ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెషయా 5

 1. నేను నా ప్రియునికి ఒక పాటపాడెదను, నా చెలికానిని గూర్చి, అతని ద్రాక్షతోటను గూర్చి పాడెదను. సారవంతమైన కొండపై నా ప్రియుడికొక ద్రాక్షతోట కలదు.

2. అతడు ఆ తోటనుత్రవ్వి రాళ్ళు ఏరివేసి మేలైన ద్రాక్షతీగలు నాటెను. తోటనడుమ బురుజుకట్టి, రసము తీయుటకు తొట్టిని తొలిపించెను. అతడు ద్రాక్షపండ్లకొరకు ఎదురుచూచెను. కాని ఆ తోట పుల్లనికాయలు కాచెను.

3. కనుక యెరూషలేము పౌరులారా! యూదావాసులారా! మీరు నాకును, నా తోటకును తీర్పుచెప్పుడు.

4. నేను నా తోటకు చేయవలసిన సేవలన్నింటిని చేసితినిగదా! ఇంకా దానికి నేనేమి చేయవలెను? పండ్లు ఫలించునని నేను కాచుకొనియుండగా అది పుల్లనికాయలు కాయనేల?

5. నేను నా తోటనేమి చేయుదునో వినుడు! దాని కంచెను కొట్టి వేయుదును. గొడ్లు దానిని మేయును. దాని ప్రాకారమును పడగొట్టుదును. వన్యమృగములు దానిని తొక్కివేయును.

6. అది పాడువడిపోవునట్లు చేయుదును. నేను ద్రాక్ష కొమ్మలను కత్తిరింపను. పారతో నేలత్రవ్వను. దానిలో ముండ్లపొదలు ఎదుగును. దానిమీద వాన కురవవలదని , మబ్బులను ఆజ్ఞాపింతును.

7. యిస్రాయేలు జనులు సైన్యములకధిపతియైన ప్రభువు ద్రాక్షతోట. యూదాప్రజలు ఆయనకు ప్రీతిగొలుపు వనము. ఆయన న్యాయమును అపేక్షించెనుగాని, అక్కడ దౌర్జన్యముండెను. ఆయన నీతిని కాంక్షించెనుగాని అన్యాయమునకు బలియైనవారి  ఆక్రందనము వినిపించెను.

8. ఇంటికి ఇల్లు, పొలమునకు పొలము కలుపుకొని ఇతరులకు ఏ మాత్రము తావు మిగులనీయక దేశమున తాము మాత్రమే వసించువారు శాపగ్రస్తులు.

9. నేను వినుచుండగా సైన్యములకధిపతియైన ప్రభువిట్లు ప్రమాణము చేసెను: “సుందరములైన మహాభవనములు అనేకములు నిర్మానుష్యమగును. "

10. పది ఎకరాల ద్రాక్షతోట మలుపులుఒక్క పీపాయిరసమును ఇచ్చును. పదికుంచాల విత్తనాలు ఒక్కకుంచము పంటనొసగును."

11. వేకువన లేచినప్పటినుండే మద్యపానము ప్రారంభించి, రేయి ప్రొద్దుపోవు వరకు త్రాగి  కైపెక్కియుండువారు శాపగ్రస్తులు.

12. వారు స్వరమండలములు, తంత్రీవాద్యములు, సితారాలు, పిల్లనగ్రోవులతోను, ద్రాక్షారసముతోను ఉత్సవములు చేసికొందురు. కాని ప్రభువు కార్యములను ఏ మాత్రము గమనింపరు. ఆయన చెయిదములను ఏమాత్రము పరిశీలింపరు.

13. నా ప్రజలకు గ్రహణశక్తి లేదు. కనుక వారు ప్రవాసము వాతబడుదురు. ప్రజానాయకులు ఆకలితోచత్తురు. సామాన్య ప్రజలు దప్పికతో నశింతురు.

14. పాతాళము వారికొరకు ఆకలికొనియున్నది. నోరు విశాలముగా తెరచుకొనియున్నది. యెరూషలేమునందలి ప్రముఖులును, రణగొణ ధ్వనిచేయు సామాన్య ప్రజలును దాని నోటబడుదురు.

15. ప్రభువు మానవమాత్రులనెల్ల అణగదొక్కును. గర్వాత్ములను అణచివేయును.

16. సైన్యముల కధిపతియైన ప్రభువు తన తీర్పుద్వారా అధికుడగును. పవిత్రుడైన ప్రభువు తన న్యాయముద్వారా "స్వీయపావిత్య్రమును వెల్లడిచేయును.

17. పాడువడిన నగరములలో గొఱ్ఱెపిల్లలు గడ్డిమేయును. మేకపిల్లలు మేతమేయును.

18. త్రాళ్ళతో కట్టి లాగుకొని పోయినట్లుగా తమ దోషములను తమ వెంట లాగుకొనిపోవువారు శాపగ్రస్తులు.

19. “ప్రభువు తాను చేయబూనిన పనిని శీఘ్రమే చేయునుగాక! మనమెల్లరమును ఆ కార్యమును చూడవచ్చును. పవిత్రుడైన యిస్రాయేలు దేవుడు తన సంకల్పమును నెరవేర్చునుగాక! అప్పుడు ఆయన ఆలోచనలను మనము అర్ధము చేసికోవచ్చును” అని వారు పలుకుచున్నారు.

20. చెడును మంచిగాను, మంచిని చెడుగాను చిత్రించి; . వెలుతురును చీకటిగాను, . చీకటిని వెలుతురుగాను మార్చి; చేదును తీపిగాను, తీపిని చేదుగాను చేయువారు శాపగ్రస్తులు.

21. తమను తాము తెలివికల వారినిగాను, బుద్ధిమంతులనుగాను ఎంచుకొనువారు శాపగ్రస్తులు.

22. ద్రాక్షరసమును సేవించుటయందును, ఘాటయిన మద్యములను కల్పుటయందును వీరులయినవారు శాపగ్రస్తులు.

23. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పుతీర్చెదరు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.

24. కావున అగ్నినాలుక దుబ్బులను దహించునట్లును, ఎండుగడ్డి అగ్గిలో మాడిపోవునట్లును వారి వ్రేళ్ళు కుళ్ళిపోవును. వారి పూవులు ఎండి ధూళివలె ఎగిరిపోవును. వారు సైన్యములకధిపతియైన ప్రభువు చట్టమును తిరస్కరించిరి.  యిస్రాయేలీయుల పవిత్రదేవుడైన దేవుని వాక్కును తృణీకరించిరి.

25. ప్రభువు కోపము ఆయన ప్రజలమీద రగుల్కొనినది. ఆయన వారిని శిక్షించుటకు చేతులెత్తును. కావున పర్వతములు కంపించును. వీధులలో పీనుగులు పెంటకుప్పలవలె ప్రోగువడును. ఆయన కోపము ఇంకను మరలింపబడలేదు. ఆయన బాహువు ఇంకను చాచబడియున్నది.

26. దూరప్రాంతమందలి జాతిని పిలుచుటకు ప్రభువు జెండాను ఎత్తెను. నేల అంచుల నుండి దానిని రప్పించుటకు ఆయన ఈలవేసెను. అదిగో! ఆ ప్రజ శీఘ్రముగా కదలివచ్చుచున్నది.

27. వారిలో అలసిపోయినవాడును, పడిపోవువాడును, నిద్రపోవువాడును, కునికిపాట్లు పడువాడును, నడికట్టు విడిపోయినవాడును, పాదరక్షలు తెగినవాడు ఒక్కడును ఉండడు.

28. వారి బాణములు వాడిగానున్నవి. వారు తమ విండ్లు ఎక్కుపెట్టి ఉన్నారు. వారి గుర్రలగిట్టలు చెకుముకి రాళ్ళవలె గట్టిగా నున్నవి. వారి రథచక్రములు సుడిగాలివలె తిరుగుచున్నవి.

29. వారు సింగములవలె, సింగపుకొదమలవలె గర్జింతురు. ఎరను పట్టి తమతావులకు గొనిపోవుదురు. ఇక ఆ వేటను ఎవడును విడిపింపజాలడు.

30. ఆ రోజున వారు యిస్రాయేలీయులమీదికి ఎత్తివచ్చి సముద్రమువలె ఘోషింతురు. దేశమువైపు పారజూచినచో అంధకారము, శోకము కనబడును. దేశముమీది వెలుగు మేఘముల వలన చీకటియగును.