ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెషయా 65

1. ప్రభువు ఇట్లనెను: నేను ప్రజల మనవులను ఆలించుటకు సిద్ధముగనే ఉంటిని గాని, వారు నాకు మొర పెట్టలేదు. నేను వారికి దర్శనమీయ గోరితినిగాని, వారు నాచెంతకు రానేలేదు. నేను మీకు సాయ పడుటకు “ఇచట ఉన్నాను, ఇచట ఉన్నాను” అని పలికినను, ఈ జనులు నా నామమున ప్రార్ధన చేయలేదు.

2. నేను నిరంతరము చేతులు చాచి ఈ ప్రజలను చెంతకు ఆహ్వానించుచుంటిని. కాని వారు మొండివారై దుష్కార్యములు చేసిరి. తమ ఆలోచనల ప్రకారము తాము ప్రవర్తించిరి.

3. నన్ను లెక్కచేయక నిరంతరము నాకు కోపము రప్పించిరి. వనములలొ బలులర్పించిరి. బలిపీఠములపై సాంబ్రాణిపొగ వేసిరి.

4. రేయి సమాధులలో, రహస్యస్థలములలొ గడపిరి. పందిమాంసము తినిరి. నిషిద్ధ భోజనములు ఆరగించిరి.

5. వారు 'మా దరిదాపునకు రావలదు. ఎడముగా ఉండవలెను. మీకంటే మేము పవిత్రులము' అని చెప్పుదురు. “వీరు నా నాసిక రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు.

6. వారి శిక్ష నా ఎదుట గ్రంథములో లిఖింప బడియున్నది. నేనిక ఊరకుండను. వారి పాపములకు ప్రతీకారముగా వారిని దండించి తీరుదును.

7. వారి తప్పిదములకును, వారి పితరుల తప్పిదములకును వారిని శిక్షింతును. వారు కొండల మీద సాంబ్రాణిపొగ వేసి నన్ను నిందించిరి. కావున నేను వారి పాపము లకు తగినట్లుగా వారిని శిక్షించి తీరుదును.”

8. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు: “కొత్త ద్రాక్షరసము తీయునపుడు గుత్తిలో ఇంకను రసమున్నచో జనులు 'దానిని పారవేయవద్దు, అది దీవెన కరమైనది. దానిలో రసమున్నది' అని పలుకుదురు కదా! అట్లే నేను ప్రజలందరిని నాశనము చేయను. నన్ను సేవించువారిని నేను కాపాడుదును.

9. నేను యాకోబునుండి సంతానమును, నా పర్వతములను స్వాధీనము చేసికొనుటకు యూదానుండి జనులను పుట్టింతును. నా సేవకులును, నేను ఎన్నుకొనిన వారును ఆ కొండలలో వసింతురు.

10. వారు నన్ను పూజింతురు. షారోను మైదానములో తమ గొఱ్ఱెలను మేపుకొందురు. ఆకోరులోయ తమ పశువులు పరుండు స్థలముగా ఉండును.

11. కాని నన్ను పరిత్యజించి, నా పవిత్ర పర్వతమును విస్మరించి గాదు అను అదృష్ట దేవతకు భోజనార్పణమును, మెనీ అను భాగ్యదేవరకు పానీయార్పణమును చేయువారిని

12. నేను కత్తికి ఎరజేయుదును. మీరెల్లరు యుద్ధమున కూలుదురు. నేను పిలిచినపుడు మీరు పలుకలేదు. నేను మాట్లాడినపుడు మీరు వినలేదు. మీరు నేనొల్లని కార్యములు చేసి నాకు అప్రియము కలిగించితిరి.”

13. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు: “నా సేవకులు కడుపునిండ భుజింతురు. కాని, మీరు ఆకలితో అలమటింతురు. నా దాసులు పానీయము సేవింతురు. కాని మీరు దప్పికగొందురు. నా దాసులు సంతోషింతురు. కాని మీరు అవమానమున మునుగుదురు.

14. నా సేవకులు సంతసముతో పాడుదురు. కాని మీరు విచారముతో విలపింతురు, దుఃఖముతో అంగలారురు.

15. నేను ఎన్నుకొనిన ప్రజలు మీ పేరును శాపవచనముగా వాడుకొందురు. ప్రభుడను, యావే నైన నేను మిమ్ము సంహరింతును. కాని నేను నా సేవకులకు నూత్ననామము నొసగుదును.

16. దేశమున దీవెన కోరుకొనువాడు విశ్వసనీయుడైన దేవుని నుండియే ఆ దీవెనను కోరుకొనును. ఒట్టు పెట్టుకొనువాడు నమ్మదగిన దేవుని పేరుమీదనే ఆ ఒట్టు పెట్టుకొనును. నేను పూర్వపుబాధలను పట్టించు కొనను, వానిని స్మరించను.

17. ఇదిగో! నేను నూత్నదివిని, నూత్నభువిని సృజింతును. పూర్వసంఘటనలను ఇక ఎవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు.

18. నేను సృజింపబోవువానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును.ఆ నగరపౌరులు ఆనందముతో అలరారుదురు.

19. నేనును యెరూషలేమును చూచి ఆనందింతును. నా ప్రజలను గాంచి హరింతును. ఆ పట్టణమున ఇక ఏడుపులు గాని, సహాయమునకై అంగలార్పులుగాని విన్పింపవు.

20. శిశువులకు బాల్యమరణములు ఉండవు. వృద్దులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు నూరేండ్లు జీవించిగాని కన్నుమూయడు. నూరేండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడును.

21. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్షతోటలు నాటుకొని వాని ఫలములారగింతురు.

22. వారు కట్టిన ఇండ్లలో అన్యులు వసింపరు. వారు నాటిన ద్రాక్షాఫలములను ఇతరులు అనుభవింపరు. నా ప్రజలు వృక్షములవలె దీర్ఘకాలము జీవింతురు నేను ఎన్నుకొనినవారు తమ కృషిఫలము తాము అనుభవింతురు.

23. వారి ప్రయాసము వ్యర్ధముగాదు. వారి పిల్లలకు దురదృష్టము వాటిల్లదు. నేను వారిని,వారి సంతానమునుగూడ దీవింతును

24. వారు మొరపెట్టక మునుపే వారి విన్నపమును విందును. వారు ప్రార్థనచేసి ముగింపక మునుపే వారి వేడుకోలును ఆలింతును.

25. తోడేలు, గొఱ్ఱెపిల్లయు కలిసి మేయును. సింగము ఎద్దువలె గడ్డిమేయును. పాము మన్నుతినును. నా పవిత్ర పర్వతమైన సియోనునందంతటను ఎట్టిహానియు, ఎట్టికీడును కలుగదు. ఇవి ప్రభువు పలుకులు.”