ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెషయా 22

 1. దర్శనపులోయను గూర్చి దైవోక్తి: నగరవాసులెల్లరు ఇంటికప్పుమీదికెక్కి ఉత్సవము చేసికొనుచున్నారు. వారికేమి పోగాలము వచ్చినది?

2. కలకలముతోను సంతోషనాదముతోను నిండియున్న ఓ నగరమా! చచ్చినవారు కత్తివాతబడి చావలేదు. పోరాడుచు ప్రాణములు కోల్పోలేదు.

3. నీ నాయకులెల్లరును పారిపోయిరి. వింటిని వంచకముందే శత్రువులకు చిక్కిరి. నీ శూరులెల్లరును బందీలైరి. వెన్నిచ్చి పారిపోయిరి.

4. “మీరు నన్ను ఒంటరిగా వదిలివేయుడు. మృతులైన నా ప్రజలనుగూర్చి నేను సంతాపముతో ఏడ్చెదను. మీరు నన్ను ఓదార్పవలదు” అంటిని.

5. దర్శనపు లోయలో భయమును, పరాజయమును కలవరపాటును పుట్టించిన దినమిది. సైన్యములకధిపతియైన ప్రభువే ఈ చెయిదము చేసెను. నగరప్రాకారములు కూలిపోయినవి. ప్రజల ఆర్తనాదములు కొండలలో మారుమ్రోగినవి.

6. ఏలాము యోధులు విండ్లుతాల్చి గుఱ్ఱములనెక్కి వచ్చిరి. కీరునగర సైనికులు డాళ్ళను సిద్ధము చేసికొనిరి.

7. యూదాలోని సారవంతపు లోయలు రథములతో నిండిపోయినవి. రౌతులు నగరద్వారమునెదుట మోహరించిరి.

8. యూదా రక్షణదుర్గము వమ్మయ్యెను. యెరూషలేమువాసులారా! మీరు ఆ దినమున ఆయుధాగారమువైపు దృష్టిని మరల్చితిరి.

9-11. దావీదు నగరప్రాకారమున మరమ్మత్తు చేయవలసిన తావులను పరిశీలించితిరి. యెరూషలేము నగరములోని ఇండ్లను పరీక్షించి చూచితిరి. వానిలో కొన్నిటిని కూల్చివేసి, వాని రాళ్ళతో ప్రాకారమును మరమ్మతు చేయగోరితిరి. ప్రాత కోనేటినుండి పారునీటిని నిల్వజేయుటకుగాను పట్టణ రెండు గోడల మధ్యమున జలాశయమును నిర్మించితిరి. కాని వీనినన్నింటినిచేసిన దేవుని లక్ష్యము చేయరైతిరి. పూర్వమే వీనిని సిద్ధముచేసిన దేవుని గుర్తింపరైతిరి

12. సైన్యములకధిపతియైన ప్రభువు, మీరు ఆ దినమున విలపించి, తల గొరిగించుకొని గోనెతాల్పవలెను అనెను.

13. కాని మీరు ఎడ్లను, పొట్టేళ్ళను వధించి, మాంసమును, మధువును సేవించి సంతసముతో కాలము గడిపితిరి. “రేపు మనము చచ్చిన చావవచ్చును, కనుక నేడు తిని త్రాగుదము" అని పలికితిరి.

14. “ఈ ప్రజలు బ్రతికియున్నంతకాలము నేను ఈ అపరాధమును క్షమింపబోను.. సైన్యములకధిపతినైన నా వాక్కిది” అని ప్రభువు నాతో ప్రమాణపూర్వకముగా పలికెను.

15. సైన్యములకధిపతియగు ప్రభువు నన్ను రాజగృహ నిర్వాహకుడును, రాజప్రాసాద అధ్యక్షుడునైన షెబ్నా వద్దకు పోయి, అతనితో ఇట్లు చెప్పుము అనెను.

16. “ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని కట్టించుకొనుచున్నావు శిలలో నీకు నివాసము నిర్మించుకొనుచున్నావు.

17. నీవు ప్రముఖుడవు కావచ్చును. కాని ప్రభువు నిన్ను గుప్పిటబట్టి క్రిందికి విసరివేయును. నిన్ను మూటకట్టి గట్టిగా నొక్కిపట్టి, బంతివలె సువిశాలదేశములోనికి విసరివేయును.

18. నీవు ఆ దేశముననే, నీవింతగా గర్వించు ఆ రథముల ప్రక్కనే చత్తువు. నీవు నీ యజమానుని రాజకుటుంబమునకు మచ్చతెచ్చితివి.”

19. ప్రభువు ఇట్లనెను: “నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును నీ ఉన్నతస్థానమునుండి నిన్ను పడద్రోయుదును

20. ఆ దినమున నేను హిల్కియా కుమారుడును,  నా సేవకుడునగు ఎల్యాకీమును ఆహ్వానింతును.

21. నీ అధికార వస్త్రములను, నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును. నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు, యూదా నివాసులకు అతడు తండ్రివంటివాడగును.

22. దావీదు వంశపురాజు తాళపుచెవిని అతడు తన భుజములమీద తాల్చునట్లు చేయుదును. అతడు తెరచినదానిని ఎవరును మూయలేరు. అతడు మూసినదానిని ఎవరును తెరువలేరు.

23. నేనతనిని గుడారపుమేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబమంతటికిని వన్నెదెచ్చును.”

24. కాని ఎల్యాకీము కుటుంబము వారు సేవకులు అతనిమీద అతిగా ఆధారపడి అతనికి భారమగుదురు. పాత్రలు, గిన్నెలు, మేకుమీద వ్రేలాడి నట్లుగా, వారతనిమీద వ్రేలాడుదురు.

25. ఆ దినమున, గోడలోనికి లోతుగా దిగగొట్టబడిన మేకు జారి క్రిందబడును. ఆ మేకు మీద వ్రేలాడు వస్తువులన్నియు నాశనమగును. సైన్యములకధిపతియు ప్రభుడనైన నేను పలికిన పలికిది.