ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెషయా 63

 1. ఎదోమునందలి బోస్రా నుండి వచ్చు ఇతడెవడు? వైభవోపేతముగా రక్తవర్ణ వస్త్రములుతాల్చి బలాధిక్యముతో ఠీవిగా విచ్చేయు ఇతడు ఎవడు? “నేను నా నీతిని ఎరిగించువాడను. నా ప్రజలను రక్షించుటకు సమర్థుడనైనవాడను.”

2. ద్రాక్షపండ్లను నలగదొక్కి రసము తీయువానివలె నీ దుస్తులు ఎఱ్ఱగానున్నవేల?

3. “నేను ఒక్కడనే జాతులను , ద్రాక్షపండ్లవలె నలగద్రోక్కితిని. నాకు సాయపడుటకు ఎవరును రారైరి.  నేను కోపముతో జాతులను నలగదొక్కితిని. రౌద్రముతో వారినణచితిని.  వారి నెత్తురు నా బట్టలమీద చింది పడగా నా దుస్తులన్నిటికి మరకలైనవి.

4. నా ప్రజలను రక్షించుసమయమును, వారి శత్రువులను శిక్షించుకాలమును ఆసన్నమైనదని నేను భావించితిని.

5. నేను సహాయము కొరకు పారజూచితిని గాని నాకు తోడ్పడువాడెవడును' కన్పింపడయ్యెను. ఎవడును నన్ను ఆదుకోనందులకు నేను ఆశ్చర్యపడితిని. కాని నా బాహువే నాకు సహాయమయ్యెను. నా ఉగ్రతయే నాకు ఆధారమయ్యెను.

6. నేను కోపముతో జాతులను నలగదొక్కితిని. ఆగ్రహముతో వారిని కండతుండెములు చేసితిని. వారి నెత్తుటిని నేలపై చిమ్మితిని.”

7. నేను ప్రభువు ప్రేమను కీర్తించెదను, ప్రభువు మనకు చేసిన అద్భుతకార్యములను స్తుతించెదను. ఆయన మిక్కుటమైన కరుణతో ప్రేమతో యిస్రాయేలునకు చాల మేలులు చేసెను.

8. ప్రభువు యిస్రాయేలు గూర్చి వీరు నా ప్రజలు, వీరు నా తనయులు కనుక నన్ను మోసగింపరని ఎంచెను.

9. కనుక వారి ఆపదలు అన్నింటిలోను, ఆయన వారికొరకై బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. దయతో, ప్రేమతో వారిని కాపాడెను. పూర్వదినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొని మోసికొనిపోయెను.

10. కాని యిస్రాయేలీయులు ఆయన మీద తిరుగబడి ఆయన పవిత్రాత్మను దుఃఖపెట్టిరి. కావున ఆయన వారికి శత్రువై వారితో పోరాడెను. 

11. కాని యిస్రాయేలీయులు మోషేయున్న పూర్వదినములను జ్ఞప్తికి తెచ్చుకొని, తమ ప్రజలనాయకులకు సహకారియై సముద్రము గుండా తమను నడిపించిన ప్రభువేడీ? తన పవిత్రాత్మను తమలో ఉంచినవాడేడి? అని ప్రశ్నించిరి.

12. స్వీయశక్తితో మోషేద్వారా మహాకార్యములు సల్పి, నీళ్ళను పాయలుగా చేసి, కీర్తిని బడసిన ప్రభువేడీ? అని అడిగిరి.

13. గుఱ్ఱము ఎడారిలో కాలుజారి పడకుండ నడచినట్లే తన ప్రజలను సముద్రము గుండ నడిపించిన ప్రభువేడీ? అని ప్రశ్నించిరి.

14. ఎద్దులను పచ్చికలోయలోనికి తోలుకొని పోయినట్లే ప్రభుని ఆత్మ , తన ప్రజలను విశ్రమ స్థానమునకు కొనిపోయెను. ఆ రీతిగా ఆయన ప్రజలను నడిపించిన తనకు కీర్తి తెచ్చుకొనెను.

15. ప్రభూ! పరమునుండి, పవిత్రమును మహిమాన్వితములైన నీ నివాసస్థలము నుండి మమ్ము కరుణతో వీక్షింపుము. నీకు మా పట్ల ఆదరభావమేది? నీ శూర కార్యములేవి? నీ నెనరేదీ? నీ ప్రేమ యేదీ? నీవు మమ్ము పట్టించుకోవా?

16. నిక్కముగా నీవే మాకు తండ్రివి. "అబ్రహాము మమ్మెరుగకపోయినను, యాకోబు మమ్మును అంగీకరింపకపోయినను, యావే, నీవే మా తండ్రివి. అనాదికాలము నుండి మా విమోచకుడవని నీకు పేరే కదా!

17. ప్రభూ! నీవు మేము నీ మార్గమునుండి వైదొలగునట్లు చేసితివేల? మేము నీకు భయపడకుండునట్లు మా హృదయములను నీవేల కఠినపరిచితివి? నీ దాసులను చూచి, నీ వెన్నుకొనిన తెగలను చూచి నీవు మా యొద్దకు మరలిరమ్ము.

18. దుష్టులు నీ మందిరమున అడుగిడనేల? మా శత్రువులు నీ దేవాలయమును  తమ కాళ్ళతో తొక్కనేల?

19. చాలకాలమునుండి మేము నీ పరిపాలనకు నోచుకోని జనులవంటి వారమైతిమి. నీకుచెందని ప్రజలవంటి వారమైతిమి.