ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెషయా 4

 1.  ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని “మేము మా అన్నమునే తిందుము, మా వస్త్రములనే తాల్తూము, మమ్ము నీ పేరున చలామణి కానిమ్ము. అప్పుడు మా అవమానము తొలగిపోవును” అని అందురు.

2. ఆ రోజున ప్రభువు చిగురు సొబగుగను, గొప్పదిగను ఉండును. నేలనుండి మొలచిన పైరు యిస్రాయేలు శేషజనమునకు, గర్వకారణముగను అలంకారముగను ఉండును.

3. సియోనున శేషించియున్నవారు, యెరూషలేమున మిగిలియున్నవారు, అనగా జీవమునొంద యెరూషలేములో దాఖలైన ప్రతివాడును పరిశుద్ధుడని పిలువబడును.

4. ప్రభువు తీర్పుతీర్చు ఆత్మచే, దహించు ఆత్మచే ప్రజలకు తీర్పుతీర్చి, వారిని శుద్ధిచేయును. ఆయన సియోను కుమార్తెల మాలిన్యమును కడిగివేయును. సియోనునందు చిందిన నెత్తుటికి ప్రాయశ్చిత్తము చేయును.

5. ఆయన సియోను కొండమీదను, దానిపైని ప్రోగయిన జనము మీదను పగలు మబ్బును, పొగను క్రమ్మించును. రేయి కాంతిమంతమైన జ్యోతిని వెలుగించును. ప్రభువు తేజస్సు నగరమంతటిని చాందినివలె కప్పును.

6. ఆయన తేజస్సు గుడారమై పగలు ప్రజలను ఎండ పొడనుండి కాపాడును. జనులు తలదాచుకొను తావుగా ఉండును. వాన, గాలివాన వచ్చినపుడు ఆశ్రయముగా ఉండును.