ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెషయా 40

 1. నా ప్రజలను ఓదార్పుడు, ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడు.

2. యెరూషలేము పౌరులకు ధైర్యముచెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదనియు, వారి తప్పిదములును మన్నింపబడినవనియు, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్షను అనుభవించిరనియు తెలియజెప్పుడు.

3. ఒక శబ్దమిట్లు పలికెను: “ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధముచేయుడు. మరుభూమిలో మనదేవునికి రాజపథమును తయారుచేయుడు.

4. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు. ప్రతి పర్వతమును, తిప్పను నేలమట్టము చేయుడు. మిట్టపల్లములు సమతలము కావలెను. కరకు తావులు నునుపు కావలెను.

5. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరు ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలుకిది.”

6. ఒక శబ్దము నాతో నీవు సందేశమును వినిపింపుమని చెప్పెను. కాని ఏమి సందేశము వినిపింపగలనని నేనంటిని. “నరులెల్లరును గడ్డివంటివారనియు వారు అడవిలో పూచిన పూలకంటె ఎక్కువకాలము మనజాలరనియు నీవు వినిపింపుము.

7. ప్రభువు తన శ్వాసను దానిమీద ఊదగా, గడ్డి ఎండిపోవును, పూవు వాడిపోవును. నరులు గడ్డివంటివారు.

8. గడ్డి ఎండిపోవును, పూవు వాడిపోవును. కాని మన దేవుని వాక్కు కలకాలము నిలుచును.”

9. సియోనూ! నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము." యెరూషలేమూ! నీవు గొంతెత్తి అరువుము. శుభవార్తను విన్పింపుము. భయపడక యెలుగెత్తి అరువుము. యూదా నగరములతో “ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు” అని చెప్పుము.

10. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను ఒసగు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందట నడచుచున్నది.

11. ఆయన కాపరివలె తనమందను మేపును. గొఱ్ఱెపిల్లలను తన బాహువులతో కూర్చి, రొమ్ము నానించుకొని మోసికొనిపోవును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా అదలించును.

12. సముద్రజలమును తన కరతలముతో కొలిచినవాడెవడు? జేనతో ఆకాశమును కొలిచినవాడెవడు? నేలలోని మంటిని కొలపాత్రమున ఉంచినవాడెవడు? పర్వతములను, తిప్పలను తక్కెడలో పెట్టి తూచినవాడెవడు?

13. ప్రభువు ఆత్మకు సలహా ఈయగలవాడెవడు? ప్రభువునకు ఉపదేశము చేయగలవాడెవడు?

14. ప్రభువు ఎవనిని సంప్రదించును? ఆయనకు ఎవడు బోధచేయును? ఆయనకు న్యాయవర్తనమును తెలియజేయువాడు ఎవడు? కార్యములను జరిపించు విధానమును ఎగిరించువాడెవడు?

15. ఆయన ఎదుట జాతులు చేదనుండి జాలువారు నీటి బొట్టు వంటివారు. తక్కెడ సిబ్బిమీది ధూళివంటివారు. ఆయనఎదుట ద్వీపములు సూక్ష్మరేణువుల వంటివి.

16. లెబానోను అడవిలోని చెట్లు మంటకు చాలవు. దానిలోని మృగములు బలినర్పించుటకు సరిపోవు.

17. ప్రభువెదుట అన్యజాతులు లెక్కకురావు. ఆయన వానిని శూన్యముగాను, ఉనికిలో లేనివానినిగాను గణించును.

18. దేవుని ఎవనితో పోల్చగలము? ఆయనకు సాటియైన రూపమెది?

19. కళాకారుడు బొమ్మను చేయగా, కంసాలి దానికి బంగారము తాపడముచేసి, దానిని వెండిలో బిగించును. కాని దేవుడు ఈ బొమ్మవంటివాడు కాడు.

20. వెండిబంగారములు లేనివాడు పుచ్చని కొయ్యను తెచ్చి, నేర్పరియైన పనివానికిచ్చి క్రిందపడిపోని బొమ్మను చేయించుకొనును.

21. మీకు తెలియదా? పూర్వమే మీరు వినలేదా? లోకమెట్లు పుట్టెనో మీరెరుగరా?

22. ఆయన భూమ్యాకాశములకు పైనున్న సింహాసనము మీద ఆసీనుడై యుండును. క్రింది నేలమీది నరులు ఆయనకు మిడుతలవలె కన్పింతురు. ఆయన ఆకాశమును తెరవలె విప్పెను. దానిని నరులు వసించు గుడారమువలె పన్నెను.

23. ఆయన రాజులను అంతమొందించును. లోకపాలకులను అడపొడ కానరాకుండ చేయును.

24. ఆ పాలకులు నేలలో నాటగా అప్పుడే వేరు పాతుకొను లేతమొక్కల వంటివారు. ప్రభువు ఆ పాలకులమీదికి ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.

25. మీరు నన్నెవ్వరితో పోల్తురు? నాకు సాటివాడెవడని, పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు.

26. కన్నులెత్తి ఆకాశమువైపు చూడుడు. ఆ నక్షత్రములనెవడు చేసెను? వానిని సైన్యమువలె నడిపించువాడే కదా!  అవి ఎన్నియో ఆయన ఎరుగును. తను వానిలో ప్రతిదానిని ఆయన పేరుపెట్టి పిలుచును. ఆయన మహాశక్తిసంపన్నుడు కనుక ఆ తారలలో ఒక్కటియు తప్పిపోదు.

27. యాకోబూ! “నా మార్గము యావేకు మరుగైయున్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు” అని నీవేల అనుచున్నావు? యిస్రాయేలూ! నీవేల చెప్పుచున్నావు?

28. నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు. ఆయన భూదిగంతములను చేసెను. ఆయన అలసిసొలసిపోవువాడు కాదు. ఆయన జ్ఞానమును నరులు గ్రహింపజాలరు.

29. ఆయన అలసిపోయినవారికి శక్తినొసగును. దుర్బలులకు బలమును దయచేయును.

30. యువకులును అలసిసొలసి పోవుదురు. లేతప్రాయము వారుసు పడిపోవుదురు.

31. కాని ప్రభువును నమ్మినవారు నూత్నబలమును పొందుదురు. వారు పక్షిరాజువలె రెక్కలు చాచి పైకెగురుదురు. అలసట లేక పరుగెత్తుదురు. బడలిక లేక నడకసాగింతురు.