ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రోమీయులకు వ్రాసిన లేఖ | Roman catholic bible in Telugu

 1. యేసుక్రీస్తు సేవకుడును, అపోస్తలుడుగా ఉండుటకును పిలువబడినవాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అయిన పౌలు వ్రాయునది:

2. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను దేవుడు ముందుగా తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనము లందు వాగ్దానము చేసెను.

3. మన ప్రభువైన యేసు క్రీస్తు మానవుడుగా, దావీదు సంతతియై జన్మించెను.

4. కాని, ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను.

5. అన్ని జాతుల ప్రజలును ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును ఒసగెను.

6. మీరును వారిలోని వారే. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచెను.

7. రోము నగరమందలి పరిశుద్దులుగా ఉండు టకు పిలువబడిన దేవుని ప్రియులందరికి శుభమును కోరుచు వ్రాయునది. మన తండ్రి దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపను, సమాధానమును కలుగునుగాక!

8. మొట్టమొదట మీ అందరికొరకై యేసుక్రీస్తు ద్వారా నా దేవునకు కృతజ్ఞతలు చెప్పుకొందును. ఏలయన మీ విశ్వాసమును ప్రపంచమంతయు పొగడుచున్నది.

9. తన కుమారుని గురించి సువార్తా ప్రచారముచేయుచు, హృదయపూర్వకముగా నేను సేవించుచున్న దేవుడు నేను చెప్పునది నిజమని నిరూపింపగలడు. మిమ్ము ఎల్లవేళల నా ప్రార్ధనల యందు జ్ఞాపకముంచుకొనుచున్నానని ఆయనకు తెలియును.

10. ఆయన సంకల్పము వలన, ఎటులయినను చివరకు మిమ్ము చేరుకొనగలుగుటకై సర్వదా ప్రార్ధించుచున్నాను.

11. ఏలయన, మిమ్ము చూడవ లెనని ఎంతగానో కోరుకొనుచున్నాను. మిమ్ము బల పరచుటకు ఆధ్యాత్మికమైన కృపావరమును మీకు ఈయగోరుచున్నాను.

12. అనగా నేను మీ మధ్య ఉండి, నేను మీ విశ్వాసము వలనను, మీరు నా విశ్వాసము వలనను ప్రోత్సాహము పొందగలమని ఆశించు చున్నాను.

13. నేను మిమ్ము కలిసికొనవలెనని అనేక మార్లు ఉద్దేశించితిని. కాని, ఇప్పటివరకు ఏదియో ఒక ఆటంకము కలుగుచునే యున్నది. సోదరులారా! అన్యులను ఎట్లు విశ్వాసులుగ మార్చితినో అట్లే మీ యందును మార్పు తీసికొనిరావలెనని నా కోరిక.

14. ఏలయన, గ్రీకులు, గ్రీకులు కానివారు, జ్ఞానులు, అజ్ఞానులు అగు అందరిపట్ల నాకు ఒక బాధ్యత ఉన్నది.

15. కనుకనే రోము నగరములోనున్న మీకును సువార్తను బోధింపవలెనని నేను ఆశపడు చున్నాను.

16. నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు. ఏలయన, అది విశ్వసించువారందరకు, మొదట యూదులకు, తరువాత గ్రీకులకు కూడ రక్షణ నొసగు దేవుని శక్తి.

17. ఏలయన “విశ్వాసము ద్వారా నీతి మంతుడు జీవించును” అని వ్రాయబడియున్నట్లు విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయల్పరచబడుచున్నది.

18. మానవుల భక్తిహీనతపై, దౌష్ట్యము పై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగు చున్నది. వారి దౌష్ట్యము సత్యమును అణచివేయు చున్నది.

19. ఏలయన, దేవుని గూర్చి తెలిసికొన గలిగినది వారికి తేటతెల్లమే. వాస్తవముగ దేవుడే వారికి దానిని ఎరుకపరచెను.

20. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటినుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వతశక్తి, దైవత్వము, సృష్టి వస్తుజాలములో స్పష్టముగ విశదమైనవి. కనుక వారికి ఎట్టి సాకును లేదు.

21. వారు దేవుని ఎరిగి నప్పటకిని ఆయనకు ఈయవలసిన గౌరవమును వారు ఈయలేదు. ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక, వారు తమ, హేతువాదములందు వ్యర్ధు లైరి. వారి బుద్దిహీనహృదయములను చీకటి ఆవరించి నది.

22. తాము బుద్ధిమంతులము అని చెప్పుకొనుచు వారు బుద్దిహీనులైరి.

23. వారు అమరుడైన దేవుని మహిమను మర్త్యుడైన మనుష్యుని స్వరూపముగా, పక్షులయొక్క జంతువుల యొక్క సర్పములయొక్క రూపములుగా మార్చిరి.

24. 'కనుక దేవుడు వారిని వారి హృదయముల దురాశలకును, వారి శరీరములను అగౌరవపరచు పరస్పర జుగుప్సాకర ప్రవర్తనలకును వదలివేసెను.

25. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా స్తుతిపాత్రుడు. ఆమెన్.

26. ఈ కారణముల వలన, దేవుడు వారిని తుచ్ఛ వ్యామోహముల పాలొనర్చెను. వారి స్త్రీలు కూడ తమ లైంగిక కృత్యములను స్వభావవిరుద్ధములగు చేష్టల ద్వారా వక్రమొనర్చిరి.

27. అట్లే పురుషులును స్త్రీలతో సహజమగు లైంగిక సంబంధమును విడనాడి, తమలో తాము అన్యోన్యమగు మోహముచే తపించిరి. వారు ఒకరితో ఒకరు లజ్జాకరముగ ప్రవర్తించిరి. దాని ఫలితముగా వారు తమ తప్పునకు తగిన శిక్షను తమ శరీరములందు అనుభవించిరి.

28. దేవుని గూర్చిన సత్యమగుజ్ఞానమును వారు తమ మనసులలో ఉంచుకొనలేదు. కనుకనే చేయరాని పనులు చేయునట్లుగ దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను.

29. వారు సర్వవిధములగు దుష్టత్వముతోను, చెడుగుతోను, అత్యాశతోను, ద్వేషముతోను నిండియుండిరి. అసూయ, హత్య, కలహము, మోసము, దుర్గుణములతోను వారు నిండియుండిరి. వారు కబుర్లతో కాలక్షేపము చేయుచు,

30. ఇతరులను గూర్చి చెడు మాటలాడుచుందురు. వారు దైవ ద్వేషులు, అహంకారులు, గర్వితులు, డాంబికులు, సదా దుష్టమార్గములనే కనిపెట్టువారు, తల్లిదండ్రు లకు అవిధేయులై ప్రవర్తించువారు,

31. అవివేకులు, ఆడితప్పువారు, పాషాణహృదయులు, నిర్దయులు.

32. ఇట్టి ప్రవర్తన కలవారికి చావే తగినదను దేవుని చట్టము వారికి తెలియును. అయినను, వారు ఈ పనులను చేయుచునే ఉందురు. వారు చేయుట మాత్రమే కాదు. అటుల చేయు తదితరులను కూడ ఆమోదింతురు. 

 1. ఇతరులకు తీర్పుతీర్చు ఓ మనుష్యుడా! నీవు ఎవడివైనను నిరుత్తరుడవై ఉన్నావు. ఏలయన, ఇతరులకు తీర్పుచెప్పుచు నీవే అట్టి కార్యములు చేయుచుంటివి కనుక నిన్ను నీవే ఖండించుకొనుచున్నావు.

2. అట్టి కార్యములొనర్చు వారిపై దేవుని దండన న్యాయసమ్మతమే.

3. మనుష్యుడా! వేనికొరకై ఇతరులకు తీర్పుచెప్పుచుందువో, వానినే నీవు చేయుచున్నావుగదా! అటులైనచో, నీవు దేవుని దండనను తప్పించుకొనగలననుకొందువా?

4. లేక, నీవు దేవుని నిండుదయను, సహనమును, ఓర్పును తృణీకరించు చున్నావా? దేవునిదయ నీ హృదయపరివర్తన నిమిత్తమే అని ఎరుగవా!

5. నీ హృదయము కఠినమైనది, మొండిది. కనుకనే, దేవుని ఆగ్రహమును, న్యాయమగు తీర్పును వ్యక్తపరుపబడు ఆనాటి నీ శిక్షను నీవే ఎక్కువ చేసికొనుచున్నావు.

6. ఏలయన, వాని వాని క్రియలను బట్టియే దేవుడు ప్రతి వ్యక్తిని బహూకరించును.

7. ఓర్పుతో సత్కార్యములు చేయుచు, కీర్తి, ప్రతిష్ఠ, అమరత్వములను కోరువారికి దేవుడు శాశ్వతజీవమును ఒసగును.

8. కాని, విభేదములు కలిగించుచు సత్యమును అంగీకరింపక తప్పుడు మార్గమును అవలంబించు వారిపై దేవుడు ఆగ్రహ మును, రౌద్రమును కురియించును.

9. దుష్కార్యము లొనర్చు ప్రతి వ్యక్తికి కష్టములు, బాధలు తప్పవు. మొదట యూదులకు, తదుపరి గ్రీకులకు కూడ అవి వచ్చును.

10. కాని సత్కార్యములు చేయు ప్రతివ్యక్తికి దేవుడు వైభవమును, గౌరవమును, శాంతిని ప్రసాదించును. మొదట యూదులకు, ఆపై గ్రీకులకు కూడ అవి కలుగును.

11. ఏలయన, దేవునకు పక్ష పాతములేదు.

12. ధర్మశాస్త్రము లేకయే పాపము కట్టుకొన్న అన్యులు ఆ ధర్మశాస్త్రముతో సంబంధము లేకనే నాశనమగుదురు. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా పాపముకట్టుకొన్న యూదులు, ఆ ధర్మశాస్త్రము వలననే దండింపబడుదురు.

13. ఏలయన, కేవలము ధర్మ శాస్త్రమును వినుట మాత్రముచే కాక, ధర్మశాస్త్రము నందలి నియమములను అనుసరించుట వలననే మనుష్యులు దేవుని ఎదుట నీతిమంతులు గావింపబడుదురు.

14. అన్యజాతులకు ధర్మశాస్త్రము లేదు. కాని వారికై వారు స్వభావసిద్ధముగా ధర్మశాస్త్రము నందలి శాసనములను పాటించినచో, వారు ధర్మ శాస్త్రము లేనివారేయైనను, వారికి వారే ఒక ధర్మ శాస్త్రమగుదురు.

15. ధర్మశాస్త్రము కోరునది వారి హృదయములపై ముద్రింపబడియున్నదని వారి ప్రవర్తనయే చాటును. ఇదియే యథార్థమేయని వారి అంతఃకరణములు కూడ నిరూపించును. ఏలయన, వారి తలంపులు కొన్నిసార్లు వారిని సమర్థించును, కొన్నిసార్లు వారిని నిందించును.

16. మానవుల హృదయములందలి రహస్య ఆలోచనలకు అన్నిటికి యేసుక్రీస్తు ద్వారా, దేవుడు తీర్పుచేయు ఆ దినమున నేను బోధించు సువార్తానుసారముగ ఇట్లే జరుగును.

17. నీ విషయమేమి? యూదుడనని నీవు చెప్పుకొందువుగదా? ధర్మశాస్త్రము పై ఆధారపడి దేవుని యందు నీ గొప్పలు చెప్పుచుందువు గదా!

18. దేవుని చిత్తము నీకు తెలియును. మంచిని ఎన్ను కొనుటను నీవు ధర్మశాస్త్రము నుండి నేర్చుకొంటివి.

19. నీవు గ్రుడ్డివారికి మార్గదర్శకుడవనియు, చీకటిలో ఉన్న వారికి దీపమనియు,

20. మూర్చులకు బోధకుడవనియు, పిన్నలకు గురువువనియు నీవెరిగినదే. విజ్ఞానపరిపూర్ణత, సత్యసంపూర్ణత అనునవి ధర్మ శాస్త్రము నందు ఇమిడియున్నవని నీవు నమ్ముచున్నావు.

21. మరి ఇతరులకు బోధించు నీవు, నీకు నీవే ఎందుకు బోధించుకొనవు? దొంగిలింపకుము అని బోధింతువు గదా! కాని, నీవు దొంగిలింతువా?

22. వ్యభిచరింపకుము అని చెప్పుచున్న నీవు వ్యభిచరింతువా? విగ్రహములను అసహ్యించు కొనుచున్న నీవు దేవాలయములను దోచుకొందువా?

23. నీకు దేవుని ధర్మశాస్త్రమున్నదని గొప్పలు చెప్పుకొనుచున్న నీవు ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా దేవుని అవమానింతువా?

24. ఏలయన: “యూదులారా! మిమ్ము బట్టి అన్యజనులు దేవుని నామమును దూషించుచున్నారు” అని వ్రాయబడియున్నది.

25. నీవు ధర్మశాస్త్రమునకు విధేయుడవైనచో నీ సున్నతికి ప్రయోజనము ఉన్నది. కాని నీవు ధర్మ శాస్త్రమునకు విధేయత చూపనిచో, సున్నతి లేనట్లే.

26. ఒకవేళ సున్నతిపొందని అన్యుడు ధర్మశాస్త్ర నియమ ములను పాటించినచో దేవుడు అతనిని సున్నతి పొందిన వానినిగ భావింపడా?

27. అప్పుడు మీరు అన్యులచే తీర్పు పొందుదురు. ఏలయన, వ్రాత రూపమున ధర్మశాస్త్రమును పొందియు, సున్నతి కలిగియుండియు, మీరు ధర్మశాస్త్రమును ఉల్లంఘింతురు. కానివారు శారీరకముగ సున్నతిని పొందకయు ధర్మ శాస్త్రమునకు విధేయత చూపుదురు.

28. నిజమైన యూదుడు బాహ్యముగ మాత్రమే యూదుడైన వాడు కాడు. అట్లే, నిజమైన సున్నతి బాహ్య శారీరక సున్నతి కాదు.

29. అంతరంగమున యూదుడైన వాడు  నిజమైన యూదుడు. అసలైన సున్నతి హృదయమునకు సంబంధించినది. అది ఆధ్యాత్మికమైనదే కాని వ్రాత పూర్వకమైన ధర్మశాస్త్రమునకు సంబంధించినది కాదు. అట్టివాడు మనుష్యులచే కాక దేవునిచే మెప్పుపొందును. 

1. అయినచో అన్యజనుల కంటె యూదులకున్న గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి?

2. ఎటు చూచినను అధికమే! దేవుడు తన సందేశమును యూదులకు అప్పగించిన విషయము మొదటిది.

3. వారిలో కొందరు అవిశ్వాసులైనంత మాత్రమున ఏమి? వారి అవిశ్వాసము దేవుని విశ్వసనీయతను భంగపరచునా?

4. ఎన్నటికిని కాదు! ప్రతివ్యక్తి అసత్య వాదియైనను దేవుడు మాత్రము సత్యశీలి. ఏలయన, “నీవు మాటలలో సత్యవంతుడవని ప్రదర్శింపబడవలెను. నీవు తీర్పు చేయబడినపుడు గెలుపొందవలెను” అని వ్రాయబడియున్నది. ..

5. కాని, మనదుర్నీతి దేవుని నీతిని స్థాపించుటకు తోడ్పడినచో అప్పుడు ఏమందుము? మనలను ఆగ్ర హించు దేవుడు తన ధర్మమును అతిక్రమించెనని అందుమా? నేను ఇట వాస్తవముగా మానవతీరున మాట్లాడుచున్నాను.

6. అది ఎన్నటికిని కాదు! అటులయినచో దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు చెప్పును?

7. నా అసత్యము దేవుని సత్యమును ప్రబ లించుచు, ఆయన వైభవమునకు తోడ్పడుచున్నది గదా! అటులయిన ఆయన నన్ను ఏల ఇంకను పాపిగా తీర్పుచేయును?

8. అటులైన మేలు కలుగుటకే కీడు చేయుదమని కొందరు మమ్ము దూషించి చెప్పినట్లు మేము ఎందుకు చెప్పరాదు? అట్టివారు తగిన దండనను పొందుదురు.

9. అయినచో, మనము అన్యజనుల కంటె ఏమైన గొప్పవారమా? లేదే! యూదులును, గ్రీకులును అందరును ఒకే విధముగా పాప ప్రభావమునకు లోనై ఉన్నారని నేను ముందే చూపితిని గదా!

10. ఏలయన వ్రాయబడిన ప్రకారము: “నీతి మంతుడు ఎవడును లేడు, ఏ ఒక్కడును లేడు.

11. దేవుని గ్రహించువాడును, అన్వేషించువాడును ఒక్కడును లేడు.

12. అందరును దేవునికి దూరమైన వారే. అందరును దుర్మార్గులే. ఒక్కడును మంచి చేయడు, ఏ ఒక్కడును చేయడు.

13. వారి గొంతు తెరువబడిన సమాధివలె ఉన్నది. వారు మాటలతో మోసపుచ్చుదురు. వారి పెదవులయందు సర్పవిషము ఉన్నది.

14. వారి నోళ్ళు శాపములతోను, ద్వేషముతోను నిండిఉన్నవి.

15. వారి పాదములు రక్తపాతమునకై పరుగులెత్తుచున్నవి.

16. వారు పాదముంచిన ప్రతిస్థలమున వినాశము, దౌర్భాగ్యము అనునవియే మిగులును.

17. శాంతిపథము వారికి తెలియదు.

18. దేవునకు భయపడుటయు వారు ఎరుగరు”.

19. ధర్మశాస్త్రమున చెప్పునది, దానిని అనుసరించి జీవించువారికే వర్తించునని మనకు తెలియును. అది, వారు ఎట్టి సాకులును చెప్పకుండ చేసి ప్రపంచమునంతను దేవుని తీర్పునకు లోబరచును.

20. ఏలయన, ధర్మశాస్త్రమును పాటించు టద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు. పాపమనగా ఏమిటో మానవుడు గుర్తించునట్లు చేయుటయే ధర్మశాస్త్రము యొక్క పని.

21. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలు పడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. యేసు క్రీస్తు నందలి వారి విశ్వాసము ద్వారా దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును అని ధర్మశాస్త్రమును, ప్రవక్తలును దానికి సాక్ష్యమిచ్చిరి. క్రీస్తునందు విశ్వా సము గలవారిని అందరిని దేవుడు తనకు అంగీకార యోగ్యులుగా చేసికొనును. ఎట్టి భేదమును లేదు.

23. మానవులందరు పాపముచేసి, దేవుని మహిమను పొందలేకపోయిరి.

24. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహముచే నీతిమంతులుగా చేయబడిరి.

25. గతమున దేవుడు ఓర్పు వహించి మానవుల పాపములను ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనపరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను కరుణా పీఠముగా బయల్పరచెను. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయునో ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతునిగా తీర్చు వాడైయుండుటకు ఆయనను అటుల చేసెను.

27. కనుక గొప్పలు చెప్పుకొనుటకు ఏమున్నది? ఏమియును లేదే! ఏ కారణమున? క్రియలవలననా? కాదు. విశ్వాసమువలననే.

28. మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసమువలనగాని, ధర్మశాస్త్రానుసార క్రియలవలన కాదని మేము భావించుచున్నాము.

29. లేక దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడ దేవుడు కాడా? అవును, దేవుడు ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడ దేవుడు.

30. దేవుడు ఒక్కడే కనుక సున్నతి పొందిన వారిని విశ్వాసము మూలముగను, సున్నతిలేనివారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును.

31. అయినచో ఈ విశ్వాసమువలన మనము ధర్మ శాస్త్రమును ధ్వంసము చేసినట్లగునా? ఎంత మాత్ర మును కాదు. మనము ధర్మశాస్త్రమును నిలబెట్టుదుము. 

 1. అయినచో మనజాతికి శారీరక సంబంధియు, మూలపురుషుడగు అబ్రహాము ఏమి కనుగొనెనని చెప్పుదము?'

2. తన క్రియల వలన అతడు నీతి మంతుడు కావింపబడినచో, పొగడుకొనుటకు అతనికి కారణము ఉండెడిది. కాని దేవుని ఎదుట పొగడు కొనలేడు.

3. “అబ్రహాము దేవుని విశ్వసించెను. అతను అది అతనికి నీతిగా ఎంచబడెను” అని లేఖనము చెప్పుచున్నది.

4. పని చేయువానికి లభింపవలసిన వేతనము దానముగా పరిగణింప బడదు. అది వాని కషార్జితము.

5. పనిచేయక భక్తి హీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా యెంచబడుచున్నది.

6. క్రియలు లేకయే దేవునిచే నీతిమంతునిగ చేయబడువాని ధన్యతను గూర్చి దావీదు ఇట్లు పలుకుచున్నాడు.

7. “ఎవరి అతిక్రమములు దేవునిచే క్షమింపబడినవో, ఎవరి పాపములు పరిహరింపబడినవో వారు ధన్యులు.

8. ఎవని పాపములు ప్రభువు లెక్కపెట్టడో అతడు ధన్యుడు!"

9. ఈ ధన్యవచనము సున్నతి పొందిన వారికి మాత్రమేనా? సున్నతి పొందనివారికి కూడ చెందునా? ఏలయన, అబ్రహాము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడుచున్నది గదా!

10. అది ఎప్పుడు ఎంచబడెను? అబ్రహాము సున్నతిపొందక పూర్వమా? తరువాతనా? తరువాత కాదు, ముందే.

11. సున్నతి పొందక పూర్వమే తాను విశ్వాసము వలన నీతిమంతునిగా అంగీకరింపబడెనని నిరూపించుటకుగాను అతడు సున్నతిని పొందెను. కనుక, సున్నతిని పొందకయే దేవుని విశ్వసించి ఆయనచే నీతిమంతులుగ అంగీకరింపబడిన వారందరికిని అబ్రహాము తండ్రియగునట్లుగా ఉద్దేశింపబడెను.

12. సున్నతి పొందిన వారికినీ అతడు తండ్రియే. ఏలయన, వారు నున్నతి పొందుటచేత మాత్రమేకాదు, మన తండ్రియగు అబ్రహాము సున్నతిని పొందుటకు పూర్వము ఎట్టి విశ్వాసజీవితమును గడిపెనో అట్టి విశ్వాసమయమగు జీవితమునే వారును గడిపిరి.  దేవుని వాగ్దానము విశ్వాసము ద్వారా పొందనగును

13. అబ్రహాము అతడి నంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము వుండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను.

14. ఏలయన, దేవుని వాగ్దాన ఫలము ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే ఈయబడవలసియున్న యెడల మానవుని విశ్వాసము నిష్ప్రయోజనమగును, దేవుని వాగ్దానము నిష్పలమగును.

15. ఏలయన, ధర్మశాస్త్రము అగ్రహమును పుట్టించును. కాని ధర్మశాస్త్రమే లేనిచోట దాని ఉల్లంఘన ప్రస్తావనయేలేదుకదా!

16. ఆ కారణముచేతనే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడియుండెను. అబ్రహాము సంతతి వారందరికిని దేవునిచే ఒసగబడిన వరముపై ఆ వాగానము ఆధారపడియున్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు. అబ్రహాము వలె విశ్వసించువారికి కూడ అది వర్తించును. ఏలయన, అబ్రహాము మనకందరికి తండ్రి గదా!

17. “అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసితిని" అని వ్రాయబడియున్నది. కనుక దేవునిఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయనయందు విశ్వాసముంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యమునుండి సృష్టిని కలిగించును.

18. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయెను. “నీ సంతానము ఆకాశము నందలి నక్షత్రముల వలె ఉండును” అని చెప్పబడినది.

19. అతడు దాదాపు నూరేండ్ల ముదుసలి. మృత తుల్యమైన తన శరీరమును తలంచుకొనినపుడును, సారా గొడ్రాలు అని తలచినపుడును అతని విశ్వాసము సన్నగిల లేదు.

20. అతడు దేవుని వాగ్దానమును అనుమానింప లేదు. దేవుని స్తుతించి తన విశ్వాసము నందు దృఢపడెను.

21. ఏలయన, దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మకముండెను.

22. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రాహాము “దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను.”

23. కాని, “అతడు నీతిమంతుడుగా అంగీకరింపబడెను” అను మాటలు అతనికొక్కడి కొరకే వ్రాయబడలేదు.

24. నీతిమంతులుగ అంగీకరింపబడవలసిన మనలను గూర్చి కూడ అవి వ్రాయబడినవి. ఏలయన, మన ప్రభువగు యేసును మృతులలోనుండి లేవనెత్తిన ఆయనయందు మనకు విశ్వాసమున్నది.

25. మన పాపమునకుగాను ఆయన మరణమునకు అప్పగించబడెను. మనలను దేవునకు అంగీకారయోగ్యులముగ ఒనర్చుటకుగాను ఆయన మరల లేవనెత్తబడెను. 

 1. కనుక, విశ్వాసమువలన మనము ఇప్పుడు నీతిమంతులముగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి.

2. ఈనాడు మనకు నిలయమైయున్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసి కొనివచ్చెను. కనుక దేవుని మహిమలో పాలుపంచు కొను ఆశతో మనము అతిశయించుచున్నాము!

3. అంతేకాదు! మన బాధలలో కూడ మనము అతిశయించుదము. ఏలయన, కష్టములు ఓర్పును,

4. ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును.

5. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయన, దేవుడు దానముగ మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను.

6. మనము బలహీనముగ ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనులకొరకై క్రీస్తు మరణించెను.

7. ఎందువలన? నీతిమంతుని కొరకు కూడ ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశః సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడు నేమో.

8. కాని, మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించుటనుబట్టి, దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు.

9. ఆయన రక్తమువలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహమునుండి ఆయన మనలను ఇంకను ఎంతగ రక్షించునో గదా!

10. మనము శత్రువులుగా ఉన్నపుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధాన పరచుకొనెనన్నచో, మరి ఇపుడు దేవునితో సమాధాన పరపబడినవారమై, ఆయన జీవించుటను బట్టి ఎంత గానో రక్షింపబడుదుము.

11. అంతేకాదు ఇపుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము.

12. ఇందునుబట్టి, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగ మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలయన మానవులందరును పాపము కట్టుకొనిరి.

13. ధర్మ శాస్త్రము ఒసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కాని ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగ పరిగణింప బడలేదు.

14. కాని, ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరిని పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతనివలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను. రానున్నవారికి ఆదాము ఒక చిహ్నమాయెను.

15. కాని దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలమంది మరణించిరనుట నిజమే. కాని దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అను గ్రహించుట ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి ఒసగును.

16. కాని దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాపఫలితము వంటిది కాదు. ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది. కాని ఎన్నియో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది.

17. మృత్యువు ఒక్కని పాపము మూలముననే వచ్చినదై, ఆ ఒక్కని ద్వారానే ఏలిన పక్షమున, దేవుని విస్తారమైన అనుగ్రహమును, నీతియును, ఆయన కృపావరమును పొందు వారు జీవముగలవారై నిశ్చయముగ యేసు క్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు.

18. కనుక, ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికిని విముక్తిని ప్రసాదించి, వారికి జీవమును అను గ్రహించుచున్నది.

19. ఆ ఒక్కమానవుని అవిధేయత ఫలితముగ అనేకులు పాపాత్ములుగ చేయబడినట్లే, ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగ అనేకులు నీతిమంతులగుదురు.

20. అతిక్రమము అధికమగునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. కాని పాపము ఎచ్చట పెరిగెనో, అచ్చట దేవుని కృపావరములు అంతకంటెను అధికమయ్యెను.

21. కనుక పాపము మృత్యువువలన పరిపాలించు నట్లే, దేవుని అనుగ్రహము, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనలను శాశ్వత జీవమునకు నడుపుచు, నీతి మూలముగ పరిపాలించును. 

 1. కనుక మనము ఏమి చెప్పుదము? దైవానుగ్రహము అధికము అగుటకుగాను మనము పాపమున జీవింపవలెనని చెప్పుదమా?

2. ఎన్నటికిని కాదు! పాపము విషయమున మనము మరణించితిమి కదా! మరి పాపములో ఇంకను ఎట్లు జీవింపగలము?

3. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినపుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితిమని మీకు తెలియదా?

4. కనుక, మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయన, తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే, మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను.

5. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమైయుండినచో, ఆయన పునరుత్థానములో కూడ మనము తప్పక ఆయనతో ఏకమైయుందుము.

6. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండునట్లు, మన పాతస్వభావము ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియును.

7. ఏలయన, మరణించినవాడు పాపము నుండి విముక్తుడాయెను.

8. మనము క్రీస్తుతో మరణించియున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము.

9. ఏలయన, మరణమునుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియును. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధి పత్యము లేదు.

10. ఆయన మరణము, పాపమునకు శాశ్వతమగు మరణము. ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము.

11. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు, క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను.

12. కనుక శారీరక వాంఛలకు లొంగునట్లుగ, మీ భౌతిక శరీరమందు పాపము ఇక ఎంత మాత్రమును పాలన చేయనీయకుడు.

13. దౌష్ట్యమునకు సాధనములుగ మీ శరీరములందు ఏ అవయవములను పాపమునకు అర్పింపకుడు. అంతేగాక, మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడిన వారుగ మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. మీ శరీరములయందలి అవయవములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు.

14. ఏలయన దేవుని కృపా వరమునకే గాని ధర్మశాస్త్రమునకు మీరు ఇక లోబడి ఉండనందున పాపము మిమ్ము ఇక పరిపాలింపదు.

15. అయినచో నేమి? ధర్మశాస్త్రమునకు కాక దేవుని కృపావరమునకు లోనైనవారము అగుటచే పాపము చేయుదమా? ఎన్నటికిని కాదు!

16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు అప్పగించుకుందురో అది మరణము నిమిత్తము పాపమునకేగాని, దేవుని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులగుదురని మీకు తెలియదా?

17. కాని దేవునికి కృతజ్ఞతలు! ఏలయన, ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు. కాని, ఇప్పుడు మీకు అప్పగింప బడిన బోధనలలోని సత్యములకు మీరు హృదయ పూర్వకముగ విధేయులైతిరి.

18. మీరు పాపముల నుండి విముక్తులై నీతికి దాసులైతిరి.

19. సహజముగ మీరు పరిమితులగుటచే నేను మానవరీతిగా మాట్లా డుచున్నాను. ఒకప్పుడు మీరు దుష్కార్యములను చేయు టకై అపవిత్రతకును, దుష్టత్వమునకును, మీ అవయవములను అప్పగించితిరి. అదే విధముగ ఈనాడు మీరు మీ అవయవములను నీతికి దాసులుగ అప్ప గించి పవిత్రులు కావలెను.

20. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమున విచ్చలవిడిగా ఉంటిరి.

21. మరి ఈనాడు మీకు సిగ్గు కలిగించుచున్న ఆ పనులు చేయుటవలన అప్పుడు మీకు కలిగిన ప్రయోజన మెట్టిది? వాని ఫలితము మరణమే కదా!

22. కాని, ఈనాడు మీరు పాపమునుండి విముక్తి పొంది, దేవునికి దాసులైతిరి. పవిత్రతకు చెందిన మీ ఫలితమును మీరు స్వీకరించితిరి. అంతేకాక, చివరకు మీకు శాశ్వత జీవితము లభించును.

23. ఏలయన, పాపము యొక్క వేతనము మరణము. కాని, దేవుని కృపాను గ్రహము, మన ప్రభువగు క్రీస్తుయేసు నందు శాశ్వత జీవనము. 

 1. సోదరులారా! ఒక వ్యక్తి జీవించియున్నంత కాలమే ధర్మశాస్త్రము అతనిపై అధికారము కలిగియుండునని మీకు తెలియదా? నేను మాట్లాడునది ధర్మశాస్త్రమును గూర్చి ఎరిగిన వారితోనే.

2. ఏలయన, వివాహమైన స్త్రీ భర్త జీవించియున్నంత కాలమే ధర్మశాస్త్రము ప్రకారము అతనికి కట్టుబడియుండును. కాని అతడు మరణించినచో తనను అతనితో బంధించి ఉంచిన ధర్మశాస్త్రమునుండి ఆమె విముక్తి పొందును.

3. కనుక భర్త జీవించియుండగా, ఆమె మరియొక పురుషునితో ఉండెనేని, ఆమె వ్యభిచారిణి అనబడును. కాని, ఆమె భర్త మరణించినచో ధర్మశాస్త్రము ప్రకారము ఆమె స్వాతంత్య్రము గల స్త్రీ అగును. అప్పుడు ఆమె మరియొక పురుషుని వివాహమాడినచో వ్యభిచరించినట్లు కాదు.

4. సోదరులారా! మీ విషయమున కూడ అట్లే ఉన్నది. ధర్మశాస్త్ర విషయమున, క్రీస్తు శరీరము ద్వారా మీరును మరణించితిరి. కాని దేవుని కొరకై మనము ఉపయోగకరములగు జీవితములు జీవించుటకుగాను మృత్యువునుండి లేవనెత్తబడిన క్రీస్తునకు ఇపుడు మీరు చెందియున్నారు.

5. ఏలయన, మన మానవస్వభావము ననుసరించి మనము జీవించినపుడు, ధర్మశాస్త్రముచే పురికొల్ప బడిన పాపపు వాంఛలు మన శరీరములయందు విజృంభించి మృత్యువును కలిగించినవి.

6. కాని, ఇప్పుడు ధర్మశాస్త్రమునుండి విముక్తులమైతిమి. ఏలయన, ఒకప్పుడు మనలను బంధించి ఉంచిన దానిని గూర్చి మరణించితిమి గదా! ఇక మనము వ్రాత పూర్వకమగు ధర్మశాస్త్రమును అనుసరించిన పాత పద్దతిలోకాక, ఆత్మానుసారమైన క్రొత్త పద్ధతిలో దేవుని సేవించుచున్నాము.

7. కనుక మనము ఏమనగలము? ధర్మశాస్త్రమే పాపభూయిష్టమైనదా? అటులనరాదు. కాని, ధర్మశాస్త్రము ద్వారా తప్ప నేను పాపము అన ఏమియో ఎరుగలేదు. ఏలయన, “దురాశపడరాదు” అని ధర్మశాస్త్రము తెలుపకయున్నచో దురాశపడుట అన ఏమియో నాకు తెలియకుండెడిది.

8. పాపము ఆ శాసనము ద్వారా పనిచేసి, నాయందు పలువిధములైన అత్యాశలను రేపు అవకాశము కనుగొన్నది. ఏలయన, ధర్మశాస్త్రమే లేనిచో పాపము మరణించినట్లే.

9. ఒకప్పుడు నేనును ధర్మశాస్త్రము లేకయే జీవించితిని. కాని, శాసనము వచ్చిన తోడనే పాపము తిరిగి తలయెత్తెను. అంతట నేను మరణించితిని.

10. జీవము పోయవలసిన శాసనము, నా విషయమున మృత్యువును తీసికొని వచ్చినది.

11. ఏలయన, పాపము శాసనము ద్వారా అవకాశము కలుగజేసుకొని నన్ను మరులుగొలిపి మోసగించి, ఆ శాసనము ద్వారానే అది నన్ను చంపినది.

12. అయినను, ధర్మశాస్త్రము నిక్కముగ పవిత్ర మైనదే. శాసనము కూడ పవిత్రము, నీతియుక్తము, ఉత్తమము.

13. అయినచో మంచిగ ఉన్నదే నాకు మరణమును కలిగించినదని దీని అర్థమా? ఎన్నటికిని కాదు! పాపము అటుల చేసినది. పాపము తన స్వభావము సంపూర్ణముగా విదితమగుటకై, మంచిని ఉపయోగించుకొని నాకు మరణమును తెచ్చి పెట్టినది. కనుకనే శాసనము ద్వారా పాపము మరింత పాప భూయిష్ఠమైనది.

14. ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైనదని మనము ఎరుగుదుము. కాని నేను పాపమునకు బానిసగా అమ్మబడిన శరీరసంబంధిని.

15. కనుక నేను చేయుచున్నదేమియో నాకు బోధపడదు. ఏలయన, నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించుదానినే చేయుచున్నాను.

16. చేయుటకు ఇష్టములేని దానిని నేను చేసినచో, ధర్మశాస్త్రము మంచిదేనని నేను ఒప్పు కొనుచున్నాను.

17. కనుక నిజముగ పనిచేయునది నేను కాదు. నాయందు నివసించుచున్న పాపమే పని చేయుచున్నది.

18. నా యందు అనగా నా భౌతిక శరీరమునందు మంచి అనునది లేదని నాకు తెలియును. ఏలయన మంచి చేయవలెనను కోరిక నాలో ఉన్నను, దానిని నేను చేయజాలకున్నాను.

19. నేను చేయగోరు మంచిని చేయక, చేయగోరని చెడును చేయుచున్నాను.

20. కనుక, నేను చేయగోరని దానిని చేసినచో దానిని చేయునది నేను కాదనియే గదా దాని భావము! నాయందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది.

21. కనుక, మంచి చేయగోరిన నాకు చెడు చేయుటయే మిగులుచున్నది అను ఈ నియమము ఒకటి నాలో పనిచేయుచున్నట్లు నేను తెలిసికొంటిని.

22. నా అంతరాత్మ దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నది.

23. కాని, నా శరీరమున వేరొక నియమము పనిచేయుట నాకు గోచరించుచున్నది. ఈ నియమము నా మనస్సు యొక్క ఆమోదమును పొందిన ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమునకు నన్ను బందీని చేయుచున్నది.

24. నేను ఎంత దౌర్బాగ్యుడను! నన్ను మరణమునకు లాగుకొని పోవుచున్న ఈ శరీరము నుండి నన్ను విమోచించువారు ఎవ్వరు?

25. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునకు కృతజ్ఞతలు. కనుక నా అంతట నేను, నా మనస్సుతో మాత్రమే దేవుని చట్టమును సేవించుచున్నాను. కాని, నా శరీరముతో పాపపు చట్టమును సేవించుచున్నాను. 

 1. క్రీస్తు యేసుతో ఏకమై జీవించువారికి ఇప్పుడు ఏ దండనయు లేదు.

2. ఏలయన, క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చెడి ఆత్మ యొక్క చట్టము, పాపమును, మృత్యువును కలిగించు చట్టమునుండి నాకు విముక్తిని ప్రసాదించెను.

3. మానవస్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతియందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరమువంటి స్వభావముతో వచ్చెను.

4. శరీరమును అనుసరించికాక, ఆత్మానుసారులమై జీవించు మనయందు ధర్మశాస్త్రముయొక్క నైతికవిధి పూర్తిగా నెరవేరుటకుగాను దేవుడు ఇట్లు చేసెను.

5. ఏలయన, శరీరమును అనుసరించి జీవించువారు, శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైనవారు, ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులు అర్పింతురు.

6. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును. ఆత్మెక వాంఛలు జీవమునకు, శాంతికి దారితీయును.

7. ఏలయన, శరీరేచ్చపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగదు, లొంగియుండలేదు.

8. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు.

9. మీయందు నిజముగ దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు గాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తుఆత్మ తనయందు లేనివాడు ఆయనకు చెందడు.

10. క్రీస్తు మీయందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించి నది. కాని, ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది.

11. క్రీస్తును మరణమునుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన, మీయందున్న తన ఆత్మవలన నశించు మీ మర్త్యశరీరములకు కూడ జీవమును ఒసగును.

12. కనుక సోదరులారా! మనము బద్దులమైనది శరీరానుసారము జీవించుటకుకాదు.

13. ఏలయన, మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కాని, ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు.

14. దేవుని ఆత్మవలన నడుప బడువారు దేవుని పుత్రులు.

15. ఏలయన, దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు. మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని 'అబ్బా! తండ్రీ!' అని పిలుతుము.

16. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును.

17. మనము పుత్రులము కనుక వారసులము, నిజముగ మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలుపంచుకొనిన యెడల ఆయన మహిమలో కూడ మనము భాగస్తులము అగుదుము.

18. ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవికావు.

19. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టియంతయు ఆతుర తతో ఎదురుచూచుచున్నది.

20. సృష్టి నాశనమునకు లోనైనది. అది దాని స్వసంకల్పముచే అటుల జరుగ లేదు. దైవసంకల్పము చేతనే నిరీక్షణయందు అట్లైనది.

21. ఏలయన, సృష్టియే వినాశనదాస్యమునుండి విడిపింపబడి దేవునిపుత్రుల మహిమోపేతమైన స్వాతంత్య్రము నందు పాలుపంచుకొనును.

22. ఏలయన, ఇప్పటివరకును సృష్టి అంతయు ప్రసవవేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియును.

23. కాని సృష్టి మాత్రమే కాదు. ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము గూడ, దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరముయొక్క విముక్తిని పొందుటకు ఎదురుచూచుచు, మనలో మనము మూలుగుచున్నాము.

24. ఏలయన, నిరీక్షణవలననే మనము రక్షింపబడితిమి. కాని, మనము దేనికొరకు నిరీక్షించు చుంటిమో దానిని చూచినచో, అది నిజముగ నిరీక్షణ కాదు. ఏలయన, తాను చూచుచున్న దానికొరకై ఒకడు ఎందుకు నిరీక్షించును?

25. కాని మనము చూడని దానికొరకై నిరీక్షించినచో, దానికొరకై మనము ఓర్పుతో వేచియుందుము.

26. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడ సాయపడును. ఏలయన, మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును.

27. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ భావమును ఎరుగును. ఏలయన, దేవుని సంకల్పానుసారముగ దైవప్రజలకొరకై ఆత్మ దేవుని ప్రార్ధించును.

28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడినవారికి, అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియును.

29. తాను ఎన్నుకొనినవారు, తన కుమారుని సారూప్యమును గలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేకమంది. దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును.

30. తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగ చేసెను. నీతి మంతులనుగ చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలుపంచి ఇచ్చెను.

31. ఇవి అన్నియు తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు?

32. ఆయన తన సొంత కుమారుని కూడ మన అందరికొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడ మనకు ఉచితముగా ఇచ్చివేయడా?

33. ఎన్నికయైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును? దేవుడే వారిని నీతిమంతులుగ ప్రకటించును గదా!

34. అయినచో శిక్షవిధించువాడు ఎవడు? క్రీస్తుయేసే! ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి, దేవుని కుడిప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మనకొరకై విజ్ఞాపన చేయువాడు.

35. కనుక క్రీస్తు యొక్క ప్రేమనుండి మనలను ఎవరు వేరుచేయగలరు? బాధగాని, కష్టముగాని, హింసగాని, క్షామము గాని, వస్తహీనతగాని, ప్రమాదముగాని, యుద్ధము గాని, మరణముగాని అట్లు చేయకలదా?

36. లేఖనము నందు వ్రాయబడినట్లుగ, “నీ కొరకై మేము దినమంతయు మరణాపాయములో ఉన్నాము, చంపబడనున్న గొఱ్ఱెలవలె ఎంచబడుచున్నాము.”

37. అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా!

38. ఏలయన, మన ప్రభువైన క్రీస్తు యేసుద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువుగాని, జీవముగాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులుగాని, ఇక్కడ ఉన్నవిగాని, రానున్నవిగాని, శక్తులుగాని,

39. ఊర్ధ్వలోకముగాని, అథోలోకముగాని, సృష్టిలో మరి ఏదియు వేరుచేయ జాలదనుట నాకు నిశ్చయమే. 

 1. నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను. అసత్యము పలుకుటలేదు.

2. నేను ఎంతగా విచారించుచున్నానో నా హృదయవేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చు చున్నది.

3. నా రక్తసంబంధులైన నా ప్రజలకొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తునుండి వేరుచేయబడినచో బాగుండెడిది.

4. దేవుడు ఎన్నుకొనిన యిస్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగ చేసికొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసికొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే.

5. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక! ఆమెన్.

6. దేవుని వాగ్దానము విఫలమైనదని నేను చెప్పుటలేదు. ఏలయన, యిస్రాయేలు ప్రజలందరును వాస్తవముగా యిస్రాయేలీయులు కారు.

7. అట్లే అబ్రహాము సంతతియైనంత మాత్రమున అందరు ఆయన బిడ్డలు కారు. కాని, “ఈసాకు సంత తియే నీ వారుగ పరిగణింపబడుదురు” అని దేవుడు అబ్రహాముతో పలికియుండెను.

8. అనగా, శారీరకముగ జన్మించిన వారందరు దేవుని బిడ్డలు కారు అని దీని అర్థము. దేవుని వాగ్దాన ఫలముగ జన్మించిన బిడ్డలు మాత్రమే ఆయన సంతతిగ పరిగణింపబడుదురు.

9. ఏలయన, “దాదాపు ఇదే సమయమున నేను మరల వచ్చెదను. అప్పుడు సారాకు ఒక కుమారుడు కలుగును” అని దేవుడు వాగ్దానము చేసెను.

10. అంతేకాదు! రిబ్కా పుత్రులు ఇరువురును మన మూలపురుషుడగు ఈసాకు సంతానమే.

11-12. కాని, “మొదటివాడు రెండవవానికి సేవకు డగును” అని దేవుడు ఆమెతో పలికెను. ఇట్లు ఒకనినే ఎన్నుకొనుట పూర్తిగా దేవుని ఉద్దేశము. వారి జననమునకు పూర్వమే, వారు మంచికాని, చెడుగుకాని చేయక పూర్వమే, దేవుడు అటుల పలికెను. కనుక దేవుని ఎన్నిక, అతని పిలుపును అనుసరించినదే కాని చేతలను అనుసరించినది కాదు.

13. కనుకనే లేఖ నమున “నేను యాకోబును ప్రేమించితిని కాని ఏసావును ద్వేషించితిని” అని చెప్పబడియున్నది.

14. కనుక మనము ఏమందుము? దేవుడు న్యాయము లేని వాడందుమా? ఎంత మాత్రమును కాదు.

15. ఏలయన, “నాకు దయకలిగిన వానిపై దయచూపుదును, నాకు జాలికలిగిన వానిపై జాలివహింతును” అని దేవుడు మోషేతో పలికియుండెను.

16. కనుక మానవ ఇష్టముపై కాని లేక ఒకడు చేయు పనిపై కాని కాక, అది దేవుని కనికరముపై మాత్రమే ఆధారపడియుండును.

17. ఏలయన, “నీయందు శక్తి ప్రదర్శింపబడవ లెనని, నానామము ప్రపంచమునందంతటను చాటబడ వలెననెడి ఉద్దేశముతోనే నేను నిన్ను రాజును చేసితిని” అని లేఖనము ఫరోతో పలుకుచున్నది.

18. కనుక తన ఇష్టము వచ్చిన వారిపై దేవుడు కనికరము చూపును. తన ఇష్టము వచ్చిన వారి హృదయములను కఠినపరచును.

19. “అటులైనచో దేవుడు ఇంకను ఎందుకు మానవునియందు తప్పుపట్టును? ఏలయన, దైవ సంకల్పమును ఎవడు ఎదుర్కొనగలడు?” అని మీలో ఎవరైన పలుకవచ్చును.

20. కాని మిత్రమా! దేవునికి ఎదురు పలుకుటకు నీవు ఎవడవు? “నీవు నన్ను ఇట్లు ఎందుకు చేసితివి? "అని చేయబడినది, చేసినవానిని అడుగగలదా!

21. మట్టిని తన ఇష్టము వచ్చినట్లు ఉపయోగించుకొనుటకును, ఒకే మట్టి ముద్దనుండి రెండుకుండలు చేయుటకు, అనగా వెలయైన కుండను, వెలతక్కువ కుండను చేయుటకును కుమ్మరికి హక్కులేదా?

22. దేవుడు చేసినది కూడ ఇట్లే. ఆయన తన ఆగ్రహమును, శక్తిని ప్రదర్శింపనెంచెను. కనుకనే తన ఆగ్రహమునకు గురియై నాశనము చేయబడవలసిన వారిని సహించుటలో ఆయన ఎంతయో ఓర్పును ప్రదర్శించెను.

23. అంతే కాదు, ఆయన కృపకు పాత్రులమై ఆయన మహిమలో పాలుపంచుకొనుటకు సిద్ధపరుపబడిన మనపై ఆయన మహత్తరమైన తన మహిమను ప్రదర్శింపనెంచెను.

24. ఏలయన, ఆయనచే పిలువబడినవారము మనమే. యూదుల నుండియేకాక అన్యజనులనుండియు ఆయన మనలను పిలిచెను.

25. ఎలయన, హోషేయ గ్రంథములో ఆయన ఇట్లు చెప్పుచున్నాడు. "నా ప్రజలు కాని వారిని 'నాప్రజలు' అని పిలుతును. నేను ప్రేమింపని ఆమెను 'నా ప్రియురాలు' అని పిలుతును"

26. 'మీరు నా ప్రజలు కాదు' అని వారికి చెప్పిన చోటనే, వారు 'సజీవుడగు దేవుని పుత్రులు' అని పిలువబడుదురు."

27. "యిస్రాయేలు ప్రజలు సముద్రతీరమునందలి ఇసుక రేణువులవలె అసంఖ్యాకులైనను, వారిలో కొలదిమంది మాత్రమే రక్షింపబడుదురు;

28. ఏలయన, త్వరలోనే దేవుడు సమస్త ప్రపంచముతోను లెక్క తేల్చుకొననున్నాడు" అని యిస్రాయేలును గూర్చి యెషయా బిగ్గరగా పలికెను.

29. గతమున యెషయా చెప్పిన ప్రకారమే, “సర్వ శక్తిమంతుడగు ప్రభువుకొంత సంతతిని మనకు విడిచి పెట్టి యుండకున్నచో, మనము సొదొమ గొమొఱ్ఱాలవలె వుందుము.”

30. అయినచో మనము ఏమందుము? నీతిని పొంద ప్రయత్నింపని అన్యజనులు, దేవుని నీతిని పొందిరి. అయితే ఈ నీతి విశ్వాసమువలన కలిగినదే.

31. ధర్మశాస్త్రముపై ఆధారపడియున్న నీతికొరకై ప్రయత్నించిన ఆ యిస్రాయేలు ప్రజలు దానిని నెర వేర్చుటయందు విఫలులైరి అని పలుకుదము.

32. మరి ఏల? ఏలయన, వారి ప్రయత్నము విశ్వాసముపై కాక, క్రియలపై ఆధారపడియుండెను. “అడ్డు రాయి” తగిలి వారు పడిపోయిరి.

33. “ఇదిగో! ప్రజలు కాలు జారిపడునట్లు ఒక రాతిని, తొట్రుపడునట్లు ఒక బండను నేను సియోనులో ఉంచుచున్నాను. కాని ఆయనయందు విశ్వాసము కలవాడు సిగ్గుపరుపబడడు” అని లేఖనము చెప్పుచున్నది. 

 1. సోదరులారా! ఆ ప్రజలు రక్షింపబడవలెనని హృదయపూర్వకముగ ఎంతగానో కోరుచున్నాను. వారికొరకై దేవుని ఎంతగానో ప్రార్థించుచున్నాను.

2. ఏలయన, వారు దేవునియెడల ఆసక్తిగల వారని నేను సాక్ష్యము ఇచ్చుచున్నాను. కాని, వారి ఆసక్తి జ్ఞానపూర్వకమైనది కాదు.

3. ఏలయన, దేవుని నీతిని ఎరుగక వారు తమ సొంత నీతిని నెలకొల్ప యత్నించి దేవుని నీతికి విధేయులు కాలేదు.

4. విశ్వ సించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.

5. “ధర్మశాస్త్రమూలమైన నీతిని అనుసరించువాడు దానివలననే జీవించును" అని మోషే వ్రాసియుండెను.

6. కాని విశ్వాస మూలమైన నీతి, “క్రీస్తును క్రిందికి తెచ్చుటకు పరలోకమునకు ఎవడు ఎక్కిపోవును?

7. లేక మృతులలోనుండి క్రీస్తును పైకి తెచ్చుటకు పాతాళమునకు ఎవడు దిగిపోవును? అని నీ హృదయములో ప్రశ్నించుకొనకుము” అని చెప్పుచున్నది.

8. అయితే అది ఏమని చెప్పుచున్నది? “దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవులపైననే, నీ హృదయముననే ఉన్నది.” ఇదియే మేము బోధించు విశ్వాసపు వాక్కు.

9. నీ నోటితో యేసును 'ప్రభువు' అని ఒప్పుకొని, మృతులలోనుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు.

10. ఏలయన, మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతు డగును. నోటితో ఒప్పుకొని రక్షణను పొందును.

11. “ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు” అని లేఖనము చెప్పుచున్నది.

12. ఏలయన, యూదులకును, అన్యులకును భేదము లేదు కదా! అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించువారిని అందరిని ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును.

13. ఏలయన, “ప్రభు నామమున ప్రార్థించు ప్రతివ్యక్తియు రక్షింప బడును.”

14. కాని, వారు విశ్వాసులు కానిచో, ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండనిచో, ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు?

15. బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగ, “సువార్తను ప్రకటించువారి పాదములు ఎంత సుందరమైనవి!"

16. కాని వారిలో అందరును సువార్తను అంగీకరించినవారు కారు. “ప్రభూ! మా సందేశమును విని కూడ విశ్వసించినదెవడు?” అని యెషయా ప్రశ్నించెను.

17. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును.

18. కాని, వారు సందేశమును వినలేదా? అని నేను ప్రశ్నింతును. వారు వినియేయున్నారు. “వారి కంఠధ్వనులు భువి అంతటను వ్యాపించెను. వారి పలుకులు భూదిగంతములవరకును వినబడెను” అని లేఖనము చెప్పుచున్నదిగదా!

19. అయినచో ఇట్లు అడుగుదును: పోనీ, యిస్రాయేలు ప్రజలకు తెలియలేదా? “నిజమునకు ఒక జనము కాని ప్రజలపై నీకు ఈర్ష్య కలిగింతును. ఒక అవివేకులగు జనముపై నీకు కోపము పుట్టింతును” అని మోషే స్వయముగ మొదట సమాధానము చెప్పెను.

20. యెషయా మరింత సాహసముతో . “నా కొరకు వెదకనివారికి నేను దొరికితిని, నన్ను కోరనివారికి నేను దర్శనమిచ్చితిని” అని పలుకుచున్నాడు.

21. కాని, యిస్రాయేలును గూర్చి అతడు, “అవిధేయులును, తిరుగుబాటు దారులును అగు ప్రజవైపు దినమంతయు నేను చేతులు చాచితిని” అని పలుకుచున్నాడు.

 1. అయినచో నేను ఒకటి అడిగెదను: దేవుడు తన ప్రజలను నిరాకరించెనా? ఎన్నటికిని కాదు! నేనును యిస్రాయేలీయుడనే, అబ్రహాము సంతతి వాడను, ఫెన్యామీను గోత్రీయుడను.

2. తాను ముందుగా ఎరిగిన తన ప్రజలను దేవుడు తిరస్కరింపలేదు. యిస్రాయేలుకు వ్యతిరేకముగ ఏలీయా ఎట్లు దేవుని ప్రార్థించెనో, వ్రాయబడినది. మీరు ఎరుగరా?

3. "ప్రభూ! వారు ప్రవక్తలను చంపి నీ పీఠములను కూలద్రోసిరి. మిగిలియున్నది నేను మాత్రమే, నన్నును చంప ప్రయత్నించుచున్నారు” అని పలుకుచున్నది.

4. దేవుడు అతనికి ఏమి సమాధానమిచ్చెను? “బాలు దేవరకు మోకరించని ఏడువేలమందిని నా కొరకై ఉంచుకొంటిని” అని ఉన్నది.

5. ఇప్పుడును అంతే. తన కృపయొక్క ఏర్పాటువలన ఇప్పుడు కొందరు మిగిలియున్నారు.

6. ఎన్నిక కృపవలన జరిగినచో అది క్రియలవలన జరుగలేదు. అట్లు కానిచో నిజముగా కృప కృపయే కాదు.

7. అయినచో నేమి? యిస్రాయేలు ప్రజలకు తాము వెదకునది లభించలేదు. దేవునిచే ఎన్ను కొనబడిన ఆ కొలదిమందియే దానిని కనుగొనిరి. ఇతరుల విషయమున దేవుని పిలుపు చెవిటికి శంఖము ఊదినట్లు వారి హృదయములు కఠినపరచబడినవి.

8. ఇందు విషయమై వ్రాయబడినది ఏమనగా: “దేవుడు వారిని నిద్రమత్తుతో కూడిన మనస్సు గల వారినిగా చేసెను. అందువలన ఈనాటికిని వారు తమ కన్నులతో చూడజాలరు. అలా చెవులతో వినజాలరు.

9. వారి విందులోనే వారు పట్టుబడుదురుగాక! చిక్కుకొందురుగాక! వారు తొట్రుపడి శిక్షింపబడుదురుగాక!

10. చూడ వీలులేకుండ వారి కన్నులు మూసికొనిపోవునుగాక! భారముచే వారి నడుములు సర్వదా వంగిపోవునుగాక!" అని దావీదు పలుకుచున్నాడు.

11. అయిన నేను ఒకటి అడిగెదను, యూదులు పడిపోవునంతగా తొట్రిల్లిరా? అది ఏమాత్రము కాదు. కాని యిస్రాయేలీయులకు అసూయను పుట్టించుటకై వారి అతిక్రమమువలన అన్యులకు రక్షణము లభించినది.

12. వారి అతిక్రమము లోకమునకు ఐశ్వర్య మైనచో అనగా వారి పతనము అన్యులకు ఐశ్వర్య మైనచో, వారి సమృద్ధివలన యింకెంత ఐశ్వర్యము కలుగునోగదా?

13. అన్యజనులారా! నేను ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాను. అన్యజనులకు నేను అపోస్తలుడనైనంత కాలము నా ప్రేషిత కార్యమును గూర్చి గొప్ప చెప్పుకొందును.

14. బహుశః ఇందు మూలమున నా జాతి వారికి అసూయను కలిగించి, వారిలో కొందరినెనను రక్షింపగలనేమో?

15. ఏలయన, వారు తిరస్కరింపబడినపుడు ప్రపంచము దేవునితో మైత్రిని పొందినదిగదా! అయినచో వారు స్వీకరింపబడినప్పటి సంగతి యేమి? మరణించిన వారికి అది పునర్జీవమగును.

16. పిండిలో దేవునికి సమర్పింపబడిన మొదటి పిడికెడు పవిత్రమైనదైనచో మిగిలినదంతయు పవిత్రమే. వేరు పవిత్రమైనదైనచో కొమ్మలును అట్టివే.

17. పెరటి ఓలివు చెట్టుకొమ్మలు కొన్ని విరువబడి, మరియొక అడవి ఓలివుచెట్టు కొమ్మ దానికి అంటు కట్టబడినది. అన్యులారా! మీరు అడవి ఓలివుచెట్టు వంటి వారు. కనుక ఇప్పుడు మీరు యూదుల ఐశ్వర్య జీవితమున పాలుపంచుకొనుచున్నారు.

18. కావున కొమ్మల వలె వారు విరిచివేయబడిరని మీరు గర్వింపవలదు. మీరు గర్వించినచో మీరు వేరులకు ఆధారము కాదని, వేరులే మీకు ఆధారమని జప్తియందుంచుకొనుడు.

19. “నిజమే. కాని నేను అంటుకట్టబడుటకే కొమ్మలు విరిచి వేయబడినవి కదా!” అని మీరు అందురు.

20. ఇది నిజమే. విశ్వసింపకపోవుటచే వారు విరిచివేయబడిరి. విశ్వసించుట చేతనే మీరు మీ స్థానమున నిలిచియున్నారు. దానిని గూర్చి గర్వింపకుడు, కాని, భయముతో ఉండుడు.

21. సహజ కొమ్మలైన యూదులనే దేవుడు శిక్షింపక విడిచి పెట్టలేదు. అటులైనచో మిమ్మును విడిచి పెట్టునను కొందురా?

22. దేవుడు ఎంతటి దయను చూపునో, ఎంతటి కాఠిన్యమును ప్రదర్శించునో గమనింపుడు. భ్రష్టులైన వారి విషయమున ఆయన కఠినముగా ఉన్నాడు. కాని మీరు ఆయన దయయందే నిలిచి యున్నచో, ఆయన మీపై దయచూపును. కాకున్నచో మీరును నరికివేయబడుదురు.

23. యూదులు కూడ తమ అవిశ్వాసమును విడిచివేసినచో అంటుకట్టబడుదురు. ఏలయన, వారిని తిరిగి అంటుకట్టుటకు దేవునికి శక్తి కలదు.

24. అన్యులారా! మీరు విరిచి వెయబడి ప్రకృతికి విరుద్ధముగ పెరటి ఓలివు చెట్టుకు అంటుకట్టబడిన అడవి ఓలివుచెట్టు కొమ్మవంటి వారు. యూదులు ఈ పెరటిచెట్లు వంటివారు. కనుక నరకబడిన పెరటిచెట్టు కొమ్మలను అదే చెట్టునకు అతుకుట దేవునికి మరింత సులభము!

25. సోదరులారా! ఒక పరమరహస్యము  ఉన్నది. అది మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. అది మిమ్ము గర్వింపకుండునట్లు చేయును. యిస్రాయేలు ప్రజల మొండితనము శాశ్వతమైనది కాదు. చేరవలసిన అన్యులు అందరును దేవుని చేరువరకే అది నిలుచును.

26. ఇట్లు యిస్రాయేలు అంతయు రక్షింపబడును. వ్రాయబడియున్నట్లుగ: సియోనునుండి విమోచకుడు వచ్చును యాకోబు దుష్టత్వమునంతయు అతడు తొలగించును.

27. వారి పాపములను తొలగించిన వెనుక, వారితో ఈ నా నిబంధన చేసికొందును.”

28. అన్యజనులారా! యూదులు సువార్త విషయమై మీ కొరకు దేవుని శత్రువులు. కాని, దేవునిచే ఎన్నుకొనబడుటచే పితరులను బట్టి వారు ఆయన ప్రియులు.

29. దేవుని కృపావరములు, ఎన్నిక మార్చబడనివి.

30. అన్యులారా! గతమున మీరు దేవునకు విధేయులు కాకున్నను, యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి.

31. అటులనే మీరు పొందిన కనికరమునుబట్టి, తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునకు అవిధేయులైరి.

32. ఏలయన, తాను వారి అందరిపై కృపనుచూపుటకై దేవుడు మానవులందరిని అవిధే యతయందు బందీలను కావించెను.

33. దేవుని ఐశ్వర్యము ఎంత మనమైనది! ఆయన వివేకము, విజ్ఞానము ఎంత గాఢమైనవి! ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును?

34. వ్రాయబడియున్నట్లుగ: “ప్రభువు మనసు ఎవరికి ఎరుక! ఆయనకు సలహాదారు ఎవరు?

35. తిరిగి అయనచే ఇచ్చివేయబడుటకు గాను, ఆయనకు ఎన్నడైన ఏదైన ఇచ్చినదెవరు?”

36. ఏలయన, ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయనకొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమెన్.

 1. కాబట్టి సోదరులారా! పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవయాగముగ మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమునుబట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను.

2. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని, మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అపుడే మీరు దేవుని సంకల్పమును, అనగా ఉత్తమమైనదియు, ఆయనకు సమ్మతమైనదియు, సంపూర్ణమైనదియు అగు దానిని తెలిసికొనగలరు.

3. ఏలయన, నాకు ఒసగబడిన దేవుని దయచేత మీ అందరికి నేను ఇట్లు చెప్పుచున్నాను. ఔచిత్యమును అతిక్రమించి, మిమ్ము మీరు గొప్పగ భావించుకొనకుడు. దానికి బదులుగా, మీ ఆలోచనలలో అణకువ చూపుడు. మీలో ప్రతివ్యక్తియు దేవుడు తనకొసగిన విశ్వాసమును బట్టి తన్ను ఎంచుకొనవలయును.

4. ఒక్క శరీరమున అనేక అవయవములున్నవి. ఆ అవయవములన్నిటికి ప్రత్యేకింపబడిన విధులున్నవి.

5. అటులనే మనము చాలమందిమైనను క్రీస్తుతో ఏకమగుటవలన మనము అందరమును ఒకే శరీరము. ఒక శరీరముయొక్క వేరువేరు అంగముల వలెనే మనము అందరమును పరస్పర సంబంధ మును కలిగియున్నాము.

6. దేవుడు మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగియున్నాము. కనుక వానిని వినియోగించుదము. మనకు ఒసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుటయైనచో, మనకు గల విశ్వాసపరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను.

7. సేవచేయుటయైనచో తప్పక సేవ చేయవలెను, బోధించుటయైనచో తప్పక బోధింపవలెను.

8. ఇతరులను ప్రోత్సహించుటయైనచో తప్పక అటులే చేయవలెను, తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకొనువాడు ఉదారబుద్ధితో ప్రవర్తింపవలెను, అధికారము కలవాడు కష్టపడి పని చేయవలెను, ఇతరులపై కనికరము చూపువాడు, సంతోషముగ అటుల చేయవలెను.

9. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడును ద్వేషించి, మంచిని అంటి పెట్టుకొని ఉండుడు.

10. ఒకరిని ఒకరు సోదరభావముతో ప్రేమించుకొనుడు. ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు.

11. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తిపూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు.

12. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్ధింపుడు.

13. అవసరము లోనున్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కారములను ఆచరింపుడు.

14. మిమ్ము హింసించువారిని దీవింపుడు. వారిని శపింపకుండ దీవింపుడు.

15. ఆనందించు వారితో ఆనందింపుడు. దుఃఖించువారితో దుఃఖింపుడు.

16. అందరియెడల సమతాభావము కలిగియుండుడు.హెచ్చెనవానియందు మనస్సు ఉంచక, తక్కువైన వానిని కోరుడు. మీకు మీరే బుద్ధిమంతులమని అను కొనకుడు.

17. ఒకడు మీకు అపకారము చేసినచో తిరిగి వానికి అపకారము చేయకుడు. అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరింపుడు.

18. అందరి తోడను సౌమ్యముగా జీవించునట్లు మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు.

19. ప్రియులారా! ఎన్నటికిని మీరు పగతీర్చుకొనక, దేవుని ఆగ్రహమునకే దానిని వదలివేయుడు. ఏలయన, వ్రాయబడియున్నట్లుగ: “పగదీర్చుట నా పని. నేనే ప్రతిఫలము ఇచ్చెడివాడను అని ప్రభువు పలుకుచున్నాడు.”

20. అంతేకాక వ్రాయబడియున్నట్లుగ: “నీ శత్రువు ఆకలిగొని యున్నచో వాని ఆకలి తీర్పుము. దాహముగొని యున్నచో దాహము తీర్పుము. ఏలయన, ఇట్లు చేయుటవలన నీవు వానినెత్తిన మండుచున్న నిప్పు కణికలను కుప్పగా పోయుదువు.

21. కీడువలన జయింపబడక, మేలుచేత కీడును జయింపుము. 

 1. ప్రతివ్యక్తియు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయన, దేవుని అనుమతిలేనిదే ఏ అధికారము ఉండదు. ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవులయందు ఉంచబడిరి.

2. కనుక అధికారులను ఎదిరించువాడు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించినట్లే. అటుల చేయువారు తీర్పును తమపై కొనితెచ్చుకొందురు.

3. ఏలయన, పాలకులు చెడుకార్యములు చేయువారికే కాని, మంచికార్యములు చేయువారికి భయంకరులు కారు. కనుక అధికారికి భయపడకుండ ఉండవలెనని నీవుకోరుదువా? అయినచో సత్కార్యము లనే చేయుము. అప్పుడు అతడు నిన్ను పొగడును.

4. ఏలయన, అతడు నీమేలు కొరకై పనిచేయు దేవుని సేవకుడే. కాని నీవు చెడును చేసినచో, అతనిని గూర్చి భయపడవలెను. ఏలయన, అతడు ఖడ్గమును వృధాగ ధరింపడు. అతడు దేవుని సేవకునిగా చెడుకార్యములు చేయువానిపై దేవుని ఆగ్రహమును కనబరచును.

5. కావున దేవుని ఆగ్రహమును బట్టియేకాక, మనస్సాక్షిని బట్టియు మీరు అధికారులకు విధేయులు కావలెను.

6. ఏలయన, తమ కర్తవ్య నిర్వహణలో అధికారులు దేవుని పరిచారకులుగా పనిచేయుచున్నారు. ఇందుకే కదా మీరు పన్నులు చెల్లించుచున్నది.

7. కనుక ఎవరికి చెల్లింపవలసినది వారికి చెల్లింపుడు. కప్పములను కట్టవలసిన వారికి కప్పములను, పన్నులు కట్టవలసిన వారికి పన్నులను కట్టివేయుడు. ఎవరికి భయపడవలెనో వారికి భయపడుడు. ఎవరిని గౌర వింపవలెనో వారిని గౌరవింపుడు.

8. ఎవరికిని ఏమియును బాకీపడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు. అది ఒకరినొకరిని అన్యోన్యము ప్రేమించుకొనుటయే. తోటివానిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు.

9. ఏలయన, “వ్యభిచరింపకుము. హత్యచేయకుము, దొంగిలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము" అను ఈ ఆజ్ఞలు అన్నియును, ఇతర ఆజ్ఞలేవియైనను, “నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము” అను ఒకే ఆజ్ఞయందు ఇమిడియున్నవి.

10. తోటివానిని ప్రేమించువాడు, వానికి ఏ కీడును చేయడు. కనుక ప్రేమ కలిగియుండుట ధర్మ శాస్త్రమును నెరవేర్చుటయే.

11. ఇప్పుడు ఎంత వేళయైనదో మీకు తెలి యును గదా! కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్రనుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరయైనది.

12. రాత్రి ముగియవచ్చినది. పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటివేళ పోరాట మొనర్చుటకు ఆయుధ ములు ధరించుదము.

13. వెలుతురులో జీవించు ప్రజలుగ, సత్ప్రవర్తన కలిగియుందము. వినోదముతో కూడిన విందులుకాని, త్రాగుబోతుతనముకాని, భోగలాలసత్వముకాని, అసభ్యవర్తనకాని, పోట్లాటకాని, అసూయకాని ఉండరాదు.

14. కాని, ప్రభువైన యేసు క్రీస్తును ధరించి, మీ శరీరేచ్చలను తృప్తి పరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. 

 1. విశ్వాసమున బలహీనుడైన వ్యక్తిని మీలో చేర్చుకొనుడు. కాని, వ్యక్తిగతములగు అభిప్రాయములపై వానితో వాదింపకుడు.

2. ఒకడు ఏదియైనను తినవచ్చునని నమ్ముచున్నాడు. కాని, విశ్వాసమున బలహీనుడైన మరొకడు శాకాహారమునే భుజించుచున్నాడు.

3. అన్నిటిని తినువ్యక్తి తిననివ్యక్తిని నీచముగ భావింపరాదు. అట్లే అన్నిటిని తిననివ్యక్తి తినువానిని దోషిగా ఎంచరాదు. ఏలయన, దేవుడు అతనిని అంగీకరించియున్నాడు.

4. మరియొకని సేవకునిపై తీర్పు చెప్పుటకు నీవు ఎవ్వడవు? వాడు నిలిచినను, పడినను వాని సొంత యజమానుని ఎదుటనేగదా! అయినను వాడు దృఢపడును. ప్రభువు వానిని దృఢపరచుటకు శక్తిగలవాడు.

5. ఒకడు ఒకదినముకంటె మరియొక దినము మంచిదని తలంచుచున్నాడు. మరియొకడు అన్ని రోజులను సమానముగ ఎంచుచున్నాడు. దానిని ప్రతి వ్యక్తియు తన మనసులో తానే రూఢిపరచు కొనవలెను.

6. ఒకానొకదినము చాల గొప్పదని తలచువాడు ప్రభువునందలి గౌరవముచేతనే అటుల చేయుచున్నాడు. అన్నిటిని తినువాడు ప్రభువునందలి గౌరవము చేతనే ఆ విధముగ చేయుచున్నాడు. ఏలయన, తన ఆహారమునకై అతడు ప్రభువునకు కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాడు. కొన్నిటిని తిననివాడు ప్రభువు  నందలి గౌరవముచేతనే ఆ విధముగ చేయుచున్నాడు.  అతడును దేవునకు కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాడు.

7. ఏలయన, మనలో ఎవ్వడును తన కొరకే జీవింపడు. ఎవ్వడును తనకొరకే మరణింపడు.

8. మనము జీవించినను ప్రభువుకొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను, మరణించినను మనము ప్రభువునకు చెందినవారమే.

9. ఏలయన, జీవించియున్నవారిని, మరణించినవారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడయ్యెను.

10. కనుక మీరు మీ సోదరునిపై ఏల తీర్పు చెప్పుదురు? లేదా, మీరు మీ సోదరుని ఏల తృణీకరింతురు? మనము అందరమును తీర్పుకొరకై దేవుని న్యాయ పీఠము ఎదుట నిలువబడుదుము.

11. ఏలయన, “నా జీవముతోడు, ప్రతి మోకాలు నాయెదుట తప్పక మోకరించును. అందరును దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు” అని వ్రాయబడియున్నది కదా!

12. కనుక మనలో ప్రతివ్యక్తియు దేవుని ఎదుట తననుగూర్చి లెక్క చెప్పు కొనవలసియుండును.

13. కనుక ఒకరిపై ఒకరము తీర్పు చేయుట మానివేయుదము. అంతేకాక సోదరునికి ఆటంకము కలుగజేయునదిగాని, అతడిని పాపాత్ముని చేయునది కాని, దేనినైనను చేయరాదని మీరు నిర్ణయించు కొనవలెను.

14. ఏదియును దాని అంతట అది అపరి శుద్ధముకాదు అని యేసుక్రీస్తునందు నాకు నిశ్చయ ముగ తెలియును. కాని ఏదైన అపరిశుద్ధమని ఒకడు తలంచినచో అది అతనికి అపరిశుద్ధమే అగును.

15. నీవు తినినదానివలన, నీ సోదరుని బాధించినచో నీవు ఎంత మాత్రమును ప్రేమపూర్వకముగ ప్రవర్తించుట లేదు. నీవు తిను ఆహారముచే, క్రీస్తు ఎవనికొరకు మరణించెనో, వానిని నాశనము చేయకుము!

16. నీవు మేలని భావించునది దూషణల పాలు కాకుండ చూడుము.

17. ఏలయన, దేవుని రాజ్యము అనగా తినుట, త్రాగుట కాదు, పవిత్రాత్మయొసగు నీతి, శాంతి, సంతోషములే.

18. ఈ విధముగా క్రీస్తును సేవించువాడు దేవుని అంగీకారమును, మానవుని ఆమోదమును పొందును.

19. కనుక, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు విషయములనే ఆసక్తితో అనుస రించుదము.

20. భోజనమును బట్టి దేవుని పనిని పాడుచేయకుము. అన్ని ఆహారములు తినదగినవియే. కాని ఇతరుల పతనమునకు కారణమగునట్లు ఏమైనను భుజించుట దోషము.

21. మాంసము తినకుండుట, మద్యపానము చేయకుండుట, సోదరుని పతనము చేయు ఏ పనిని చేయకుండుట మంచిది.

22. కావున, ఈ విషయమును గూర్చిన నీ విశ్వాసము నీకును దేవునకును మధ్యనే ఉంచుము. తాను ఆమోదించు క్రియలను చేసినపుడు శిక్షావిధిని పొందని వాడు ధన్యుడు.

23. కాని, తాను భుజించుదానిని గూర్చి ఎవడైన అనుమానము కలిగియు, దానిని భుజించినయెడల వాడు దోషియగును, ఏలయన, వాడు చేయుపని విశ్వాసముపై ఆధారపడినది కాదు. అంతే కాదు, విశ్వాసముపై అధారపడనిది ఏదియైన పాపమే. 

 1. బలవంతులమైన మనము మనలను మనము సంతోష పెట్టుకొనక బలహీనుల లోపములను సహింపవలెను.

2. అంతేకాక, మనలో ప్రతి వ్యక్తియు, తన సోదరుని మేలుకొరకు వాని క్షేమాభి వృద్ధి కొరకు వానిని సంతోషపెట్టవలెను.

3. ఏలయన, క్రీస్తు తనను తాను సంతోషపెట్టుకొనలేదు. “నిన్ను నిందించువారి నిందలు నా పైననే పడినవి” అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

4. ఏలయన, వ్రాయబడినవి అన్నియు మనకు బోధించుట కొరకే వ్రాయబడినవి. లేఖనములు మనకు ఒసగు సహనము ప్రోత్సాహముల ద్వారా మనకు నిరీక్షణ కలుగుట కొరకే అవి వ్రాయబడినవి.

5. సహనమునకును, ప్రోత్సాహమునకును కర్తయగు దేవుడు, క్రీస్తుయేసును అనుసరించుట ద్వారా మీకు పరస్పరము సామరస్యమును కలిగించునుగాక!

6. అప్పుడు మీరు అందరును కలిసి ఏకకంఠముతో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడును, తండ్రియును అయిన ఆయనను స్తుతింతురు.

7. కనుక, క్రీస్తు మిమ్ము స్వీకరించినట్లే, దేవుని మహిమకై మీరు ఒకరిని ఒకరు స్వీకరింపుడు.

8. ఏలయన, నేను ఒక్క విషయమును చెప్పుచున్నాను. వినుడు! పితరులకు ఒసగిన వాగ్దానములను నెరవేర్చు టలో దేవుడు సత్యవంతుడని చూపుటకును,

9. ఆయన కనికరమునకై అన్యజనులు దేవుని స్తుతించునట్లు చేయుటకును, క్రీస్తు సున్నతి పొందినవారికి పరిచారకుడు అయ్యేను. “కనుక, అన్యులలో నేను నిన్ను స్తుతింతును.  నీ నామ సంకీర్తనము చేయుదును” . అని వ్రాయబడియున్నట్లుగ:

10. మరల, “అన్యజనులారా! ఆయన ప్రజలతో ఆనందింపుడు!” అనియు అది పలుకుచున్నది.

11. తిరిగి, “అన్యజనులారా! మీరందరును ప్రభువును స్తుతింపుడు! ప్రజలందరును ఆయనను స్తుతింపుడు!” అనియు అదియే చెప్పుచున్నది.

12. అటులనే యెషయా, “యీషాయి నుండి ఒకడు వచ్చును. అన్యులను పరిపాలించుటకు ఆయన ఉద్భవించును. వారు ఆయనయందు నమ్మకము కలిగియుందురు” అని పలికెను.

13. నిరీక్షణకు మూలమగు దేవుడు, ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణమగు ఆనందమును, సమాధానమును కలిగించునుగాక! పవిత్రాత్మ ప్రభావమున మీ నిరీక్షణ సంపూర్ణమగును.

14. నా సోదరులారా! మీ వరకు మీరు మంచితనముతోను, సమస్తజ్ఞానముతోను నిండినవారై ఒకరికి ఒకరు ఉపదేశించుకొనగలరని నేను నమ్ముచున్నాను.

15. కాని ఎంతయో ధైర్యముతో మీకు కొన్ని విషయ ములను గుర్తుచేయుటకు వ్రాసితిని. దేవుని అను గ్రహము వలననే నేను అంతధైర్యమును చూపితిని.

16. క్రీస్తు యేసు సేవకుడనై అన్యులకొరకు పని చేయుటకే నేను అనుగ్రహమును పొందితిని. అన్యులు పవిత్రాత్మ ద్వారా దేవునకు అంకితము కావింపబడి, ఆయనకు అంగీకారయోగ్యమైన నైవేద్యము అగుటకై, దేవుని సువార్తను బోధించుటలో నేను ఒక అర్చకునిగ పనిచేయుచున్నాను.

17. కావున క్రీస్తు యేసునందు దేవునికొరకై నేను చేసినవానినిగూర్చి గర్వింప వచ్చును.

18. క్రీస్తు నా ద్వారా, నా మాటల వలనను,  చేతల వలనను,

19. సూచకక్రియల చేతను, అద్బుతముల చేతను, ఆత్మయొక్క శక్తి మూలమునను, అన్య జనులను దేవునకు విధేయులను చేయుటకై చేసిన దానిని గూర్చి మాత్రమే ధైర్యము వహించి పలికెదను. కనుక, యెరూషలేమునుండి ఇల్లూరికు వరకు పయనించుట వలన క్రీస్తునుగూర్చిన సువార్తను సంపూర్ణ ముగ ప్రకటించితిని.

20. ఎవరో వేసిన పునాదిపై నిర్మింపకుండుటకై, క్రీస్తును గూర్చి వినని ప్రదేశములోనే సువార్తను ప్రకటింపవలెననునది సర్వదా నా గాఢవాంఛయైయున్నది.

21. “ఆయననుగూర్చి తెలియజేయబడనివారు చూతురు. విననివారు అర్థము చేసికొందురు” అని లేఖనమునందు వ్రాయబడియున్నది గదా!

22. ఈ కారణముననే, మీ వద్దకు రాకుండ అనేక మార్లు నాకు ఆటంకములు కలిగినవి.

23.కాని, ఈ ప్రాంతములలో నా పని ఇప్పటికి పూర్తియైనది. అంతేకాక మిమ్ము చూడ రావలయునని చాల కాలము నుండి ఆశించుచున్నాను.

24. ఇప్పుడు స్పెయిను దేశమునకు పోవుచు త్రోవలో మిమ్ము చూచి, కొంత కాలము మీతో ఆనందముగ గడిపి, నా ప్రయాణ మునకు మీ తోడ్పాటును పొందగలననుకొనుచున్నాను.

25. కాని ప్రస్తుతము యెరూషలేములోని దైవప్రజల సేవకై నేను అచ్చటికి పోవుచున్నాను.

26. ఏలయన, మాసిడోనియా, గ్రీసులోని దైవసంఘములు యెరూషలేము నందలి దైవప్రజలలోని పేదలకు సాయపడవలెనని నిర్ణయించినవి.

27. వారి యంతట వారే అటుల చేయుటకు నిర్ణయించుకొనిరి. కాని నిజముగా, ఆ పేదలకు సాయపడవలసిన బాధ్యత వారికి ఉన్నది. ఏలయన, యూదులు తమ ఆధ్యాత్మిక ఆశీర్వాదములను అన్యులతో పంచుకొనిరి. కనుకనే తమ ఐహికమైన ఆశీర్వాదములతో అన్యులు యూదులకు సాయపడవలెను.

28. కావున ఈ పనిని ముగించి, వారి కొరకై ప్రోగుచేయబడిన ఈ ధనము వారికి అప్పగించిన తరువాత, నేను స్పెయినుకు వెళ్ళుచు, త్రోవలో మిమ్ము చూచెదను.

29. నేను మీయొద్దకు వచ్చునపుడు, క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదముతో చేరుదునని నాకు తెలియును.

30. సోదరులారా! నాకొరకై దేవుని ఆసక్తితో ప్రార్థించి నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువగు యేసు క్రీస్తునుబట్టియు, ఆత్మ యొక్క ప్రేమను బట్టియు మిమ్ము అర్థించుచున్నాను.

31. యూదయాలోని అవిశ్వాసులనుండి నేను రక్షింపబడునటులును, యెరూషలేములో నా సేవలు అచటి దైవప్రజలకు అంగీకార యోగ్యమగునట్లును ప్రార్థింపుడు.

32. కనుక, అది దేవుని చిత్తమైన, నేను సంతోషముతో మిమ్ముచేరి, మీతో ఆనందింపగలను.

33. సమాధానకర్తయగు దేవుడు మీ అందరితో ఉండును గాక! ఆమెన్. 

 1. కెంకేయలోని క్రైస్తవ సంఘపు పరిచారకురాలు ఫేబీ అను మన సోదరిని మీకు సిఫారసు చేయుచున్నాను.

2. దైవ ప్రజలకు తగినట్లుగ ప్రభువు నామ మున ఆమెను స్వీకరింపుడు. ఆమెకు అవసరమైన సాయమును చేయుడు. ఏలయన, ఆమె అనేక మంది కిని, నాకును సహాయకురాలు.

3. క్రీస్తు యేసు సేవలో నా తోటిపనివారగు ప్రిస్కాకును, అక్విలాకును నా శుభాకాంక్షలు.

4. ఏలయన, నా కొరకై వారు ప్రాణములకు తెగించిరి. నేను వారికి కృతజ్ఞుడను. నేను మాత్రమే కాదు. అన్యుల సంఘములన్నియు వారికి కృతజ్ఞతను తెలుపుచున్నవి.

5. వారి యింట సమావేశమైయున్న క్రీస్తు సంఘమునకు శుభాకాంక్షలు. క్రీస్తును విశ్వసించుటలో ఆసియా మండలములో ప్రథముడును, నా ప్రియమిత్రుడును అగు ఎపైనెతుకు శుభాకాంక్షలు.

6. మీ కొరకై ఎంతయో శ్రమపడిన మరియకు శుభాకాంక్షలు.

7. నాతో పాటు చెరయందున్న నా బంధువులగు అంద్రోనికకును, యూనీయకును శుభాకాంక్షలు. వారు అపోస్తలులలో ప్రసిద్ధి చెందినవారు. పైగా నాకంటె ముందు క్రీస్తును విశ్వ సించినవారు.

8. క్రీస్తునందు నా ప్రియుడగు అంప్లీయతునకు నా శుభాకాంక్షలు.

9. అటులనే క్రీస్తు సేవలో నాతోటి పనివాడైన ఉర్భానునకును, మన ప్రియుడగు స్తాకునకును శుభాకాంక్షలు.

10. క్రీస్తునందు ఆమోదింపబడిన అపెల్లెకు శుభాకాంక్షలు. అరిస్టోబూలు కుటుంబమునకు శుభాకాంక్షలు.

11. నా బంధువగు హెరోది యోనునకును, నార్కిస్సు కుటుంబమునందలి క్రైస్తవ సోదరులకును శుభాకాంక్షలు.

12. ప్రభువు సేవలో కృషిచేయుచున్న త్రుఫైనా కును, త్రుఫోసాకును, ప్రభువుకొరకై ఎంతయో శ్రమపడిన ప్రియమైన పెర్సిసునకును శుభాకాంక్షలు.

13. ప్రభు సేవలో ఉత్తమకృషి చేసిన రూఫసునకును, నన్ను కుమారునిగా చూచుకొనిన అతని తల్లికిని శుభాకాంక్షలు.

14. అసుంక్రితు, ఫైగోను, హెర్మే, పత్రోబ, హేర్మాలకును, క్రైస్తవ సోదరులకు అందరికిని శుభాకాంక్షలు.

15. పిలోలోగు, జూలియాలకును, నెరెయకును, అతని సోదరికిని, ఒలింపాకును, వారితోటి క్రైస్తవులందరికిని శుభాకాంక్షలు.

16. పవిత్రమగు ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు పలుకుడు. క్రీస్తు సంఘములన్నియు మీకు శుభాకాంక్షలు పంపుచున్నవి.

17. సోదరులారా! మిమ్ము ఇట్లు అధించుచున్నాను. చీలికలు పుట్టించువారిని గూర్చియు, ప్రజల విశ్వాసమును తలక్రిందులు చేయువారిని గూర్చియు జాగ్రత్తగా ఉండుడు. అట్టి వారు మీరు పొందిన ఉపదేశమునకు విరుద్ధముగ నుందురు. వారికి దూరముగ ఉండుడు.

18. ఏలయన, అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభువగు క్రీస్తుకు సేవచేయు వారు కాదు. మంచి మాటలద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు.

19. మీ విధేయతనుగూర్చి అందరు వినియేయున్నారు. కనుకనే నేను మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మంచి విషయమున వివేకవంతులై, చెడు విషయమున నిష్కపటులై ఉండవలెనని నా కోరిక.

20. మన సమాధానమునకు మూలమగు దేవుడు, త్వరలో సైతానును మీ పాదముల క్రింద చితుక తొక్కును. మన ప్రభువగు యేసు క్రీస్తు అనుగ్రహము మీకు తోడగునుగాక!

21. నా తోటి సహచరుడు తిమోతి మీకు శుభాకాంక్షలను అందజేయుచున్నాడు. అటులనే సహచరులగు యూదులు లూసియ, యాసోను, సోసిపత్రులు కూడ శుభాకాంక్షలు పంపుచున్నారు.

22. ఈ లేఖను వ్రాసిన తెర్తియ అను నేనును మీకు ప్రభువు నందు శుభాకాంక్షలను అందించుచున్నాను.

23. నాకును, తన గృహమున చేరు సంఘమునకు కూడ ఆతిథ్యమిచ్చు గాయియు మీకు శుభాకాంక్షలను అందించుచున్నాడు. నగర కోశాధికారి అగు ఎరాస్తు, మన సోదరుడు క్వార్లు మీకు శుభమనుచున్నారు.

24. (మన ప్రభువగు యేసు క్రీస్తు అను గ్రహము మీ అందరితో ఉండును గాక! ఆమెన్.)

25. దేవునకు మహిమ కలుగునుగాక! ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగ నిలుచునట్లు చేయ గలడు. నా సువార్తను అనుసరించియు, యేసు క్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించియు గతమున యుగ యుగములు గుప్తముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరుపబడిన పరమరహస్యమును అనుసరించియు ఆయన అటుల చేసెను.

26. కాని ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరును విశ్వసించి విధేయులగుటకు గాను నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకును తెలియజేయబడినది.

27. అ ద్వితీయుడును, సర్వజ్ఞుడును అగు దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగును గాక! ఆమెన్.