రహింప లేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయకాఠిన్యము గలవారైయున్నారా?

18. మీరు కనులుండియ చూడరా? చెవులుండియు వినరా? జ్ఞప్తికి తెచ్చుకోలేరా?

19. ఐదు రొట్టెలను ఐదువేలమందికి పంచి పెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్నిగంపలు నింపితిరి?” అని ప్రశ్నింపగా, “పండ్రెండు గంపలు నింపితిమి” అని వారు సమాధానమిచ్చిరి.

20. “అట్లే ఏడు రొట్టెలను నాలుగువేలమందికి పంచి పెట్టినపుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్నిగంపలకు ఎత్తితిరి?" అని అడుగగా, “ఏడు గంపలకు” అని సమాధాన మిచ్చిరి.

21. “అంతమాత్రము అర్థము కాలేదా?” అని యేసు శిష్యులను మందలించెను.

22. అంతట వారు బెత్సయిదా గ్రామము చేరిరి. అచట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసువద్దకు తీసికొనివచ్చి, వానిని తాకవలయునని ఆయనను ప్రార్థించిరి.

23. యేసు వానిని చేయిపట్టుకొని, ఊరి వెలుపలకు తీసికొనిపోయి, వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి, తన చేతులను వానిపై ఉంచి, “నీవు చూడగలుగుచున్నావా?” అని ప్రశ్నించెను.

24. వాడు కనులెత్తి “నాకు మనుష్యులు కని పించుచున్నారు. కాని, నా దృష్టికి వారు చెట్లవలెయుండి నడచుచున్నట్లు కనిపించుచున్నారు” అని సమాధానమిచ్చెను.

25. యేసు మరల వానికన్నులను తాకి సూటిగా వానివైపు చూడగా, వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను.

26. "తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు” అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను.

27. యేసు శిష్యులతో కైసరయాఫిలిప్పు ప్రాంత మునకు వెళ్ళుచు, మార్గమధ్యమున “ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు?" అని వారిని అడిగెను.

28. అందుకు వారు, “కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, లేదా మరియొక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు” అనిరి.

29. అప్పుడు యేసు “మరి నన్నుగూర్చి మీరు ఏమను కొనుచున్నారు?” అని వారిని ప్రశ్నింపగా, పేతురు, “నీవు క్రీస్తువు” అని ప్రత్యుత్తరమిచ్చెను.

30. అంతట ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను.

31. యేసు శిష్యులకు “మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి. మూడవదినమున ఉత్థానమగుట అగత్యము" అని ఉపదేశించి,

32. వారికి ఈ విషయమును తేట తెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రకకు తీసికొనిపోయి, “అటుల పలుకరాదు” అని వారింప సాగెను.

33. యేసు శిష్యులవైపు తిరిగి పేతురును చూచి, "సైతానూ! నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవికావు” అనెను.

34. అంతట యేసు జనసమూహములను, శిష్యులను చేరబిలిచి, “నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని, తన సిలువను మోసికొని, నన్ను అనుసరింపవలయును.

35. తన ప్రాణమును కాపాడుకొనచూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, తన ప్రాణమును ధారపోయు వాడు దానిని దక్కించుకొనును.

36. మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ఆత్మను కోల్పోయిన, వానికి ప్రయోజనమేమి?

37. తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఈయగలడు?

38. నన్నుగూర్చి నా సందేశమునుగూర్చి ఈ పాపిష్టి వ్యభిచారతరములో సిగ్గుపడువానినిగూర్చి, మనుష్య కుమారుడు కూడ దేవదూతల సమేతముగ తన తండ్రి మహిమతో వచ్చునపుడు సిగ్గుపడును" అని పలికెను. 

 1. మరియు ఆయన వారితో, “దేవునిరాజ్యము శక్తిసహితముగ సిద్ధించుట చూచువరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.

2. ఆరు రోజులు గడచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంటతీసికొని ఒక ఉన్నతపర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి యెదుట ఆయన దివ్యరూపమును ధరించెను.

3. ఆయన వస్త్రములు వెలుగువలె ప్రకాశించెను. ఈ లోకములో ఎవడును చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను.

4. ఏలీయా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి.

5. అపుడు పేతురు “బోధకుడా! మనము ఇచటనే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మింతుము” అని,

6. తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి.

7. అపుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలమునుండి “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనను ఆలకింపుడు” అని ఒక వాణి వినిపించెను.

8. అంతట వారు చూడగా, వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు.

9. వారు పర్వతమునుండి దిగివచ్చుచుండ యేసు వారితో, “మనుష్యకుమారుడు మృతులనుండి పునరుత్థానమగువరకు మీరు ఈ వృత్తాంతమును ఎవ్వరితోను చెప్పరాదు” అని ఆజ్ఞాపించెను.

10. కనుక దీనిని ఎవరితో చెప్పక, ఈ పునరుత్థాన అంతరార్థము ఏమైయుండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించు కొనసాగిరి.

11. పిమ్మటవారు “ఏలియా ముందుగా రావలయునని ధర్మశాస్త్ర బోధకులు ఏల చెప్పు చున్నారు?” అని యేసును ప్రశ్నించిరి.

12. అందుకు ఆయన “అంతయు సిద్ధపరచుటకు ఏలియా ముందుగా రావలసిన మాట వాస్తవమే. అట్లయిన, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి, తృణీకరింపబడునని వ్రాయబడియున్నదేల?

13. ముందు వ్రాయబడినట్లు ఏలియా ఇదివరకే వచ్చియున్నాడు. కాని, ప్రజలు అతనియెడల తమకు ఇచ్చవచ్చినట్లు ప్రవర్తించిరి అని మీతో చెప్పుచున్నాను” అని పలికెను.

14. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించు చుండిరి.

15. యేసును చూడగనే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి, పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి.

16. “వారితో మీరు ఏ విషయమునుగూర్చి తర్కించు చున్నారు?” అని యేసు శిష్యులను ప్రశ్నించెను.

17. జనసమూహములో ఒకడు “బోధకుడా! మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమయొద్దకు తీసికొనివచ్చితిని.

18. భూతము వీనిని ఆదేశించి నపుడెల్ల నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుచు, కొయ్య బారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని. అది వారికి సాధ్యపడలేదు” అని విన్నవించెను.

19. యేసు వారితో “మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలము మీ మధ్యనుందును? ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుని ఇచటకు తీసికొని రండు” అనగా,

20. వారు అట్లే వానిని తీసికొని వచ్చిరి. యేసును చూచినవెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి, అటుఇటు దొర్లించి, నురుగులు క్రక్కించెను.

21. “ఈ దుర్బరావస్థ ఎంత కాలమునుండి?" అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. “పసితనమునుండి” అని అతడు బదులుచెప్పి,

22. “అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్ళలోను, నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయముచేయుడు” అని ప్రార్థించెను.

23. అందుకు యేసు “ 'సాధ్యమగునేని' అనుచున్నావా! విశ్వసించు వానికి అంతయు సాధ్యమే” అని పలికెను.

24. అప్పుడు ఆ బాలుని తండ్రి “నేను నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము” అని ఎలుగెత్తి పలికెను.

25. అంతట జనులు గుమికూడి తనయొద్దకు పరుగెత్తుకొనివచ్చుట చూచి యేసు “మూగ చెవిటి దయ్యమా! ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడును వీనిని ఆవహింపకుము” అని శాసించెను.

26. అప్పుడు ఆ భూతము ఆర్భటించుచు, బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగువలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి.

27. కాని, యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడులేచి నిలుచుండెను.

28. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగ ఆయనతో “ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు?” అని ప్రశ్నించిరి.

29. అందుకు ఆయన వారితో, “ప్రార్థనవలనతప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్య పడదు” అని చెప్పెను.

30. వారు ఆ స్థలమును వీడి గలిలీయ ప్రాంత మునకు వెళ్ళిరి. తాను ఎచటనున్నది ఎవ్వరికిని తెలియకూడదని ఆయన కోరిక.

31. ఏలయన, “మనుష్యకుమారుడు శత్రువుల చేతికి అప్పగింప బడును. వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవదినమున ఆయన పునరుత్థానుడగును” అని యేసు తనశిష్యులకు బోధించుచుండెను.

32. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి.

33. అంతట వారు కఫర్నామునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను "మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి?” అని అడిగెను.

34. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించు కొనియుండుటచే వారు ప్రత్యుత్తరమీయలేక ఊర కుండిరి.

35. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి, “ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడుగా ఉండవలయును” అని పలికెను.

36. మరియు ఆయన ఒక చిన్నబిడ్డను చేరదీసి వారి మధ్యనుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో,

37. "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు, నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు” అనెను.

38. అంతట యోహాను యేసుతో "బోధకుడా! మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేముచూచి వానిని నిషేధించితిమి” అని పలికెను.

39. అందుకు యేసు “మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్నుగూర్చి దుష్ప్రచారము చేయజాలడు.

40. మనకు విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు.

41. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్ళు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను” అనెను.

42. "నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్దతిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.

43. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము.

44. రెండు చేతులతో నిత్యనరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు.

45. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పార వేయుము.

46. రెండు కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటె ఒక్క కాలితో నిత్యజీవమున ప్రవేశించుట మేలు.

47. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవునిరాజ్యమున ప్రవే శించుట మేలు.

48. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు.

49. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్నివలన కలుగును.

50. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్ప దనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్ప దనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు” అనెను. 

 1. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవల నున్న యూదయా ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను.

2. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, “భార్యను పరిత్యజించుట భర్తకు తగునా?” అని ప్రశ్నించిరి.

3. అందుకు యేసు "మోషే మీకేమి ఆదేశించెను?”అని తిరిగి ప్రశ్నించెను.

4. “విడాకుల పత్రమును వ్రాసియిచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే అదేశించెను” అని వారు సమాధానమిచ్చిరి.

5. అందుకు యేసు “మీ హృదయకాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను.

6. కాని, సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు.

7. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును.

8. వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులుకాక, ఏకశరీరులైయున్నారు.

9. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరుపరాదు” అని యేసు వారితో పలికెను.

10. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి.

11. అపుడు ఆయన వారితో “తన భార్యను పరిత్యజించి, వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచు న్నాడు.

12. అట్లే తన భర్తను పరిత్యజించి, వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది” అని పలికెను.

13. అంతట కొందరు తమ చిన్నారులను తాక వలెనని యేసు చెంతకు తీసికొనిరాగా, శిష్యులు వారిని గద్దించిరి.

14. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి “చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు. వారిని ఆటంకపరపకుడు. ఏలయన అట్టివారిదే దేవుని రాజ్యము” అని పలికెను.

15. “మరియు ఈ పసిబిడ్డలవలె ఎవరు దేవునిరాజ్య మును అంగీకరింపరో వారు దేవునిరాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను” అని,

16. ఆ చిన్నారులను ఎత్తి కౌగలించుకొని దీవించెను.

17. యేసు పయనమై పోవుచుండ మార్గ మధ్యమున ఒకడు పరుగెత్తుకొనివచ్చి, ఆయన ఎదుట మోకరించి, “సద్బోధకుడా! నిత్య జీవమును పొందుటకు నేను ఏమి చేయవలయును?" అని ప్రశ్నించెను.

18. అందుకు యేసు “సద్బోధకుడా” అని నన్ను ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరును కాదు.

19. దైవాజ్ఞలను నీవు ఎరుగు దువు గదా! నరహత్య చేయకుము. వ్యభిచరింప కుము. దొంగిలింపకుము. అసత్యమాడకుము. మోసగింపకుము. తల్లిదండ్రులను గౌరవింపుము” అనెను.

20. అందులకు అతడు "బోధకుడా! బాల్యమునుండి వీనిని అన్నింటిని పాటించుచునే ఉన్నాను” అనెను.

21. యేసు అతని వంక ప్రేమతో చూచి "అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి, పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును" అనెను.

22. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే, ఈ మాట విని మొగము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయెను.

23. యేసు చుట్టుచూచి, తనశిష్యులతో "ధనవంతులు దేవునిరాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము!" అనెను.

24. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో ‘బిడ్డలారా! దేవునిరాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము!

25. ధనవంతుడు దేవునిరాజ్యమున ప్రవే శించుటకంటె, ఒంటె సూదిబెజ్జములో దూరిపోవుట సులభము” అనెను.

26. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, “అట్లయిన ఇక ఎవడు రక్షణ పొందగలడు?" అని గుసగుసలాడుకొనిరి.

27. యేసు వారితో, “మానవులకు ఇది అసాధ్యము. కాని, దేవునకు సమస్తమును సాధ్యమే” అనెను.

28. అపుడు పేతురు ఆయనతో “ఇదిగో! అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించి తిమి” అనెను.

29. అందుకు యేసు “అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్న దమ్ములను, అక్కచెల్లెండ్రను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు

30. ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోక ములో శాశ్వతజీవమును పొందును.

31. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు. కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు” అనెను.

32. అంతట వారు యెరూషలేమునకు పయనము కాగా యేసు అందరికంటే ముందుగా సాగిపోవుచుండెను. అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడిరి. ప్రజలు భయపడిరి. యేసు పన్నిద్దరు శిష్యులను తనయొద్దకు పిలిచి, తనకు జరుగనున్న సంఘటనలనుగూర్చి వివరింపసాగెను:

33. “ఇదిగో! మనము యెరూషలేము వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధానార్చకుల, ధర్మశాస్త్ర బోధకుల చేతులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణ దండన విధించి, అన్యుల చేతులకు అప్పగింతురు.

34. వారు ఆయనను అవమానింతురు. ఆయనపై ఉమ్మివేయుదురు. కొరడాలతో మోది చంపుదురు. కాని మూడుదినముల పిదప ఆయన పునరుత్థానుడు అగును.”

35. అంతట జెబదాయి పుత్రులగు యోహాను, యాకోబులు యేసును సమీపించి “బోధకుడా! మాదొక మనవి. అనుగ్రహింపుడు” అని వేడుకొనిరి.

36. అందుకాయన “నేను మీకేమి చేయగోరుచున్నారు?” అని వారినడిగెను.

37. వారు “మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనపుడు మమ్ము మీ కుడిఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు” అని ప్రార్థించిరి.

38. అందులకు యేసు “మీరు కోరున దేమియో మీరు ఎరుగురు. నేను పానముచేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా? నేను పొందబోవు బప్తిస్మమును మీరును పొందగలరా?” అనెను.

39. “అవును” అని వారు పలికిరి. యేసు వారితో “నేను పానముచేయు పాత్రమునుండి మీరు పానము చేసెదరు. నేను పొందబోవు బప్తిస్మమును మీరును పొందెదరు.

40. కాని, నా కుడిఎడమల మిమ్ము కూర్చుండబెట్టునది నేను కాదు. నా తండ్రి ఏర్పరచిన వారికే అది లభించును” అని పలికెను.

41. తక్కిన పదుగురు శిష్యులు దీనిని విని నప్పుడు యోహాను, యాకోబులపై కినుకు వహించిరి.

42. యేసు శిష్యులను కూడబిలిచి, వారితో ఇట్లనెను: “అన్యజాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు.

43. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను.

44. మీలో ఎవడైన ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయె ఉండవలెను.

45. ఏలయన మనుష్యకుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను.

46. పిదప, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచటనుండి యేసు తనశిష్యులతోను, గొప్ప జన సమూహముతోను యెరికోపట్టణము దాటి వెళ్ళు చుండగా 'బర్తిమయి' అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కన కూర్చుండియుండెను. అతడు 'తిమయి' కుమారుడు.

47. నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని, అతడు “దావీదుకుమారా! యేసు ప్రభూ! నన్ను కరుణింపుము” అని కేకలిడసాగెను.

48. “ఊరకుండుము” అని అనేకులు వానిని గద్దించిరి. కాని వాడుమాత్రము "దావీదుకుమారా! నన్ను కరు జింపుము” అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను.

49. అంతట యేసు నిలిచి, “వానిని ఇటకు పిలువుడు” అనగా, వారు వానియొద్దకు వెళ్ళి “ఓరి, లెమ్ము, ధైర్యముగానుండుము. ఆయన రమ్మనుచున్నాడు” అని పిలిచిరి.

50. అంతట వాడు తనవస్త్రమును పారవేసి, వెంటనే లేచి యేసువద్దకు వచ్చెను.

51. అప్పుడు యేసు “నేను ఏమి చేయగోరుచున్నావు?” అని వానిని అడుగగా, వాడు “బోధకుడా! నాకు చూపు దయ చేయుము” అని వేడుకొనెను.

52. “నీవు వెళ్ళుము. నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది” అని యేసు అనినంతనే వాడు దృష్టిని పొంది, త్రోవవెంట ఆయనను అనుసరించెను.

1. యేసు తనశిష్యులతో యెరూషలేమునకు సమీపమున ఉన్న ఓలివుకొండ దగ్గరనున్న బెత్ఫగే, బెతానియా గ్రామములను సమీపించెను. అప్పుడు ఆయన ఇరువురు శిష్యులనుపంపుచు ఇట్లు ఆదేశించెను.

2. “మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరు అచట కట్టివేయబడియున్న గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఇంతవరకు ఎవరును ఎక్కలేదు. దానిని విప్పి తోలుకొని రండు”.

3. " 'ఇదేమి?” అని ఎవడేని ప్రశ్నించినచో 'ప్రభువునకు అది అవసరము. త్వరలో తిరిగి పంపగలడు' అని చెప్పుడు.”

4. వారు వెళ్ళి వీధి ప్రక్కన గుమ్మమునకు కట్టివేయబడియున్న గాడిద పిల్లను చూచిరి. వారు దానిని విప్పుచుండగా,

5. అచట నిలిచియున్న వారిలో కొందరు “ఇదేమి పని?” అని అడిగిరి.

6. అందుకు వారిద్దరు యేసు ఆదేశమును వారికి తెలిపిరి. అది వినినవారు అందులకు అంగీకరించిరి.

7. వారు గాడిదసిల్లను యేసు వద్దకు తోలుకొనివచ్చి, దానిపై తమవస్త్రములను పరచిరి. ఆయన దానిపై కూర్చుండెను.

8. మార్గమున చాలమంది తమ వస్త్రములను పరచిరి. కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి, ఆ త్రోవన పరచిరి.

9. ఆయన ముందువెనుక నడచు జనసమూహములు: "హోసన్నా! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక!

10. వచ్చుచున్న మన తండ్రియైన దావీదురాజ్యము స్తుతింపబడునుగాక! మహోన్నతునకు హోసన్నా!” అని విజయ ధ్వానములు చేసిరి.

11. యేసు అటుల పయనించి, యెరూషలేము దేవాలయమున ప్రవేశించి పరిసరములను చూచెను. సాయంసమయమగుటచే పండ్రెండుగురు శిష్యులతో బెతానియా గ్రామమునకు బయలుదేరెను.

12. ఆ మరునాడు వారు బెతానియా గ్రామము నుండి వచ్చుచుండ, యేసు ఆకలిగొనెను.

13. అప్పుడు ఆయన దూరమున పచ్చని ఆకులతో నిండిన అత్తిచెట్టును చూచి పండు దొరకునేమో అని దాని యొద్దకు వచ్చెను. అది ఫలించుఋతువు కానందున, అందు ఆకులేకాని, పండ్లులేవాయెను.

14. అప్పుడు ఆయన “ఈ చెట్టు ఎన్నడును ఫలింపకుండునుగాక!” అని శపించెను. ఆ శాప వచనమును శిష్యులు వినిరి.

15. అంతట వారు యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచట క్రయవిక్రయములు చేయు వారందరిని వెడలగొట్టెను. రూకలుమార్చువారి బల్లలను, పావురములను అమ్ము వారి పీటలను పడద్రోసెను.

16. దేవాలయపు ఆవర ణమునుండి ఎవ్వరిని దేనిని తీసికొనిపోనీయ లేదు.

17. “ 'నా ఆలయము అన్ని జాతులకు ప్రార్ధనాలయము అనబడును' అని వ్రాయబడియుండలేదా? మీరు అట్టిదానిని దొంగల గుహగా మార్చితిరి” అని యేసు వారిని మందలించెను.

18. ఈ మాటలు వినిన ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లయినను చంప వలయును అని ఆలోచన చేయుచుండిరి. కాని, జనులందరు ఆయన బోధలకు ఆశ్చర్యచకితులగుటచే ఆయనకు భయపడిరి.

19. సాయంసమయమున ఆయన శిష్యులతో కూడ ఆ పట్టణమును వీడిపోయెను.

20. మరునాడు ప్రాతఃకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూచిరి.

21. అపుడు పేతురు "బోధకుడా! ఇదిగో, నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది” అనెను.

22. అందులకు యేసు “మీరు దేవునియందు విశ్వాసము ఉంచుడు.

23. ఎవరైనను ఈ పర్వతముతో 'నీవు లేచి సముద్రమునపడుము' అని చెప్పి, తన హృదయములో సందేహింపక, తాను చెప్పినది జరుగునని విశ్వసించినయెడల అతను చెప్పినట్లుగనే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

24. కనుక మీరు ప్రార్ధింపుడు. ప్రార్ధనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు.

25. నీవు ప్రార్ధించునపుడు నీ సోదరునిపై నీకు ఏమైన మనస్పర్థఉన్నచో వానిని క్షమింపుము. అపుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును.

26. కాని నీవు నీ సోదరుని క్షమింపని యెడల, పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పి దములను క్షమింపడు” అనెను.

27. అటు తరువాత వారు యెరూషలేమునకు తిరిగివచ్చిరి. యేసు దేవాలయములో తిరుగుచుండ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి,

28. “ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు నీకు అధికారము ఇచ్చినది ఎవరు?” అని ఆయనను ప్రశ్నించిరి.

29. అందుకు యేసు, “నేను కూడ మిమ్ము ఒక మాట అడిగెదను. దానికి సమాధానము ఇచ్చినయెడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకును తెలిపెదను.

30. యోహాను బప్తిస్మము ఎచటనుండి వచ్చినది? పరలోకము నుండియా? లేక మానవుని నుండియా? నాకు సమా ధానమిండు.” అనెను.

31. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి. “పరలోకమునుండి అని మనము చెప్పినయెడల ఆయన అట్లయిన మీరెందుకు యోహానును నమ్మలేదు అని అడుగును.

32. లేదా మానవులనుండి అని చెప్పితిమా! ప్రజలందరును యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకు ఏమి ముప్పుకలుగునో!” అని భయపడిరి.

33. “మాకు తెలియదు” అని ఆయనతో చెప్పిరి. అపుడు ఆయన వారితో “ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నానో నేనును చెప్పను” అనెను. 

 1. యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. “ఒకడు ద్రాక్షతోటను వేసి దానిచుట్టు కంచెనాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి, గోపురమును కట్టించి, కౌలుదార్లకు గుత్తకుఇచ్చి, దేశాటనము వెడలెను.

2. పంటకాలమున ఆ కౌలుదార్లనుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదార్ల వద్దకు తన సేవకునొకనిని పంపెను.

3. కాని, వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి.

4. ఆ యజమానుడు మరియొక సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి.

5. అంతట యజమానుడు మరియొక సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల -ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి, మరికొందరిని చంపివేసిరి.

6. ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారియొద్దకు పంపెను.

7. ఆ కౌలుదార్లు వానిని చూచి 'ఇదిగో ఇతడే వారసుడు. రండు, ఇతనిని తుదముట్టింతము. ఈ ఆస్తి మనకు దక్కును' అని తమలోతాము చెప్పుకొనిరి.

8. ఇటు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోటవెలుపల పారవేసిరి.

9. “అప్పుడు ద్రాక్షతోట యజమానుడు, కౌలుదారులను ఏమిచేయును?” అని యేను ప్రశ్నించెను. “అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును” అని వారు పలికిరి.

10. “ఈ లేఖనమును మీరు చదువ లేదా? 'ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయెను.

11. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము!' " అని యేసు పలికెను.

12. ఈ ఉపమానము విశేషించి తమ్ము గురించి పలికెనని యూద ప్రముఖులు గ్రహించి ఆయనను బంధింపదలచిరి. కాని, జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి.

13. అంతట వారు యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడపన్ని పరిసయ్యులలో, హేరోదీయులలో కొందరిని ఆయనవద్దకు పంపిరి.

14. వారు వచ్చి “బోధకుడా! నీవు సత్యసంధుడవు. ఎవరికిని భయపడవు. మోమాటము లేనివాడవు. దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించు వాడవు. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయ సమ్మతమా? కాదా? నీ అభిప్రాయమేమి? అని అడిగిరి.

15. యేసు వారి కపటోపాయమును గుర్తించి, “నన్ను ఏల పరీక్షింతురు? సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు” అని అడుగగా

16. వారు ఒక దీనారమును ఆయనకు అందించిరి. అపుడు ఆయన “అందలి రూపమును, నామధేయమును ఎవరివి?” అని వారిని ప్రశ్నింప, "కైసరువి” అని వారు ప్రత్యుత్తర మిచ్చిరి.

17. “అట్లయిన కైసరువి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు” అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి.

18. అపుడు పునరుత్థానమును అంగీకరింపని సదూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి,

19. “బోధకుడా! ఒకడు సంతానములేక మరణించిన యెడల, అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలుగజేయవలయునని మోషే ఆజ్ఞాపించెనుకదా!

20. ఒకానొకప్పుడు ఏడుగురు అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను.

21. రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను. కాని అతడును సంతానము లేకయే మరణించెను. మూడవవానికిని ఆ గతియే పట్టెను.

22. అట్లే ఏడుగురికిని సంభవించెను. తుట్టతుదకు ఆమెయు మరణించెను.

23. ఆ ఏడుగురు సోదరులు ఆమెను వివాహమాడిరికదా! పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును?” అని ప్రశ్నించిరి.

24. అందులకు యేసు “మీరు లేఖనములను, దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు.

25. పునరుత్థానమైన పిదప వారు వివాహము చేసికొనరు, వివాహమునకు ఈయబడరు, పరలోక మందలి దేవదూతలవలె ఉందురు.

26. 'నేనే అబ్రహాముదేవుడను, నేనే ఈసాకు దేవుడను, నేనే యాకోబుదేవుడను', అని మండుచున్న పొదనుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదువలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్థావనకాదా?

27. మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడుకాని మృతులకు కాదు అని ప్రత్యుత్తర మిచ్చెను.

28. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి, యేసు చక్కగా సమాధానము ఇచ్చెనని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఎది?” అని ప్రశ్నించెను.

29. అందుకు యేసు "యిస్రాయేలీయులారా! వినుడు. మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు.

30. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, పూర్ణఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణశక్తితోను ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ.

31. నిన్ను నీవు ప్రేమించుకొను నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆ మరియొకటి లేదు” అని సమాధానమిచ్చెను.

32. అప్పుడతడు “బోధకుడా! నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే. ఆయన తప్ప మరియొకడు లేడు.

33. ఆయనను పూర్ణ హృదయముతోను, పూర్ణమనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకొనునట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుటయు, సమస్త దహనబలులకంటెను సమస్త బలులకంటెను ఘనమైనది” అని పలికెను.

34. చక్కగా సమాధాన మిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు “దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు” అనెను. అటు తరువాత ఆయనను ఎవరును ఏమియును అడుగుటకు సాహ సింపలేదు.

35. యేసు దేవాలయములో బోధించుచు, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు?

36. దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను: “నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నాకుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు, నా ప్రభువుతో పలికెను.'

37. ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును?” అని ప్రశ్నించెను. జనసమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆలకించుచుండిరి. .

38. యేసు ఇట్లు ఉపదేశించుచు “మీరు ధర్మ శాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువుటంగీలను ధరించి తిరుగుటను, అంగడి వీధులలో వందనములు అందుకొనుటకును కోరుకొందురు.

39. ప్రార్థనామందిరములందు ప్రధానాసనములను, విందులయందు అగ్రస్థానములను వారు కాంక్షింతురు.

40. వారు దీర్ఘజపములను చేయునట్లు నటించుచు, వితంతువుల ఇండ్లను దోచుకొను చున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురికాగలరు" అనెను.

41. పిమ్మట యేసు కానుకలపెట్టెయొద్ద కూర్చుండి, అందు ప్రజలు కానుకలు వేయురీతిని పరీక్షించు చుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండిరి.

42. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి, రెండు నాణెములను మాత్రమే వేసెను.

43. ఆయన శిష్యులను పిలిచి, “ఈ కానుక పెట్టెలో డబ్బులువేసిన వారందరికంటె ఈ పేద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని అనెను.

44. “ఏలయన, వారందరు తమ సమృద్ధినుండి కానుకలు వేసిరి. కాని ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు, తన జీవనాధార మంతయు త్యాగము చేసినది” అనెను. 

1. యేసు దేవాలయము నుండి వెళ్ళుచుండగా శిష్యులలో ఒకడు “బోధకుడా! ఈ రాళ్ళు ఎట్టివో, ఈ కట్టడములు ఎట్టివో చూడుడు” అనెను.

2. “మీరు చూచు ఈ గొప్ప కట్టడములు రాతిమీద రాయి నిలువక నేలమట్టమగును” అని యేసు పలికెను.

3. యేసు ఓలివుకొండపై దేవాలయమునకు ఎదురుగా ఏకాంతమున కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయలు వచ్చి,

4. “ఇవి అన్నియు ఎప్పుడు సంభవించును? వీని రాకడకు సూచన ఏమి?” అని అడిగిరి.

5. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను: “మిమ్ము ఎవ్వరును మోసగింపకుండ మెలకువ కలిగిఉండుడు.

6. అనేకులు నాపేరిట వచ్చి 'నేనే ఆయనను' అని ఎందరినో మోసగింతురు.

7. మీరు యుద్ధములను గూర్చియు, వానికి సంబంధించిన వార్తలను గూరియు వినునపుడు కలవరపడకుడు. ఇవి అన్నియు జరిగి తీరును. అంతలోనే అంతము రాదు.

8. జాతికి జాతి. రాజ్యమునకు రాజ్యము విరుద్ధముగా లేచును. అనేక ప్రదేశములందు భూకంపములు కలుగును. క్షామములు సంభవించును. ఇవి అన్నియు వేదనలకు ప్రారంభ సూచనలు.

9. “మీరు మెలకువతో వర్తింపుడు. ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు. ప్రార్థనామందిరములలో మిమ్ము చెండాడుదురు. అధిపతుల ఎదుట, రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలిచెదరు.

10. కనుక ముందుగా సమస జాతుల వారికి సువార్త ప్రకటింపబడవలెను.

11. మిమ్ము అప్పగింప పట్టుకొనిపోవునపుడు 'మేము ఏమి చెప్పవలెను?' అని మీరు ఆతురపడవలదు. ఆ సమయమున మీకు ఒసగబడిన దానినే మాట్లాడుడు. ఏలయన, మాటాడునది మీరు కాదు, పవిత్రాత్మయే.

12. సోదరుడు సోదరుని, తండ్రి కుమారుని మృత్యువునకు అప్పగించును. కన్నబిడ్డలే తల్లిదండ్రులకు వ్యతిరేకముగా నిలిచి చంపింతురు.

13. నా నామము నిమిత్తము మిమ్ము అందరును ద్వేషింతురు. అయినను తుదివరకు నిలిచినవాడే రక్షింపబడును.

14. “మీరు హేయమైన వినాశనము నిలువరాని చోట నిలుచుట చూచినపుడు (వఠించువాడు గ్రహించుగాక!) యూదయా సీమలో ఉన్నవారు పర్వత ములకు పారిపోవలెను.

15. మిద్దెపై నున్నవాడు సామగ్రికొరకు ఇంటిలోనికి దిగిరాకూడదు.

16. పొలములో పనిచేయువాడు తన పైవస్త్రము తీసి కొనుటకు వెనుకకు మరలిపోరాదు.

17. ఆ దినములందు గర్భిణులకు, బాలింతలకు ఎంత బాధాకరము?

18. మీ పలాయనము శీతకాలమందు కాకుండునట్లు ప్రార్ధింపుడు.

19. ఆ దినములందు సంభవింపనున్న ఆపదలు, సృష్టి ఆరంభమునుండి నేటివరకును రాలేదు, ఇక ముందును రావు.

20. దేవుడు ఆ దినముల సంఖ్యను తగ్గింపకున్నచో ఎవ్వడును జీవింపడు. కాని, ఎన్నుకొనబడినవారి నిమిత్తము అవి తగ్గింపబడెను.

21. అప్పుడు మీలో ఎవడైన 'ఇదిగో! క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. లేక అక్కడ ఉన్నాడు' అని చెప్పిన మీరు నమ్మవద్దు.

22. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు బయలు దేరి సాధ్యమయినయెడల దేవుడు ఎన్నుకొనిన వారిని మోసగించుటకు గొప్ప వింతలను మహత్కార్యములను చేయుదురు.

23. మీరు జాగరూకులైయుండుడు. ఇదిగో ముందుగానే సమస్తము మీతో చెప్పియున్నాను.

24. “ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధురుడగును. చంద్రుడు కాంతిహీనుడగును.

25. అంతరిక్షము నుండి నక్షత్ర ములు రాలును. అంతరిక్ష శక్తులు కంపించును.

26. అపుడు మనుష్యకుమారుడు మహాశక్తితో మహా మహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరు కాంతురు.

27. అపుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశమువరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగుచేయించును.

28. “అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు: దాని రెమ్మలు లేతవై చిగురించినపుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు.

29. అట్లే వీనిని అన్నింటిని మీరు చూచునపుడు ఆయన సమీపముననే, వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు.

30. ఇవన్నియు నెరవేరునంతవరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను.

31. భూమ్యాకాశములు గతించిపోవునుగాని నా మాటలు గతించిపోవు.

32. " ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలుగాని, కుమారుడుగాని, మరెవ్వరునుగాని ఎరుగరు.

33. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు.

34. ఆ గడియ ఇట్లుండును: ఒకానొకడు దేశాటనము వెళ్ళుచు, తన సేవకులను, ఆయా కార్య ములందు నియమించి,మెలకువతో ఉండుమని ద్వార పాలకుని హెచ్చరించెను.

35. యజమానుడు సంధ్యా సమయముననో, అర్థరాత్రముననో, కోడికూయు  వేళనో, ప్రాతఃకాలముననో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండుడు.

36. ఒక వేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించు చుండుట చూడవచ్చును.

37. మీకు చెప్పునదే అందరికి చెప్పుచున్నాను. జాగరూకులై ఉండుడు!" 

 1. పాస్క పులియని రొట్టెల పండుగకు రెండు దినములు ముందు ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయముచే యేసును ఏ విధముగా బంధించి చంపుదుమా అని సమాలోచనము చేయ సాగిరి.

2. కాని ప్రజలలో అలజడి కలుగునని, అది పండుగలో చేయతగదని తలంచిరి.

3. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా ఒక స్త్రీ విలువైన పరిమళ తైలము గల పాత్రతో వచ్చి, ఆ పాత్రను పగులగొట్టి, దానిని ఆయన శిరస్సుపై పోసెను.

4. అది చూచిన కొందరు కోపపడి “ఈ వృథా వ్యయము ఎందులకు?

5. దీనిని మూడువందల దీనారములకంటె ఎక్కువధరకు అమ్మి పేదలకు దానము చేయవచ్చునుగదా!” అని ఆమెను గూర్చి సణుగుగొనసాగిరి.

6. యేసు అది గ్రహించి వారితో “ఈమె జోలికి పోవలదు, ఈమెను మీరేల నొప్పించెదరు? నా పట్ల ఈమె మంచిపనియే చేసినది.

7. పేదలు మీతో ఎల్లప్పుడును ఉందురు. మీ ఇష్టము వచ్చినప్పుడెల్ల వారికి మీరు సహాయపడవచ్చును. కాని, నేను మీతో ఎల్లప్పుడు ఉండను.

8. ఈమె తన శక్తికొలది చేసినది. భూస్థాపనార్దము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళముతో అభిషేకించినది.

9. ప్రపంచము నందంతట ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసినది, ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” అనెను.

10. పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కారియోతు యేసును పట్టియిచ్చుటకై ప్రధానార్చకులవద్దకు వెళ్ళెను.

11. అది విని వారు మిగుల సంతసించి వానికి కొంత రొక్కమును ఇచ్చుటకు వాగ్దానము చేసిరి. కనుక వాడు ఆయనను పట్టియిచ్చుటకు కాచుకొని యుండెను.

12. పాస్కబలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటిదినమున శిష్యులు యేసువద్దకు వచ్చి “మేము మీకు ఎచ్చట పాస్కభోజనమును సిద్ధపరుప గోరుచున్నారు?” అని అడిగిరి.

13. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు “మీరు పట్టణములోనికి పొండు. అచట కడవతో నీటిని తీసికొనివచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును.

14. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ యింటి యజమానునితో “నా శిష్యులతో నేను పాస్క భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడ? అని మా గురువు అడుగుచున్నాడు” అని చెప్పుడు.

15. అప్పుడు అతడు మేడపై సిద్ధపరుపబడిన విశాలమైన గదిని మీకు చూపును. అందు మనకు పాస్కభోజన మును సిద్ధపరపుడు” అని చెప్పెను.

16. అంతట ఆశిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి, యేసు చెప్పినట్లు కనుగొని పాస్కభోజనమును సిద్ధపరచిరి.

17. సాయంసమయమున పన్నిద్దరు శిష్యులతో యేసు అచ్చటకు వచ్చెను.

18. వారు భోజనము చేయుచుండ ఆయన వారితో “ఇక్కడ నాతో భుజించుచున్న మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించునని మీతో నిజముగా చెప్పుచున్నాను” అనెను.

19. అందుకు వారు మిగులచింతించి “నేనా? నేనా?” అని ఒక్కొక్కరు అడుగసాగిరి.

20. అందుకు ఆయన “పన్నిద్దరిలో ఒకడు నాతో ఈ పాత్రలోనే రొట్టెను అద్దుకొనువాడే.”

21. “మనుష్యకుమారుని గూర్చి వ్రాయబడినట్లు ఆయన మరణించును. కాని, మనుష్యకుమారుని అప్పగించువానికి అయ్యో అనర్గము! అతడు జన్మింపకుండిన అతనికి మేలుగా  ఉండెడిది” అనెను.

22. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని, ఆశీర్వదించి, త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు “దీనిని మీరు తీసికొని భుజింపుడు. ఇది నా శరీరము” అనెను.

23. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దానినుండి వారు అందరు త్రాగిరి.

24. యేసు వారితో “ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతననిబంధన యొక్క నా రక్తము.

25. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షరసమును నూతన ముగా పానముచేయు దినమువరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను” అనెను.

26. వారొక స్తుతిగీతము పాడిన పిదప ఓలివుకొండకు వెళ్ళిరి.

27. అప్పుడు యేసు వారితో “మీరు నన్ను విడిచి పోయెదరు. ఏలయన 'నేను గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, గొఱ్ఱెలన్నియు చెల్లాచెదరగును' అని వ్రాయబడియున్నది.

28. కాని నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటె ముందుగా గలిలీయసీమకు వెళ్ళెదను” అని పలికెను.

29. “అందరు మిమ్ము విడిచివెళ్ళినను నేను మాత్రము మిమ్ము విడిచి వెళ్ళను" అని పేతురు పలికెను.

30. అందుకు యేసు “ఈ రాత్రి కోడి రెండవమారు కూయకమునుపే నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.

31. అప్పుడు పేతురు ఆయనతో “మీతో మరణింపవలసివచ్చినను నేను మిమ్ము ఎరుగను అని బొంకను” అని నొక్కి పలికెను. అటులనే శిష్యులందరును పలికిరి.

32. అంతట యేసు తనశిష్యులతో గెత్సెమని తోటకు వచ్చి, “నేను ప్రార్థనచేసికొని వచ్చువరకు మీరు ఇచట కూర్చుండుడు” అని చెప్పెను.

33. పేతురును, యాకోబును, యోహానులను తనతో వెంటబెట్టుకొని పోయెను. అప్పుడు ఆయన ఆవేదనపడుచు చింతాక్రాంతుడాయెను.

34. ఆయన వారితో “నా ఆత్మ మరణవేదన పడుచున్నది. మీరు ఇచటనే ఉండి జాగరణచేయుడు” అని పలికెను.

35. ఆయన కొంత దూరము వెళ్ళి, నేలపై సాగిలపడి, సాధ్యమైనయెడల ఆ గడియ తననుండి తొలగిపోవలయునని ప్రార్థించెను.

36. “అబ్బా! తండ్రీ! నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. ఈ పాత్రమును నానుండి తొలగింపుము. అయినను, నా ఇష్టము కాదు. నీ చిత్తమే నెరవేరనిమ్ము” అని ప్రార్థించెను.

37. అంతట ఆయన తన శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుటను చూచి, పేతురుతో, “సీమోనూ! నిద్రించుచున్నావా? ఒక గంట సేపయినను మేల్కొని ఉండలేకపోతివా?” అని,

38. వారితో “మీరు శోధనకు గురికాకుండుటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగియున్నను, దేహము దుర్బలముగా ఉన్నది” అనెను.

39. ఆయన మరల రెండవమారు వెళ్ళి, అట్లే ప్రార్థించెను.

40. తిరిగివచ్చి, వారి నేత్రములు నిద్రాభారముచే మూతబడుచుండుట చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెనో వారికి తోచలేదు.

41. ఆయన మూడవవర్యాయము వచ్చి, వారితో “మీరు ఇంకను నిద్రించుచు, విశ్రమించుచున్నారా? ఇక చాలును. గడియ సమీపించినది. ఇదిగో! ఇప్పుడే మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు.

42. రెండు, పోదము రండు. నన్ను పట్టియిచ్చువాడు సమీపించుచున్నాడు” అనెను.

43.ఆయన ఇట్లు మాటలాడుచుండగా పన్నిద్దరిలో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు పంపిన జనసమూహము కత్తులను, బడితలను చేతబూని అతనితో వచ్చెను.

44. “నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే ఆయన. అతనిని పట్టి బంధించి, భద్రముగా తీసికొని పొండు” అని ఆ గురుద్రోహి వారికి ఒక గురుతును ఇచ్చెను.

45. అతడు యేసు వద్దకు వచ్చిన వెంటనే 'రబ్బీ' అని ఆయనను ముద్దు పెట్టుకొనెను.

46. వారు ఆయనను పట్టి బంధించిరి.

47. వెంటనే అచట నిలిచియున్న వారిలో ఒకడు తన కత్తిని తీసి, ప్రధానా ర్చకుని సేవకునికొట్టి వాని చెవి తెగనరికెను.

48. యేసు వారలతో “మీరు నన్ను పట్టుకొనుటకు కత్తులను, బడితలను తీసికొని దొంగ పైకి వచ్చినట్లు వచ్చితిరా?

49. ప్రతిదినము నేను దేవాలయములో మీమధ్య ప్రసంగించుచుంటిని, మీరు అపుడు నన్ను పట్టుకొనలేదు. కాని, లేఖనములు ఇట్లు నెరవేరవలసి ఉన్నవి” అనెను.

50. అపుడు శిష్యులు అందరు ఆయనను విడిచి పారిపోయిరి.

51. యువకుడు ఒకడు తన దిగంబర శరీరముపై నారవస్త్రము వేసికొని యేసును అనుసరించుచుండెను. వారు అతనిని పట్టుకొనిరి.

52. కాని అతడు నార వస్త్రము విడిచి దిగంబరుడై పారిపోయెను.

53. వారు యేసును బంధించి, ప్రధానార్చకుని యొద్దకు తీసికొనిపోయిరి. అచట ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు అందరు సమావేశమైరి.

54. పేతురు దూరదూరముగ యేసును అనుసరించుచు ప్రధానార్చకుని గృహప్రాంగణమును ప్రవేశించి పరిచారకులతో కలసి చలిమంటయే కూర్చుండెను.

55. ప్రధానార్చకులు, న్యాయస్థానాధిపతులందరు యేసుకు మరణశిక్ష విధించుటకై అబద్ధపు సాక్ష్యములు వెదుకనారంభించిరి. కాని వారికి ఏమియు లభింపలేదు.

56. జనులు అనేకులు ఆయనకు విరుద్ధముగా తప్పుడు సాక్ష్యములు చెప్పిరి. కాని వారి సాక్ష్యములు ఒకదానితో ఒకటి పొసగలేదు. ,

57. అపుడు కొందరులేచి ఆయనకు విరుద్దముగా సాక్ష్యము ఇచ్చుచు,

58. “మానవనిర్మితమగు ఈ దేవాలయమును ధ్వంసముచేసి తిరిగి మూడు దినములలో మానవనిర్మితము కాని వేరొక దేవాలయమును నిర్మింపగలనని ఇతడు చెప్పుచుండగా మేము స్వయముగా వింటిమి” అనిరి.

59. కాని, ఈ సాక్ష్యము కూడ సరిపడలేదు.

60. అపుడు ప్రధానార్చకుడు లేచి సభామధ్యమున నిలువబడి యేసును చూచి, “నీపై మోపబడిన నేరమునకు ఏమి సమాధానము ఇచ్చెదవు?” అని ప్రశ్నించెను.

61. ఆయన బదులు పలుకక మౌనము వహించెను. మరల ప్రధానార్చకుడు ఆయనను “దేవుని కుమారుడవు అగు క్రీస్తువు నీవేనా?” అని ప్రశ్నించెను.

62. అందుకు యేసు “అవును, నేనే. సర్వశక్తిమంతుని కుడిప్రక్కన మనుష్యకుమారుడు కూర్చుండియుండు టయు, ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూడగలరు” అని సమాధానము ఇచ్చెను.

63. అపుడు ప్రధానార్చకుడు మండిపడుచూ, తన వస్త్రములను చింపుకొని “ఇప్పుడు ఇక మనకు సాక్షులతో పనియేమి?

64. ఇతని దేవదూషణ మీరును వింటిరికదా! మీ ఉద్దేశమేమి?” అని అడిగెను. వారందరు ఏకకంఠముతో “ఇతడు మరణదండనకు పాత్రుడు” అని నిర్ణయించిరి.

65. కొందరు ఆయనపై ఉమినిరి. మరి కొందరు ఆయన ముఖమును మూసి, గ్రుద్దుచు, “నిన్ను గ్రుద్దినవారెవరు? ప్రవచింపుము!” అని హేళన చేసిరి. భటులు ఆయనను పిడికిళ్ళతో గ్రుద్దిరి.

66. పేతురు ఆ గృహప్రాంగణమున ఉండగా ప్రధానార్చకుని దాసీలలో ఒకతె వచ్చి,

67. చలి కాచుకొనుచున్న పేతురును చూచి "నీవు కూడ నజరేతు నివాసియగు యేసు వెంట ఉన్నవాడవుకావా?” అని ప్రశ్నించెను.

68. అందుకు అతడు “నేను ఏమియు ఎరుగను. నీవు ఏమి చెప్పునది నాకు తెలియుట లేదు” అని బొంకుచు, పంచలోనికి వెళ్ళిపోయెను. వెంటనే కోడికూసెను.

69. అచట ఉన్న దాసి అతనిని చూచి దగ్గర నిలిచియున్నవారితో “ఈతడు వారిలోని వాడే” అని పలికెను.

70. అతడు మరల బొంకెను. ఆ పిదప, అచట ఉన్నవారు పేతురును చూచి, “నీవు నిశ్చయముగా వారిలోని వాడవే, నీవును గలిలీయ నివాసివే" అనిరి.

71. అందుకు పేతురు శపించుకొనుచు, ఆనపెట్టి “మీరు చెప్పుచున్న ఆ మనుష్యుని ఎరుగనే ఎరుగను” అని పలికెను.

72. అంతలో రెండవ పర్యాయము కోడికూసెను. “కోడి రెండు పర్యాయములు కూయకమునుపే ముమ్మారు నీవు నన్ను ఎరుగనని పలుకుదువు” అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము రాగా పేతురు వెక్కివెక్కి ఏడెను. 

 1. ప్రాతఃకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరును యేసును చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్పగించిరి.

2. “నీవు యూదుల రాజువా?” అని పిలాతు ప్రశ్నించెను. “నీవు అన్నట్లే” అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను.

3. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి.

4. పిలాతు యేసును చూచి "నీపై వీరు ఎన్నినేరములు మోపుచున్నారో చూడుము. నీవు ఏమియును సమాధానము ఈయవా?” అనెను.

5. యేసు పల్లెత్తి మాటయిన పలుకకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడెను.

6. ఆ పండుగలో జనులు కోరుకొనిన ఒక ఖైదీని విడుదలచేయు ఆచారము పిలాతునకు కలదు.

7. విప్లవములు లేవదీయుచు, నరహత్యలు చేసినవారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బ అనువాడు ఒకడు.

8. ప్రజలందరు గుమిగూడి పండుగ ఆనవాయితీ చొప్పున ఒక ఖైదీని విడుదల చేయుమని పిలాతును కోరిరి.

9. అందుకు పిలాతు “యూదుల రాజును విడుదల చేయమందురా?” అని వారిని ప్రశ్నించెను.

10. ఏలయన ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగి యుండెను.

11. కాని ప్రధానార్చకులు బరబ్బను విడుదల చేయుమని అడుగ వలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి.

12. “అటులయిన యూదుల రాజు అని మీరు చెప్పుచున్న అతనిని నన్ను ఏమి చేయుమందురు?” అని పిలాతు మరల ప్రశ్నించెను.

13. “అతనిని సిలువ వేయుడు” అని వారు కేకలు వేసిరి.

14. "ఆయన చేసిన నేరమేమి?" అని అడుగగా “అతనిని సిలువ వేయవలసినదే” అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి.

15. అపుడు పిలాతు జన సమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బను విడిపించి, యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయుటకు వారలకు అప్పగించెను.

16. అపుడు సైనికులు ఆయనను రాజభవన అంతర్భాగమునకు తీసికొనిపోయిరి. సైనికులందరు సమావేశమైన పిమ్మట,

17. వారు యేసుకు ఊదా రంగు వస్త్రములను ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి, ఆయన తలపై పెట్టిరి.

18. “యూదులరాజా! నీకు జయము” అని ఆయనకు సమస్కరింపసాగిరి.

19. మరియు రెల్లుతో ఆయన తలపై మోది, మీద ఉమిసి, మోకరిల్లి నమస్కరించిరి.

20. వారు అటుల పరిహసించిన పిదప, ఊదా వస్త్రమును తీసివేసి, ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి, సిలువ వేయుటకై తీసికొనిపోయిరి.

21. పల్లెటూరినుండి ఆ మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామవాసి సీమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి (అతడు అలెగ్జాండరు, రూఫసుల తండ్రి).

22. 'కపాల' నామాంతరము గల 'గొల్గొతా' అను స్థలమునకు ఆయనను తీసికొని పోయిరి.

23. అచట ఆయనకు చేదుకలిపిన ద్రాక్షరసమును త్రాగుటకు ఇచ్చిరి. కాని ఆయన దానిని పుచ్చుకొనలేదు.

24. పిదప వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసికొని ఆయన వస్త్రములను పంచుకొనిరి.

25. ఉదయము తొమ్మిది గంటలకు ఆయనను సిలువ పైకి ఎక్కించిరి.

26. ఆయన పైనుంచిన నిందారోపణ ఫలకముపై "యూదులరాజు” అని వ్రాయబడి ఉండెను.

27. వారు ఆయనకు కుడి ఎడమల ఇరువురు దొంగలను సిలువవేసిరి.

28. “ఆయన అపరాధులలో ఒకడుగా ఎంచబడెను” అను లేఖనము ఇట్లు నెరవేరెను.

29. పిదప, ఆ మార్గమున వచ్చిపోవువారు తలలు ఊపుచు “ఆహా! దేవాలయమును పడగొట్టి మూడుదినములలో మరల నిర్మించువాడా!

30. సిలువనుండి దిగిరమ్ము. నిన్ను నీవు రక్షించుకొనుము” అని పరిహాసములు ఆడిరి.

31. ఇట్లే ప్రధానార్చకులును, ధర్మశాస్త్ర బోధకులును పరిహాసము చేయుచు,“ఈయన ఇతరులను రక్షించెనుగాని, తనను తాను రక్షించుకొనలేడాయెను” అని పలికిరి.

32. “యిస్రాయేలు రాజగు క్రీస్తును దిగిరానిమ్ము, అప్పుడు మనము చూచి విశ్వసింతుము” అని హేళన చేసిరి. ఆయనతోపాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరును అట్లే ఆయనను నిందించిరి.

33. మధ్యాహ్నము నుండి మూడుగంటలవరకు భూమండలమెల్ల చిమ్మచీకటులు క్రమ్మెను.

34. పగలు మూడుగంటల సమయమున, “ఎలోయీ, ఎలోయీ లామా సబక్తాని?” అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. “నా దేవా! నా దేవా! నన్ను ఏల విడనాడితివి?” అని దీని అర్థము.

35. దగ్గర నిలిచిన వారిలో కొందరు అది విని, “ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడు” అనిరి.

36. ఒకడు పరుగెత్తిపోయి నీటిపాచి తీసికొని వచ్చి, పులిసిన ద్రాక్షరసములో ముంచి, ఒక కోలకు తగిలించి, ఆయనకు త్రాగుటకు ఇచ్చి, “తాళుడు, ఏలీయా ఇతనిని సిలువ నుండి దింపవచ్చునేమో చూతము" అని పలికెను.

37. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

38. అపుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.

39. ఇట్లు యేసు ప్రాణము విడుచుటను చూచి అచట నిలచి యున్న శతాధిపతి “నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే” అని పలికెను.

40. అప్పుడు కొందరు స్త్రీలు అల్లంత దూరమునుండి చూచు చుండిరి. వారిలో మగ్ధలా మరియమ్మ, చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమియమ్మ అనువారు ఉండిరి.

41. వారు యేసు గలిలీయసీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారము చేసినవారు. వీరితోపాటు ఆయనను అనుసరించి యోరూషలేమునకు వచ్చిన స్త్రీలు చాలమంది ఉండిరి.

42. అది ఆయత్త దినము. అనగా విశ్రాంతి దినమునకు ముందటి దినము,

43. కనుక సాయం కాలమున మహాసభ సభ్యుడును దేవునిరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడును, అరిమత్తయి నివాసియగు యోసేపు సాహసించి, పిలాతు వద్దకు వెళ్ళి, యేసు భౌతిక దేహమును కోరెను.

44. యేసు అంతత్వరగా మరణించెను అని విని, పిలాతు ఆశ్చర్యపడి సేనాపతిని పిలిపించి "ఆయన అప్పుడే మరణించెనా?”అని అడిగెను.

45. అది నిజమేనని అతనివలన విని పిలాతు, యేసు భౌతిక దేహమును కొనిపోవ యోసేపునకు అనుమతి ఇచ్చెను.

46. యోసేపు ఒక నార బట్టను కొనివచ్చి, యేసు భౌతికదేహమును సిలువనుండి దింపి, దానిని ఆ వస్త్రముతో చుట్టి, రాతిలో తొలిపించిన సమాధియందు ఉంచెను, సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్దరాతిని దొర్లించెను.

47. మగ్దలా మరియమ్మయు, యోసేపు తల్లి మరియమ్మయు ఆయనను సమాధిచేసిన స్థలమును గుర్తుంచుకొనిరి. 

 1. విశ్రాంతి దినము గడచిన తరువాత మగ్దలా మరియమ్మ, యాకోబుతల్లి మరియమ్మ, సలోమియమ్మ యేసు భౌతికదేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని,

2. ఆదివారము వేకువజామున బయలుదేరి సూర్యోదయసమయమునకు సమాధిని చేరిరి.

3. "సమాధి ద్వారమునుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు?” అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి.

4. అది ఒక పెద్దరాయి. కాని వారు వెళ్ళి చూచునప్పటికే ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి.

5. వారు సమాధిలోనికి పోగా, తెల్లనివస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చుండియున్న ఒక యువకుని చూచి ఆశ్చర్యచకితులైరి.

6. అతడు వారితో “మీరు భయపడకుడు. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యెను. ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు.

7. మీరు వెళ్ళి పేతురునకు, తక్కిన శిష్యులకు 'ఆయన మీకంటె ముందు గలిలీయకు వెళ్ళుచున్నాడు. తాను చెప్పినట్లు మీరు ఆయనను అచట చూచెదరు' అని చెప్పుడు” అనెను.

8. వారు ఆశ్చర్యముతోను, భయముతోను బయటకు వచ్చి అచటనుండి పరుగెత్తిరి. వారు భయ పడినందున ఎవ్వరితో ఏమియు చెప్పలేదు.

9. ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్థనుడైన యేసు, తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను.

10. ఆమె వెళ్ళి ఆయనతో ఉండినవారును, దుఃఖసాగరములో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందజేసెను.

11. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి.

12. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళు చున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శన మిచ్చెను.

13. వారు ఇద్దరు తిరిగివచ్చి తక్కినవారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు.

14. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యమునకును వారిని గద్దించెను.

15. మరియు ఆయన వారితో ఇట్లనెను: “మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.

16. విశ్వసించి జ్ఞానస్నానము పొందు వాడు రక్షింపబడును. విశ్వసింపనివానికి దండన విధింపబడును.

17. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. అన్యభాషలను మాట్లాడెదరు.

18. పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములనుంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు."

19. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను.

20. పిదప శిష్యులు వెళ్ళి అంతట సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు, అద్భుతములద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను.

21. ఆ స్త్రీలు వెళ్ళి పేతురుతోను, ఆయన సహచరులతోను ఈ సంగతులను గూర్చి సంక్షిప్తముగా తెలియజేసిరి. పిదప పవిత్రమును, సజీవమును అగు ఈ నిత్యరక్షణ సువార్తను యేసే తన శిష్యుల మూలమున లోకమంతట వ్యాపింపజేసెను.