ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెషయా 6

 1. ఉజ్జీయారాజు గతించిన యేడు ఉన్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను.

2. ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సెరాపులు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. వారు రెండు రెక్కలతో తమ ముఖమును, రెండింటితో కాళ్ళను కప్పుకొని రెండింటితో ఎగురుచుండిరి.

3. ఆ దేవదూతలు ఒకరితోనొకరు: "సైన్యములకధిపతియైన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది” అని యెలుగెత్తి పలుకుచుండిరి.

4. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. దేవళము పొగతో నిండెను.

5. నేను: “హా! చెడితినిగదా! నా నోటినుండి వెలువడునవన్నియు అపవిత్రమైనమాటలే. అపవిత్రమైనమాటలు పలుకు ప్రజలనడుమ నేను వసించుచున్నాను. రాజును, సైన్యములకధిపతియునైన ప్రభువును నా కన్నులతో చూచితినిగదా!” అని అనుకొంటిని.

6. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరివచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీదినుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొనివచ్చెను.

7. ఆ కణికను నా నోటికి అంటించి “ఇది నీ పెదవులకు సోకినది. కనుక నీ పాపము తొలగిపోయినది. నీ దోషమునకు పరిహారము జరిగినది” అని పలికెను.

8. అప్పుడు ప్రభువు: “నేనెవరిని పంపుదును? మనకొరకు ఎవడు పోవును?” అని పలుకుచుండగా నేను వింటిని. “చిత్తగించుము! నేనున్నాను, నన్నుపంపుడు” అని నేను అంటిని.

9. ప్రభువు నాతో ఇట్లనెను: “నీవు ఈ ప్రజలయొద్దకు పోయి వారితో ఇట్లు చెప్పుము: 'మరల మరల విన్నను మీకు అర్థముకాదు! మరలమరల చూచినను మీరు గ్రహింపలేరు!"

10. మరియు ఆయన నాతో ఇట్లు చెప్పెను: నీవు ఈ జనుల హృదయాలు మొద్దువారునట్లు చేయుము, వారి చెవులు చెవిటి వగునట్లు చేయుము, కన్నులు గ్రుడ్డివగునట్లు చేయుము. అప్పుడు వారు చూడజాలరు, వినజాలరు, అర్థము చేసుకోజాలరు. పరివర్తనము చెందజాలరు, స్వస్థతను బడయజాలరు.”

11. అందులకు నేను “ప్రభూ ! ఇట్లు ఎన్నాళ్ళు జరుగును?” అని ప్రశ్నింపగా ఆయన ఇట్లు నుడివెను: “పట్టణములు నాశనమై నిర్మానుష్యమగు వరకును గృహములు శూన్యమగు వరకును, దేశము పాడువడు వరకును,

12. నేను ప్రజలను దూరముగా పంపివేయగా దేశమంతయు నిర్జన ప్రదేశమగు వరకును ఇట్లే జరుగును.

13. దేశమున పదియవవంతు మిగిలియున్నను వారును చత్తురు. సింధూరమును నరికివేయగా, దాని మొద్దు మాత్రము మిగిలియున్నట్లుగా ఉండిపోవును. ఆ మొద్దు నుండి మరల పవిత్ర ప్రజ చిగురించును.”