ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొరింతీయులకు వ్రాసిన 1వ లేఖ | Roman catholic bible Telugu | Telugu catholic Bible

 1. దేవుని సంకల్పము వలన క్రీస్తుయేసు అపోస్తలునిగ పిలువబడిన పౌలును, మరియు మన సోదరుడు సొస్తెనేసును

2. కొరింతులోని దైవసంఘమునకు వ్రాయునది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరుపబడి, ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించువారితో సహా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడినవారు. ఆయన వారికిని మనకును ప్రభువు.

3. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువు యేసుక్రీస్తునుండియు మీకు అనుగ్రహమును, శాంతియు లభించునుగాక!

4. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన కృపానుగ్రహమును ఒసగెను. కనుక, మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును.

5. ఏలయన, క్రీస్తుతో ఐక్యమువలన, మీరు సర్వ విధముల  వాక్కునందును, జ్ఞానమునందును, ఐశ్వర్యవంతులైతిరి.

6. క్రీస్తునుగూర్చిన సందేశము మీయందు ఎంతయో దృఢపడినది.

7. కనుకనే, మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు, ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు.

8. మన ప్రభువగు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగ ఉండునట్లు, ఆయన మిమ్ము తుదివరకు సుస్థిరముగ ఉంచును.

9. తన కుమారుడును, మన ప్రభువును అగు యేసుక్రీస్తుతో సహవాస మునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు.

10. సోదరులారా! వర్గములు లేకుండ, సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను.

11. ఏలయన, సోదరులారా! మీలో మీకు కలహములు ఉన్నవని క్లోవు కుటుంబసభ్యులు నాకు తెలిపిరి.

12. నేను చెప్పునది ఏమన, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగ పలుకుచున్నారు. ఒకడు "నేను పౌలు అనుచరుడను” అనియు వేరొకడు “నేను అపొల్లో అనుచరుడను” అనియు, మరియొకడు “నేను పేతురు అనుచరుడను" అనియు, ఇంకొకడు “నేను క్రీస్తు అనుచరుడను” అనియు పలుకుచున్నారు.

13. క్రీస్తు విభజింప బడినాడా? పౌలు మీ కొరకు సిలువవేయబడెనా? మీరు పౌలు నామమున జ్ఞానస్నానమును పొందితిరా?

14. క్రిస్పునకును, గాయునకును తప్ప మీలో ఎవరికిని నేను జ్ఞానస్నానమును ఈయనందులకు దేవునకు కృతజ్ఞుడనై ఉన్నాను.

15. అపుడు, నా నామమున మీరు జ్ఞానస్నానమును పొందితిరని ఎవరును పలుకజాలరు.

16. స్తేఫాను కుటుంబమునకుగూడ నేను జానస్నానమొసగితిని. కాని అంతకుమించి ఇంక ఎవరికిని నేను జ్ఞానస్నానమొసగినట్లు నాకు గుర్తులేదు.

17. క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను కాని జ్ఞానస్నానమును ఒసగుటకు కాదు. క్రీస్తు సిలువ మరణము శక్తివిహీనము కాకుండునట్లు వాక్చాతుర్యములేకుండ ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను.

18. ఏలయన, బ్రష్టులైపోవుచున్న వారికి క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము అర్థరహితమైనది. కాని, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి.

19. ఏలయన, ఆ "జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును. వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును” అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది.

20. కనుక, జ్ఞాని గతి ఏమి? పండితుని గతి ఏమి? నేర్పరులగు లౌకికవాదుల గతి ఏమి? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా?

21. దేవుడు. తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానముచేత ఆయనను ఎరుగకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెట్టితనముచేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యెను.

22. యూదులు అద్భుతములను కోరుచున్నారు. గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు.

23. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమును అగు, సిలువవేయబడిన క్రీస్తును, మనము ప్రకటించుచున్నాము.

24. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును, అన్యులకును క్రీస్తే దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు.

25. ఏలయన, దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకముకంటెను గొప్పది. దేవుని బలహీనత అని తోచునది మానవుల శక్తి కంటెను దృఢమైనది.

26. సోదరులారా! దేవుడు మిమ్ము పిలిచిననాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసికొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులును, శక్తి మంతులును, సాంఘికముగ ఉన్నత జీవనము కలవారును కొలదిమంది మాత్రమే.

27. వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయు టకు, లోకముచే అవివేకులుగా భావింపబడువారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసికొనెను.

28. లోకముచే ముఖ్యమైనదిగ భావింపబడుదానిని నాశనము చేయుటకు, లోకము అల్పముగ, నీచముగ, విలువలేనిదిగ ఎంచుదానిని ఆయన ఎన్నుకొనెను.

29. అనగా దేవునిసన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పు కొనలేడు.

30. కాని, దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకము చేసెను. అంతే కాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి.

31. కనుక లేఖనములో వ్రాయబడినట్లుగ, “గొప్పలు చెప్పదలచినవాడు ప్రభువు చేసినదానిని గూర్చి గొప్పలు చెప్పవలయును." 

 1. సోదరులారా! దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినపుడు గొప్ప పదజాలమును గాని, మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు.

2. నేను మీతో ఉన్నప్పుడు, యేసు క్రీస్తును గూర్చియు, అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప, మరేమియు తెలిసికొనకూడదని నేను నిశ్చయించుకొంటిని.

3. కనుక, నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతోను, భయముతోను మరియు ఎంతో వణకుతో ఉంటిని.

4. నా ఉపన్యాసమును మరియు నా సువార్త ప్రకటన, జ్ఞానయుక్తమైన తీయనిపలుకులతోగాక దేవుని ఆత్మశక్తిని నిరూపించునవై ఉండెను.

5. కనుక మీ విశ్వాసము మానవవివేకము పైకాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది.

6. కాని పరిపక్వమునొందిన వారితో నేను జ్ఞాన ముతో మాటలాడుచున్నాను. కాని ఆ జ్ఞానము లౌకికమైనది కాదు, నశించెడి లౌకికపాలకుల జ్ఞానము కూడ కాదు.

7. నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞాన మును బోధించుచున్నాను. అది మరుగైయుండెను. లోకసృష్టికి పూర్వమే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

8. ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికిని ఈ జ్ఞానమునుగూర్చి తెలియదు. వారికి తెలిసియేయు న్నచో, మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసెడి వారు కారు.

9. కాని లేఖనములో వ్రాయబడినట్లుగ, “ఎవడును, ఎన్నడును కననిదియు, విననిదియు, ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడును భావింపనిదియు అగుదానినే తనను ప్రేమించువారికై దేవుడు సిద్ధమొనర్చెను.”

10. కాని, తన ఆత్మద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెదకును. దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను గూడ వెదకును.

11. ఒకని యందలి మానవ ఆత్మయే తప్ప మరియెవ్వరు అతని ఆలోచనలను తెలిసికొన గలరు? అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలను మరి ఎవ్వరు ఎరుగలేరు.

12. మనము స్వీకరించినది ఈ లౌకికమగు ఆత్మ కాదు. దేవుడు మనకు ఒసగిన సమస్తమును తెలిసికొనగలుగుటకై దేవునిచే పంప బడిన ఆత్మనే మనము స్వీకరించియున్నాము. .

13. కనుక, ఆత్మతో కూడిన వారికి ఆధ్యాత్మిక సత్యములను బోధించునపుడు, మనము మానవ వివేకము బోధించు పదజాలమునుకాక, ఆత్మ బోధించు పలుకులనే పలుకుదుము.

14. కాని, లౌకిక వ్యక్తి దేవుని ఆత్మచే ఒసగబడు వరములను గ్రహింపలేడు. వానికి అవి తెలివిమాలినవిగా గోచరించును. నిజముగా అతడు వానిని అవగాహనచేసికొనలేడు. ఏలయన, వాని విలువ ఆత్మానుభవము చేతనే వివేచింప వీలగును.

15. ఆధ్యాత్మికవ్యక్తి అన్నిటి విలువలను నిర్ణయింపగలడు. కాని ఎవరును వాని పై తీర్పు చెప్పలేరు.

16. లేఖనములో వ్రాయబడినట్లుగ, “ప్రభువు మనస్సు ఎవరికి ఎరుక? ఆయనకు ఎవరు బోధింపగలరు?” కాని, మనకు మాత్రము క్రీస్తు మనస్తత్వము ఉన్నది. 

 1. సోదరులారా! నిజమునకు ఆధ్యాత్మిక వ్యకులతో మాట్లాడిన విధమున మీతో మాట్లాడలేకపోయితిని. లౌకికులనియు, క్రైస్తవ విశ్వాసములో పసిబిడ్డలనియుయెంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది.

2. అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మిమ్ము భోజనముతోగాక పాలతోనే పోషింపవలసి వచ్చినది. అంతేకాదు, ఇప్పటికిని మీరు భుజింపగల స్థితిలో లేరు.

3. ఏలయన, ఇప్పటికిని మీరు శరీర సంబంధులై జీవించుచున్నారు గదా! అసూయాపరులై, ఒకరితో ఒకరు కలహించుచుండుటచే, ఇంకను మీరు శరీరసంబంధులుగ, మానవమాత్రులుగ జీవించు చున్నట్లే గదా!

4. ఒకడు, “నేను పౌలు అనుయాయుడను” అనియు, మరియొకడు “నేను అపొల్లో సహచరుడను” అనియు పలుకుచున్నప్పుడు, మీరు కేవలము లోకసంబంధిత వ్యక్తులుగా ప్రవర్తించుట లేదా?

5. నిజమునకు అపోల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము మిమ్ము విశ్వసింపచేసిన ఆ దేవుని సేవకులము మాత్రమే. ప్రతివ్యక్తియు దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును.

6. నేను విత్తనమునునాటితిని, అపోల్లో నీరు పోసెను. కాని దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే.

7. నిజమునకు విత్తువాడును, నీరు పోయువాడును ముఖ్యులు కారు. ఏలయన, మొక్కకు పెరుగుదల నొసగు దేవుడే ముఖ్యుడు.

8. విత్తువానికిని, నీరుపోయు వానికిని భేదమే లేదు. వాని వాని పనినిబట్టి ప్రతివ్యక్తి కిని దేవుడు ప్రతిఫలమును ఇచ్చును.

9. మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము. మీరు దేవుని పొలము. మీరు దేవుని గృహమునై యున్నారు.

10. దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పివలె పనిచేసి పునాదిని వేసితిని. వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కాని తన నిర్మాణ విషయమున ప్రతివ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను.

11. ఏలయన, యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప, వేరొక పునాదిని ఎవడును వేయజాలడు.

12. పునాదిపైన కట్టడములో కొందరు బంగారమును, వెండిని, అమూల్యములగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లుదుబ్బును వాడుదురు.

13. క్రీస్తు దినము దానిని బహిరంగ పరచిననాడు ఒక్కొక్కని పనితనము తెలియనగును.  ఏలయన, ఆనాటి అగ్నిజ్వాల ప్రతివ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ ఆగ్ని దానిని పరీక్షించి దాని నిజస్వభావమును ప్రదర్శించును.

14. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానము పొందును.

15. కాని ఎవని కృషియైనను దగ్గమై పోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కాని ఆ అగ్నినుండి తప్పించు కొనెనో అనునట్లు, అతడు మాత్రము రక్షింపబడును.

16. మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా?

17. ఎవడై నను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయన, దేవుని ఆలయము పవిత్రమైనది. మీరే ఆయన ఆలయము.

18. ఎవడును తనను తాను మోసగించు కొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొనెనేని, నిజముగ వివేక వంతుడగుటకు గాను అతడు అవివేకి కావలెను.

19. ఏలయన ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడునది దేవుని దృష్టిలో అవివేకము. లేఖనములో వ్రాయబడినట్లుగ, “వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును.”

20. “వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియును”

21. కనుక మానవుల చేతలను గూర్చి ఎవడును గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయును మీదే.

22. పౌలు, అపొల్లో, పేతురు, ఈ ప్రపంచము, జీవన్మరణములు, వర్తమానము, భవిష్యత్తు ఇవి అన్నియును మీవే.

23. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు. 

 1. మీరు మమ్ము క్రీస్తు సేవకులనుగను, దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందిన వారినిగను పరిగణింపవలెను.

2. బాధ్యత అప్పగింపబడినవాడు విశ్వాసపాత్రుడై ఉండవలయును.

3. కనుక, మీరుగాని లేక ఏ మానవ న్యాయస్థానముగాని నాకు తీర్పు చెప్పుటనుగూర్చి నేను ఎంతమాత్రమును పట్టించు కొనను. నేను కూడ నాపై తీర్పు చెప్పుకొనను.

4. నా మనస్సాక్షి నిర్మలముగ ఉన్నది. కాని అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. ప్రభువే నా పై తీర్పు చెప్పును.

5. కనుక, తగినసమయము ఆసన్నమగు వరకు, అనగా ప్రభువురాకడ వరకును ఎవనిపైనను మీరు తీర్పు చెప్పరాదు. చీకటియందున్న రహస్య విషయములను ఆయన వెలికితీయును. హృదయము లలోని ఆలోచనలను ఆయన బహిరంగమొనర్చును. అప్పుడు తనకు తగినవిధమున ప్రతివ్యక్తియు దేవుని పొగడను పొందును.

6. సోదరులారా! మీ కొరకే దీనిని అంతయు నాకును, అపొల్లోకును అన్వయింపచేసితిని. వ్రాయ బడిన దానిని మీరు అతిక్రమింపకుండుటయును, మీలో ఎవరును ఒకనిని గూర్చి గర్వించి మరియొకనిని తృణీకరింపకుండుటయును మా నుండి నేర్చుకొనవలె ననియే అటుల చేసితిని.

7. ఇతరులకంటె నిన్ను అధికునిగ పరిగణించునదెవరు? దేవునినుండి పొందనిది నీవద్ద ఏమైన ఉన్నదా? మరి ఈ విధముగా పొందిన దైతే నీకు ఉన్నది. దేవుడు ఇచ్చిన దానము కాదని నీవు ఎట్లు గర్వింపగలవు?

8. ఇప్పటికే మీకు సమస్తమును సమకూరినది! ఇప్పటికే మీరు ఐశ్వర్యవంతులు! మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. మీరు నిజముగ రాజులు కావలెన నియే నా కోరిక. అప్పుడు మీతోపాటు మేమును రాజులము కాగలము.

9. మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచు చున్నది. మేము లోకమునకును, దేవదూతలకును, మనుష్యులకును ప్రదర్శనగా ఉన్నాము.

10. క్రీస్తు కొరకు మేము అవివేకులము. కాని క్రీస్తునందు మీరు వివేకవంతులు! మేము బలహీనులము, కాని మీరు బలవంతులు! మేము తృణీకరింపబడుచున్నాము. కాని మీరు గౌరవింపబడుచున్నారు.

11. ఈ క్షణము వరకును మేము ఆకలిదప్పులతో ఉన్నవారము, మావి చింపిరి గుడ్డలు, మేము హింసింపబడుచున్నాము, ఊళ్లు పట్టుకొని మేము తిరుగుచున్నాము,

12. మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పనిచేయుదుము. మేము శపింపబడినపుడు దీవింతుము, హింసింప బడినపుడు సహింతుము,

13. అవమానింపబడినపుడు మనవి చేసికొందుము. ఇప్పటి వరకును మేము ఈ లోకపు చెత్తగా, మురుగుగా ఎంచబడియున్నాము.

14. మీరు సిగ్గుపడునట్లు చేయవలెనని నేను ఇట్లు వ్రాయుటలేదు. నా ప్రియపుత్రులుగ మీకు బోధించుటకే నేను ఇట్లు వ్రాయుచున్నాను.

15. ఏలయన, క్రీస్తునందు మీ జీవితమున మీకు పదివేల మంది గురువులున్నను, మీకు తండ్రి ఒక్కడే. ఏల యన, క్రీస్తు యేసు సువార్తను అందించుట ద్వారా నేను మిమ్ము కంటిని గనుక నేను మీకు తండ్రినైతిని.

16. కనుక మీరును నావలె నడువవలెనని మిమ్ము అర్థించు చున్నాను.

17. ఇందులకే తిమోతిని మీ వద్దకు పంపుచున్నాను. అతడు ప్రియతముడును, క్రీస్తునందు విశ్వాసపాత్రుడైన నా పుత్రుడు. అతడు క్రీస్తునందు నేను నడచుకొను విధమును, అనగా ప్రతిస్థలము లోను, ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును.

18. నేను మిమ్ము చూడరాబోనని తలచి మీలో కొందరు గర్వపడుచున్నారు.

19. కాని ప్రభువు చిత్తమైనచో నేను మిమ్ము త్వరలోనే చేరుకొందును. అప్పుడు ఆ గర్వించెడివారి మాటలనుగాక వారి బలమును నేను తెలిసికొందును.

20. ఏలయన, దేవుని రాజ్యము మాటలతో కాక శక్తి సమన్వితమై ఉన్నది.

21. మీకు ఏది ఇష్టము? నన్ను బెత్తము పుచ్చుకొని మీయొద్దకు రమ్మందురా? లేక ప్రేమతోను, సాత్వికమైన మనస్సుతోను రావలయునా? 

 1. అన్యులు సైతము చేయనేరని మహా దారుణమైన వ్యభిచార దోషము మీయందు ఉన్నదని వదంతి కలదు. ఏలయన, ఒకడు తన సవతి తల్లిని ఉంచుకొనియెనట!

2. అయినచో మీరు ఎట్లు ఇంకను గర్వింప గలరు? మీరు శోకింపవలదా? అట్టి వ్యక్తిని మీ నుండి బయటికి గెంటివేయవలెను.

3. వాస్తవముగా, శారీరకముగ నేను మీకు దూరముగనే ఉన్నను, నా ఆత్మ మీతోనే ఉన్నది. నేను మీతో ఉన్నట్లుగనే భావించి మన ప్రభువగు యేసు నామమున, ఆ దారుణమును చేసిన వ్యక్తిపై తీర్పు చెప్పితిని.

4. మీరు సమావేశమగునపుడు, నేనును ఆత్మద్వారా మీతో ఉందును కనుక మన ప్రభువగు యేసుక్రీస్తు శక్తివలన,

5. ఆ వ్యక్తి శారీరకముగ నాశనమగుటకై వానిని సైతానుకు అప్పగించివేయుడు. అప్పుడు ప్రభువు దినమున వాని ఆత్మ రక్షింపబడగలదు.

6. గర్వించుట మీకు సముచితము కాదు! కొద్దిపాటి పులిసిన పిండి పిండినంతను పులియజేయునని మీకు తెలియదా!

7. పాపమను ఈ పాత పులిసినపిండిని తీసివేయవలయును. అప్పుడు మీరు ఏ మాత్రమును పులియని క్రొత్తదియగు పిండివలె ఉందురు. నిజముగ మీరు అట్టివారేనని నాకు తెలియును. ఏలయన, పాస్క గొఱ్ఱెపిల్లయగు క్రీస్తు బలిచేయబడెను.

8. కాబట్టి ద్వేషము, దౌష్ట్యము అను పాతపిండితో చేసిన రొట్టెతో కాక, నిజాయితి, సత్యము అనువానితో కూడిన పులియనిపిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసికొందము.

9. వ్యభిచారులగు వ్యక్తులతో మీరు సంబంధము పెట్టుకొనరాదని మీకు ఉత్తరము వ్రాసితిని.

10. కాని ఈ లోకములో వ్యభిచారులును, దురాశాపరులును, దోచుకొనువారును, విగ్రహారాధకులైన వారందరితోను సాంగత్యము వలదని నేనభిప్రాయపడుటలేదు. అట్టి వారినుండి తప్పించుకొనవలెనన్నచో మీరు ఈ లోకమునుండి వైదొలగవలసి ఉండును.

11. సోదరుడని పిలుచుకొనుచు, వ్యభిచారియును, దురాశాపరుడును, విగ్రహారాధకుడును, నిందారోపకుడును, త్రాగుబోతును, దోచుకొనువాడును అగు వ్యక్తితో కలిసి ఉండరాదనియే నా అభిప్రాయము. అట్టివానితో భోజనమైనను చేయకుడు.

12. అన్యులపై తీర్పుచెప్పుటకు నాకేమి పని? సంఘములోని వారిపైననే కదా మీరు తీర్పు చెప్పవలసినది?

13. అన్యులపై దేవుడు తీర్పు చెప్పును. ఆ దుష్టుని మీలోనుండి తొలగింపుడు. 

 1.మీలో ఎవరికేని ఒక సోదరునితో వివాదము తటస్థించినచో, దేవుని ప్రజలచే తీర్పు చెప్పించుకొనుటకు బదులుగా, అవినీతిపరుల ఎదుట న్యాయమును కోరుటకు సాహసించునా?

2. దేవుని ప్రజలు లోకమునకు తీర్పు తీర్చుదురని మీకు తెలియదా? కావున, లోకమునకే మీరు తీర్పు చెప్పవలసియున్నచో, చిన్న విషయములలో మీరు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యతలేదా?

3. దేవదూతలకు కూడ మనము తీర్పు తీర్చుదుమని మీకు తెలియదా? అయినచో ఈ లోకపు విషయములలో తీర్పు చెప్పుట ఎంత?

4. కనుక, అట్టి వివాదములు సంభవించినపుడు, దైవసంఘముచే తృణీకరింపబడిన వ్యక్తుల యొద్దకు విచారణకై వానిని తీసికొని పోవుదురా?

5. మీకు సిగ్గులేదు. సోదరుల మధ్య వివాదమును తీర్పగల వివేకవంతుడు మీలో ఒక్కడైన లేడా?

6. అటులగాక ఒక సోదరునిపై మరియొకడు న్యాయస్థానమునకు పోయి, అవిశ్వాసియగు వ్యక్తిచే తీర్పుపొందుటయా!

7. మీరు ఒకరిపై ఒకరు వ్యాజ్యెమాడినయెడల పూర్తిగా దిగజారిపోయినట్లే. అంతకంటె మీకు జరిగిన అన్యాయమును సహించుట మేలు కదా! దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలుకదా!

8. కాని, మీరే ఒకరికి ఒకరు అన్యాయము చేసికొనుచున్నారు. ఒకరిని ఒకరు దోచుకొనుచున్నారు. అందును మీ సోదరులనే!

9. దుష్టులు దేవుని రాజ్యము పొందరని మీకు తెలియదా? మోసపోకుడు. అవినీతిపరులును, విగ్రహారాధకులును, వ్యభిచారులును, నపుంసకులును, స్వలింగ వ్యామోహ వక్రబుద్దులును,

10. దొంగలును, దురాశాపరులును, త్రాగుబోతులును, పరనిందాపరులును, దోచుకొనువారును దేవుని రాజ్యమునకు వారసులు కారు.

11. మీలో కొందరు అట్టి వారైయుంటిరి. కాని, మీరు పాపము నుండి కడుగబడితిరి. మన ప్రభువగు యేసుక్రీస్తు నామమువలనను, మన దేవుని ఆత్మవలనను మీరు కడగబడి పరిశుద్ధపరుపబడిన వారై నీతిమంతులుగ తీర్చిదిద్దబడిరి.

12. “నేను ఏదియైనను చేయవచ్చును" అని యెవడైన పలుకవచ్చును. నిజమే, కాని అన్నియును మీకు మంచివికావు. “నేను ఏదియైనను చేయవచ్చును” అని నేను చెప్పవచ్చును. కాని, ఏదియైనను నన్ను బానిసగా చేయుటకు నేను ఒప్పుకొనను.

13. “పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట" అని ఇంకొకడు చెప్పవచ్చును. నిజమే. కాని దేవుడు రెంటిని నాశము చేయును. మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు. అది ప్రభువు కొరకు. ప్రభువు దాని కొరకు.

14. దేవుడు ప్రభువును మృతులనుండి లేవనెత్తెను. ఆయన మనలను కూడ తన శక్తితో లేవనెత్తును!

15. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయవములని మీకు తెలియదా? క్రీస్తు దేహములోని అవయవములను ఒక వేశ్య దేహము యొక్క అవయవములుగ నేను చేయుదునా? ఎన్నటికిని జరుగదు!

16. వేశ్యా సాంగత్యముగల వ్యక్తి ఆమెతో ఏకశరీరి అగునని మీకు తెలియదా? “వారు ఇరువురును ఒకే శరీరము కలవారగుదురు” అని లేఖనము స్పష్టముగా చెప్పుచున్నది.

17. కాని ప్రభువుతో ఐక్యము చెందువాడు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటియగును.

18. వ్యభిచరింపకుడు. మానవుడు చేయు ఏ ఇతర పాపమైనను అతని శరీరమునకు వెలుపల ఉండును. కాని వ్యభిచరించు వ్యక్తి తన శరీరము పాప భూయిష్టము చేయును.

19. మీ శరీరము మీయందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే ఒసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు.

20. ఏలయన, ఆయన వెల నిచ్చి మిమ్ము కొనెను. కనుక మీ దేహముతో దేవుని మహిమపరుపుడు. 

 1. ఇక మీరు వ్రాసిన విషయములను గూర్చి: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.

2. కాని వ్యభి చారమునకు లొంగకుండుటకుగాను, ప్రతి పురుషునకు సొంతభార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను.

3. భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి వివాహధర్మములను నెరవేర్చుచూ, ఒకరి అవసరములను మరియొకరు తీర్చు చుండవలెను.

4. స్త్రీ తన శరీరమునకు యజమానురాలు కాదు. భర్తయే ఆమె శరీరమునకు యజమానుడు. అట్లే పురుషుడు తన శరీరమునకు యజమానుడు కాడు. భార్యయే అతని శరీరమునకు యజమానురాలు.

5. ప్రార్థన చేయుటకు ఉభయులు అంగీకరించిన సమయములందు తప్ప ఒకరికొకరు దూరము కారాదు. అప్పుడు ఆత్మనిగ్రహములేని మీరు సైతాను ఆకర్షణకు లోనుగాకుండునట్లు తిరిగి కలిసి కొనుడు.

6. అయినను ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు.

7. నిజమునకు అందరు నావలెనే ఉండవలెనని నా కోరిక, కాని, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రత్యేకమగు దేవుని వరమును పొంది ఉన్నాడు. ఒకనికి ఈ వరము, వేరొకనికి ఆ వరము.

8. అవివాహితులకును, విధవలకును నేను చెప్పునదేమన, వారు నావలెనే ఒంటరిగ జీవించుట ఉత్తమము.

9. కాని, నిగ్రహశక్తి లేకున్నచో వారు వివాహమాడవలెను. వ్యామోహము వలన వ్యధ చెందుటకంటె వివాహమాడుట మేలు.

10. వివాహితులను నేను ఇట్లు ఆజ్ఞాపించు చున్నాను. ఈ ఆజ్ఞ నాది కాదు. అది ప్రభువునకు చెందినదే. భార్య భర్తను విడనాడరాదు.

11. ఒకవేళ విడనాడినచో మరల వివాహమాడరాదు. లేదా భర్తతో సమాధానపడవలెను. పురుషుడు భార్యను విడనాడ రాదు.

12. ఇతరులకు నేను ఇట్లు చెప్పుచున్నాను. ఇది నా మాటయే. ప్రభువు పలుకు కాదు. ఒక క్రైస్తవునికి అవిశ్వాసురాలగు భార్య ఉన్నచో, ఆమె అతనితో జీవించుటకు ఇష్టపడినచో, అతడు ఆమెను విడనాడ రాదు.

13. ఒక క్రైస్తవ స్త్రీ అవిశ్వాసియగు పురుషుని వివాహమాడి ఉన్నచో, అతడు ఆమెతో జీవించుటకు ఇష్టపడినపుడు, ఆమె అతనిని విడువరాదు.

14. ఏలయన, అవిశ్వాసియగు భర్త తన క్రైస్తవభార్యతో ఏకమగుట ద్వారా పరిశుద్దుడగును. అట్లే అవిశ్వాసియగు భార్య తన క్రైస్తవ భర్తతో ఏకమగుట ద్వారా పరిశుద్ధురాలగును. ఇది ఇట్లు కానిచో మీ బిడ్డలు అన్యమతస్థుల బిడ్డల వంటి వారగుదురు. కాని వారు దేవునకు స్వీకారయోగ్యులుగా ఉన్నారు.

15. కాని అవిశ్వాసియగు ఒక వ్యక్తి తన క్రైస్తవభార్యనుగాని, భర్తనుగాని విడనాడదలచినచో అట్లే చేయనిండు. అట్టి సందర్భములలో క్రైస్తవభర్తగాని, భార్యగాని కట్టువడి యుండనక్కరలేదు. ఏలయన, దేవుడు మిమ్ము ప్రశాంత ముగా జీవించుటకు పిలిచెను.

16. ఓ స్త్రీ! నీ భర్తను నీవు రక్షింపగలవో లేవో నీకు ఎట్లు తెలియును? ఓ పురుషుడా! నీ భార్యను నీవు రక్షింపగలవో లేవో నీకు ఎట్లు తెలియును?

17. ప్రతివ్యక్తియు, తనకు ప్రభువు ఒసగిన వర మును అనుసరించియు, దేవుడు తనను పిలిచిననాడు తానున్న స్థితినిబట్టియు జీవించు చుండవలెను. దైవ సంఘములో సర్వత్ర నేను ఈ సూత్రమునే బోధింతును.

18. ఎవడైనను తాను పొందిన పిలుపునకు పూర్వమే సున్నతి చేయబడియుండినయెడల అతడు సున్నతి చిహ్నములను తీసివేయ ప్రయత్నింపరాదు. ఎవడైనను తాను పొందిన పిలుపునకు పూర్వము సున్నతి చేయబడని యెడల అతడు సున్నతి పొందరాదు.

19. ఏలయన, సున్నతి పొందుట, పొందకపోవుట ముఖ్యము కాదు. దేవుని శాసనములకు విధేయత చూపుటయే ముఖ్యము.

20. ప్రతివ్యక్తియు, దేవుని పిలుపును స్వీక రించిననాడు తాను ఎట్లుండెనో అట్లే ఉండవలెను.

21. దేవుడు పిలిచిననాడు నీవు ఒక బానిసవా? లెక్కచేయకుము. కాని స్వతంత్రుడవగుటకు అవకాశము ఉన్నచో, దానిని ఉపయోగించుకొనుము.

22. ఏలయన, ప్రభువుచే పిలువబడిన సేవకుడు ప్రభువునకు చెందిన స్వతంత్రుడే. అట్లే క్రీస్తుచే పిలువబడిన స్వతంత్రుడు ఆయనకు సేవకుడే.

23. దేవుడు మిమ్ము వెలను ఇచ్చి కొనెను. కనుక మానవులకు దాసులు కారాదు.

24. సోదరులారా! తాను పిలువబడిననాడు ఉన్న విధముననే ప్రతి వ్యక్తియు దేవుని సహవాసములో నిలిచిపోవలయును.

25. ఇక అవివాహితల విషయము. నాకు ఈ విషయమున ప్రభువు శాసనము లేదు. కాని ప్రభువు కృపచే విశ్వాసపాత్రుడగు వ్యక్తిగ నేను నా అభిప్రాయమును తెలుపుచున్నాను.

26. ప్రస్తుత విషాద పరిస్థితులను బట్టి, పురుషుడు తాను ఉన్నవిధముగ ఉండుటయే మంచిదని నా అభిప్రాయము.

27. కాని నీకు భార్య ఉన్నదా? ఆమెను వదలించుకొనుటకు యత్నింపకుము. నీవు అవివాహితుడవా? భార్య కొరకు యత్నింపకుము.

28. కాని నీవు వివాహమాడినచో పాపము చేయుటలేదు. అట్లే అవివాహితయగు స్త్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయుటలేదు. కాని అట్టి వ్యక్తులకు కలుగు దైనందిన కష్టములనుండి మిమ్ము తప్పింపవలయున నియే నా తలంపు.

29. సోదరులారా! నేను చెప్పునదేమనగా ఇంక ఎంతో సమయము లేదు. కనుక ఇప్పటినుండి భార్యలు కలవారు భార్యలు లేనట్లుగను,

30. ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగలేనట్లును, కొనువారు తాముకొనినవానికి సొంతదారులు కానట్లును,

31. లౌకికమగు వస్తువు లతో వ్యాపారము చేయువారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలెను. ఏలయన, ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంక ఎంతో కాలము ఉండబోదు.

32. మీరు విచారమునుండి దూరము కావలెననియే నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు, అవివాహితుడగు వ్యక్తి ప్రభువు పనియందే నిమగ్నుడగును.

33. కాని, భార్యను సంతోషపెట్టవలెనను తలంపు గలవాడగుటచే వివాహితుడగు వ్యక్తి లౌకికవ్యవహారములలో చిక్కుకొని,

34. రెండు ప్రక్కలకు లాగబడుచుండును. శారీరకముగను, ఆత్మయందును కూడ అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక, ప్రభువు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకికవ్యవహారములలో చిక్కుకొనును.

35. నేను మీ ప్రయోజనము నిమిత్తము ఇట్లు చెప్పుచున్నాను. నేను మీపై నిబంధనలు విధించుట లేదు. మీరు ప్రభువు సేవకు సంపూర్ణముగ సమర్పించు కొనవలయునని, చక్కని క్రమశిక్షణ అలవరచుకొన వలయునని నేను ఇట్లు చెప్పుచున్నాను.

36. ఎవడేని ఒకతెను ప్రధానము చేసికొన్నపిదప ఆమె ఈడుమించిపోవుచున్నదని భావించినయెడల ఆ యువతిని వివాహమాడుట మంచిదని తలంచి నచో అతడు తాను ఆశించినట్లే చేయవచ్చును. అందు పాపములేదు.

37. కాని, ఎవడైన హృదయ స్థిరత్వము కలిగి బలవంతముగా కాక, తన సంకల్పమును నెరవేర్చు కొను స్వేచ్చగలవాడై, తన కోరికను నిగ్రహించుకొని, తాను కృతనిశ్చయముతో ప్రదానము చేయబడిన తన కన్యకను నిశ్చితార్థురాలిగా ఉంచదలచినచో అది మంచిదే.

38. కనుక తన కన్యకను వివాహమాడువాడు మంచిపనియే చేయును. వివాహమాడనివాడు మరింత మంచి పనిచేసినట్లగును. -

39. వివాహిత స్త్రీ తన భర్త జీవించి ఉండునంత కాలము స్వతంత్రురాలు కాదు. కాని, ఆమె భర్త మరణించినచో, తాను కోరిన వ్యక్తిని వివాహమాడుటకు ఆమెకు స్వేచ్చ కలదు. కాని అది క్రైస్తవ వివా హమై ఉండవలెను.

40. కాని, ఉన్నట్లే ఉండినచో ఆమె ఎంతయో సంతోషింపగలదు. అది నా అభి ప్రాయము. నాయందుకూడ దేవుని ఆత్మ ఉన్నదని నా తలంపు. 

 1. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును గూర్చిన విషయము: “మనకు అందరికిని జ్ఞానమున్నది” అనుట నిజమేకాని, ఆ జ్ఞానము మనుష్యుని గర్వముతో ఉప్పొంగునట్లు చేయును. కాని ప్రేమ బలముచేకూర్చును.

2. తనకు ఏదియో కొంత తెలియుననుకొను వ్యక్తికి తెలియదగిన రీతి తెలియదు.

3. కాని దేవుని ప్రేమించు వ్యక్తిని దేవుడు ఎరుగును.

4. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయము: విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదనియు, ఒక్కడే దేవుడనియు మనకు తెలియును.

5. దివియందుగాని, భువిమీదగాని “దేవతలు” అనబడు వారున్నను, ఈ “దేవతలు" లేదా ప్రభువులు పెక్కుమంది ఉన్నను,

6. మనకు పితయగు దేవుడు ఒక్కడే. ఆయనయే సర్వమునకు సృష్టికర్త. ఆయన కొరకే మనము జీవింతుము. ప్రభువు ఒక్కడే. ఆ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృష్టింప బడినది. ఆయన ద్వారా మనము జీవించుచున్నాము.

7. కాని అందరికిని ఈ సత్యము తెలియదు. కొందరు విగ్రహములకు అలవాటుపడి, ఆ ఆహారమును భుజించునప్పుడు ఆ ఆహారమును ఇంకను విగ్రహమునకు సంబంధించిన దానిగనే ఎంచుచున్నారు. వారి అంతఃకరణము బలహీనముగ ఉండుటచే అపరిశుద్ధమగుచున్నది.

8. కాని ఆహారము మనలను దేవుని దగ్గరకు చేర్చదు. భుజింపనిచో మనము ఏమియును పోగొట్టుకొనము. భుజించినందువలన ఏమియు పొందబోము.

9. కాని, మీ స్వేచ్చ విశ్వాసమున బలహీనులగు వ్యక్తులను పాపమున పడునట్లు చేయకుండ శ్రద్ధ వహింపుడు.

10. ఏలయన, ఒక విగ్రహముయొక్క ఆలయములో “జ్ఞానము” గలవాడవగు నీవు భుజించు చుండగా బలహీనమగు అంతఃకరణముగల ఏ వ్యక్తియైనను చూచినచో, వాడును విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును తినుటకు ధైర్యము తెచ్చుకొనడా?

11. కనుక నీ జ్ఞానమువలన ఆ బలహీనుడు నశించును. ఆ సోదరుని కొరకు క్రీస్తు మరణించెను గదా!

12. ఇట్లు మీ సోదరులకు వ్యతిరేకముగ మీరు పాపమొనర్చినపుడు, వారి బలహీనములగు అంతఃకరణములను గాయపరచుచు, క్రీస్తునకు వ్యతిరేకముగ మీరు పాపము చేయుచున్నారు.

13. కనుక ఆహారము నా సోదరుని పాపముచేయునట్లు చేయు చున్నచో, నా సోదరుడు పాపములో పడకుండుటకై నేను ఇక ఎన్నడును మాంసమును తినను. 

 1. నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తలుడను కానా? మన ప్రభువగు యేసును నేను చూడలేదా? ప్రభువుకొరకు చేసిన నా పనికి ఫలము మీరు కాదా?

2. ఇతరులు నన్ను అపోస్తలునిగా అంగీకరింపకున్నను, మీరు మాత్రము నన్ను అపోస్తలునిగా అంగీకరించుచున్నారు. ప్రభువునందలి మీ జీవితమువలన నేను అపోస్తలుడను అనుటకు మీరే ముద్రగా గల నిరూపణము.

3. నన్ను విమర్శించువారికి నా సమాధానమిది.

4. మాకు తినుటకు, త్రాగుటకు అధికారములేదా?

5. ఇతర అపోస్తలులును, ప్రభువు సోదరులును, పేతురును చేయుచున్నట్లు ప్రయాణములో మాతో ఒక క్రైస్తవ గృహిణిని తీసికొని పోవుటకును మాకు అధికారము లేదా?

6. పనిచేయకుండుటకు బర్నబాయు, నేనును మాత్రమే అధికారము లేనివారమా?

7. సైనికుడు తన సొంత ఖర్చుతో సైన్యములో పనిచేయునా? అట్లే తాను పెంచిన ద్రాక్షతోటలోని పండ్లు తినని రైతు గలడా? తాను పోషించిన గొఱ్ఱెలమందనుండి లభించిన పాలు త్రాగని వ్యక్తి గలడా?

8. ఇదంతయు నేను ఒక మానవమాత్రునిగా చెప్పుచుంటినా? ఇదే విషయమును ధర్మశాస్త్రమూ చెప్పుట లేదా?

9. “పంటనూర్చు ఎద్దునోటికి చిక్కము వేయకుము” అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. అయినచో దేవుడు ఎద్దుల విషయము పట్టించుకొనునా?

10. లేక ఇటుల చెప్పుటలో ఆయన యథార్థ ముగ మనలను ఉద్దేశింపలేదా? ఇది మన కొరకే రచింపబడినది! పొలము దున్నువాడును, పంటకూర్చు వాడును ఫలసాయమున పాలుపంచుకొను ఆశతోడనే తమ పనిని చేయవలెను.

11. మీలో మేము ఆధ్యాత్మికమగు విత్తనమును నాటితిమి. కనుక మీనుండి మేము లౌకిక ప్రయోజనములను పొందినచో మితిమీరుటయగునా?

12. ఇతరులు మీయొద్దనుండి వీనిని  ఆశింప అధికారముగల వారైనచో, మాకు అంతకంటే అధికమైన అధికారము లేదా? కాని మేము ఈ అధికారమును ఉపయోగించుకొనలేదు. అంతేకాదు. క్రీస్తుసువార్తకు ఎట్టి ఆటంకమును కలిగింపకుండుటకై సమస్తమును సహించితిమి.

13. దేవాలయమున పనిచేయువారు దేవాల యమునుండియే ఆహారమును పొందుదురు. బలిపీఠముపై బలులర్పించువారు ఆ బలులలో భాగము పొందుదురు. ఇది మీకు నిశ్చయముగ తెలియును.

14. అట్లే సువార్త బోధకులు దానినుండియే తమ జీవనాధారమును పొందవలెనని ప్రభువు శాసించి యున్నాడు.

15. కాని, నేను ఈ అధికారములలో దేనిని వాడుకొనలేదు. ఇప్పుడును వాడుకొను తలంపుతో నేను ఇట్లు వ్రాయుటలేదు. నా యీ అతిశయమును ఎవడైనను నిరర్థకము చేయుటకంటే నాకు చావే మేలు.

16. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను కారణము లేదు. నిజము నకు సువార్తను ప్రకటించు ఆవశ్యకత నాపై మోప బడియున్నది. అయ్యో! నేను సువార్తను ప్రకటించని యెడల ఎంత అనర్గము!

17. ఈ పనిని నాయంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కాని ఇది నా అభీష్టమునకు వ్యతిరేకమైనచో నాకు ఒక నిర్వాహకత్వము ఒప్పచెప్పబడినదని అర్థము.

18. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా అధికారమును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక, సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా ప్రతిఫలము.

19. నేను స్వతంత్రుడను. ఎవరికిని దాసుడను కాను. కాని ఇంకను ఎక్కువమందిని సంపాదించు కొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగ చేసికొనుచున్నాను.

20. యూదులతో పని చేయునపుడు, వారిని సంపాదించుకొనుటకుగాను యూదుని వలె జీవించితిని. నేను మోషే ధర్మశాస్త్రమునకు బద్దుడను కాకున్నను, బద్దులైన వారితో పాటు పనిచేయుచున్నపుడు వారిని సంపాదించుకొనుటకై వారి వలెనే జీవించితిని.

21. అట్లే అన్యులతో ఉన్నపుడు వారిని సంపాదించుకొనుటకు యూదుల ధర్మశాస్త్రమునకు దూరముగ, అన్యునివలెనే జీవించితిని. కాని, నేను దేవుని చట్టమునకు విధేయుడను కానని దీని భావము కాదు. ఏలయన, యథార్థముగ నేను క్రీస్తు చట్టమునకు లోనై యున్నాను.

22. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు, వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకనివలెనైతిని. కనుక నేను కొందరినైనను, ఏ విధముగనైనను రక్షింపగలుగుటకుగాను అందరి కొరకు అన్ని విధములుగనైతిని.

23. సువార్త దీవెనలలో పాలుపంచుకొనుటకు గాను, సువార్తకొరకై నేను ఇది అంతయు చేయు చున్నాను.

24. పరుగు పందెమున అందరును పరుగె తుదురు. కాని వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియును గదా! కావున బహుమతిని అందుకొనునట్లు పరుగెత్తుడు.

25. పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షణకు లోబరచుకొనును. అశాశ్వతమగు కిరీటమునకై వారు అటుల చేయుదురు. కాని శాశ్వతమగు దానికై మనము ఆ విధముగ చేయుదము.

26. కనుక గమ్యములేకుండ నేను పరుగిడుటలేదు. గాలితో గ్రుద్దులాటవలె నేను పోరాడుటలేదు.

27. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును. 

 1. సోదరులారా! మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలిసికొనవలెనని నా కోరిక. వారు అందరు మేఘముక్రింద ఉండిరి. సముద్రమును దాటి సురక్షితముగా ఆవలకు చేరిరి.

2. వారు మేఘమునందును, సముద్రమునందును మోషే సహ వాసములోనికి బప్తిస్మమును పొందిరి.

3. అందరును ఆధ్యాత్మికమగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి.

4. అందరును ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి. ఏలయన, వారు తమతోపాటు వెడలిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రిస్తే.

5. అయినప్పటికిని, వారిలో పెక్కుమందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక వారి ప్రేతములు ఎడారియందు చెల్లాచెదరు చేయబడినవి.

6. కావున, వారివలె మనము చెడును ఆశింప కుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి.

7. వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులుగా ఉండకుడు. “తినుటకు, త్రాగుటకు ప్రజలు కూర్చుండిరి; నాట్యమాడుటకై లేచిరి" అని వ్రాయబడినట్లు

8. వారిలో కొందరివలె మనము వ్యభిచరింపరాదు. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క రోజుననే ఇరువది మూడువేలమంది మరణమునకు గురియైరి.

9. వారిలో కొందరివలె మనము ప్రభువును శోధింపరాదు. వారిలో కొందరు శోధించి పాములచే కాటు వేయబడి మరణించిరి.

10. వారిలో కొందరి వలె మనము సణుగుకొనరాదు. వారిలో కొందరు సణగి వినాశకర్తచే నాశనము చేయబడిరి. .

11. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నియు సంభవించినవి. యుగాంతపు చిట్టచివరి రోజులలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవి అన్నియు వ్రాయబడినవి.

12. కనుక తాను చక్కగా నిలబడితినని భావించు వ్యక్తి, పడిపోకుండునట్లు జాగ్రత్తగా ఉండవలెను.

13. మానవులకు సాధారణము కాని ఏ శోధనయు మీకు కలుగలేదు. ఏలయన, దేవుడు నమ్మదగినవాడు. మీ నిగ్రహశక్తిని మించి మిమ్ము శోధింపబడనీయడు. అంతే కాక, మీరు శోధింపబడునప్పుడు, దానిని సహింపగల శక్తిని మీకు ఒసగి, బయటపడు మార్గమును మీకు ఆయన చూపును.

14. కావున, ప్రియమిత్రులారా! విగ్రహారాధన నుండి తొలగిపొండు.

15. బుద్ధిమంతులని ఎంచి మీకు చెప్పుచున్నాను. నేను చెప్పుదానిని మీరే యోచింపుడు.

16. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునపుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెను విరిచినపుడు క్రీస్తు శరీరములో పాలుపంచుకొనుట లేదా?

17. ఒకే రొట్టె అగుటచే, పెక్కుమందిమైనను, మనము అందరమును ఒకే శరీరము. ఏలయన, మనము అందరమును ఒకే రొట్టెయందు పాలుపంచుకొను చున్నాము.

18. హెబ్రీయ ప్రజల విషయము విచారింపుడు. బలిగా అర్పింపబడిన దానిని తినువారు బలి పీఠముపై దేవుని సేవలో భాగస్వాములు కారా?

19. దీని భావమేమి? విగ్రహముగాని, దానికి అర్పింప బడిన ఆహారముగాని నిజముగ లెక్కింపదగినదా?

20. కాదు! అన్యుల బలిపీఠములపై బలిచేయబడినది దేవునకు కాక, దయ్యములకు అర్పింపబడుచున్నది. కనుక మీరు దయ్యములతో భాగస్వాములు కారాదని నా కోరిక.

21. ప్రభువు పాత్రమునుండియు, సైతాను పాత్రమునుండియు రెండింటినుండియు త్రాగజాలరు. ప్రభువు బల్లవద్దను, సైతాను బల్లవద్దను రెండింటివద్ద తినజాలరు.

22. దేవునికి అసూయ కలిగింపవలెనని భావించుదమా? ఆయన కంటె మనము బలవంతులమని అనుకొందమా?

23. అన్నియును అనుమతింపబడినవే కాని, అన్నియును ఉపయోగకరములు కావు. అన్నియును అనుమతింపబడినవే కాని, అన్నియును అభివృద్ధిని కలిగింపవు.

24. ఏ వ్యక్తియు తన మేలునే చూచుకొనక ఇతరుల మేలు కొరకై చూచుచుండవలెను.

25. మనస్సాక్షి మూలకమగు ఎట్టి ప్రశ్నలు అడుగకయే మాంసపు విక్రయశాలయందుండు దేనిని అయినను మీరు తినవచ్చును.

26. ఏలయన, పవిత్ర గ్రంథము పలుకుచున్నట్లుగ, “భువియు, భువియందలి సమస్తమును ప్రభువునకు చెందినవే!”

27. అవిశ్వాసియగు వ్యక్తి ఒకడు మిమ్ము భోజన మునకు పిలిచెను అనుకొనుడు. మీరు పోదలచినచో, మనస్సాక్షికి సంబంధించిన ఎట్టి ప్రశ్నలు అడుగకయే మీముందు ఉంచబడిన దానిని భుజింపుడు.

28. (కాని “ఇది విగ్రహములకు అర్పింపబడిన ఆహారము” అని ఎవరైన చెప్పినచో దానిని భుజింపకుడు. ఏలయన, మీకు అటుల చెప్పినవాని నిమిత్తమును, మనస్సాక్షి నిమిత్తమును దానిని భుజింపకుడు.

29. అనగా మీ మనస్సాక్షి నిమిత్తము కాదు. అతని మనస్సాక్షి నిమిత్తమే). ఏలయన, వేరొకని సంకోచిత మనస్సాక్షిని బట్టి నా స్వేచ్చ ఏల పరిమితము కావలెను?

30. నేను కృతజ్ఞతతో భోజనములో పాల్గొన్నచో, నేను కృతజ్ఞతా స్తుతులు అర్పించి తిను ఆహారమునుగూర్చినన్ను విమర్శింపనేల?

31. నీవు తినినను, త్రాగినను, ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమకొరకై చేయుము.

32. యూదులకుగాని, అన్యులకుగాని, దైవసంఘమునకుగాని ఎట్టి బాధయు కలుగకుండునట్లు జీవింపుడు.

33. నా స్వప్రయోజనమును ఆశింపక, ఇతరులు రక్షింపబడవలెనని వారి మేలును కోరుతు, నేను చేయు పనులన్నింటియందు అందరిని ఆనందింపచేయుటకు ప్రయత్నించుచుంటిని. 

 1. నేను క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్నుఅనుసరింపుడు.

2. మీరు సదా నన్ను జ్ఞాపకము ఉంచుకొనుచు మీకు నేను అందజేసిన సంప్రదాయములను యథాతథముగా అనుసరించుచున్నారని మిమ్ము నేను పొగడుచున్నాను.

3. కాని ప్రతి వ్యక్తికి క్రీస్తు శిరస్సు అనియు, భర్త భార్యకు శిరస్సు అనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు గ్రహింపవలెనని నా అభిలాష.

4. కనుక తన తలను కప్పుకొని ఎవడు ప్రార్ధించునో, దైవసందేశమును ప్రవచించునో, అతడు తన తలను అవమానించుచున్నాడు.

5. అట్లే తన తలపై ముసుగువేసికొనక ఏ స్త్రీయైనను ప్రార్ధించినను, దైవసందేశమును ప్రవచించినను, ఆమె తన తలను అవమానించినట్లు అగును. అట్లయినచో ఆమెకు క్షౌరము జరిగినట్లే అగును.

6. తలపై ముసుగు వేసికొననొల్లని స్త్రీ, తనజుట్టునే కత్తిరించు కొనవలయును. అయితే క్షౌరము చేయించుకొనుటగాని, జుట్టు కత్తిరించుకొనుట గాని స్త్రీకి అవమానకరమైనచో ఆమెను ముసుగు ధరింపనిండు.

7. పురుషుడు దేవుని రూపమును మహిమను ప్రతిబింబించును కనుక, అతడు తన తలపై ముసుగువేసికొనరాదు. కాని స్త్రీ పురుషుని వైభవమును ప్రతిబింబించును.

8. ఏలయన పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీయే పురుషునినుండి సృష్టింపబడినది.

9. పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. స్త్రీయే పురుషుని కొరకు సృష్టింపబడినది.

10. కనుక, దేవదూతలనుబట్టి పురుషుని ఆధిక్యమునకు చిహ్నముగ స్త్రీ తన తలపై ముసుగువేసికొనవలెను.

11. కాని, ప్రభువునందు స్త్రీ పురుషుని విడిచి స్వతంత్రురాలు కాదు. అట్లే పురుషు డును స్త్రీని విడిచి స్వతంత్రుడు కాడు.

12. ఏలయన, స్త్రీ పురుషునినుండి రూపొందింపబడినట్లే ఇప్పుడు పురుషుడు స్త్రీనుండి జన్మించుచున్నాడు. ఇవి అన్నియు దేవునినుండి వచ్చినవి.

13. మీరే నిర్ణయించుకొనుడు. స్త్రీ తలపై ముసుగు వేసికొనక ప్రార్ధనలో పాల్గొనుట యుక్తమా?

14. పురుషునికి పొడవైన వెంట్రుకలు అవమానకరమని ప్రకృతియే బోధించుచున్నది కదా!

15. కాని అదియే స్త్రీకి గర్వింపదగినది. ఆ పొడవైన జుట్టే ఆమెకు తలను కప్పుకొనుటకు ఒసగ బడినది.

16. కాని ఎవరైనను దానిని గురించి వాదింపదలచినచో, మనకుగాని, దైవసంఘములకుగాని వేరొక విధమైన ఆచారము ఎట్టిదియునులేదు అని మాత్రమే నేను చెప్పవలెను.

17. కాని ఇక చెప్పబోవు ఉత్తరువులలో మిమ్ము పొగడను. ఏలన, మీ సమావేశములు నిజముగ మంచి కంటే చెడును ఎక్కువగ చేయుచున్నవి.

18. మొదటి విషయము ఏమనగా, మీరు దైవసంఘముగ సమావేశమైనపుడు మీలో విరుద్ధవర్గములు ఉన్నవని వినుచున్నాను. ఇది కొంతవరకు నిజమే అని నేను నమ్ముచున్నాను.

19. సన్మార్గమున ఉన్నవారు స్పష్టముగ గుర్తింపబడునట్లు మీలో వర్గములు ఉండి తీరవలెను.

20. మీరు సమావేశమైనపుడు మీరు తినునది ప్రభువు భోజనము కాదు.

21. ఏలయన, మీరు తినునప్పుడు మీ ఇష్టానుసారము తినుచుందురు. కొందరు ఇంకను ఆకలితోనే ఉండగా, కొందరు త్రాగి తూలుచుందురు.

22. తినుటకును త్రాగుటకును మీకు మీ ఇండ్లు లేవా? లేక మీరు దేవుని సంఘమును తృణీకరించి అవసరములో ఉన్న వ్యక్తులను అవమానింతురా? దీనిని గూర్చి మీకు నేను ఏమి చెప్పవలెను? మిమ్ము పొగడవలెనా? ఈ విషయమున నేను మిమ్ము పొగడను.

23. ఏలయన, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్ప గింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసికొని,

24. దేవునకు కృతజ్ఞతలు అర్పించి, దానిని త్రుంచి, “ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము. దీనిని నా జ్ఞాప కార్ధము చేయుడు” అని పలికెను.

25. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసికొని, “ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన. దీనిని మీరు పానము చేయునప్పుడెల్ల, నా జ్ఞాపకార్ధము చేయుడు” అని పలికెను.

26. కనుక, ఈ రొట్టెను భుజించు నప్పుడెల్ల, ఈ పాత్రనుండి పానము చేయునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు.

27. కనుక, అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను ఎవడైన తినినను, లేక ఆయన పాత్రనుండి త్రాగినను అతడు ప్రభువు శరీరమునకు, రక్తమునకు వ్యతిరేకముగ పాపము చేయుచున్నాడు.

28. కనుక, ప్రతి వ్యక్తియు ఆత్మపరిశీలనము కావించుకొని రొట్టెను తిని, పాత్రము నుండి త్రాగవలెను.

29. ఏలయన, ఎవడైనను రొట్టెను తినుచు, పాత్రము నుండి త్రాగుచు అది ప్రభువు శరీరము అని గుర్తింపనిచో, అతడు తినుటవలనను, త్రాగుటవలనను తీర్పునకు గురియగును.

30. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనముగ ఉన్నారు. కొందరు మరణించిరి.

31. మొదటనే మనము ఆత్మపరిశీలనము కావించుకొని నచో, మనము దేవుని తీర్పునకు గురికాము.

32. కాని, లోకముతో పాటు మనమును తీర్పు పొందకుండు టకై, మనము ప్రభువుచే తీర్పుచెప్పబడి శిక్షింపబడు చుంటిమి.

33. కాబట్టి సోదరులారా! ప్రభువు భోజనమున పాల్గొనుటకు సమావేశమైనపుడు మీరు ఒకరికొరకు ఒకరు వేచియుండుడు.

34. ఒకవేళ, ఎవడైనను ఆకలి గొనియున్నచో, మీ సమావేశమున మీరు దేవుని తీర్పునకు గురికాకుండుటకై, అతడు ఇంటి వద్ద భుజింపవలెను. ఇతర విషయములు నేను అచటకు వచ్చినపుడు పరిష్కరించెదను. 

 1. సోదరులారా! ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు.

2. మీరు అన్యులుగా ఉన్న కాలమున మీరు మూగవిగ్రహముల ప్రభావమునకు లోనై యుంటిరి. అవి మిమ్ము అన్యమార్గములకు కొనిపోయె డివి. ఇది మీకు తెలియును.

3. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు, “యేసు నాశనమగునుగాక!' అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు 'యేసే ప్రభువు' అని అంగీకరింపజాలడు.

4. కృపావరములు అనేకములు ఉన్నవికాని, వానిని ఒసగు ఆత్మ ఒక్కడే.

5. సేవలు అనేక పద్దతు లలో జరుగుచున్నవి. కాని సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే.

6. సేవచేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి. కాని అన్ని సేవలకును, అందరకును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును.

7. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మప్రత్యక్షత అనుగ్రహింపబడినది.

8. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరియొకనికి విజ్ఞాన పూర్వకమగు వాక్కును ఒసగు చున్నాడు.

9. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరియొకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు.

10. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని, మరియొకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింప గల శక్తిని ఇచ్చుచున్నాడు.

11. కాని వీనిని అన్నింటిని చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన ఒసగుచున్నాడు.

12. క్రీస్తు పెక్కు అవయవములుగల ఒకే శరీరము వంటివాడు. పెక్కుఅంగములతో కూడినను శరీరము ఒకటియే కదా!

13. అట్లే, యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను, మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరము లోనికి జ్ఞానస్నానమును పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి.

14. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు. అది పెక్కుఅంగములతో కూడినది.

15. "నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను" అని పాదము పలికినచో, అది శరీరమున ఒక భాగము కాకపోదు.

16. “నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను” అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు.

17. శరీరము అంతయును ఒక్క నేత్రమే యైనచో అది ఎట్లు వినగలదు? శరీరము అంతయును ఒక్క చెవియేయైనచో అది ఎట్లు వాసన తెలిసి కొనగలదు?

18. కాని, తన సంకల్పానుసారముగ ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను.

19. అంతయు ఒకే అవయవమైనచో శరీరమే ఉండదు.

20. కనుకనే పెక్కు అవయవములు గలవు కాని శరీరము ఒక్కటే.

21. కాబట్టి, “నీతో నాకు అవసరము లేదు!” అని కన్ను చేతితో పలుకజాలదు. అట్లే, “మీతో నాకు పనిలేదు!” అని శిరస్సు పాదములతో పలుకజాలదు.

22. అంతేకాక, బలహీనముగ తోచు అవయవములు లేకున్నచో మనము జీవితము గడపజాలము.

23. ముఖ్యమని మనము భావింపని అవయవములనే ఎంతయో శ్రద్ధగా చూచుకొందుము. అంద విహీన ములైన శరీరభాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా,

24. అందముగా ఉన్న శరీర అవయవములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవ విహీనములగు అవయవములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడే మన శరీరములను అటుల ఏర్పరచెను.

25. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని యందలి విభిన్న అవయవములన్నియు ఒకదానిపై ఒకటి సమానశ్రద్ధను కలిగియుండుటకు ఆయన అటుల చేసెను.

26. శరీరమున ఒక్క అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములును బాధపడును. ఒక అవయవము గౌరవము పొందినచో, దాని ఆనందమున మిగిలిన అవయవములన్నియు పాలుపంచుకొనును.

27. కావున మీరు అందరును క్రీస్తు శరీరము. ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే.

28. దేవుడు శ్రీ సభలో మొదట కొందరిని అపోస్తలులనుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలనుగాను, తదుపరి కొందరిని బోధకులనుగాను, ఆపైన కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థతకూర్పు శక్తిగలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయు వారినిగాను, కొందరిని పరిపాలకులనుగాను, కొందరిని వివిధములగు భాషలు మాట్లాడువారిని గాను నియమించెను.

29. అందరును అపోస్తలులా? అందరును ప్రవక్తలా? అందరును బోధకులా? అందరును అద్భుతములు చేయుదురా?

30. స్వస్థపరచు శక్తి అందరికిని కలదా? అందరును వివిధములగు భాషలలో మాటలాడుదురా? అందరును వాని అర్థమును తెలియజేయుదురా?

31. కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటి కంటె శ్రేష్ఠమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను.

 1. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడ నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమలేనిచో నా వాక్కు మ్రోగెడి కంచుతోను, గణగణలాడెడి తాళము తోను సమానము.

2. నేను ప్రవచింపగలిగినను, నిగూఢరహస్యములను అర్ధము చేసికొనగలిగినను, సమస్తజ్ఞానము కలవాడనైనను, పర్వతములను కూడ పెకలింపగల గొప్ప విశ్వాసమును కలిగివున్నను, ప్రేమలేని వాడనైనచో నేను వ్యర్ధుడనే.

3. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్ధము నా శరీరమునే త్యజించినను, ప్రేమలేనివాడనైనచో, అది నాకు నిరుపయోగము.

4. ప్రేమ సహనముకలది, దయకలది, అసూయకాని, డంబముకాని, గర్వముకాని ప్రేమకు లేవు.

5. అమర్యాదకాని స్వార్ధ పరత్వముకాని, కోపస్వభావముగాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు.

6. ప్రేమ, కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును.

7. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును.

8. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్థకములు. భాషలు నిలిచిపోవును. జ్ఞానము గతించును.

9. ఏలయన, మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము.

10. కాని సంపూర్ణమైనది వచ్చిననాడు అసంపూర్ణమైనవి నశించును.

11. నేను బాలుడనై ఉన్నప్పుడు, బాలునివలె మాట్లాడితిని, బాలునివలె తలంచితిని, బాలునివలె ఆలోచించితిని. కాని ఇప్పుడు పెద్దవాడనైనపుడు పిల్లల పద్దతులను వదలివేసితిని.

12. ఇప్పుడు మనము చూచునది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది. కాని అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంతమాత్రమే. కాని అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును.

13. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. 

 1. ప్రేమనే మీ ధ్యేయముగా ఉంచుకొనుడు. ఆధ్యాత్మికమగు వరములపై అందును విశేషించి ప్రవ చనవరముపై మీ మనసు నిలుపుకొనుడు.

2. భాషలలో మాట్లాడువాడు మానవులతో కాక, దేవునితో మాటలాడును. ఎవడును వానిని అర్థము చేసికొన లేడు. ఏలయన, ఆత్మద్వారా అతడు రహస్యసత్య ములను పలుకుచున్నాడు.

3. కాని ప్రవచించు వ్యక్తి మానవులతో మాట్లాడుచు, వారికి సాయమును, ప్రోత్సా హమును, ఆదరణను కలిగించుచున్నాడు.

4. భాషలలో మాట్లాడు వ్యక్తి తనకు తానే క్షేమాభివృద్ధి కలుగ చేసికొనును కాని, ప్రవచించు వ్యక్తి క్రీస్తు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.

5. మీరందరును భాషలలో మాట్లాడవలెనని నా కోరిక. కాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. ఏలయన, అతడు పలుకు దానిని క్రీస్తుసంఘ క్షేమా భివృద్ధికై వివరించిననే తప్ప, భాషలలో మాట్లాడు వ్యక్తి కంటె ప్రవచించు వ్యక్తియే అధికుడు.

6. కావున సోదరులారా! నేను మీవద్దకు వచ్చి భాషలలో మాటలాడినచో నా వలన మీకు ఉపయోగ మేమి? దేవుని ప్రకటననుగాని, జ్ఞానమునుగాని, ప్రవచనమునుగాని, బోధననుగాని మీకు వినిపించి ననేతప్ప నేను ఎంత మాత్రమును ఉపయోగకారిని కాను.

7. నిర్జీవములైన వాద్యవస్తువులగు వేణువు లేదా వీణ విషయములో కూడ ధ్వనులు స్పష్టముగ మ్రోగింప బడిననే తప్ప వాయింపబడుచున్న రాగమును ఎవడైనను ఎట్లు తెలిసికొనగలడు?

8. బాకా ఊదు వాడు స్పష్టమైన ధ్వనిని చేయనిచో యుద్ధమునకు ఎవరు సిద్ధపడుదురు?

9. అటులనే భాషలతో కూడిన నీ సందేశము స్పష్టముగాలేనిచో ఎవరైనను నీవు మాట్లాడునది ఎట్లు అర్థము చేసికొనగలరు? నీ మాటలు గాలిలో కలిసిపోవును.

10. ప్రపంచములో పెక్కుభాషలు ఉన్నవి. కాని వానిలో అర్థరహితమైనది ఒక్కటియు లేదు.

11. మాటలాడబడుచున్న భాష నాకు తెలియనిదైనచో దానిని మాట్లాడు వ్యక్తి నాకు పరదేశీయుడుగను, నేను వానికి పరదేశీయుడనుగను ఉందును.

12. ఆధ్యాత్మికవరములు పొందవలెననెడు ఆసక్తి మీలోవున్నది కనుక, క్రీస్తు సంఘాభివృద్ధికై వానిని సమృద్ధిగా పొందుటకు ప్రయత్నింపుడు.

13. కనుక భాషలో మాట్లాడు వ్యక్తి దాని అర్థమును తెలియపరచు శక్తికొరకై ప్రార్థింపవలెను.

14. ఏలయన, నేను భాషలో ప్రార్థించినచో, నిజముగ నా ఆత్మ ప్రార్ధించునుకాని, నా మనస్సు ఫలింపదు.

15. అయినచో నేను ఏమి చేయవలెను? నా ఆత్మతో ప్రార్ధించెదను, నా మనస్సుతో కూడ ప్రార్ధించెదను. నా ఆత్మతో పాడెదను, నా మనస్సుతోకూడ పాడెదను.

16. మీరు ఆత్మమూలముననే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనినచో, సమావేశమున పాల్గొను పామరుడు మీ కృతజ్ఞతాస్తుతికి ఎట్లు “ఆమెన్"అని బదులు పలుకగలడు? ఏలయన, మీరు చెప్పునది ఏమియో అతడు ఎరుగడు.

17. నీవు చక్కగనే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నావు. కాని దానివలన ఇతరులకు ఎట్టి అభివృద్ధియు కలుగదు.

18. మీ అందరికంటె నేను భాషలలో ఎక్కువగ మాటలాడువాడనైనందులకు దేవునకు కృతజ్ఞుడను.

19. కాని, క్రీస్తు సంఘపు ఆరాధనయందు అర్ధము కాని భాషలో పదివేల మాటలు మాట్లాడుటకంటె, ఇతరులకు బోధనందించ గలుగుటకై అర్థమగునట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలుకుట సముచితము.

20. సోదరులారా! పసిబిడ్డలవలె ఆలోచింప కుడు. చెడువిషయమున పసివారివలెయుండి, ఆలోచ నలలో పరిణతి చెందిన వారుగ ఉండుడు.

21. ధర్మశాస్త్రమున వ్రాయబడినట్లు, “అన్యభాషల ద్వారా, పరదేశీయుల పెదవుల ద్వారా, నేను ఈ ప్రజలతో మాటలాడుదును. కాని అప్పటికిని వారు నా మాటవినరు” అని ప్రభువు పలుకుచున్నాడు.

22. కనుక భాషలలో మాట్లాడుట అవిశ్వాసులకే కాని, విశ్వాసులకు గురుతు కాదు; ప్రవచించుట విశ్వాసులకే కాని, అవిశ్వాసులకు గురుతుకాదు.

23. ఒకవేళ సంఘమంతయు సమావేశమై, ప్రతివ్యక్తియు భాషలలో మాట్లాడుటకు ఆరంభించినచో, సామాన్యులు గాని, అవిశ్వాసులు గాని లోనికి వచ్చినచో, మీరు అందరును పిచ్చివారని వారు పలుకరా?

24. కాని, అందరు ప్రవచించినచో, ఎవడైన అవిశ్వాసికాని, సామాన్యుడుకాని లోనికి వచ్చినచో, అతనికి వినబడిన దానినిబట్టి, అతనికి తన పాపములను గూర్చి ఒప్పు దల కలుగును. తాను వినిన దానిచే అతడు తీర్పు పొందును.

25. అతని రహస్యమైన ఆలోచనలు బహిరంగము చేయబడును. అతడు సాగిలపడి దేవుని ఆరాధించుచు, “దేవుడు నిజముగ ఇచ్చట మీతో ఉన్నాడు!” అని అంగీకరించును.

26. సోదరులారా! ఇక ఏమి చేయవలెను? ఆరాధనకొరకు మీరు సమావేశమైనపుడు, ఒకడు సంకీర్తనము చేయవలెననియు, ఒకడు బోధింప వలెననియు, ఒకడు దేవుడు బయల్పరచిన దానిని ప్రకటింపవలెననియు, ఒకడు భాషలతో మాట్లాడవలెననియు, ఒకడు దానికి అర్థము చెప్పవలెననియు తలంచుచున్నారు. కాని ఇవి అన్నియు క్రీస్తు సంఘపు టాధ్యాత్మిక వికాసమునకై చేయుడు.

27. ఎవడైన భాషలలో మాటలాడవలెనన్నచో, ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే ఒకరి తరువాత ఒకరు మాటాడవలెను. ఆ చెప్పబడునది ఏమియో వేరొకనిచే వివరింపబడవలెను.

28. కాని వివరింపగల వ్యక్తి ఎవ్వడును లేనిచో వారిలో ప్రతివ్యక్తియు మౌనముగ ఉండి తనతోను, దేవునితోను మాత్రమే మాటలాడుకొనవలెను.

29. ప్రవక్తలలో ఇద్దరు లేక ముగ్గురు మాత్రము మాట్లాడవలెను. వారు చెప్పిన దానిని ఇతరులు వివేచింపవలెను.

30. సమావేశమున కూర్చున్న వారిలో ఎవడైన దేవునినుండి సందేశమును పొందెనేని, మాటలాడుచున్న వ్యక్తి తన మాటలు ఆపివేయవలెను.

31. అందరును నేర్చుకొని ప్రోత్స హింపబడుటకుగాను వీరు అందరును ఒకరి తరువాత ఒకరు ప్రవచింపవచ్చును.

32. ప్రవక్తల ప్రవచన శక్తి ప్రవక్తలకు లోబడి ఉండవలెను.

33. ఏలయన, క్రమరాహిత్యమునకు కాక సమాధానమునకే దేవుడు కర్త. పునీతుల సంఘములన్నింటిలోవలె

34. సమావేశములయందు స్త్రీలు మౌనముగా ఉండవలెను. వారు మాటలాడుటకు అనుమతి లేదు. యూదుల చట్టము పలుకుచున్నట్లుగ వారు అణకువతో ఉండవలెను.

35. వారు ఏదైన తెలిసికొనవలెనన్నచో ఇంటి వద్ద తమతమ భర్తలను అడుగవలెను. సంఘ సమావేశమున స్త్రీలు మాటలాడుట అవమానకరము.

36. మీ భావమేమిటి? దేవుని పలుకు మీ నుండియే బయల్వెడలినదా? లేక మీకు మాత్రమే అది లభించినదా?

37. ఎవడైనను తాను దేవుని ప్రవక్తనని లేక ఆత్మవరములు కలవాడనని భావించినచో, నేను మీకు వ్రాయునది ప్రభువు ఆజ్ఞ అని అతడు గ్రహింపవలెను.

38. కాని అతడు దీనిని గమనింపనిచో మీరు అతనిని గూర్చి శ్రద్ధవహింపవలదు.

39. కనుక సోదరులారా! ప్రవచించుటకై ఆసక్తితో కాంక్షింపుడు. భాషలలో మాటలాడుటను నిరోధింపకుడు.

40. కాని సమస్తమును సముచితము గను, క్రమబద్దముగను జరుగవలెను. 

 1. సోదరులారా! నేను బోధించునదియు మీరు గ్రహించినదియు, మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనెంచుచున్నాను.

2. మీరు ఉద్దేశరహితముగ విశ్వసించి ఉండిననే తప్ప, నేను మీకు బోధించిన విధముగ మీరు దానికి గట్టిగ అంటిపెట్టుకొని ఉంటిరేని, మీరు రక్షింపబడుదురు.

3. నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. లేఖనమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను.

4. లేఖనమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి, మూడవ దినమున సజీవుడుగ లేవనెత్తబడెను.

5. ఆయన పేతురునకు తదుపరి పండ్రెండుమంది అపోస్తలులకును కనబడెను.

6. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో ఐదువందలమందికి పైగా కన బడెను, వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియేయున్నారు.

7. ఆపైన యాకోబునకును తదుపరి అపోస్తలులకందరికిని ఆయన కనబడెను.

8. అకాలమందు జన్మించినట్లున్నవాడనైనను, చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను.

9. ఏలయన, అపోస్తలులందరిలో నేను అల్పుడను. దేవునిసంఘమును హింసించిన వాడనగుటచే అపోస్తలుడనని పిలువబడుటకు నేను అయోగ్యుడను.

10. కాని దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలులకంటె నేను ఎంతయో అధికముగా శ్రమించితిని. కాని అది నిజముగ నా ప్రయాస కాదు. అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే.

11. కనుక, నేను కాని, వారు కాని మేమందరమును బోధించునది ఇదియే. ఇదియే మీరు విశ్వసించినది.

12. మృత్యువునుండి క్రీస్తు జీవముతో లేవనెత్త బడెనని గదా మా సందేశము! మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు?

13. అదియే నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనియే గదా దాని అర్థము!

14. మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.

15. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తెననుటచే, దేవుని విషయములో మేము అసత్యమాడినట్లే. ఏలయన, మరణించినవారు జీవముతో లేవనెత్త బడరనునదియే నిజమైనచో, దేవుడు ఆయనను లేవ నెత్తనట్లేకదా!

16. మృతులు లేవనెత్తబడనిచో, క్రీస్తు లేవనెత్తబడలేదు.

17. క్రీస్తు లేవనెత్తబడనిచో, మీ విశ్వాసము వ్యర్థము. మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు.

18. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే.

19. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితముకొరకే అయినచో, ప్రపంచములో అందరికంటెను మనము అత్యంత దయనీయులము.

20. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువునుండి లేవనెత్త బడినవారిలో ప్రథముడనుట సత్యము.

21. ఏలయన, ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవే శించినట్లే, మృతుల పునరుత్థానము కూడ ఒక మనుష్యుని మూలముననే వచ్చినది.

22. ఆదామునందు అందరు ఎట్లు మృతి చెందుచున్నారో, అటులనే క్రీస్తు నందు అందరు బ్రతికింపబడుదురు.

23. కాని ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే: ప్రథమఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు.

24. అప్పుడు అంతము వచ్చును. పరి పాలకులను, అధికారులను, శక్తులను అందరిని క్రీస్తు జయించి రాజ్యమును తండ్రియగు దేవునికి అప్పగించును.

25. ఏలయన, దేవుడు శత్రువులనందరను ఓడించి ఆయన పాదములక్రింద ఉంచువరకు క్రీస్తు పరిపాలింపవలెను.

26. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు.

27. “ఏలయన దేవుడు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచెను” అని లేఖనము పలుకుచున్నది. సమస్తము, అనగా దేవుడు మినహా సమస్తమును, ఆయనయే క్రీస్తు పాదముల క్రింద ఉంచెననునది సుస్పష్టము.

28. కాని, సమస్తమును క్రీస్తు పాలనకు లోనుగావించిన తరువాత, కుమారుడగు ఆయనయే సమస్తమును తనకు లోబరచిన దేవునకు తనను తాను లోబరచుకొనును. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును.

29. మరి మృతులకొరకై జ్ఞానస్నానమును పొందిన వారి విషయమేమి? వారు ఏమి సాధింప గోరెదరు? వారు చెప్పుకొను విధమున మరణించిన వారు మరల లేవనెత్తబడరనుటయే యథార్థమైనచో, మరి మృతులకొరకై వారు ఏల జ్ఞానస్నానమును పొందుచున్నారు.

30. మరి మనకు ఏల అనుక్షణమును ప్రమాదములు సంభవించుచున్నవి?

31. సోదరులారా! ప్రతిదినమును నేను మృత్యుముఖమును చూచుచున్నాను? మన ప్రభువగు యేసుక్రీస్తు నందలి మన జీవితమున మీయందు నాకున్న గర్వము నాచే ఇట్లు చెప్పించుచున్నది.

32. కాని, మనుష్య రీతిగా ఎఫెసులోని మృగములతో నేను పోరాడియున్నచో నేను పొందిన లాభమేమి? మరణించినవారు జీవముతో లేవనెత్తబడనిచో, “రేపు మనము మరణింతుము కనుక హాయిగా తిని త్రాగుదము.”

33. మోసపోకుడు: “దుష్టసాంగత్యము మంచి నడవడికను నాశనము చేయును.”

34. జ్ఞానము కలిగి పాపమార్గమునుండి మరలిపోవుడు. మీలో కొందరు దేవుని ఎరుగరు. మీరు సిగ్గుపడుటకై యిట్లు చెప్పు చున్నాను.

35. “చనిపోయినవారు ఎట్లు జీవముతో లెవ నెత్తబడుదురు? వారికి యెట్టి శరీరముండును?” అని ఎవడైన ప్రశ్నింపవచ్చును.

36. మూర్బుడా! ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు అది మరణింపనిదే మొలకెత్తదు.

37. నీవు భూమిలో నాటునది విత్తనము మాత్రమే. నీవు నాటునది గోధుమగింజయో, లేక మరియొకటియో; కాని పెద్దది కాబోవు మొక్కకాదు.

38. తన సంకల్పమును అనుసరించి దేవుడు దానికి శరీరమును ఒసగును. ఒక్కొక్క గింజ కును దానికి తగిన శరీరమును ఒసగును.

39. అట్లే జీవకోటియొక్క శరీరములన్నియు ఒకే విధముగా ఉండవు. మానవులకు ఒక విధము, జంతువులకు మరియొక విధము, పక్షులకు వేరొక విధము, చేపలకు ఇంకొక విధము.

40. అట్లే ఆకాశ వస్తురూపములును, భూవస్తురూపములును ఉన్నవి. భూవస్తు రూపముల వైభవము ఒక విధమైనది. ఆకాశ వస్తురూపముల వైభవము వేరొక విధమైనది.

41. సూర్యుని వైభవము ఒక విధము. చంద్రునిది వేరొక విధము. నక్షత్రములది మరియొక విధము. ఆ నక్షత్రములలోనుపెక్కు విధములగు వైభవములున్నవి.

42. మృతులు పునర్జీవితులు చేయబడునపుడు ఇట్లుండును: శరీరము క్షయమగునదిగా విత్తబడి అక్షయమగునదిగా లేపబడును.

43. అది గౌరవము లేనిదిగా విత్తబడి, వైభవముగలదిగా లేపబడును. అది బలహీనమైనదిగా విత్తబడి, బలముగలదిగా లేపబడును.

44. భౌతికశరీరముగా అది విత్తబడి, ఆధ్యా త్మిక శరీరముగా అది లేపబడును. భౌతికశరీరము ఉన్నది కనుక ఆధ్యాత్మికశరీరమును ఉండవలెను.

45. ఏలయన, “మొదటి మానవుడు ఆదాము సజీవిగ సృష్టింపబడెను” అని లేఖనము పలుకుచున్నది. కాని, చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ.

46. మొదట వచ్చునది ఆధ్మాత్మికమైనది కాదు. మొదట భౌతికము, తదుపరి ఆధ్మాత్మికము.

47. మొదటి ఆదాము భువియందలి మట్టితో చేయబడెను. రెండవ ఆదాము దివినుండి వచ్చెను.

48. భువికి సంబంధించిన వారు భువినుండి చేయబడినవానిని పోలియుందురు. దివికి సంబంధించిన వారు దివినుండి వచ్చినవానిని పోలియుందురు.

49. భువినుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివినుండి వచ్చిన వాని పోలికను పొందగలము.

50. సోదరులారా! నా భావమిది: రక్త మాంస ములతో చేయబడినది దేవుని రాజ్యమున పాలుపంచు కొనలేదు. భౌతికమైనది అమరత్వమును పొందలేదు.

51. ఈ రహస్యమును వినుడు. అందరమును మరణింపము. కాని, చివరి బాకా మ్రోగగానే,

52. రెప్పపాటులో మనయందు మార్పు సంభవించును. ఏలయన, అది మ్రోగుటతో మృతులు అమరులై లేవనెత్తబడుదురు. మనము అందరమును మారిపోవుదుము.

53. ఏలయన, భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనవలెను. మరణించునది మరణింపని దానిని ధరించుకొనవలెను.

54. కనుక భౌతికమయినది అమరమయిన దానిని కప్పుకొనినపుడు, మర ణించునది మరణింపనిదానిని ధరించినపుడు, “మృత్యువు నాశనము చేయబడినది; విజయము సంపూర్ణము”  అను లేఖన వాక్యము యథార్థమగును.

55. ఓ మృత్యువా! నీ విజయము ఎక్కడ?  ఓ మృత్యువా! బాధకలిగింపగల నీ ముల్లు ఎక్కడ?

56. మరణపు ముల్లు పాపము. పాపమునకున్నబలము ధర్మశాస్త్రమే.

57. కాని మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు!

58. కనుక, ప్రియతమ సోదరులారా! దృఢముగా స్థిరముగా నిలబడుడు. ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధచూపుడు. ఏలయన, ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియునుగదా! 

 1. ఇక దేవుని ప్రజలకు సాయపడు విషయము:గలతీయలోని క్రైస్తవ సంఘములను నేను ఏమి చేయుమని చెప్పితినో మీరు అది చేయవలెను.

2. వారములో మొదటి రోజున ప్రతివ్యక్తియు తాను సంపా దించిన దానికి అనుగుణముగ కొంతధనమును ప్రక్కన పెట్టి దాచి ఉంచవలెను. అటులైనచో నేను వచ్చినప్పుడు డబ్బు ప్రోగుజేయవలసిన అవసరము ఉండదు.

3. నేను వచ్చిన పిదప మీ ఆమోదమును పొందిన వ్యక్తులకు పరిచయ పత్రముతో మీ దానములను ఇచ్చి యెరూషలేమునకు పంపుదును.

4. నేనును పోవుట మంచిదనిపించినచో వారు నావెంట వత్తురు.

5. మాసిడోనియాలో సంచారమునకు వెళ్ళ ఉద్దేశించుచున్నాను గనుక, మాసిడోనియాలో సంచారమునకు వెళ్ళినపుడు మీ యొద్దకు వచ్చెదను.

6. మీతో కొంత కాలము గడపగలననుకొనుచున్నాను. ఒకవేళ చలికాలమంతయు అచటనే ఉందునేమో. తరువాత నేను పోవలసిన ప్రదేశమునకు పయనించుటలో మీరు తోడ్పడ వచ్చును.

7. మార్గమధ్యమున మిమ్ము చూచి, వెంటనే దాటిపోవుట నాకు ఇష్టములేదు. ప్రభువు అనుగ్రహించినచో మీతో కొంతకాలము గడపగలనను కొనుచున్నాను.

8. పెంతెకోస్తుదినమువరకు ఎఫెసులోనే గడిపెదను.

9. పెక్కు మంది విరోధులున్నను సముచితమగు కృషిసలుపుటకు ఇక్కడ ఎంతయో అవకాశము వున్నది. దానికి తగిన విశాలమైన తలుపు నా కొరకు తెరువబడి వున్నది.

10. తిమోతి అటు వచ్చినచో అతడు మీతో నిర్భయముగ సంచరించునట్లు చూడుడు. అతడును నావలెనే ప్రభువుకొరకు కృషి సలుపుచున్నాడు.

11. ఎవరును అతనిని అవమానింపరాదు. అతడు నన్నుచేరుకొనుటకై ప్రశాంతముగ తన ప్రయాణమును సాగించుకొనుటకు మీరు అతనికి సాయపడవలెను. సోదరులతో పాటు అతనికొరకై నేను ఎదురుచూచు చున్నాను.

12. సోదరుడగు అపోల్లో విషయము: ఇతర సోదరులతోపాటు అతడును మిమ్ము చూడ బోవలెననిన పెక్కుమార్లు అతనిని నేను ప్రోత్సహించి తిని. కాని, ఇప్పుడే బయలుదేరుట అతనికి ఏ మాత్రము ఇష్టము లేదు. సరియైన అవకాశము లభించినపుడు అతడు రాగలడు.

13. జాగరూకులై ఉండుడు. విశ్వాసమున దృఢముగ ఉండుడు. ధైర్యము కలిగి బలవంతులై ఉండుడు.

14. ప్రేమపూర్వకముగ అన్ని పనులు చేయుడు. .

15. స్తెఫాను, అతని కుటుంబము మీకు తెలిసినదే. అకాయియలో వారే మొదట క్రీస్తును స్వీకరించిరి. దేవుని ప్రజల సేవకు వారు తమను అర్పించు కొనిరి.

16. సోదరులారా! అట్టి వారికిని, వారితో పాటు నిష్ఠగా సేవచేయువారి నాయకత్వమునకు మీరు లోబడియుండుడని నేను మిమ్ము అర్థించుచున్నాను.

17. స్తెఫానా, ఫోర్తునాతు, అకయికూసు రాకడ నాకు ఆనందదాయకము. మీరు లేని లోపమును వారు తీర్చి,

18. మిమ్ము ఆనందింపజేసినట్లే నన్నును ఆనందింపజేసిరి. ఇట్టి వారు గుర్తింపదగినవారు.

19. ఆసియా మండలములోని క్రీస్తు సంఘములు మీకు తమ శుభాకాంక్షలను పంపుచున్నవి. అక్విల, ప్రిస్కా, వారి యింటియందు సమావేశమగు దైవసంఘము మీకు ప్రభువునందు హృదయపూర్వక శుభాకాంక్షలు అందించుచున్నారు.

20. ఇచ్చట సోదరులందరు మీకు శుభాకాంక్షలను అందించు చున్నారు. సోదరులవలె మీరు ఒకరిని ఒకరు పవిత్ర మైన ముద్దుపెట్టుకొని శుభాకాంక్షలను తెలుపుకొనుడు.

21. పౌలునైన నేను నా స్వహస్తములతో ఈ శుభవచనములు వ్రాయుచున్నాను.

22. ప్రభువును ప్రేమింపనివాడు శపింప బడునుగాక! మరనాత!

23. యేసుప్రభువు అనుగ్రహము మీతో ఉండునుగాక!

24. క్రీస్తు యేసునందు నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక! ఆమెన్.