ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెషయా 45

 1. ప్రభువు కోరెషును అభిషిక్తుని గావించెను. జాతులను జయించుటకును, రాజుల అధికారమును అడ్డగించుటకును అతనిని నియమించెను. ప్రభువు అతనికి నగరద్వారములు తెరచును. అట్టి కోరెషుతో ప్రభువు ఇట్లు నుడివెను:

2. “నేను నీకు మార్గము సిద్ధము చేయుటకు కొండలను చదునుచేయుదును. ఇత్తడి ద్వారములను పగులగొట్టి వాని ఇనుపగడెలను విరుగగొట్టెదను.

3. చీకటి తావులలో రహస్యముగా దాచియుంచిన నిధులను నీవశము గావించెదను. అప్పుడు నీవు, నేను ప్రభుడనని తెలిసికొందువు. యిస్రాయేలు దేవుడు నిన్ను పేరెత్తి పిలిచెనని గ్రహింతువు.

4. నా సేవకుడైన యాకోబునకు, నేనెన్నుకొనిన యిస్రాయేలునకు తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. నీవు నన్ను ఎరుగకున్నను, నేను నిన్ను ఘనుని చేసెదను.

5. నేను ప్రభుడను, నాకు సాటివాడు లేడు. నేనుతప్ప వేరొక వేల్పులేడు. నన్ను గూర్చి నీకు తెలియకున్నను, నేను నిన్ను బలాఢ్యుని జేయుదును.

6. దీనివలన తూర్పునుండి పడమటి వరకును గల జనులెల్లరు, నేనుతప్ప మరియొక దేవుడు లేడని తెలిసికొందురు. నేను ప్రభుడను, వేరొక దైవములేడు.

7. వెలుగును చీకటినిగూడ నేనే కలిగింతును. మంచిని చెడునుగూడ నేనే చేయుదును.  వీనినెల నేనే చేయుదును.

8. ఆకాశమా! పైనుండి నీతిని కురిపించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు, నీతిని మొలకెత్తించునుగాక! విమోచనను అంకురింపచేయుగాక! ప్రభుడనైన నేను ఈ కార్యము చేయుదును.

9. కుండలలో ఒకటైన మట్టికుండ తనను చేసిన కుమ్మరితో వాదము చేయునా! మట్టి కుమ్మరితో 'నీవేమి చేయుచున్నావు' అని అడుగునా? కుండ కుమ్మరితో 'నీకు నేర్పు చాలదు' అని పలుకునా? 

10. బిడ్డడు తండ్రితో 'నీవు నన్నిట్లుకననేల' అని పలుకునా?? అట్లే తల్లితో 'నీవు గర్భమున ధరించినదేమి?" అని అడుగునా?

11. యిస్రాయేలును సృజించినవాడును, యిస్రాయేలు పవిత్ర దేవుడునైన ప్రభువు ఇట్లనుచున్నాడు: “మీరు నా బిడ్డలను గూర్చి నన్ను ప్రశ్నింతురా? నేనేమి చేయవలెనో నాకు నేర్పింతురా?

12. భూమిని చేసినది, దానిమీద నరుని సృజించినది నేనే నా చేతులతో ఆకాశమును విశాలముగా విప్పితిని. నేను సూర్య, చంద్ర, తారకలను నా అధీనమున ఉంచుకొందును.

13. నీతినిబట్టి కోరెషును పురికొల్పినది నేనే. నేను అతడి త్రోవలను సరాళము చేయుదును. అతడు నా నగరమును నిర్మించును.  బదులు ధనమునుగాని, లంచమునుగాని పుచ్చుకొనకయే బందీలైన నా ప్రజలను తీసికొనివచ్చును." సైన్యములకధిపతియైన ప్రభువు పలుకిది.

14. ప్రభువు యిస్రాయేలుతో ఇట్లనుచున్నాడు: “ఐగుప్తు కార్మికులును, కూషు వర్తకులును, దీర్ఘకాయులైన సెబా ప్రజలును నీకు దాసులై నీ వారగుదురు. వారు సంకెళ్ళతో నీ వెంటవత్తురు.  నీకు వంగి దండము పెట్టి 'దేవుడు నీతోనున్నాడు, అతనికి సాటివాడు లేడు, మరియొక దేవుడులేడు” ' అని విన్నవింతురు.

15. రక్షకుడైన యిస్రాయేలు దేవుడు నిక్కముగా దాగియున్న దేవుడు.

16. ప్రభువు నెదిరించువారు అవమానము చెందుదురు. విగ్రహములను చేయువారు సిగ్గుచెందుదురు.

17. కాని ప్రభువు యిస్రాయేలును రక్షించును. ఆ రక్షణము శాశ్వతమైనది. ఆ ప్రజలు ఇక ఎప్పటికిని, అవమానమునకు గురికారు.

18. ప్రభువు ఆకసమును సృజించెను.ఆయనే దేవుడు. ఆయన భూమికి రూపమునిచ్చి దానిని కలిగించెను. దానిని స్థిరముగా నెలకొల్పేను. ఆ భూమిని నివాసయోగ్యముగా చేసెనుగాని అస్తవ్యస్తముగా చేయలేదు. అట్టి దేవుడు ఇట్లు పలుకుచున్నాడు: “నేనే ప్రభుడను, మరియొక దేవుడు లేడు.

19. నేను రహస్యముగా మాటలాడలేదు.  నా సంకల్పమును మరుగుచేయలేదు. నేను యాకోబు వంశజులతో ఆ 'మీరు నన్ను అస్తవ్యస్తమైన తావున వ్యర్ధముగ వెదకుడు' అని చెప్పలేదు. ప్రభుడనైన నేను సత్యమును పలుకుదును. న్యాయమును తెలియజేయుదును.”

20. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “జాతులందు చావును తప్పించుకొని బ్రతికియున్నవారలారా! మీరెల్లరును కలిసి ఇటు రండు, తీర్పునకు సిద్ధముకండు. " కొయ్యబొమ్మలను మోసికొని పోవువారికి, తమను రక్షింపజాలని దైవములకు మ్రొక్కువారికి ఙ్ఞానములేదు.

21. రండు, మీ అభియోగమును న్యాయస్థానమున విన్పింపుడు. అందుకు మీరు ఒకరినొకరు సంప్రతించుకొనుడు. ఈ అంశమును ముందుగా ఎరిగించినదెవరు? దానిని పూర్వమే తెలియజేసినదెవరు? ప్రభుడనైన నేను కాదా? నేను న్యాయవంతుడను, రక్షకుడను. నేను తప్ప మరియొక దేవుడు లేడు.

22. లోకము నాలుగు చెరగులనున్న ప్రజలెల్లరు నా చెంతకువచ్చి లు రక్షణమును బడయుడు.  నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు.

23. నేను నా పేరిట ప్రమాణముచేసి చెప్పుచున్నాను. నా ప్రమాణము నీతివంతమైనది, ఆ దానికి తిరుగులేదు. ఎల్లరును నా ముందట మోకరిల్లుదురు. 'మేము నీ ఆజ్ఞానువర్తులమైయుందుము' అని బాస చేయుదురు.

24. నీతియు, బలమును యావేయందే ఉన్నవని ఎల్లరును చెప్పుకొందురు. నన్నెదిరించు వారందరును అవమానము చెందుదురు.

25. యిస్రాయేలు సంతతియెల్ల ప్రభువునందు నీతిమంతులుగా ఎంచబడి అతిశయిల్లును.